నకిలీ జర్నలిస్టులు.. ఆషాఢభూతులు.. అలజడులు!
ABN , Publish Date - Nov 29 , 2026 | 12:36 AM
సోషల్ మీడియా విస్ఫోటనం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. అయితే, సోషల్ మీడియా వేదికలను రాజకీయ పార్టీలు వినియోగిస్తున్న తీరు మరింత ఆందోళన కలిగించేదిగా ఉంది.
సోషల్ మీడియా విస్ఫోటనం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. అయితే, సోషల్ మీడియా వేదికలను రాజకీయ పార్టీలు వినియోగిస్తున్న తీరు మరింత ఆందోళన కలిగించేదిగా ఉంది. స్వీయ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను వేదికగా మార్చుకొని ప్రజల మెదళ్లలోకి అసత్యాలను, అర్ధ సత్యాలను జొప్పిస్తున్నాయి. ఈ ధోరణి ప్రబలిపోవడంతో రాజకీయ పార్టీల పరిస్థితి పులి మీద స్వారీలా మారిపోయింది. సోషల్ మీడియా వారియర్స్ పేరిట అనేక రాజకీయ పార్టీలు వేలాది మందిని నియమించుకొని తమ రాజకీయ ప్రత్యర్థులపై విషం చిమ్మడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొని... ఏది సత్యమో, ఏది అసత్యమో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. నిజానికి సోషల్ మీడియా అనేది సామాన్య ప్రజలకు లభించిన అద్భుత అవకాశం. తమ భావాలను, అభిప్రాయాలను స్వేచ్ఛగా, పైసా ఖర్చు లేకుండా వ్యక్తపరిచే అవకాశం సోషల్ మీడియా వల్ల లభించింది. ఆయా అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంతోపాటు ప్రభుత్వ నిర్ణయాలలోని మంచి చెడులపై చర్చించడానికి ఇదొక వేదికగా ఉపయోగపడుతూ వచ్చింది. సమాచార విప్లవానికి కూడా సోషల్ మీడియా దోహదపడింది. ప్రధాన మీడియాను వెనక్కి నెట్టి ప్రభుత్వాలను, విధాన నిర్ణయాలు తీసుకొనే వారిని ప్రభావితం చేసే స్థాయికి సోషల్ మీడియా ఎదిగింది. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావానికి గురికాని వ్యవస్థ అంటూ ఏదీ లేదనడం అతిశయోక్తి కాదు. ప్రజలకు క్షణాల్లో సమాచారం చేరిపోతోంది. సమకాలీన అంశాలపై ప్రధాన మీడియా సంస్థలను దేబిరించే అవసరం లేకుండా సామాన్యులు సైతం తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచగలుగుతున్నారు. ఈ పరిణామం మీడియా రంగంలో కూడా అనేక మార్పులకు దారితీసింది. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మిగతా రంగాలలో అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకున్నట్టుగానే సోషల్ మీడియాలో కూడా అవాంఛనీయ పోకడలు పొడచూపడం మొదలైంది. ఈ పరిస్థితికి ముందుగా రాజకీయ పార్టీలనే నిందించాలి.
బురదచల్లుడుకు వేదికగా...
మొదట్లో రాజకీయ పార్టీలు తమకు అనుకూల ప్రచారం చేసుకోవడానికి సోషల్ మీడియాను వేదికగా వాడుకున్నాయి. ప్రశాంత్ కిశోర్ వంటి వ్యూహకర్తల రంగప్రవేశంతో సోషల్ మీడియాలో వికృత పోకడలు చోటుచేసుకోవడం మొదలైంది. తమ రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని దుష్ప్రచారం చేయడానికి అన్ని రాజకీయ పార్టీలూ వ్యూహకర్తలను నియమించుకుంటున్నాయి. సదరు వ్యూహకర్తల నేతృత్వంలో పార్టీల సోషల్ మీడియా విభాగాలు ఏర్పాటయ్యాయి. సోషల్ మీడియా విభాగాల నిర్వహణ కోసం రాజకీయ పార్టీలు కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా ఆయా పార్టీలు చేసే ఖర్చును బట్టి వాటికి సోషల్ మీడియా వేదికలు ఏర్పడుతున్నాయి. ఫలానా పార్టీ సోషల్ మీడియా వేదిక బలంగా ఉందని చెప్పుకొనే పరిస్థితి వచ్చింది. రాజకీయ పార్టీలు తమ విధానాలు, ప్రణాళికలను ప్రజలకు వివరించడానికి సోషల్ మీడియా వేదికలను ఏర్పాటుచేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ... అంతటితో ఆగకుండా ప్రత్యర్థులపై విష ప్రచారానికి దిగుతున్నాయి. ఇందుకోసం వేలాది మందిని నియమించుకొని కోట్లాది రూపాయలను జీతాల రూపంలో ఖర్చు చేస్తున్నాయి. ఫలితంగా కూలి మీడియా సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ప్రధాన మీడియా సంస్థలకు ఉన్నట్టు సోషల్ మీడియాకు పరిమితమైన వారికిగానీ, సంస్థలకుగానీ జవాబుదారీతనం లేదు. అమలులో ఉన్న చట్టాలకు దొరక్కుండా తప్పించుకునేందుకు విదేశాల్లో సోషల్ మీడియా ఖాతాలను తెరిచి అక్కడి నుంచి నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విదేశీ పౌరసత్వం తీసుకున్నవాళ్లు హద్దూ అదుపు లేకుండా మాట్లాడుతూ వీడియోలను రూపొందించి వదులుతున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉండటంతో వీరి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. రాజకీయ పార్టీల పట్ల అభిమానంతో వ్యాఖ్యలు చేయడం, పోస్టులు–వీడియోలు పెట్టడం వేరు. రాజకీయ పార్టీలకు కిరాయి సైనికులుగా మారి పోస్టులు–వీడియోలు పెట్టడం వేరు. ఈ విశృంఖలత్వం వల్ల అధికారంలో ఉన్న వారే కాదు, ప్రతిపక్షంలో ఉన్నవారు కూడా బాధితులుగా మారిపోతున్నారు. రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలకు అనుకూల–వ్యతిరేక వాదనలు చేస్తే ఫర్వాలేదుగానీ ఏ నిర్ణయం తీసుకోకపోయినా ఏదో జరిగిపోయినట్టు ప్రచారం చేయడం అభ్యంతరకరం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పోకడలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
విశ్లేషకులు... వింతలు!
గతంలో రాజకీయాలను విశ్లేషించగలవారు కొద్ది మంది మాత్రమే కనిపించేవారు. ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఎవరికి వారు రాజకీయ విశ్లేషకులుగా మారిపోవచ్చునని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు గమనార్హం. సోషల్ మీడియా విస్తరించడంతో పాటు యూట్యూబ్ చానళ్లు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకురావడంతో ఉన్నపళంగా సీనియర్ జర్నలిస్టులు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు అవతరిస్తున్నారు. ప్రధాన మీడియా సంస్థలలో ఎన్నడూ పనిచేయనివారు కూడా సీనియర్ జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారు. సమకాలీన రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై సమగ్ర అవగాహన ఉన్న సీనియర్ జర్నలిస్టులు సైతం ఈ పరిణామాలను చూసి తెల్లముఖం వేస్తున్నారు. ఎనలిస్టులు, జర్నలిస్టులుగా చలామణి అవుతున్న వారి విపరీత వ్యాఖ్యలు చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రధాన మీడియా సంస్థలలో ఉండే కట్టుబాట్ల వల్ల తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయలేని జర్నలిస్టులకు సోషల్ మీడియా గొప్ప వరం అన్నది వాస్తవం. అయితే, సోషల్ మీడియాను వేదికగా చేసుకొని నకిలీ జర్నలిస్టులు, ఆషాఢభూతులు పుట్టుకురావడమే విషాదం. రాజకీయ పార్టీల ఆర్థిక అండదండలతో ఇలాంటి వారు సొంతంగా యూట్యూబ్ చానళ్లు ఏర్పాటుచేసుకుని అర్ధ సత్యాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత గోప్యతను బలితీసుకుంటున్నారు. కుక్క పిల్ల, సబ్బు బిళ్ల... కాదేదీ కవితకు అనర్హం అన్నట్టుగా ఇలాంటి వారికి సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరి వ్యక్తిగత జీవితాలు ముడిసరుకుగా మారిపోతున్నాయి. చట్టాలు బలహీనంగా ఉండటంతో రాజకీయ పార్టీలు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకొని వెళ్లేలా తమ కిరాయి మూకలను ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో గిట్టని మీడియా సంస్థలను కూడా ముడిసరుకులుగా మార్చుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేస్తున్నట్టుగానే గిట్టని మీడియా సంస్థలపై కూడా దుష్ప్రచారం చేయిస్తున్నారు.
