తెలుగు కథకు అత్తరులద్దిన సత్యాగ్ని
ABN , Publish Date - Nov 24 , 2026 | 01:30 AM
ముస్లిం జీవితాన్ని తెలుగు కథల్లోకి అత్తరులా ఒంపినవాడు షేక్ హుసేన్ సత్యాగ్ని. 83 ఏళ్ల వయసులో కడపలోని తన స్వగృహంలో నవంబరు 16న ఆయన కన్నుమూశారు 1989లో ‘పాచికలు’ అనే ముస్లిం కథల సంకలనం..
ముస్లిం జీవితాన్ని తెలుగు కథల్లోకి అత్తరులా ఒంపినవాడు షేక్ హుసేన్ సత్యాగ్ని. 83 ఏళ్ల వయసులో కడపలోని తన స్వగృహంలో నవంబరు 16న ఆయన కన్నుమూశారు 1989లో ‘పాచికలు’ అనే ముస్లిం కథల సంకలనం వేయకముందే పీడిత, తాడిత ప్రజల గొంతును తన కథల్లో వినిపించారు. మొదటి కథ ‘నూరు రూపాయలు’ 1985లో ప్రచురితమైంది. వరుసగా నాలుగేళ్లలో రాసిన కథలతో 1988లో ‘అగ్ని సరస్సు’ పేరుతో సంకలనం తీసుకొచ్చారు. కడపలో జరిగిన ఈ పుస్తకం ఆవిష్కరణకు ఆనాటి ప్రసిద్ధ కథకులు వల్లంపాటి వెంకటసుబ్బయ్య, మధురాంతకం రాజారాం హాజరయ్యారు. ‘అగ్ని సరస్సు’ సంకలనంలో ‘వినిపించని ఏడుపులు’ కథలో పరోక్షంగా ముస్లిం జీవితం ఉంటుంది. దాన్ని చూసేనేమో వల్లంపాటి వెంకటసుబ్బయ్య ‘సత్యాగ్నీ.. నువ్వు ముస్లిం జీవితాలను కూడా కథలుగా రాయాలి’ అన్నారట. ఆ మాట పట్టుకుని షేక్ హుసేన్ సత్యాగ్ని ఏడాది తిరగకుండానే ఏడు ముస్లిం జీవిత కథలతో ‘పాచికలు’ పుస్తకం రాశారు.
సత్యాగ్ని స్త్రీ పక్షపాతి. ముస్లిం, ముస్లిమేతర సమాజమని కాకుండా, ప్రధానంగా స్త్రీ అణచివేత కేంద్రంగా అనేక కథలు రాశారు. కడప బుగ్గవంక ఒడ్డునున్న కంపచెట్లే స్థావరంగా చేసుకుని శరీరాన్ని అమ్ముకుంటున్న ఓ అభాగ్యురాలి దీనగాథను ఆయన తొలికథ ‘నూరు రూపాయలు’లో వివరించారు. అలాగే తలాఖ్ సంప్రదాయాన్ని దుర్వినియోగం చేస్తున్న ముస్లిం పురుషుల వల్ల స్త్రీలు ఎదుర్కొంటున్న బాధలను ‘పాచికలు’ కథలో వివరించారు.
కడప దగ్గర్లోని రాయలపంతులపల్లెలో 1943లో పుట్టిన షేక్ హుసేన్ కలం పేరు ‘సత్యాగ్ని’. సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారి శిష్యుల్లో షేక్ హుసేన్ ఒకరు. సంప్రదాయ సాహిత్యాన్ని ఎంతో ఇష్టపడే హుసేన్ మొదటగా ముత్యాల సరాలు ఛందస్సులో ‘భగ్న వీణ’ గేయకావ్యం రాశారు. అయితే ముస్లిం పేరైనందువల్ల సాహిత్యరంగంలో ఆదరణ తక్కువ ఉంటుందేమోనని పుట్టపర్తి వారే స్వయంగా ‘సత్యాగ్ని’ అని కలం పేరు సూచించినట్టు షేక్ హుసేన్ చెబుతారు.
షేక్ హుసేన్ చాలాకాలం విద్యార్థి నాయకుడిగా, కార్మిక నాయకుడిగా ఉండటం వల్ల వ్యవస్థలోని అనేక లోపాలను బాగా పట్టుకోగలిగారు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలోని డొల్లతనాన్ని, చట్టం చేసే విచిత్రాలను ఆయన కథల్లో వివరించారు. ‘వినిపించని ఏడుపులు, దొంగలు, నూరు రూపాయలు...’ వంటి కథల్లోని పోలీస్ పాత్రలే ఇందుకు ఉదాహరణలు.
హుసేన్ ఏం రాసినా తన జీవితంలో లేనిదీ, చూడనిదీ రాయలేదు. కల్పిత కథలకు ఆయన ఆమడ దూరం. చూసింది చూసినట్టు చక్కటి భాషా పటిమతో కళ్లకు కట్టినట్టు రాయడం ఈయన శైలిలోని ప్రత్యేకత. ముస్లిం మైనార్టీ కథ రాస్తే ఆ వాతావరణానికి తగ్గ భాష రాయడం, ఆధిపత్య భావజాలానికి సంబంధించిన కథ రాస్తే దానికి తగ్గ వాతావరణాన్ని, భాషను సృష్టించడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే రాయలసీమ కథల మాస్టారు కేతు విశ్వనాథరెడ్డి ఈయన గురించి చెబుతూ ‘అలవోకగా కథానికా తత్వం అలవర్చుకున్నవాడు’ అన్నారు.
షేక్ హుసేన్ సత్యాగ్ని రాజకీయాల్లో చేరి, అక్కడా రాణించారు. కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి మైనార్టీ నాయకుడాయన. రెండుమార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. ఎనభై ఏళ్లు పైబడ్డాక కూడా అక్షర సేద్యం చేశారు. మలిదశలో ఆయన వెలువరించిన ‘సత్యాగ్ని కథలు’ (2015), ‘దివార్’ (2022) కథా సంకలనాలే అందుకు సాక్ష్యం. ‘సత్యాగ్ని’ కథల పుస్తకంలో ఉన్న ‘కుచేలుడు’, ‘గడ్డిపరకలు’, ‘స్వాతంత్య్ర సమరయోధుడు’ వంటి కథలు ఆయన రాజకీయ జీవితంలోని అనుభవాలకు దర్పణం. ‘దివార్’లో ప్రశ్నించే స్త్రీల కథలు కనిపిస్తాయి. ఇష్టం లేని పెళ్లిని ‘ఖబుల్ నహీ’ అంటూ పెళ్లి మండపంలోనే అరిచిచెప్పే స్త్రీ పాత్ర ‘నిఖా’ కథలో కనిపిస్తుంది. వేధింపులకు గురిచేసే అత్త, మొగుడిపై తిరుగుబాటు చేసి న్యాయ పోరాటంలో విజయం సాధించే స్త్రీ పాత్ర ‘బాంది’ కథలో కనిపిస్తుంది. టైటిల్ కథ ‘దివార్’లో పెద్దవాళ్లను ఎదిరించి ఒక ముస్లిం స్త్రీ– దూదేకుల అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. ఇవన్నీ ఈనాటి ముస్లిం మహిళల చైతన్యాన్ని చూపిస్తున్నాయి.
హుసేన్ సత్యాగ్ని రాజకీయాల్లోకి రాకముందు పాత్రికేయుడిగా పనిచేశారు. సినిమాల మీద ఆసక్తితో కొద్దికాలం చెన్నైలో గడిపారు. నాటకాల మీద పిచ్చితో ‘మజ్నూష’ నాటకం రాసి, ప్రదర్శించి నటుడిగా కూడా ప్రశంసలు అందుకున్నారు. తాను రాసిన పాటలతో ‘సత్యాగ్ని గీతాలు’ పేరిట పుస్తకాన్ని వెలువరించారు. తెలుగు కథలో ప్రభావవంతంగా ముస్లిం జీవితాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి చాలామంది ఆయన్ను తొలి తెలుగు ముస్లిం మైనార్టీ కథకుడుగానే గుర్తిస్తారు కానీ, ఆయన అంతకుమించి సేవలందించారు. పౌర సమాజం ఆయన్ను ఆ దిశగా కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సత్యాగ్నికి నివాళి.
- వేంపల్లె షరీఫ్ (కథా రచయిత)