టెస్ట్ క్రికెట్: సౌందర్య క్రీడాభిరామం!
ABN , Publish Date - Apr 04 , 2026 | 02:48 AM
కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘంలో నేను సభ్యుడిని. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంకు కొద్ది దూరంలోనే నేను నివసిస్తుంటాను. గతవారం ఆ స్టేడియంలో ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ మ్యాచ్ ఆడుతున్నప్పుడు నేను ఇంటి వద్దనే ఉన్నాను.
రేడియో శ్రవణ మాధ్యమం, టెలివిజన్ దృశ్య మాధ్యమం ద్వారా నా అనుభవంలోకి వచ్చిన అనేక అద్భుత టెస్ట్ మ్యాచ్‌ల మధుర జ్ఞాపకాలు ఇటీవల మళ్లీ నన్ను పులకింపజేశాయి. బ్రిటిష్ క్రికెట్ రచయిత Scyld Berry పుస్తకం ‘500 Declared: The Joys of Covering 500 Cricket Tests’ పఠనం నన్ను గతంలోకి తీసుకెళ్లింది. మరి ఈ ఐపీఎల్ సీజన్‌లో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభ మ్యాచ్‌ను వీక్షించిన వారికి ఒక నెల రోజుల తరువాతైనా ఆ టీ20 మ్యాచ్ అనుభూతిదాయకంగా తలపుకొస్తుందా?
కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘంలో నేను సభ్యుడిని. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంకు కొద్ది దూరంలోనే నేను నివసిస్తుంటాను. గతవారం ఆ స్టేడియంలో ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ మ్యాచ్ ఆడుతున్నప్పుడు నేను ఇంటి వద్దనే ఉన్నాను. టీవీలో మ్యాచ్‌ను తిలకించడం కాకుండా ఆ సమయంలో ఐపీఎల్‌కు భిన్నమైన, ప్రశస్త క్రికెట్ గురించి ఇటీవలే ప్రచురితమైన ఒక పుస్తకాన్ని చదువుతున్నాను. Scyld Berry రచించిన ‘500 Declared: The Joys of Covering 500 Cricket Tests’ గురించి నేను ప్రస్తావిస్తున్నాను. ఐదు దశాబ్దాల (1973–2024)కు పైగా క్రికెట్ చరిత్రను స్ఫూర్తిదాయకంగా వివరించిన పుస్తకమది. ‘క్రికెట్: ది గేమ్ ఆఫ్ లైఫ్’ అనేది ఆయన రాసిన మరో పుస్తకం.
500 టెస్ట్ మ్యాచ్‌లను వీక్షించిన తొలి వ్యక్తి రిచి బెనాడ్. వీటిలో 63 మ్యాచ్‌లను ఒక ఆటగాడిగా, మిగతా వాటిని ఒక పాత్రికేయుడు, వ్యాఖ్యాతగా ఆయన వీక్షించారు. ఇంగ్లాండ్ ఆడిన 500 టెస్ట్ మ్యాచ్‌లపై రిపోర్ట్ చేసిన తొలి పాత్రికేయుడు బెర్రీ. అబ్జర్వర్, సండే కరస్పాండెంట్, ది ఇండిపెండెంట్, సండే టెలీగ్రాఫ్, డైలీ టెలీగ్రాఫ్ మొదలైన పత్రికలకు క్రికెట్ కరస్పాండెంట్‌గా బెర్రీ ఉండేవాడు. ఒక ఆటగాడి గొప్పతనాన్ని నిర్వచించే లేదా మ్యాచ్‌ను మలుపు తిప్పిన నిర్దిష్ట, సంక్షిప్త ఆట క్షణాలను అసాధారణ రీతిలో వివరించడం బెర్రీ రచనా విశిష్టత. విస్తారమైన, సంక్లిష్టమైన టెస్ట్ క్రికెట్ కళాత్మకతను చిరస్మరణీయంగా వివరించడంలో బెర్రీకి బెర్రీనే సాటి. ఆయన పరిశీలనలు కేవలం క్రికెట్‌కే పరిమితమైనవి కావు. ‘భారత్‌లోని బెంగాల్, యూరోప్‌లోని ఇటలీ మధ్య పోలికలు ఉన్నాయి. ప్రజల చిత్త వృత్తి, ఆహార ప్రీతి, సాహిత్య సంస్కృతి విషయంలో బెంగాల్, ఇటలీ మధ్య కొట్టొచ్చే సామ్యాలు ఉన్నాయి. రవీంద్రుడు ఇటీవలి కాలం వాడే అయినప్పటికీ మధ్యయుగాల డాంటేకు ఇటాలియన్లు ఇచ్చే ప్రాధాన్యాన్ని బెంగాలీలు తమ ఇరవయో శతాబ్ది మహాకవికి ఇస్తారు’ అని బెర్రీ రాశారు.
కేంబ్రిడ్జిలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిగా ఉన్నప్పుడే బెర్రీ ప్రెస్ బాక్స్‌లోకి ప్రవేశించాడు. 1970ల్లో ఇంగ్లిష్ క్రికెట్ జర్నలిజం దిగ్గజాల గురించిన పద చిత్రాలను ప్రతిభావంతంగా నివేదించాడు. జాన్ ఆర్లాట్ (గార్డియన్), జాన్‌వుడ్ కాక్ (టైమ్స్), ఈడబ్ల్యూ స్వాంటన్ (డైలీ టెలిగ్రాఫ్) మొదలైన వారి పట్ల ఎంతో గౌరవాదరాలతో రాశాడు. అయితే తన తరం క్రికెట్ రచయితల గురించి రాయడంలో చాలా జాగ్రత్త చూపాడు. కథనం సాగుతున్న కొద్దీ ఆటకు, ఆటగాళ్లకు మాత్రమే ప్రాధాన్యమిచ్చాడు. ఇయాన్ చాపెల్, బాయ్‌కాట్, డేవిడ్ గోవర్ మొదలైనవారి క్రీడా ప్రతిభను, ఉదాత్త మానవతను వివరించాడు.
క్రికెట్ టెక్నిక్‌ల విషయంలో బెర్రీ నిశిత అవగాహన ఆయన పుస్తకమంతటా కనిపిస్తుంది. ఆ టెక్నిక్‌లు కాలక్రమంలో ఎలా మారుతూ వచ్చాయో కూడా ఆయన సుబోధకంగా వివరించాడు. ఫాస్ట్ బౌలింగ్ నుంచి బ్యాటర్లను రక్షించేందుకై ప్రవేశపెట్టిన హెల్మెట్లు.. ఆట ఆడే విధానంపై అనూహ్య, పరివర్తనాత్మక ప్రభావాన్ని చూపాయని బెర్రీ అభిప్రాయపడ్డారు. వేగంగా వచ్చే బంతిని సమర్థంగా ఎదుర్కోవడంలో అవి బ్యాటర్లకు ఎనలేని ధైర్యాన్ని ఇచ్చాయని పేర్కొన్నాడు. బ్యాటర్లలో భయాన్ని తొలగించడం ద్వారా హెల్మెట్లు బ్యాట్, బంతి మధ్య సమతుల్యతను ప్రాథమికంగా మార్చి, మరింత సాహసోపేతమైన, సాంకేతిక ఆటను ప్రోత్సహించాయని బెర్రీ రాశాడు.
బెర్రీ వ్యాఖ్యల్లో సూక్ష్మ హాస్యం తొణికిసలాడుతుంది. కాన్పూర్‌లోని క్రికెట్ మైదాన్ గురించి అతడిలా రాశాడు: ‘ఈ క్రికెట్ గ్రౌండ్‌ను గ్రీన్‌పార్క్ అని అంటారు. కాన్పూర్ నడిబొడ్డున ధూళిరంగులో లేని ఏకైక ప్రదేశం ఇదొక్కటే’. వరల్డ్ సిరీస్ మ్యాచ్‌లలో ఆడే క్రికెటర్లు డబ్బు తీసుకోవడాన్ని విమర్శించేవారు కూడా ధనవంతులేనని బెర్రీ పేర్కొన్నాడు. 1977లో జాక్ ఫింగిల్టన్‌ను కలుసుకున్నప్పుడు ఆనాటికి ప్రశస్త ఆస్ట్రేలియన్ క్రికెట్ రచయిత ఆయనే అని బెర్రీ కితాబునిచ్చాడు. ఆ తరువాత ఆ ప్రతిష్ఠ గిడియన్ హైగ్‌కు బదిలీ అయిందనే విషయాన్ని మన ఊహకు వదిలేశాడు.
