ఎన్నికల కమిషన్ ఎవరికోసం?
ABN , Publish Date - Sep 30 , 2026 | 12:31 AM
‘తుపాకీ పోలీసు చేతిలో ఉన్నప్పటికీ దాన్ని ఎవరిపై పేల్చాలో నిర్ణయించే అధికారం పైవాడి చేతుల్లోనే ఉంటుంది’ అని ప్రముఖ నవలాకారుడు జార్జి ఆర్వెల్ తన సుప్రసిద్ధ నవల ‘1984’లో అన్నారు.
‘తుపాకీ పోలీసు చేతిలో ఉన్నప్పటికీ దాన్ని ఎవరిపై పేల్చాలో నిర్ణయించే అధికారం పైవాడి చేతుల్లోనే ఉంటుంది’ అని ప్రముఖ నవలాకారుడు జార్జి ఆర్వెల్ తన సుప్రసిద్ధ నవల ‘1984’లో అన్నారు. ఒక భయంకర ఊహాజనిత ప్రపంచం గురించి చిత్రించిన ఆ నవలలో ‘థాట్ పోలీస్’ అని ఆర్వెల్ నిర్వచించిన వ్యవస్థలో నిర్ణయాలు అమలు చేసేవారు స్వతంత్రంగా ఆలోచించే శక్తిని కోల్పోతారు. పైవాడు ఏది చెబితే అది చేసే రోబోల్లా మారతారు. మన అధికార వ్యవస్థ ఆ సత్యాన్ని ప్రతిబింబిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.
ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో అనేక కీలక నిర్ణయాలు తమకు తెలియకుండా తీసుకున్నారని ఇద్దరు ఎన్నికల కమిషనర్లు తమ కమిషన్‌లో వివిధ విభాగాలకు పంపిన 14 నోట్స్‌ను సెప్టెంబర్ 24న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లీక్ చేసింది. ఈ సంచలన వార్తా కథనంతో ప్రతిపక్షాలకు, బీజేపీని వ్యతిరేకించే అనేక వర్గాలకు ఎక్కడి లేని ఆవేశం పుట్టుకొచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను దేశద్రోహి అని నిందిస్తూ, ఆయనను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్తగా ప్రభవించిన కాక్రోచ్ జనతా పార్టీ కూడా దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. విచిత్రమేమంటే రెండు రోజుల తర్వాత ఇదే ఎన్నికల కమిషన్ తమ నిర్ణయాలన్నీ కలిసికట్టుగా తీసుకున్నామని ప్రకటించింది. ముగ్గురు ఎన్నికల కమిషనర్లు సమావేశమైన ఫొటోను కూడా పత్రికలకు విడుదల చేశారు.
అయితే ప్రతిపక్షాలు, బీజేపీ వ్యతిరేక వర్గాలు ఎంత గగ్గోలు సృష్టిస్తున్నా కేంద్రంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా దాని గురించి అంత సీరియస్‌గా ఉన్నట్లు కనపడడం లేదు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వార్త వచ్చిన సమయానికి మోదీ ఢిల్లీలోని సేవాతీర్థ్‌లో చింతన్ శిబిర్ పేరుతో కేంద్ర కేబినెట్ మంత్రులతో రెండు రోజుల ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. తాము చేపట్టబోయే పాలనా సంస్కరణలు, వికసిత్ భారత్– 2047కు రోడ్ మ్యాప్‌పై సుదీర్ఘంగా చర్చించారు. ఎక్స్‌ప్రెస్ వార్తపై సెప్టెంబర్ 25న ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళనకు ఉపక్రమించాయి. ఆ రోజు దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి అయినందున ప్రధాని మోదీ యువతీ యువకులతో కలిసి భజన్ క్లబ్బింగ్ పేరిట ‘అచ్యుతం, కేశవం’ ‘రాధే రాధే’ వంటి భజన గీతాలను ఆలపించారు. స్వయంగా కంజీరా వాయిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం యూపీ ట్రేడ్ షో, అహ్మదాబాద్‌లో ఎల్ఎన్‌జీ రైలు ప్రారంభం, ఉగ్రవాద నిరోధక సదస్సు తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారే కానీ విపక్షాల ఆందోళన పట్ల ఏ మాత్రం స్పందించలేదు.