ఉదాహరణకు, ‘ఆంధ్రజ్యోతి’ సంస్థలపై ఇటీవలి కాలంలో చేస్తున్న ప్రచారాన్నే తీసుకుందాం. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థలకు ఫ్యూచర్ సిటీలో వంద కోట్ల రూపాయల విలువైన భూమిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కట్టబెట్టారని భారత రాష్ట్ర సమితి, కేటీఆర్ కనుసన్నల్లో పనిచేసే సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం చేశారు. వంద కోట్లు కాదు కదా– సెంటు భూమి కూడా మేం ప్రభుత్వం నుంచి తీసుకోలేదు. కోరను కూడా లేదు. అయినా తాడూ బొంగరం లేని సంస్థలతో చేయించే ప్రచారానికి ఏమని సమాధానం చెబుతాం? తన ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేయిస్తున్న కేటీఆర్ నిన్నటి వరకు తాను కూడా సోషల్ మీడియా బాధితుడినే అన్న విషయం మరచిపోతున్నట్టుగా ఉంది. వీక్షకుల సంఖ్యను బట్టి యూట్యూబ్ చానళ్లకు ఆదాయం వస్తుంది. దీనివల్ల మంచితోపాటు చెడు కూడా చోటుచేసుకుంటోంది. ఆదాయం పెంచుకోవడం కోసం అర్ధ సత్యాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఆదాయం వచ్చే అవకాశం ఉన్నందున చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు... జర్నలిస్టు అవతారం ఎత్తవచ్చునన్న భావన వ్యాప్తి చెందుతోంది. ఆదాయం లభించే వెసులుబాటు లేకపోతే ఈ విపరీత పోకడలకు అడ్డుకట్ట పడుతుందేమో తెలియదు. ఆదాయం లభించని పక్షంలో నిఖార్సయిన అభిప్రాయాలు మాత్రమే సోషల్ మీడియాలో కనపడతాయి.
ఏమిటి ప్రయోజనం?
