Share News

ఆ ధైర్యం మనకెప్పుడు?

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:39 AM

ఆధునిక యుగంలో సాంకేతికత పిల్లల పాలిట యమపాశంగా మారుతోంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ముగ్గురు మైనర్ సోదరీమణులు తమ తల్లిదండ్రులతో ఏర్పడిన చిన్నపాటి ఘర్షణకే...

ఆ ధైర్యం మనకెప్పుడు?

ఆధునిక యుగంలో సాంకేతికత పిల్లల పాలిట యమపాశంగా మారుతోంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ముగ్గురు మైనర్ సోదరీమణులు తమ తల్లిదండ్రులతో ఏర్పడిన చిన్నపాటి ఘర్షణకే ఆత్మహత్య చేసుకోవడం సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సోషల్ మీడియా కంపెనీలు తమ బ్యాంక్ బ్యాలెన్స్‌లను పెంచుకోవడానికి అమాయక పిల్లల ప్రాణాలను ఏ విధంగా బలిపీఠం ఎక్కిస్తున్నాయో చెప్పడానికి ఇది ఒక భయానక హెచ్చరిక.

సోషల్ మీడియా దిగ్గజాలు పిల్లల భద్రత కంటే వారిని నిరంతరం తమ ప్లాట్‌ఫామ్‌లకు అతుక్కుపోయేలా చేసే ‘అడిక్టివ్ ఆల్గారిథమ్స్’కే ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో పిల్లల్లో విపరీతమైన ఆందోళన, తమ శరీరాకృతిపై అసంతృప్తి, సామాజిక జీవితం పట్ల అసహ్యంతో పాటు ఆత్మహత్య ఆలోచనలను పెంపొందిస్తున్నాయి. పిల్లల ఆట, చదువు, నిద్ర వంటి కనీస అవసరాలను కూడా ఈ డిజిటల్ మహమ్మారి ఆక్రమిస్తోంది. దీంతో వారు వాస్తవిక ప్రపంచానికి దూరమై, డిజిటల్ మాయాజాలంలో చిక్కుకుపోతున్నారు. గతంలో పొగాకు కంపెనీలు తమ ఉత్పత్తుల వల్ల కలిగే నష్టాలను దాచిపెట్టి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడాయి. నేటి టెక్ కంపెనీలు కూడా సరిగ్గా అదే దారిలో నడుస్తున్నాయి. పిల్లలకు సోషల్ మీడియాను నిరాకరించడం వారి సమాచార హక్కును కాలరాయడమేనని, కలిగే హానిపై ఆధారాలు బలహీనంగా ఉన్నాయని వాదిస్తున్నాయి. అమెరికా కోర్టుల్లో బయటపడిన ఆధారాల ప్రకారం, తమ ప్లాట్‌ఫామ్‌ల వల్ల బాలికలు లైంగిక హింసకు, మానవ అక్రమ రవాణాకు గురవుతున్నారని తెలిసి కూడా ఈ సంస్థలు మౌనంగా ఉన్నాయి.


ఆస్ట్రేలియా ప్రభుత్వం, 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. వయస్సు నిర్ధారణ బాధ్యతను పూర్తిగా కంపెనీలపైనే ఉంచింది. అమెరికా, యూకే, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా కఠిన చట్టాల దిశగా అడుగులు వేస్తున్నాయి. భారతదేశంలో పరిస్థితి మరింత విషమంగా ఉంది. స్మార్ట్‌ఫోన్ల వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. 16 ఏళ్ల లోపు పిల్లల్లో మూడింట ఒక వంతు మందికి స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. టెక్ కంపెనీల ఖజానాలు నింపడానికి మన పిల్లల ప్రాణాలను బలి ఇవ్వలేం. మన విధానకర్తలు వెంటనే మేల్కొని ఆస్ట్రేలియా తరహాలో కఠినమైన నిషేధ చట్టాలను అమలు చేయాలి. దీంతో పాటు సమాజంలో కూడా అవగాహన పెంచాలి. పిల్లలకు ఆన్‌లైన్ లోకం కంటే నిజ జీవితంలోని మానవీయ సంబంధాలే ముఖ్యమని, వారితో సమయం గడపడం ద్వారా తల్లిదండ్రులు తెలియజెప్పాలి.

– వెంకగారి భూమయ్య

Updated Date - Feb 21 , 2026 | 12:41 AM