Share News

రోదసినీ కాలుష్య కాసారం చేస్తారా?!

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:38 AM

భూమిపై కాలుష్యం చాలదన్నట్లు, అంతరిక్షాన్ని కూడా తన కార్యకలాపాలతో కాలుష్యభరితం చేసే దిశగా మనిషి అడుగులు వేస్తున్నాడా? ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ సంస్థ అంతరిక్షంలో..

రోదసినీ కాలుష్య కాసారం చేస్తారా?!

భూమిపై కాలుష్యం చాలదన్నట్లు, అంతరిక్షాన్ని కూడా తన కార్యకలాపాలతో కాలుష్యభరితం చేసే దిశగా మనిషి అడుగులు వేస్తున్నాడా? ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ సంస్థ అంతరిక్షంలో పది లక్షల ఉపగ్రహాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఈ ప్రశ్నను మన ముందుకు తెస్తోంది. ఇవి సాధారణ కమ్యూనికేషన్ ఉపగ్రహాలు మాత్రమే కావు. అంతరిక్షంలోనే కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత డేటా సెంటర్లుగా పనిచేసేలా వాటిని రూపొందించాలనే ఆలోచన ఉంది. భూమిపై ఏఐ వ్యవస్థల నిర్వహణకు భారీ డేటా సెంటర్లు అవసరం. వాటికి అపారమైన విద్యుత్తు, నీరు, శీతలీకరణ సదుపాయాలు కావాలి. అంతరిక్షంలో సూర్యశక్తిని వినియోగించుకుంటూ కంప్యూటింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తే, భూమిపై విద్యుత్తు, నీటి వినియోగాన్ని తగ్గించవచ్చన్నది ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ప్రధాన వాదన. వినడానికి ఇది ఒక గొప్ప సాంకేతిక పరిష్కారంలా కనిపిస్తోంది. కానీ ఒక ప్రశ్న: భూమిపై కాలుష్యాన్ని తగ్గించడానికి మనం అంతరిక్షాన్ని మరో కాలుష్య కేంద్రంగా మార్చుకోవాలా?


ప్రస్తుతం అంతరిక్షంలో వేలాది ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి. వాటి సంఖ్యను లక్షల స్థాయికి పెంచితే, అవి పరస్పరం ఢీకొనే ప్రమాదం మరింత పెరుగుతుంది. ఒక ఉపగ్రహం ధ్వంసమైతే ఏర్పడే శకలాలు మరిన్ని ఉపగ్రహాలను ఢీకొని, మరిన్ని శకలాలకు కారణమయ్యే ప్రమాదం ఉంది. ఈ గొలుసుకట్టు పరిణామం కొన్ని కక్ష్యలను భవిష్యత్తులో ఉపయోగించలేని స్థితికి తీసుకెళ్లవచ్చు. దీనినే శాస్త్రవేత్తలు కెస్లర్ సిండ్రోమ్‌గా పేర్కొంటారు. మరో ఆందోళన– ఉపగ్రహాల జీవితకాలం ముగిసిన తరువాత వాటిని తొలగించే ప్రక్రియ. సాధారణంగా పనిచేయని ఉపగ్రహాలను భూ వాతావరణంలోకి తీసుకొచ్చి దహనం చేస్తారు. లక్షల ఉపగ్రహాల విషయంలో ఈ ప్రక్రియ ఎంత విస్తృతంగా జరుగుతుంది? వాటిలోని లోహాలు, ఇతర పదార్థాలు వాతావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ముఖ్యంగా ఓజోన్ పొరపై, వాతావరణ రసాయనిక సమతుల్యతపై ఎలాంటి పరిణామాలు ఉంటాయి? ఇవన్నీ సమగ్రంగా పరిశీలించాల్సిన అంశాలు. ఈ ప్రాజెక్టు వల్ల భూమిపై డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్తు, నీటి వినియోగం తగ్గే అవకాశం ఉందన్న వాదనను పూర్తిగా తోసిపుచ్చలేం. అయితే, ఉపగ్రహాల తయారీకి అవసరమైన ముడి పదార్థాలు, వాటిని అంతరిక్షంలోకి పంపడానికి వినియోగించే రాకెట్లు, ప్రయోగాల వల్ల కలిగే కాలుష్యం, ఉపగ్రహాల నిర్వహణ, చివరికి వాటిని తొలగించే ప్రక్రియ.. వీటన్నింటి పర్యావరణ ప్రభావాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి. భూమిపై కాలుష్యాన్ని తగ్గిస్తున్నామని చెప్పుకుంటూ, దాని భారాన్ని అంతరిక్షానికి తరలిస్తున్నామా? అన్నది కీలకమైన ప్రశ్న.

– సుబ్రహ్మణ్య శర్మ అనుముల

Updated Date - Nov 28 , 2026 | 12:39 AM