నాడు సక్రమమైనది.. నేడు అక్రమమెలా అయింది?
ABN , Publish Date - Oct 24 , 2026 | 02:21 AM
ప్రత్యేక సమగ్ర సవరణపై కాంగ్రెస్, ఇండియా కూటమి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, అర్థరహితమైనవి.
ప్రత్యేక సమగ్ర సవరణపై కాంగ్రెస్, ఇండియా కూటమి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, అర్థరహితమైనవి. విపక్ష పార్టీలు రాజకీయంగా బీజేపీని ఎదుర్కొనే సత్తా లేక, ఎన్నికల్లో గెలవలేక ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ప్రజలను కావాలనే తప్పుదోవపట్టిస్తున్నాయి. ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ వంటి అత్యున్నత రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నాయి. ఈ సమగ్ర సవరణ ప్రక్రియను సుప్రీంకోర్టు ఇప్పటికే సమర్థించినా, దీనిపై రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, కాంగ్రెస్ నేతలు నిరసనల పేరుతో వింత చేష్టలకు దిగడం ప్రజాస్వామ్య వ్యవస్థలను అవమానించడమే.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంత ముఖ్యమో, ఆ ఎన్నికలకు ఆధారమైన ఓటర్ల జాబితా స్వచ్ఛంగా ఉండటం అంతకంటే ముఖ్యం. మరణించిన, నివాసం మారిన, రెండు చోట్ల ఓటు ఉన్న, నకిలీ ఓటర్లు జాబితాలో కొనసాగితే ప్రజాతీర్పే ప్రశ్నార్థకమవుతుంది. ఈ లోపాలను సరిదిద్దడానికే భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టింది. అయితే ఈ ప్రక్రియ ద్వారా నిజమైన ఓటర్లను తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి అబద్ధపు ప్రచారానికి దిగింది. జాబితా నుంచి ఒక్క నిజమైన ఓటరునైనా అక్రమంగా తొలగించినట్టు ఆ నేతలు ఇప్పటివరకు నిరూపించలేకపోయారు. ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిపక్షాలు ఎన్నికల సంఘంపై చేసే దాడి ఇది.
రాజ్యాంగంలోని 324వ అధికరణం, ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లోని 21వ విభాగం ఎన్నికల సంఘానికి ప్రత్యేక సమగ్ర సవరణ అధికారాన్ని కల్పిస్తున్నాయి. ఇది ఎవరి హక్కులనూ కాలరాసే చర్య కాదు. ఓటర్ల జాబితాను నవీకరించే సాధారణ పరిపాలనా ప్రక్రియ మాత్రమే. ఎన్నికల సంఘం సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తోంది. ముసాయిదా జాబితాను ప్రజల ముందుంచి, అభ్యంతరాలకు, సవరణలకు తగిన గడువు ఇచ్చిన తర్వాతే తుది జాబితాను ప్రకటిస్తోంది. పొరపాటున పేరు గల్లంతైన అర్హులెవరైనా తిరిగి నమోదు చేసుకునే అవకాశమూ ఉంది.
ఈ ప్రక్రియ ఎంత విస్తృతంగా సాగిందో గణాంకాలే చెబుతున్నాయి. దేశంలోని 95 కోట్ల ఓటర్లలో 82 కోట్ల మంది గణనలో పాల్గొన్నారు. పదకొండు లక్షల మందికి పైగా ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయగా, వివిధ రాజకీయ పక్షాలకు చెందిన 35 లక్షల మంది ప్రతినిధులు ప్రతి దశనూ పర్యవేక్షించారు. అన్ని పక్షాల ప్రతినిధులు కళ్లారా చూస్తుండగా రహస్యంగా ఓట్లను తొలగించడం ఎలా సాధ్యం? ఈ తనిఖీలో 2.89 కోట్ల మంది మరణించిన వారి పేర్లు, 1.01 కోట్ల నకిలీ పేర్లు ఉన్నట్టు తేలింది. అభ్యంతరాల ఆధారంగా ఫారం–7 దరఖాస్తుల ద్వారా దేశవ్యాప్తంగా కేవలం 29 లక్షల పేర్లను మాత్రమే చట్టబద్ధంగా తొలగించారు. మరోవైపు ఫారం–6 దరఖాస్తుల ద్వారా రెండు కోట్లకు పైగా కొత్త ఓటర్లు జాబితాలో చేరారు. అర్హుడైన ప్రతి పౌరుడికీ ఓటర్ల జాబితాలో చోటు కల్పించడమే ఈ ప్రక్రియ ఉద్దేశమని ఇది స్పష్టం చేస్తోంది.
