Share News

మ్యాక్స్ సొసైటీలను బలోపేతం చేయాలి

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:15 AM

అనేకానేక ప్రజా ఉద్యమాల మూలంగా తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించింది. అయినా సిరిసిల్లలో మరమగ్గాల చేనేత పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందలేదు.

మ్యాక్స్ సొసైటీలను బలోపేతం చేయాలి

అనేకానేక ప్రజా ఉద్యమాల మూలంగా తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించింది. అయినా సిరిసిల్లలో మరమగ్గాల చేనేత పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందలేదు. చేనేత కార్మిక కుటుంబాలలో చాప కింద నీరులా సంక్షోభం కొనసాగుతూ వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరిట 2018 నుంచి 2023 వరకు ఏటా మొత్తం కలుపుకొని రూ.2,100 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చింది. సిరిసిల్ల, గర్శకుర్తి, తంగళ్లపల్లి, కొత్తపల్లి ప్రాంతాలను కలుపుకుంటే సుమారు 25,000 పవర్‌లూమ్స్ ఉన్నాయి. దీనితో నేత కార్మికులకు ‘పొద్దుటిది పొట్టకు మాపటిది బట్టకు’ అన్నట్టు సంవత్సరానికి సుమారు 6 నెలల పని దొరికింది. చేనేత మగ్గం దాదాపుగా అంతరించిపోగా, పవర్‌లూమ్ నేత పరిశ్రమగా విరాజిల్లుతున్నది. సేట్లు, ఆసాములు, కార్మికులు అనే మూడు అంచెలుగా ఈ పరిశ్రమ మనుగడ సాగుతున్నది.

టెస్కో విభాగం ద్వారా నేత పరిశ్రమలోని మూడంచెల వ్యవస్థ స్థానంలో కార్మికులే సభ్యులుగా 135 మ్యాక్స్ సొసైటీలను స్వయం సహాయకంగా అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ సొసైటీలకు తగిన ఆర్థిక వనరులు, స్తోమత లేకపోవడం వల్ల స్వయం సహాయక సంఘాలు తిరిగి మాస్టర్ వీవర్స్ చేతుల్లోకే వెళ్లిపోయాయి. దాంతో నేత కార్మికుల బతుకులు... ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. మరోవైపు 2022–23 సంవత్సరంలో బతుకమ్మ చీరలు సరఫరా చేసినందుకు గాను గత ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు బకాయి చెల్లించవలసి ఉన్నది. ఆ బకాయిల మెలిక కారణంగా సేట్లు తిరిగి కేటీఆర్ గెలుపునకు కారణమయ్యారు.


2023లో ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ బకాయిలను చెల్లించడమే కాకుండా సిరిసిల్ల నేత పరిశ్రమకు ఇందిరమ్మ స్వయం సహాయక చీరల ఆర్డర్లను ఇచ్చి పునరుత్తేజం కలిగించేలా కార్యాచరణ రూపొందించింది. అంతేకాక 5 హెచ్‌పీల వరకు ఉన్న కుటీర పరిశ్రమ గుర్తింపును 25 హెచ్‌పీలకు పెంచి, 50శాతం విద్యుత్‌ రాయితీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిశ్రమపై మొత్తం ఎనిమిది వేల మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారు.

పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ఇస్తూ పరిశ్రమకు ప్రోత్సాహం అందిస్తున్నది. కర్ణాటకలో 10 హెచ్‌పీల వరకు ఉచితంగా కరెంటును నేత పరిశ్రమకు అందజేస్తున్నారు. పెద్ద టెక్స్‌టైల్ కంపెనీలతో పాటు సిరిసిల్ల లాంటి మధ్య, దిగువ తరగతి పవర్‌లూమ్ పరిశ్రమను ఒకే గాటన కట్టి కేంద్ర ప్రభుత్వం 12శాతం జీఎస్టీ విధించడం వల్ల పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతున్నది.

చివరగా మాక్స్ సొసైటీలను ప్రభుత్వం ఆర్థికంగా బలోపేతం చేస్తేనే నేత కార్మికులకు చేయూత ఇచ్చినట్టు అవుతుంది. సిరిసిల్ల ప్రాంతంలోని నేత పరిశ్రమనే కాదు, రాష్ట్రంలోని పోచంపల్లి, నారాయణపూర్, భువనగిరి తదితర ప్రాంతాలలో ఉన్న పెద్ద సేట్ల చేతుల్లోంచి పరిశ్రమలు విడుదలయితేనే గానీ నేత కార్మికుల కుటుంబాలలో మార్పు రాదు.

- జూకంటి జగన్నాథం

Updated Date - Sep 30 , 2026 | 12:18 AM