మొత్తం మీద చూస్తే సోషల్ మీడియా అనేది ప్రస్తుతం ఒక బెడదగా మారిపోయింది. నిజాలు తెలుసుకోలేని స్థితికి ప్రజలు నెట్టబడుతున్నారు. ఈ పరిస్థితికి రాజకీయ పార్టీలు ఆజ్యం పోస్తున్నాయి. కిరాయి సైనికులను నియమించుకున్నట్టుగా కిరాయి జర్నలిస్టులను నియమించుకుంటున్నాయి. ఫలితంగా బోగస్ ఎనలిస్టులు, బోగస్ జర్నలిస్టులు పుట్టుకొస్తున్నారు. రాజకీయ పార్టీలు నియమించుకుంటున్న సోషల్ మీడియా వారియర్స్ వల్ల తప్పుడు సమాచారం ప్రజలను ఉప్పెనలా ముంచేస్తోంది. ఇంతా చేస్తే ఇలాంటి తప్పుడు సమాచారం వల్ల రాజకీయ పార్టీలు పొందుతున్న ప్రయోజనం కూడా పెద్దగా కనిపించడం లేదు. అధికారంలో ఉన్న పార్టీలను సోషల్ మీడియా వారియర్స్ కాపాడిన సందర్భాలు లేవు. నిదానంగా అయినా నిజాలు తెలుసుకొనే మార్గాలు అందుబాటులోకి వచ్చినందున ప్రజలకు నిజం తెలిసిపోతోంది. అయితే, రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వేదికను దుర్వినియోగం చేస్తుండటం వల్ల అతి పెద్ద ఉపద్రవం ముంచుకురానుంది. తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం వల్ల వారి మెదళ్లను విషతుల్యం చేయబోతున్నారు. ఈ పరిణామం వల్ల నిజాలను నిర్ధారించుకోలేని స్థితికి ప్రజలు చేరుకునే ప్రమాదం ఉంది. అదే సమయంలో వ్యక్తుల మీద, వ్యవస్థల మీద ప్రజల్లో అపనమ్మకం ఏర్పడుతుంది. మొత్తంగా సమాజంలో నమ్మకం నశించి అపనమ్మకాలు, అపోహలకు గురై అశాంతితో అలజడులకు దారితీయవచ్చు. సోషల్ మీడియా ప్రభావంతో మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోలేని స్థితికి ప్రజలు చేరితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. నిజం ఏదో అబద్ధం ఏదో తెలియకపోతే ఎలా? తప్పుడు సమాచారంతో ప్రజల మెదళ్లను విషతుల్యం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. రాజకీయ పార్టీలు, వాటి నాయకులపై ఇప్పటికే ప్రజలకు విశ్వాసం పోయింది. ఇప్పుడు రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వేదికగా సాగిస్తున్న దుష్ప్రచారాల వల్ల మిగతా వ్యవస్థల పట్ల కూడా ప్రజల్లో విశ్వాసం పోతోంది. తమ నాయకుడికి, తమ పార్టీకి అనుకూలంగా వ్యవహరించని వారినందరినీ విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కారణంగా మంచివాళ్లకు, చెడ్డవాళ్లకు మధ్య అంతరం చెరిగిపోతోంది.
విషప్రచారాలదే పైచేయి అయితే మన మెదళ్లు విషతుల్యం కాకుండా ఉంటాయా? మంచికీ చెడుకీ వ్యత్యాసం తెలుసుకోలేని స్థితికి ప్రజలు చేరిపోతే పరిస్థితి ఏమిటి? ఈ ముప్పును అరికట్టాలంటే సోషల్ మీడియా ఖాతాలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో విదేశీ గడ్డ మీద నుంచి నిర్వహించే ఖాతాలను కూడా కట్టడిచేసే మార్గాలు అన్వేషించాలి. రాజకీయ పార్టీలు ఇప్పటికైనా స్వీయ నియంత్రణ పాటించాలి. లేని పక్షంలో దుష్ప్రచార హోరులో పార్టీలు కూడా కొట్టుకుపోతాయి. రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖుల వ్యక్తిగత జీవితాలు కూడా ఛిద్రం అవుతాయి. భావ ప్రకటనా స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా ఉండాలి కదా? ఏది వ్యక్తిగతం– ఏది ప్రజాహితం? అన్న విచక్షణ లేకపోతే ఎలా? బాధ్యత లేని స్వేచ్ఛ అనర్థాలకు దారితీస్తుంది. సోషల్ మీడియాలో చోటుచేసుకుంటున్న వికృత పోకడల వల్ల నమ్మకం అనేది చచ్చిపోతోంది. దీనికితోడు ఏఐ–డీప్ ఫేక్ వంటి టెక్నాలజీల ముప్పు ఉండనే ఉంది. ఫేక్ ఖాతాలు, ఫేక్ ఐడీలతో సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి విష ప్రచారం చేయడం వల్ల దాని ప్రభావం మొత్తం సమాజం మీద పడకుండా ఉంటుందా? అయితే గుడ్డిలో మెల్ల అన్నట్టుగా సోషల్ మీడియా ప్రచారాల అంతరార్థాన్ని, వాటి వెనుక ఎవరు ఉన్నదీ ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. నిజం తెలుసుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఏ ప్రచారం వెనుక ఎవరున్నారు? వారి వెనుక ఉన్న రాజకీయ పార్టీ ఏది? అని తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా పోస్టు లేదా వీడియో కనపడగానే దాని వెనుక ఫలానా పార్టీ ఉందని గుర్తిస్తున్నారు. ఇదొక శుభ పరిణామం. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఇప్పటికైనా సోషల్ మీడియాపై అతిగా ఆధారపడటానికి స్వస్తి చెప్పాలి. సోషల్ మీడియాను మాత్రమే నమ్ముకుంటే అధికారంలోకి రాలేమని గుర్తించాలి.
కష్టార్జితమా.. అవినీతి సొమ్మా?
ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి, షర్మిల మధ్య తలెత్తిన యలహంక ఆస్తుల వివాదం విషయానికి వద్దాం. ఈ వివాదం నేపథ్యంలో జగన్మోహన్‌రెడ్డి ప్రతిష్ఠ మసకబారింది. మేనమామగా మేనకోడలి పెళ్లికి సహకరించాల్సింది పోయి ఎప్పటి నుంచో షర్మిల నివసిస్తున్న ఇంట్లోకి కూడా వెళ్లనీయకుండా అడ్డుకోవడంతో ప్రజల్లో ఆయనపై ఏహ్య భావం ఏర్పడింది. చట్టపరంగా యలహంక భవనాలు జగన్‌రెడ్డి కుటుంబానికే చెందుతాయి. కనుక షర్మిలకు చట్టపరమైన హక్కులేదని వాదిస్తున్న వారి వాదనలో నిజం ఉంది. అయితే, ఈ భవనాలు ఆ కుటుంబానికి ఎలా సమకూరాయన్నదే ఇక్కడ కీలకం. చట్టపరమైన హక్కు జగన్‌కే ఉన్నప్పటికీ నైతికత అనేది కూడా ఒకటి ఉంటుంది కదా? కేరళకు చెందిన నాయర్ అనే ఆయన కుటుంబం నుంచి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యలహంక వద్ద ఇరవై ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. కర్ణాటకలో 2007లో అమలులో ఉన్న నిబంధనలను అధిగమించేందుకు జగన్‌రెడ్డి అత్తగారైన సుగుణ పేరిట ఈ భూమిని కొనుగోలు చేశారు. కర్ణాటకలో వ్యవసాయ భూమి కొనుగోలు చేయాలంటే వారికి దేశంలో మరెక్కడైనా వ్యవసాయ భూమి ఉండాలి. అదే సమయంలో వారు ఆదాయపు పన్ను చెల్లింపుదారు అయి ఉండకూడదు. అంటే వ్యవసాయ ఆదాయం తప్ప పన్ను చెల్లించే మరే ఆదాయం వారికి ఉండకూడదు. రాజశేఖరరెడ్డి కుటుంబంలో అందరూ ఆదాయం పన్ను రిటర్న్స్ దాఖలు చేస్తున్న వారే అయినందున సుగుణ పేరిట కొన్నారు. అప్పట్లో ఎకరం దాదాపు కోటి రూపాయల చొప్పున కొనుగోలు చేశారు.ఇందులో అధిక భాగం బ్లాక్ మనీనే. తమాషా ఏమిటంటే ఈ భూమి కొనుగోలుకు అవసరమైన వైట్ మనీని సుగుణకు సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అప్పట్లో ఇచ్చింది.
ప్రస్తుతం కోర్టును ఆశ్రయించిన భీమిశెట్టి రమేశ్‌బాబుతో పాటు జగన్ భార్య భారతిరెడ్డి కూడా ఈ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారు. భూమి కొనుగోలుకు అవసరమైన డబ్బును అప్పుగా ఇచ్చిన సిలికాన్ సంస్థకు సుగుణ ఆ భూమిని వెంటనే లీజుకు ఇచ్చారు. అంటే, కర్ణాటక నిబంధనలను అధిగమించడానికి మాత్రమే సుగుణ పేరును వాడుకున్నారన్న మాట. దీన్నిబట్టి ఆ భూమిని వాస్తవానికి కొనుగోలు చేసింది మాత్రం రాజశేఖరరెడ్డి కుటుంబమే. బిల్డర్ల ద్వారా అప్పు ఇప్పించినట్టు రికార్డుల్లో చూపించి ఈ భూమి కొనుగోలు చేశారు.ఇప్పుడు ఈ వివాదం కుటుంబ వ్యవహారం అని జగన్‌రెడ్డి తరఫున వాదిస్తున్నవారు తెలుసుకోవలసింది ఏమిటంటే, రాజశేఖరరెడ్డి హయాంలో అవినీతి ద్వారా సమకూర్చుకున్న ఆస్తులలో యలహంక భవంతులు కూడా ఉన్నాయని! ఆ భవంతులు జగన్‌రెడ్డి కష్టార్జితం కావు. సుగుణ కష్టార్జితం అంతకన్నా కావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము అది. జగన్‌రెడ్డిపై విచారణ జరిపిన దర్యాప్తు సంస్థలు ఈ భవంతుల విషయం ఎలా విస్మరించాయో తెలియదు. ఇప్పటికైనా ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపితే అప్పుడు ఏం జరిగిందో స్పష్టమవుతుంది. తన కుమారుడు జగన్‌రెడ్డి, కుమార్తె షర్మిల కోసం రాజశేఖరరెడ్డి యలహంకలో రెండు భవంతులు నిర్మించి ఇచ్చారు. సిలికాన్ బిల్డర్స్, సుగుణ పేర్లను వాడుకున్నారు. సుగుణకు కుడిచేత్తో అప్పు ఇచ్చిన సిలికాన్ బిల్డర్స్ ఎడమ చేతితో లీజుకు తీసుకుంది. ఈ సిలికాన్ బిల్డర్స్ సంస్థలో భారతిరెడ్డి కూడా డైరెక్టర్ అన్న విషయం కీలకం. దాదాపు ఇరవై కోట్లు చెల్లించి ఆ భూమి కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత భారతిరెడ్డి తండ్రి గంగిరెడ్డికి అప్పట్లో లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అవినీతి సొమ్ముతో సమకూర్చుకున్న ఆస్తులకోసం కుటుంబంలో ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి. యలహంక ఆస్తులు తన కష్టార్జితం కావని జగన్‌రెడ్డికి తెలియంది కాదు. అలాగే అది తన అత్తగారి కష్టార్జితం కాదని కూడా ఆయనకు తెలుసు. ఇప్పుడు సుగుణతో ఆ భవంతులను జగన్‌రెడ్డి కుమార్తెలకు గిఫ్టుగా ఇప్పించారు.
అప్పనంగా వచ్చిపడిన ఆస్తి కోసం జగన్‌రెడ్డి ఇంతలా ఎందుకు పట్టుపడుతున్నారో తెలియదు. మేనకోడలి పెళ్లిని కూడా అక్కడ జరుపుకోనివ్వకుండా అడ్డుకోవడం ఎందుకో తెలియదు. ఈ చర్య వల్ల ఆయన నైతికంగా పతనమయ్యారు. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు జగన్‌రెడ్డిని ప్రజలు పట్టించుకోలేదుగానీ ఇప్పుడు మాత్రం ఆయన చర్యలను జీర్ణించుకోలేకపోతున్నారు. తన ఇద్దరు పిల్లల కోసం రాజశేఖరరెడ్డి అక్కడ రెండు భవంతులు నిర్మించి ఇచ్చారు. ఇప్పుడు జగన్‌రెడ్డి తన ఇద్దరు కుమార్తెల కోసం షర్మిలను వెళ్లగొట్టి మరీ ఆ భవంతులను సొంతం చేసుకుని ఉండొచ్చు. అయితే మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని అంటారు! చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాలి!