Share News

ఆపలేని ఆ ఐదు అంటే భయం!

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:50 AM

భారతీయ సమాజం మారుతోంది. అనూహ్య వేగంతో మారుతున్న సామాజిక ధోరణులను, రాజకీయాలు పోతోన్న పోకడలను నేను చాలా సంవత్సరాలుగా నిశితంగా గమనిస్తున్నాను.

ఆపలేని ఆ ఐదు అంటే భయం!

భారతీయ సమాజం మారుతోంది. అనూహ్య వేగంతో మారుతున్న సామాజిక ధోరణులను, రాజకీయాలు పోతోన్న పోకడలను నేను చాలా సంవత్సరాలుగా నిశితంగా గమనిస్తున్నాను. ఒక పెద్ద మార్పుగా కనిపించేది కాలంలో తాత్కాలికమైనదిగాను, ప్రభావశీలతలో అప్రధానమైనదిగాను తేలిపోతుంది. కనిపించే ప్రతి మేఘమూ నిలబడి వర్షించదు. చిరుజల్లు వెదజల్లి సాగిపోతోంది. చెప్పవచ్చిన దేమిటంటే మన జీవనగంగలో ప్రతి ప్రవాహమూ లోతైనది కాదు. ఎండిపోతోన్న తావులు అందులో ఎన్నో ఉన్నాయి.

భారతదేశ చరిత్రలో 1947 ఒక కీలక సంవత్సరం. అదొక కొత్త ఆరంభం. దరిమిలా మన జాతి జీవనంలో అనేక ప్రభావాలు, ప్రాబల్యాలను దేశప్రజలు గుర్తించారు. అయితే అవి చాలా వరకు స్వల్పకాల అద్భుతాలుగా మిగిలిపోయాయి. ఆరంభదశలో ఉన్న మార్పులు అనేకం విశాల ప్రజానీకం దృష్టికెక్కలేదు. అయితే ఈ మార్పులు సంఖ్యానేక భారతీయుల జీవితాలను మౌనంగా ప్రభావితం చేస్తున్నాయి. ఉదాహరణకు గాంధీజీ మహాత్ముడిగా భాసించారు. ఎందరో ఆయన్ను దైవ సమానుడిగా గౌరవించారు. గాంధేయవాదుల సంఖ్య తక్కువేమీ కాదు. గాంధేయ జీవన విధానం, అహింస, సత్యాగ్రహం, చరఖా, పౌర ఉల్లంఘన మొదలైనవి గాంధీ అనంతరం రెండు దశాబ్దాలకు మించి మనగలగలేకపోయాయి. స్వాతంత్ర్యానంతరం శీఘ్ర పట్టణీకరణ పెరుగుదలను చాలా తక్కువ మంది ఊహించారు. మరింత తక్కువ మంది వాతావరణ మార్పును గుర్తించారు. అంతకంటే చాలా తక్కువ మంది సమాజం, శాస్త్ర సాంకేతిక రంగాల పురోగతి మధ్య సంకీర్ణ సంబంధాన్ని అర్థం చేసుకున్నారు.

‘జోస్యం చెప్పడం ఒక కష్టసాధ్యమైన విషయం. ముఖ్యంగా భవిష్యత్తు గురించి అయితే’ అని నీల్స్‌ బోర్‌ (ఇరవయో శతాబ్ది వైజ్ఞానిక విప్లవకారుల్లో అగ్రగణ్యుడు) అన్నారు. ఆయన తాత్విక హాస్యంలో సామాన్య వివేకం పరిపూర్ణంగా ఉన్నది. అయినప్పటికీ భవిష్యత్తు అనే నిషిద్ధ ప్రదేశాన్ని దర్శించేందుకు నేను సాహసిస్తున్నాను. మన సమాజ జీవితంలో అయిదు ధోరణులు క్రమ క్రమంగా శక్తిని, వేగాన్ని పుంజుకోవడాన్ని నేను గమనించాను. వాటిని నేను ఏవగించుకుంటున్నాను, కొన్నిటికి భయపడుతున్నాను కూడా. అయితే అవి ఆపడానికి వీలు లేనివి. ఎవరూ ఆపలేనివిగా కనిపిస్తున్నాయి.