తమ మధ్య ఎలాంటి విభేదాలూ లేవని ముగ్గురు ఎన్నికల కమిషనర్లు ప్రకటించినంత మాత్రాన దేశంలో ఎన్నికల వ్యవస్థ సక్రమంగా నడుస్తుందని బుద్ధిజీవులు ఎవరూ అనుకునే అవకాశాలు లేవు. ఇద్దరు మాజీ ఎన్నికల కమిషనర్లు లావాసా, రావత్ కూడా ‘సర్’ అమలవుతున్న తీరును తీవ్రంగా విమర్శించారు. సర్ నిర్వహణకు అనుసరిస్తున్న పద్ధతి రాజ్యాంగ వ్యతిరేకమని, లోపభూయిష్ఠమని లావాసా విమర్శిస్తే... ఎన్నికల కమిషన్ పనిచేస్తున్న తీరు సక్రమంగా లేదని, దాని విశ్వసనీయతపై కారుమేఘాలు కమ్ముకున్నాయని రావత్ అభిప్రాయపడ్డారు. నిజానికి వివిధ విభాగాలకు ఇద్దరు ప్రస్తుత కమిషనర్లు పంపిన నోట్స్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రతినిధికి ఎలా చేరాయి? ఒక్కో విభాగం నుంచి నోట్స్ సేకరించడం కష్టమని, ఇద్దరు ఎన్నికల కమిషనర్లలో ఏ ఒక్కరో తమ వద్ద ఉన్న అన్ని నోట్స్‌ను లీక్ చేయడం అసాధ్యమని ఎన్నికల సంఘం అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. ఏమైనప్పటికీ ఈ ముగ్గురు ఎన్నికల కమిషనర్లు చివరకు అంతా క్షేమమే అన్నట్లుగా పత్రికా ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు. నిజానికి గత మే నుంచి ఆగస్టు వరకు ముఖాముఖి చూసుకుని ఈ ముగ్గురు అధికారులు తమలో తాము సర్దుకుపోయేందుకు ఏ ప్రచ్ఛన్న హస్తం దోహదం చేసిందో ఊహించడం కష్టం కాదు.
మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఓట్ల చోరీ గురించి గొంతు చించుకుంటూ ఉండేది. అయితే ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నోట్స్ బయటపడ్డాక దేశవ్యాప్తంగా మోదీ వ్యతిరేక శక్తులు వేర్వేరుగా స్పందించడం మొదలుపెట్టాయి. దేశమంతటా యూట్యూబర్లు విస్తృతంగా జ్ఞానేశ్ కుమార్‌ను దుయ్యబట్టడం మొదలుపెట్టారు. ఇంతకూ దేశంలో ఏ వివాదం ఎంతకాలం సాగుతుందో చెప్పలేము. నీట్ పేపర్ లీక్ వివాదం సద్దుమణిగింది. అయోధ్యలోని రామమందిరంలో చందా చోరీ గురించి ఎవరూ మాట్లాడడం లేదు. యూపీఐపై లెవీ చార్జీల గురించి కూడా జరగాల్సినంత చర్చ జరగలేదు. పెట్రోల్‌లో ఇథనాల్ వివాదం ఎప్పుడో తెరమరుగైంది. ఒక వివాదం తర్వాత మరో వివాదం వస్తూ పోతూనే ఉన్నది. పార్లమెంటు సమావేశాలు జరగడం, స్తంభించిపోవడం మామూలయిపోయాయి. ఇప్పుడు ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్న అక్రమాల గురించి ఎవరైనా ఎంతకాలం మాట్లాడతారో చెప్పడం కష్టం. న్యాయవ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అస్మదీయులనే ఎన్నికల కమిషనర్లుగా నియమించే అవకాశం గురించి ఒక న్యాయమూర్తి మాట్లాడితే ‘మీరు మాత్రం మీకు నచ్చిన వారిని న్యాయమూర్తులుగా కొలీజియంలో నియమించుకోవడం లేదా?’ అని సొలిసిటర్ జనరల్ ప్రశ్నించారు.
గతంలో బోఫోర్స్ కుంభకోణం గురించి ప్రతిపక్షాలు దాదాపు రెండేళ్లు తీవ్రంగా ఉద్యమించి చివరికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం అధికారం కోల్పోయేలా చేశాయి. యూపీఏ పాలనలో అవినీతికి వ్యతిరేకంగా మూడేళ్లకు పైగా ఆందోళనను నిర్వహించి, మోదీ అధికారం చేపట్టే వరకూ బీజేపీ విశ్రమించలేదు. ఎన్నికల కమిషన్ అక్రమంగా 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించడం, జిల్లా, రాష్ట్ర అధికారులకు కేంద్ర డేటాబేస్ అందుబాటులో లేకపోవడం, 16 లక్షల మంది ఓటర్లను తొలగించడం సరైనదంటూ సీఈసీ ఏకపక్షంగా అప్పీళ్లు దాఖలు చేయడం, గోవాలో తొలగించిన ఓటర్లను స్థానిక అధికారులే జాబితాలో చేర్చలేకపోవడం తీవ్రమైన విషయాలే, సందేహం లేదు. అయినా వీటన్నిటిపై ప్రజల్లో ఒక ఉద్వేగపూరితమైన వ్యతిరేకతను నిర్మించకపోతే ప్రతిపక్షాలు చేయగలిగేది ఏమీ లేదు. పెద్ద ఎత్తున ఓటర్లను తొలగించడం వల్లే బెంగాల్, బిహార్, హరియాణా ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని, ఆ ఎన్నికలను రద్దు చేయాలని వాదిస్తున్న ప్రతిపక్షాలు సదరు రాష్ట్రాల్లో ప్రజాందోళనలను ఎందుకు నిర్వహించలేకపోతున్నాయి? బోఫోర్స్ కుంభకోణం మాదిరి ప్రజల్లో చైతన్యం తేగలిగిన పరిస్థితి ఎన్నికల అక్రమాల విషయంలో రాగలదా?
