విలక్షణ కార్మికనేత శంకరగుహ నియోగి
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:56 AM
మనదేశంలో స్వాతంత్య్ర ఉద్యమంతో పెనవేసుకొని కాంగ్రెస్, కమ్యూనిస్టు తేడాలు లేకుండా అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు (ఏఐటీయూసీ) 1920లో ప్రారంభమయింది.
మనదేశంలో స్వాతంత్య్ర ఉద్యమంతో పెనవేసుకొని కాంగ్రెస్, కమ్యూనిస్టు తేడాలు లేకుండా అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు (ఏఐటీయూసీ) 1920లో ప్రారంభమయింది. తరువాత దాని నుంచి కాంగ్రెస్ విడిపోయి 1947 మే 3న ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్‌టీయూసీ) స్థాపించుకున్నది. ఆ తర్వాత 1970 వరకు ఐక్యంగా నిలిచిన వామపక్షాల్లో లుకలుకలు ప్రారంభమై సీపీఎంకు చెందిన నాయకులు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) ఏర్పాటు చేసుకున్నారు. తరువాతి కాలంలో చిన్నచిన్న నక్సల్ గ్రూపులు, ఇతర వామపక్షాలు, అన్ని అధికార రాజకీయ పక్షాలు తమ తమ సొంత కుంపట్లు ఏర్పరచుకున్నాయి.
కానీ ఛత్తీస్‌గఢ్‌లో 1977 మార్చి 3న శంకరగుహ నియోగి నాయకత్వంలో ఏర్పడిన ఛత్తీస్‌గఢ్ మైన్స్ శ్రామిక సంఘ్ (సీఎంఎస్‌ఎస్) సంప్రదాయ కార్మిక సంఘాల కంటే భిన్నమైనది. కేవలం ఆర్థిక పరిధులకే పరిమితం కాకుండా ఈ సంఘం కార్మికుల జీవితాల్లోకి చొచ్చుకెళ్లింది. జీతాలు, గేట్ మీటింగ్‌లు, పనిగంటలు, పని ప్రదేశాల్లో సౌకర్యాల కల్పన లాంటి విషయాలకు పరిమితం కాకుండా కార్మికుడి జీవితంలోని అన్ని కోణాలకూ విస్తరించి, వారి జీవితాలను ప్రభావితం చేసింది. గనుల ప్రాంతంలో సారా, దొంగ సారా వ్యాపారాలు బాగా ఉండేవి. సారా కాంట్రాక్టర్లు కిరాయి గుండాల సహకారంతో దుకాణాలు నడిపేవారు. కఠోర శ్రమ నుంచి సారా మాత్రమే తమను ఓదార్చుతుందనే భ్రమతో కార్మికులు సారాకు బానిసలై ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోయేవారు. నియోగి నాయకత్వంలోని కార్మికసంఘం తాగుడుకు వ్యతిరేకంగా ప్రచారంతో కూడిన ఉద్యమాలు నడిపింది.
క్రమంగా ఫలితం కన్పించింది. మళ్లీ వారు సారా వైపు చూడకుండా భజన కార్యక్రమాలు, గాన కచేరీలు, నాటకాలు రూపొందించి ప్రదర్శించేవారు. తాగిన వారికి వందా, యాభై జరిమానా విధించి, వారు చూడకుండా ఆ మొత్తాన్ని వారి ఇళ్లల్లో ఆడవాళ్లకు అందించేవారు. కార్మికుల విద్య కోసం పాఠశాలలు నిర్మించారు. పాఠశాలల్లో ఫలితాలు మెరుగుపడ్డాయి. కార్మికుల సమ్మె సమయంలో వారికి బియ్యం ఇచ్చి ఆదుకున్నారు. కార్మికులు చందాలు వేసుకొని ఆసుపత్రి నిర్మించుకున్నారు. దానికి ‘షహీద్ ఆసుపత్రి’ అని పేరు పెట్టుకున్నారు. 15 పడకలతో ప్రారంభమై వంద పడకల ఆసుపత్రిగా మారింది. ఆసుపత్రిలో అనేకమందికి శిక్షణ ఇచ్చి ఆరోగ్య కార్యకర్తలుగా తయారు చేశారు. ఈ వలంటీర్లు అందరూ గని కార్మికులే. పరిశుభ్రత, మంచి ఆహారం, మంచినీరుపై అవగాహన కల్పించారు. రైతులతో, స్థానిక గిరిజనులతో మమేకమై వారి హక్కుల కోసం కూడా కార్మికులు పోరాడేవారు.
సీఎంఎస్‌ఎస్ 17 ప్రజాసంఘాలుగా విస్తరించే క్రమంలో గడ్చిరోలి, దనిటోలా, రాజానంద్ గావ్ దాటి క్రమంగా 1990 నాటికి భిలాయ్‌కి చేరింది. కేవలం ఉక్కు పరిశ్రమకే పరిమితం కాకుండా ఆ నగరంలో మొత్తం కార్మికవర్గం సీఎంఎస్‌ఎస్‌లో చేరారు. దీంతో పారిశ్రామికవేత్తలంతా భయపడ్డారు. ఈ కారణంగా నియోగి తన 23 సంవత్సరాల ఉద్యమ జీవితంలో 25 సార్లు జైలుకెళ్లాడు. ఎమర్జెన్సీ కాలమంతా జైల్లో ఉన్నాడు.
1991లో జాతీయ భద్రతా చట్టం కింద నియోగిని అరెస్టు చేసి, రాయపూర్, దుర్గ్, బస్తర్, బిలాస్‌పూర్, రాజ్‌నందగావ్ జిల్లాల నుంచి బహిష్కరించగా... అరెస్టు, బహిష్కరణ ఉత్తర్వులు చెల్లవని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. నియోగి విడుదలయ్యాక ‘శత్రువు ఇక బుల్లెట్లతో మాట్లాడతాడు’ అన్నాడు. తనను చంపటానికి పారిశ్రామికవేత్తలు, ఒక పోలీసు అధికారి కుట్ర చేస్తున్నారని ముగ్గురి పేర్లను బహిరంగంగా ప్రకటించాడు. తాను మరణించినా ఆ తర్వాత తన సహచరులు ఎవరెవరు ఏయే బాధ్యతలు చూడాలో కూడా ముందే నిర్ణయించాడు.
అనుకున్నట్లే 1991 సెప్టెంబర్ 28 తెల్లవారుఝామున 3 గంటలకు భిలాయ్ సీఎంఎస్‌ఎస్ సంఘ కార్యాలయంలో గాఢనిద్రలో ఉన్న నియోగిపై ఆరుగురు కిరాయి గుండాలు దాడిచేసి, మెషిన్‌గన్‌లతో 18 బుల్లెట్లు నియోగి శరీరంలో దించారు. చనిపోయేముందు సగం చదివిన లెనిన్ ‘ఆన్ ట్రేడ్ యూనియన్స్’ పుస్తకం ఆయన పక్కనే ఉంది. ఛత్తీస్‌గఢ్ చరిత్రలో అపూర్వం అనదగ్గ పెద్దయాత్రతో నియోగికి జనం నివాళి అర్పించారు.
ఇంతకీ ఈ శంకరగుహ నియోగి ఎవరు? ఛత్తీస్‌గఢ్‌తో ఇతని సంబంధం ఏమిటి? ఆయన ఆ ప్రాంతంవాడు కాదు. బెంగాల్‌లోని డార్జిలింగ్ సమీపంలో జుల్పాయిగురికి చెందిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో నియోగి 1942 సెప్టెంబర్ 18న జన్మించాడు. తండ్రి ఒక స్కూలు టీచరు. తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. 19 సంవత్సరాల వయస్సులో మేనమామల ఇంటికి దుర్గ్ జిల్లాకు వచ్చాడు. చిన్నా చితకా పనులు చేస్తూ బీఎస్సీ పూర్తిచేసి, భిలాయ్ ఉక్కు పరిశ్రమలో ఉద్యోగం సంపాదించాడు. కార్మిక సంఘం స్థాపించి, సమ్మె చేయించడంతో ఉద్యోగం పోవటమే గాక 1968లో తొలిసారి జైలు పాలయ్యాడు.
భిలాయ్ పారిశ్రామికవేత్తలు సుపారి ఇచ్చి కిరాయి గుండాలైన పల్టాన్‌ముల్లా, అవదేశ్‌రాయ్, అబ్బాస్‌సింగ్, చంద్రకాంత్ షా, జ్ఞాన ప్రకాశ్ మిశ్రా, మూల్‌చంద్ షాలతో నియోగిని చంపించారని ఆరోపిస్తూ సీబీఐ దాఖలు చేసిన కేసును విచారించిన ట్రయల్‌కోర్టు ముల్లాకు మరణశిక్ష, మిగిలిన వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే మధ్యప్రదేశ్ హైకోర్టు కేసును కొట్టివేసింది. దానిపై సర్వోన్నత న్యాయస్థానానికి సీబీఐ అప్పీలు చేయగా, 2005లో ముల్లాకు విధించిన మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ, మిగిలిన వారికి సంశయలాభం కారణంగా మేలు కలిగిస్తూ విడుదల చేసింది. కానీ, దేశం ఒక గొప్ప కార్మిక నాయకుడిని కోల్పోయింది.
- చెరుకూరి సత్యనారాయణ
(సెప్టెంబర్ 28: శంకరగుహ నియోగి వర్ధంతి)