స్వతంత్ర భారతంలో ఇప్పటివరకు ఎనిమిదిసార్లు ఈ ప్రక్రియ జరగ్గా, వాటిలో అత్యధికం కాంగ్రెస్ హయాంలోనే జరిగాయి. అప్పుడు సక్రమమైన ప్రక్రియ ఇప్పుడు అక్రమం ఎలా అవుతుంది? కేరళలో ఈ సవరణ పూర్తయిన తర్వాతే ఎన్నికలు జరిగాయి. అక్కడ కాంగ్రెస్ గెలిచినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు? శశిథరూర్, రమేశ్ చెన్నితల, సచిన్ పైలట్ వంటి కాంగ్రెస్ నేతలే నకిలీ ఓట్ల ఏరివేతకు ఈ ప్రక్రియ అవసరమని మద్దతు పలికారు. 42 మంది మాజీ న్యాయమూర్తులు ఎన్నికల సంఘానికి మద్దతుగా బహిరంగ లేఖపై సంతకం చేస్తూ, ఆధారాలు లేని ఆరోపణలను తప్పుపట్టారు.
కాంగ్రెస్ ఆందోళన వెనుక ఉన్నది ఓటమి భయమే. 1952లో 45శాతంగా ఉన్న ఆ పక్షం ఓట్ల శాతం 2024 నాటికి 21శాతానికి పడిపోయింది. ప్రజల విశ్వాసం కోల్పోయిన ప్రతిసారీ రాజ్యాంగ సంస్థలపై బురదజల్లడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారింది. ఎన్నికల సంఘం నిష్పాక్షికతను ప్రశ్నిస్తున్న ఆ పక్షం, ఒకప్పుడు ఎన్నికల సంఘానికి సారథ్యం వహించిన ఎం.ఎస్.గిల్ పదవీ విరమణ తర్వాత కాంగ్రెస్‌లో చేరి కేంద్రమంత్రి అయిన సంగతిని మరిచిపోయింది. అలాగే టి.ఎన్.శేషన్ పదవీ విరమణ తర్వాత గాంధీనగర్ నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేయలేదా? మరో సీఈసీ నవీన్ చావ్లా నిష్పాక్షికతపైనా అప్పట్లో తీవ్ర ప్రశ్నలు తలెత్తాయి. ఎన్నికల అక్రమాల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు ఉన్నదా? ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకున్నారన్న ఆరోపణలు రుజువై 1975లో ఇందిరా గాంధీ ఎన్నిక రద్దయిన ఉదంతం ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యాయం. తీవ్ర వ్యతిరేకత నడుమ ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించినవేళ చోటుచేసుకున్న 1988 నాటి అస్సాం నెల్లి మారణకాండ భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చింది.
గతంలో జరిగిన ఇలాంటి అవకతవకలు పునరావృతం కాకుండా చూడటమే ప్రత్యేక సమగ్ర సవరణ ముఖ్యోద్దేశం. అర్హులైన ప్రతి పౌరుడికీ ఓటు హక్కు దక్కాలన్నా, ప్రతి ఓటుకూ సమాన విలువ ఉండాలన్నా జాబితా స్వచ్ఛంగా ఉండాలి. ఓటమి భయంతో రాజ్యాంగ సంస్థలపై నిందలు వేయడం మాని, ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందే మార్గాన్ని కాంగ్రెస్ వెతుక్కోవాలి. నకిలీ ఓట్ల ఏరివేతను వ్యతిరేకించడమంటే పరోక్షంగా ఆ ఓట్లను సమర్థించడమే.
- వల్లూరి జయప్రకాష్ నారాయణ
బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి