Share News

అరుణ హరితం నియోగి జీవితం

ABN , Publish Date - Jan 24 , 2026 | 05:42 AM

స్వతంత్ర భారతదేశ చరిత్రలో పలువురు ప్రముఖ రాజకీయవేత్తల జీవితాలు హింసాత్మక మరణాలతో ముగిశాయి. తన తుది అరవైలలో ఇందిరాగాంధీ, తన నడిమి నలభైలలో రాజీవ్‌గాంధీ....

అరుణ హరితం నియోగి జీవితం

స్వతంత్ర భారతదేశ చరిత్రలో పలువురు ప్రముఖ రాజకీయవేత్తల జీవితాలు హింసాత్మక మరణాలతో ముగిశాయి. తన తుది అరవైలలో ఇందిరాగాంధీ, తన నడిమి నలభైలలో రాజీవ్‌గాంధీ, తన మధ్య యాభైలలో ప్రమోద్‌ మహాజన్‌ దురంతాల పాలయ్యారు. సంజయ్‌గాంధీ, రాజేశ్‌ పైలట్‌, మాధవరావు సింధియా, వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవితాలు విమాన లేదా రోడ్డు ప్రమాదాలలో అర్ధంతరంగా ముగిశాయి. ఈ దురదృష్ట నాయకులు మరో ఇరవై సంవత్సరాలు జీవించి ఉన్న పక్షంలో వారి రాజకీయ జీవితాలు ఎటువంటి మలుపు తిరిగి ఉండేవో కదా!

ఈ ప్రస్తావిత రాజకీయ నాయకుల మరణాల కంటే, మన వ్యవస్థలోని దౌష్ట్యానికి అకాల మరణం పాలైన మౌలిక చింతనాశీలి, కార్మిక సంఘనాయకుడు శంకర్‌ గుహ నియోగి మృతితో భారతదేశానికి ఎక్కువ నష్టం వాటిల్లిందని నేను గట్టిగా అభిప్రాయపడుతున్నాను. నియోగి మరణం మన దేశంలో పౌర సమాజ ఉద్యమానికి చావుదెబ్బ అయింది. బహుశా, అది ఆ విఘాతం నుంచి ఇప్పటికీ కోలుకోనే లేదు.


నియోగి 1991లో 48 ఏళ్ల వయసులో పెట్టుబడిదారుల కిరాయి గూండాల కిరాతకానికి బలయ్యారు. కార్మికుల్లో ఆత్మగౌరవాన్ని మేల్కొలిపి, తమ యజమానుల వలే తామూ ఈ దేశ సమాన పౌరులమనే చైతన్యాన్ని వారిలో రగుల్కొలిపిన నియోగి ఉనికిని ఆ ధనస్వాములు భరించలేకపోయారు. తమకు అడ్డుగా ఉన్న నియోగిని క్రూరంగా తొలగించుకున్నారు.

గతంలో నేను ఇదే కాలమ్‌లో నియోగి గురించి రాశాను. అయినా మళ్లీ రాసి తీరాల్సిన సందర్భమిది. సామాజిక శాస్త్రవేత్త రాధికా కృష్ణన్‌ పుస్తకం ‘Shankar Guha Niyogi : A Politics in Red and Green’ వెలువడిన తరుణమిది. నియోగి పోరాట, త్యాగమయ జీవితం, ఇప్పటికీ ఆయన కృషి ప్రాధాన్యం ఏమిటో స్ఫూర్తిదాయకంగా రాధిక తన పుస్తకంలో వివరించారు.

1943లో ఒక బెంగాలీ కుటుంబంలో జన్మించిన నియోగి 19 ఏళ్ల వయసులో భిలాయి ఉక్కు కర్మాగారంలో కార్మికుడుగా జీవితాన్ని ప్రారంభించారు. ఆధునికత దిశగా భారతదేశ ప్రస్థానాన్ని వేగవంతం చేసిన ఆ సంస్థ ఉద్యోగం నుంచి చాలా త్వరగానే వైదొలిగి ప్రజాహిత క్రియాశీలతలో నియోగి నిమగ్నమయ్యారు. ఒక ఆదివాసీ మహిళను వివాహం చేసుకున్నారు. మైనింగ్‌ కార్మికులను సంఘటితం చేయడం ప్రారంభించారు. పర్యావరణ సుస్థిరత సంబంధిత విషయాలలో కూడా ఆయన మొదటి నుంచీ శ్రద్ధ చూపుతూ వచ్చారు. వ్యాపార, పారిశ్రామికవర్గాల ప్రయోజనాల పరిపూర్తికి కాకుండా స్థానిక రైతులు, ఆదివాసుల సంక్షేమానికి దోహదం చేసేలా అటవీ, జల విధానాలను రూపొందించాలని ప్రభుత్వాన్ని నియోగి కోరారు.


1977లో ‘ఛత్తీస్‌గఢ్‌ మైన్స్‌ శ్రామిక్‌ సంఘ్‌’ (సీఎమ్‌ఎస్‌ఎస్‌) వ్యవస్థాపనకు నియోగి తోడ్పడ్డారు. రెండు సంవత్సరాల అనంతరం మరింత విశాల కార్యక్రమం ప్రాతిపదికన ‘ఛత్తీస్‌గఢ్‌ ముక్తి మోర్చా’ (సీఎమ్‌ఎమ్‌) ఉనికిలోకి రావడంలో ఆయన ప్రత్యేక కృషి చేశారు. కార్మిక సంఘం సీఎమ్‌ఎస్‌ఎస్‌తో పాటు సీఎమ్‌ఎమ్‌లో మహిళా, యువజన, సాంస్కృతిక విభాగాలు కూడా ఉన్నాయి. గని కార్మికుల ఆర్థిక సహకారంతో ఆరోగ్య భద్రతలో ఒక పథ నిర్దేశక ఆస్పత్రిని కూడా సీఎమ్‌ఎమ్‌ నిర్వహించింది. నియోగి మరణం నాటి నుంచీ సీఎమ్‌ఎమ్‌, సీఎమ్‌ఎస్‌ఎస్‌ రెండూ కూడా కార్మిక హక్కుల సాధన, సామాజిక న్యాయం, పర్యావరణ సుస్థిరతకు కృషి చేస్తున్నాయి. ఆదర్శవాదులై మధ్యతరగతి భారతీయ యువజనులు తమ లాభదాయక వృత్తి జీవితాలకు స్వస్తి చెప్పి, శ్రామిక జనావళి సంక్షేమం కోసం నియోగితో చేతులు కలిపి, ఆయన సంస్థల్లో పనిచేశారు. నియోగి బాటలో నడిచిన ప్రముఖులలో వెల్లూరులోని ప్రతిష్ఠాత్మక క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ పట్టభద్రుడు డాక్టర్‌ వినాయక్‌ సేన్‌, కాన్పూరు ఐఐటీ విద్యాధికురాలు సుధా భరద్వాజ్‌ తదితరులు ఉన్నారు.

నియోగి సీఎమ్‌ఎమ్‌ సంప్రదాయక కార్మిక సంఘాల వలే వేతన పెరుగుదల, సరైన పని పరిస్థితులు, సెలవు దినాలు, పీఎఫ్ సదుపాయాలు మొదలైన అంశాలకే పరిమితం కాకుండా ఒక కొత్త మార్గంలో పయనించింది. కార్మికుల వృత్తి సంబంధ ఆరోగ్య భద్రతకు విశేష కృషి చేసింది. నియోగి మౌలిక చింతకుడు. అయితే నిత్యం పోరాటాలలో నిమగ్నమయి ఉండవలసి రావడంతో అరుదుగా మాత్రమే తన భావాలకు లిఖిత రూపమిచ్చేవారు. ‘హమారా పర్యావరణ్‌’ అనే వ్యాసం సుప్రసిద్ధమైనది. వాయు, జల కాలుష్యాలు, నేల క్రమ క్షయం మొదలైనవి మానవ జీవితాలకు, జీవనాధారాలకు చాలా హాని కలిగిస్తున్నాయని, లాభార్జనే లక్ష్యంగా పనిచేస్తున్న పారిశ్రామికవేత్తలే ఆ నష్టాలకు ప్రధాన కారకులని సీఎమ్ఎమ్‌ డాక్యుమెంట్లలో స్పష్టంగా ఉందని రాధికా కృష్ణన్‌ తన పుస్తకంలో వివరించారు.


భారతదేశ పరిస్థితులకు సరిపడే ఉత్పత్తి సంబంధిత సాంకేతికతల విషయంలో నియోగి విశేష శ్రద్ధాసక్తులు చూపేవారు. ఐరోపా, అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న భారీ యంత్రాలు సమాజంలో వర్గం, జెండర్‌ ప్రాతిపదికన అసమానతలు సృష్టిస్తాయని ఆయన తరచూ విమర్శిస్తుండేవారు. యాంత్రీకరణకు ఎక్కువగా నష్టపోతుంది మహిళలేనని సీఎమ్‌ఎమ్‌ గుర్తించిందని రాధిక రాశారు. దల్లీ గనులలో పని చేసే కార్మికులలో సగం మంది మహిళలేనని, అయితే పూర్తిగా యాంత్రీకరణ అయిన గనులలో మహిళలను అనిపుణ కార్మికులుగా భావిస్తూ వారి శ్రమను ఉపయోగించుకోవడానికి యజమానులు నిరాకరిస్తున్నారని ఆమె రాశారు. ఇలా మహిళా కార్మికులకు ఉపాధిని నిరాకరించడం వారి ఆర్థిక స్వేచ్ఛ, మహిళా అస్తిత్వ గౌరవంపై దాడి చేయడమేనని సీఎమ్‌ఎమ్‌ గట్టిగా అభిప్రాయపడిందని రాధిక వెల్లడించారు. జీవనాధారాలకు భద్రత కల్పించి, కార్మికుల కొనుగోలు సామర్థ్యం పెంపొందించడం ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించే ప్రత్యామ్నాయ ఉత్పత్తి కార్యకలాపాల నమూనాను రూపొందించేందుకు నియోగి, ఆయన నాయకత్వంలోని సీఎమ్‌ఎమ్‌ కృషి చేశాయని రాధికా కృష్ణన్‌ పేర్కొన్నారు.

నియోగి తన సమకాలీన ఉద్యమం నొకదాని గురించి రాసిన మాటలను కూడా రాధిక ఉటంకించారు: ‘చిప్కో ఉద్యమం మమ్ములను ఉత్తేజపరిచింది. అది ఒక విప్లవాత్మక ఉద్యమంగా మేము గుర్తించాము’. ఆమె పుస్తకం చదువుతుంటే నియోగి, చిప్కో ఉద్యమ నేత చండీప్రసాద్‌ భట్‌ల మధ్య ఉన్న సామ్యాలు నన్ను చకితపరిచాయి. నియోగి హరిత మార్క్సిస్టు. భట్‌ (ఇంకా మన మధ్య నడయాడుతున్నారు) ఒక వామపక్ష గాంధేయవాది. ఇరువురూ పర్యావరణ స్థిరత్వాన్ని సామాజిక న్యాయంతో అనుసంధానించారు. ఇరువురూ సమాజంలో అట్టడుగు స్థాయి ప్రజల సంక్షేమాన్ని కాంక్షించిన మేధావులు. ఆ ఆదర్శాన్ని ఆచరణలోకి తీసుకురావడమే తమ జీవితధ్యేయంగా చేసుకున్న ఉదాత్తులు. సదా శ్రామికులు, రైతుల మధ్య కృషి చేస్తూనే దేశాభ్యున్నతికి, ప్రపంచ శ్రేయస్సుకు విస్తృత దృక్పథాన్ని వ్యక్తం చేసినవారు.


శంకర్‌ గుహ నియోగి మూడున్నర దశాబ్దాల క్రితం మైనింగ్‌ మాఫియా ఘాతుకానికి బలయ్యారు. అయినప్పటికీ ఆయన జీవిత కృషి వర్తమాన భారతదేశానికి చాలా సందర్భోచితంగా ఉన్నది. అది నేటి భారతదేశంతో కనీసం ఐదు ప్రధాన మార్గాలలో శక్తిమంతంగా మాట్లాడుతున్నది. అవి: (అ) అసంఘటిత రంగ కార్మికుల అనిశ్చిత పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రాధాన్యమిచ్చింది (నిర్మాణ రంగంలోను, గిగ్‌ ఎకానమీలోను లక్షలాది కార్మికుల జీవన పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉంటున్నాయో మరి చెప్పనవసరం లేదు); (ఆ) ప్రజాస్వామ్య సుస్థిరతలో స్వతంత్ర పౌరసమాజ సంఘాల పాత్రకు ప్రాధాన్యం. తన హిందూత్వ భావజాలంతో ఏకీభవించని పౌర సమాజ బృందాలను బీజేపీ పలు విధాలా బెదిరింపులు, వేధింపులకు గురి చేస్తున్న ప్రస్తుత తరుణంలో స్వతంత్ర పౌర సమాజ సంఘాల అవసరం మరింతగా ఉంది; (ఇ) అభివృద్ధి సాధనతో పర్యావరణ సుస్థిరతను సమ్మిళితపరచవలసిన ఆవశ్యకత. మన నగరాలలో పెరిగిపోతున్న వాయు కాలుష్యం భూగర్భ జలాలు అంతకంతకూ తరిగిపోతుండడం, నదులు కాలుష్య కాసారాలుగా మారిపోతుండడం, హిమాలయాలు, పశ్చిమ కనుమలు, ఆరావళి పర్వతాలను మౌలిక సదుపాయాల, మైనింగ్‌ కంపెనీలు విచక్షణారహితంగా దుర్వినియోగం చేస్తున్నాయి. అధికారంలో ఉన్నవారి అండదండలు వాటికి లభిస్తున్నాయి. పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా శంకర్‌ గుహ నియోగి, ఇంకా చండీప్రసాద్‌ భట్‌ హెచ్చరికలను విస్మరించడం వల్ల సంభవిస్తున్న ఈ హాని అంతా ఇంతా కాదు; (ఈ) నియోగి జీవిత కృషి మరింత అర్థవంతమైన అంటే తక్కువ దోపిడీదాయక, తక్కువ విధ్వంసక అభివృద్ధి నమూనాను సూచిస్తుంది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్ లాంటి చిన్న రాష్ట్రాలు అవశ్యం అనుసరించాల్సిన అభివృద్ధి నమూనా అది; (ఉ) ‘అధునాతన’ సాంకేతికతల దీర్ఘకాలిక ప్రభావాల గురించి మితిమీరిన ఆశావహ దృక్పథం శ్రేయస్కరం కాదు. ఆటోమేషన్‌, కృత్రిమ మేధ వల్ల లక్షలాది భారతీయులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. పనిలేకపోవడంతో పురుషులు తమ స్మార్ట్‌ ఫోన్లలో అనునిత్యం అశ్లీల సినిమాలను వీక్షించడంలో నిమగ్నమవుతున్నారు! నవీన సాంకేతికతల దుష్ప్రభావాలను మరెవరి కంటే కూడా మెరుగ్గా నియోగి అర్థం చేసుకున్నారు. ఆ సాంకేతికతలు ప్రైవేట్‌ కంపెనీలకు అపరిమిత లాభాలను సమకూర్చవచ్చుగానీ సమాజానికి, ప్రకృతికి ఎనలేని హాని చేస్తాయని నియోగి దశాబ్దాల క్రితమే హెచ్చరించారు.

77వ భారత గణతంత్ర రాజ్య దినోత్సవ శుభసందర్భంలో ఈ కాలమ్‌ ప్రచురితమవనున్నది. ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు. శంకర్‌ గుహ నియోగి వలే స్వేచ్ఛ, సమానత్వం, (మరీ ముఖ్యంగా) సౌభ్రాతృత్వం వంటి ఉదాత్త విలువలు మూర్తీభవించిన వ్యక్తులు మన సమున్నత భారత గణతంత్ర రాజ్య చరిత్రలో చాలా చాలా తక్కువమంది ఉన్నారు.

-రామచంద్ర గుహ

Updated Date - Jan 24 , 2026 | 05:42 AM