మన ప్రజాస్వామ్యం క్షీణిస్తోంది. ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు పాలనే ప్రజాస్వామ్యం. ఇది ఒక సార్వజనీన సత్యం. వ్యక్తులు స్వేచ్ఛగా జన్మిస్తారు. అనేక స్వేచ్ఛల విషయంలో వారికి స్వతస్సిద్ధ హక్కులు ఉంటాయి. ప్రజల హక్కులను గౌరవించి, వాటిని కాపాడే ప్రభుత్వమే ప్రజాస్వామిక ప్రభుత్వం.. ప్రజల హక్కులను పరిరక్షించి, వాటిని ప్రతి ఒక్కరి జీవితంలో ఆచరణలోకి తీసుకువచ్చేందుకు స్వతంత్ర సంస్థలను నెలకొల్పడం ప్రజాస్వామ్య ప్రభుత్వ విధ్యుక్త ధర్మం. ఈ కర్తవ్య నిర్వహణను సక్రమంగా పాటించని ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం కానేరదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం, భావప్రకటనా స్వేచ్ఛ అంతకంతకూ తగ్గిపోతున్నాయని ఫ్రీడమ్‌ హౌస్‌, వీ–డెమ్‌ ఇనిస్టిట్యూట్‌, రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ మొదలైన సంస్థలు నిర్ధారిస్తున్నాయి. వివిధ సూచికల ఆధారంగా ఏ దేశాలు స్వేచ్ఛాయుతమైనవో, ఏ దేశాలు స్వేచ్ఛాయుతమైనవి కావో అవి వర్గీకరిస్తాయి. కేవలం ఎన్నికల నిర్వహణను మాత్రమే కాకుండా, కొన్ని నిర్దిష్ట ప్రమాణాల ప్రాతిపదికన అవి నిర్ణయానికి వస్తాయి. మొత్తం మీద ప్రజాస్వామ్య పాలన విషయంలో చాలా దేశాల స్కోరు అంతకంతకూ పడిపోతోంది. 2005లో భారత్‌ స్కోరు 77 కాగా అది ఇప్పుడు 63–67 మధ్య ఉన్నది. భారత్‌ కేవలం ఒక ‘ఎన్నికల ప్రజాస్వామ్యం’ మాత్రమేనని వీ–డెమ్‌ అభిప్రాయపడింది. మన దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా జరగడం క్రమంగా తగ్గిపోతోంది. ప్రజాస్వామిక పాలనకు సంబంధించి ప్రపంచంలో మన స్థానం పడిపోతుండడం పట్ల భారత ప్రజలు కలతచెందడం లేదు. ప్రభుత్వాలు సమకూరుస్తున్న సంక్షేమ చర్యలకు వారు సంతృప్తి చెందుతున్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకిరావడం వారిని ఆనందపరుస్తోంది. ప్రజాస్వామిక పాలనలో చైనా స్కోరు చాలా సంవత్సరాల పాటు 9/100గా ఉన్నది. అయితే చైనా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని అన్ని అంతర్జాతీయ సంస్థల నివేదికలు ఘంటాపథంగా చెప్పాయి. భారత్‌ సైతం అదే మార్గంలోకి వెళ్లవచ్చు.


దేశ ఆర్థికవ్యవస్థ ఆరోగ్యదాయకంగా ఉందని చెప్పగలమా? మన ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాలలో డ్యూపోలీ (ద్విస్వామ్యం– ఒక మార్కెట్‌లో ఒక ఉత్పత్తి లేదా సేవను అందించేవి కేవలం రెండు ప్రధాన కంపెనీలు ఉండడం) లేదా ఒలిగోపోలీ (పరిమితస్వామ్యం– ఒక మార్కెట్‌లో పెద్ద విక్రేతలు వేళ్ల మీద లెక్కపెట్టదగిన కొద్దిమంది మాత్రమే ఉండడం) ప్రాబల్యంలోకి వెళ్లిపోవచ్చు. విమానయానం, టెలీకమ్యూనికేషన్స్‌, సిమెంట్‌, స్టీల్‌, విద్యుత్‌, ఫార్మా, పెట్రోలియం, రక్షణ ఉత్పత్తులు, మైనింగ్‌, కిరాణం మొదలైనవి అందుకు నిదర్శనాలు. మిగతా రంగాలలో కూడా త్వరలోనే ఇదే తరహా ధోరణులు ప్రబలిపోవచ్చు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ)లు దాదాపుగా అంతరించిపోవచ్చు. ఎన్జీవో అణచివేతకు గురవుతాయి. మొత్తం మీద పరిస్థితులు పూర్తిగా గుత్తాధిపత్య సంస్థలకు అనుకూలంగా మారతాయి. పెట్టుబడి, శ్రమశక్తి మధ్య సమతౌల్యత యథావిధిగా పెట్టుబడికి అనుకూలంగా ఉండడమే కొనసాగుతుంది. ఆదాయ అసమానతలు మరింతగా పెరుగుతాయి. ఆర్థిక సమానత్వాలు అసాధ్యమైపోతాయి.

వలసలు పెరిగిపోతాయి. అస్తిత్వాలు అర్థం కోల్పోతాయి. చాలా పెద్ద నగరాలు కాస్మోపాలిటన్ నగరాలుగా పరిణమిస్తాయి. భాషల, మతాల, సంస్కృతుల మేళవింపు నెలవులుగా ఆ మహానగరాలు వెలుగొందుతాయి. అనేక పట్టణాలు సైతం అదే రీతిలో అభివృద్ధి చెందుతాయి. పట్టణీకరణ ధోరణులు వ్యాప్తి చెందుతాయి. మాస్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (నగరాల్లోని లక్షలాది ప్రజలు ఒకేసారి సురక్షితంగా, తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ఉపయోగపడే ప్రజా రవాణా వ్యవస్థ) అభివృద్ధి చెందుతుంది. ఏ ఒక్కరూ ‘ఒక ప్రదేశానికి చెందినవారై’ ఉండరు. ‘స్వస్థలం’ అనే భావన ఉమ్మడి కుటుంబ ఆచారం వలే అంతరించిపోతుంది. నిత్యం తటస్థపడే వ్యక్తులలో అత్యధికులు కొత్తవారై ఉంటారు. స్నేహ సంబంధాల పరిధి కుంచించుకుపోతుంది. సోషల్‌ మీడియా, చాటింగ్‌ యాప్స్‌ వీడియో కాల్స్‌ ద్వారానే సంబంధాలు ఏర్పడతాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే మనుషుల మధ్య ప్రత్యక్ష సంబంధాలు, భావోద్వేగాలు తగ్గిపోతాయి. మనుషుల మధ్య సంభాషణలు స్మార్ట్‌ ఫోన్లు మొదలైన ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా సంధానమవుతాయి. ‘ఏ మనిషీ ఒక ద్వీపం కాదు’ అన్న భావన తప్పు అని రుజువవుతుంది. ఆత్మీయతలు, భావోద్వేగాలు కాకుండా వ్యాపార లావాదేవీలే మనుషుల మధ్య సంబంధాలను నిర్ణయిస్తాయి.


సాంస్కృతిక జాతీయవాదం ప్రబలిపోతుంది. మైనారిటీ వర్గాలలో భయాందోళనలు పెరిగిపోతాయి. శాస్త్రం(సైన్స్‌)ను మిథ్యాశాస్త్రం (సూడో–సైన్స్‌) నుంచి వేరు చేసే రేఖ చెదిరిపోతుంది. పురాణాల మిడి మిడి జ్ఞానాన్ని సైన్స్‌గా, కల్పిత గాథలు చరిత్రగా, ఆచారాలను సాంకేతికతగా ప్రచారం చేస్తారు. రుజువుల ఆధారంగా సత్యాన్ని ఆవిష్కరించే పద్ధతులు తిరస్కరణకు గురవుతాయి. పురాణ గాథలు, పునర్జన్మలు వేదాలలోని జీవశాస్త్ర విషయాలపై మరింత లోతైన పరిశోధన చేయవల్సిందిగా ఐఐటీలపై ఒత్తిడి పెరిగే అవకాశమున్నది. సాంస్కృతిక పునరుద్ధ్ధరణ అనేది ఆలయాల పునర్నిర్మాణం, హిందూ మత పండుగల నిర్వహణ చుట్టూ పరిభ్రమిస్తుంది. పలు పట్టణాలలో మాంసం విక్రయశాలలను మూసివేయవచ్చు. పశ్చిమ బెంగాల్‌ను అనుసరించి మధ్యాహ్న భోజన పథకంలో కోడిగుడ్లను ఇవ్వడాన్ని నిలిపివేస్తారు. మరిన్ని రాష్ట్రాలు ఉమ్మడి పౌరస్మృతులను ఆమోదించి అమలులోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నది. హిందూత్వ అజెండా పట్ల వ్యతిరేకతను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తారు. ఒకే ఒక్క భాషలో మాట్లాడగల, రాయగల సామర్థ్యమున్న బాలల, వయోజనుల సంఖ్య మరింతగా పెరగడం ఖాయం (ఆ ఏకైక భాష హిందీ కాక మరేమవుతుంది?). మతపరమైన, భాషాపరమైన, జాతిపరమైన మైనారిటీలు నిత్యం భయాందోళనలతో బతికే పరిస్థితులు దాపురిస్తాయి.


ఇంతవరకు పేర్కొన్న పరిస్థితుల పర్యవసానాలు ఏమిటి? 144 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తు ఎలా పరిణమించనున్నది? ఈ జనాభా 167 కోట్లకు పెరిగి, ఆ తరువాత క్రమంగా తగ్గిపోవడం ప్రారంభమవుతుంది. భారతీయులు ఆహారాన్ని, సరుకులను సమృద్ధంగా ఉత్పత్తి చేస్తున్నారు. వాటిని అధికాధికంగా వినియోగించుకుంటున్నారు. గణనీయంగా ఎగుమతి చేస్తున్నారు. కనుక ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, దేశ ఆర్థిక వ్యవస్థ 5శాతం లేదా అంతకంటే ఎక్కువ వార్షిక వృద్ధిరేటుతో పురోగమిస్తూనే ఉంటుంది. సంపన్నులు, కుబేరుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. అయితే పేదల సంఖ్య అంతకంటే ఎక్కువగా అధికమవుతుంది. వారి జీవన ప్రమాణాలు నాసిరకంగా ఉంటాయి. ఏదో ఒక సాకుతో భారత్‌ అభివృద్ధిలో భాగస్వాములు కాకుండా కోట్లాది ప్రజలను మినహాయిస్తే వారి పరిస్థితి మరింత దిగజారుతుంది. అన్ని రకాల అసమానతలు పెరిగిపోతాయి. ప్రజల్లో అసంతృప్తి, ఆగ్రహావేశాలు పెరిగిపోతాయి.

‘ప్రజాస్వామ్య ప్రమాణాల పతనం, ఆర్థిక గుత్తాధిపత్యాల పెరుగుదల, పట్టణీకరణ విస్తరణ, సాంస్కృతిక జాతీయవాద ప్రాబల్యం, ధనిక– పేద వ్యత్యాసాలు అధికమవడం’ ముంచుకొస్తున్న అనివార్య పరిణామాలు. ఈ ఐదు ఆర్థిక, సామాజిక, రాజకీయ ధోరణులను మీరు నిరాకరించవచ్చు లేదా వాటికి మరికొన్నిటిని కలపవచ్చు లేక వాటి నుంచి కొన్నిటిని తీసివేయవచ్చు. ఏది చేసినా, దేశం ఏ దిశగా పోతుందో మీరు కాదనలేరు. ప్రపంచంలో భారత్‌ స్థానాన్ని నిర్ణయించేవి అవే.

(కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పి.చిదంబరం దీర్ఘకాలంగా ఆంధ్రజ్యోతికి అందిస్తున్న ‘పళని’ పలుకు ఇంతటితో ముగిసింది.)

Updated Date - Jun 28 , 2026 | 12:53 AM