భారతదేశంలో తమ ఓటు హక్కు గురించి ఎంతమంది పోరాడుతున్నారో చెప్పడం కష్టం. దేశవ్యాప్తంగా కనీసం 3 కోట్ల మంది తమను తాము ఓటర్లుగా నమోదు చేసుకోలేదు. నమోదు చేసుకున్న వారిలో ‘సర్’ పేరిట ఎన్నికల కమిషన్ తీసేసిన పేర్లను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 99 కోట్ల మంది ఓటర్లలో 86 కోట్ల మంది మాత్రమే ఓటర్లుగా మిగులుతారు. వీరిలో కూడా గత సార్వత్రక ఎన్నికల గణాంక వివరాల ప్రకారం, కేవలం 66శాతం మంది అంటే 33 కోట్ల మంది ఓటు వేసేందుకు కనీసం ఆసక్తి కూడా చూపడం లేదు. ప్రతి పౌరుడు తన ఓటు హక్కును విధిగా వినియోగించుకునేలా వారిని చైతన్యపరచడం ఎన్నికల కమిషన్ విధ్యుక్త ధర్మం. అయితే ‘సర్’ ప్రక్రియ మూలంగా ఓటర్లలో ఉన్న చైతన్యం నీరుగారిపోతోందా?! రకరకాల ప్రశ్నలకు జవాబిస్తూ, అధికారుల చుట్టూ తిరిగేందుకు శ్రద్ధ, తీరిక ఉన్నవారెంతమంది? దేశంలో 18–35 సంవత్సరాల మధ్య వయస్సున్న యువ భారతీయుల సంఖ్య 35–40 కోట్ల వరకూ ఉంటుంది. కానీ వారిలో ఓటర్లు ఎంతమంది? తమను ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ప్రజలు, ముఖ్యంగా యువతరం ఉద్యమించేలా చేయగలిగిన శక్తి ప్రతిపక్షాలకు, మేధావులకు ఉన్నదా? ఉపాధి కోసం దేశంలో ఎక్కడెక్కడికో వెళ్లక తప్పని యువతకు, మరీ ముఖ్యంగా వలస కూలీలకు ఓటు వేయాలన్న తహతహ ఉంటుందా? మన దేశంలో సోషల్ మీడియాలో అభిప్రాయాలు చెప్పేవారయినా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారా అన్నది అనుమానమే. ఒకప్పుడు ఎన్నికలను బహిష్కరించమని చెప్పినవారు సైతం ఇప్పుడు ఓటు హక్కు గురించి మాట్లాడుతున్నారు!
ఈ వాస్తవాలు తెలిసినందువల్లే బహుశా మోదీ, అమిత్ షా ఎన్నికల సంఘంపై జరుగుతున్న చర్చను ఒక చోద్యంగా భావిస్తున్నట్టు కనపడుతోంది. ఈ దేశంలో ప్రతి పార్టీ తమకు అంకితభావం ఉన్న ఓటర్ల బేస్‌ను తయారు చేసుకుని వారిని వివిధ ప్రలోభాలు, భావోద్వేగాలకు గురిచేయడం పరిపాటిగా ఉంది. డేటాబేస్ అదుపులో ఉన్నందువల్ల ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో వ్యూహరచన చేసే భారతీయ జనతా పార్టీకి తమకు ఓటు వేసే వారెవరో, తమ ప్రత్యర్థులకు ఓటు వేసే వారెవరో రాష్ట్రాల వారీగా తెలియకుండా పోలేదు. సర్ ప్రక్రియలో తొలగించే ఓట్లతో తమ ఓటు బ్యాంకుకు పెద్దగా నష్టం ఉండకపోవచ్చుననేది ఆ పార్టీ అభిప్రాయం కావచ్చు. పైగా ప్రతిపక్షాలు ఒక వర్గం ఓట్ల కొరకు ఎంత గగ్గోలు పెడితే అంత మేరకు తమ మెజారిటీ ఓట్లు సంఘటితం అవుతాయని పాలకపక్షం వారు భావిస్తుండవచ్చు. ఓట్ల కోసం జరిగే ఈ కొట్లాట మధ్య అసలైన ఎన్నికల సంస్కరణలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రతి ఎన్నికలోనూ విచ్చలవిడిగా ప్రవహిస్తున్న వేల కోట్ల రూపాయల నల్లధనం గురించి ఎవరికీ పట్టడం లేదు. అయినప్పటికీ ఎన్నికల కమిషన్ తీరుతెన్నులపై ప్రతిపక్షాలు, జెన్ జీ నిర్మించే ఆందోళన వ్యవస్థలో ఏ మాత్రం చలనం తీసుకువచ్చినా సంతోషకరమే.
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)