టెస్ట్ క్రికెట్ ఆడే ప్రతి దేశంలోనూ బెర్రీ పర్యటించాడు. తొలుత 1977లో పాకిస్థాన్‌ను సందర్శించాడు. 1980లో ఇండియాను సందర్శించాడు. తదాది భారత ఉపఖండానికి అతడు తరచూ వస్తూనే ఉన్నాడు. ఈ రెండు దేశాల గురించి ఒక ఆసక్తికరమైన రాజకీయ వ్యాఖ్య చేశాడు: ‘భారతదేశ పాలనా బాధ్యతలు చేపట్టిన తరువాత దేశ రాజకీయాలలో భూస్వాముల ప్రాబల్యాన్ని నెహ్రూ పూర్తిగా తగ్గించివేశారు. సైన్యాన్ని బ్యారక్‌లకు పరిమితం చేశారు. అమెరికా, యూరోపియన్ దేశాల సహాయ సహకారాలతో ప్రధాన నగరాలలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలను నెలకొల్పారు. నేటి సిలికాన్ వ్యాలీలోని పలువురు సీఈవోలు ఆ సంస్థల నుంచే ప్రభవించారు. పాకిస్థాన్ ఇటువంటి సంస్కరణలకు పూనుకోలేదు. అమెరికన్లు ఆ దేశంలో వైమానిక స్థావరాలను నిర్మించుకుని భారత్, రష్యా, చైనాలకు వ్యతిరేకంగా ఆ దేశాన్ని ఉపయోగించుకున్నారు’.
క్రికెట్ భౌగోళిక విస్తరణ విలక్షణతలను ‘500 డిక్లేర్డ్’ సముచితంగా వివరించింది. అయితే ఈ ప్రశస్త పుస్తకం ఇంగ్లాండ్ యాషెస్ విజయాల (ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రతి రెండు సంవత్సరాలకు జరిగే ఒక ప్రతిష్ఠాత్మక టెస్ట్ క్రికెట్ సిరీస్)కు, ముఖ్యంగా 1981 టోర్నమెంట్‌కు విశేష ప్రాధాన్యమిచ్చింది. ఇది అర్థం చేసుకోదగినదే. బెర్రీ తన సొంత క్రికెటింగ్ అనుభవాల గురించి కూడా వివరించాడు. ఈ విషయాలను అతడు కొంచెం అతిగా రాశాడేమోనని నాకు అన్పించింది. అయినప్పటికీ ‘500 డిక్లేర్డ్’ ప్రగాఢ ఆసక్తితో చదివించే పుస్తకం, సందేహం లేదు. రోవింగ్ క్రికెట్ కరస్పాండెంట్‌గా తన సమున్నత, సాటిలేని అనుభవాలు, క్రికెటేతర వ్యవహారాలలో తన ఆసక్తుల ఆధారంగా చాలా హృద్యమైన రచనను బెర్రీ మనకు ప్రసాదించాడు.
ఏకబిగిన ‘500 డిక్లేర్డ్’ చదివిన తరువాత నా మనసులో రెండు ప్రశ్నలు తటిల్లుమన్నాయి: బీసీసీఐ ‘ఆమోదించిన’ క్రికెట్ వ్యాఖ్యాతలలో ఏ ఒక్కరైనా వృత్తి ధర్మంగా తాము వీక్షించిన 500 టెస్ట్ మ్యాచ్‌లు, లేదూ, 50 టీ20 మ్యాచ్‌ల గురించి బెర్రీ రచనతో పోల్చడానికి యోగ్యమైన పుస్తకాన్ని రాయగలరా? ఆ సర్వోన్నత, సర్వోత్కృష్ట క్రికెట్ పరిజ్ఞాని జయ్ షా ముందుమాట తప్పకుండా ఉండే అటువంటి పుస్తకాన్ని పరిపూర్ణ పఠనానందంతో ప్రశంసించే పాఠకులు పెక్కు మంది ఉంటారా? కచ్చితంగా ఉండరుగాక ఉండరు అనేదే ఆ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం.
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన క్రికెట్ ఫార్మాట్లలో అతి చిన్నదైన టీ20నే గుణహీనమైనది. చదునైన పిచ్‌లు, చిన్న బౌండరీలతో బౌలర్లను నాలుగు ఓవర్లకు పరిమితం చేసే కల్తీ క్రికెట్ అది. ఇందుకు భిన్నంగా ఐదు రోజుల పాటు ఒక్కో జట్టుకు రెండు ఇన్నింగ్స్‌లతో ఆడే మ్యాచ్‌ల సిరీస్‌కు టెస్ట్ క్రికెట్ అనే పేరు సుప్రసిద్ధమవడానికి కారణమున్నది. బ్యాటర్, బౌలర్ ఇరువురూ తమ ప్రతిభా పాటవాలు, సహజ సామర్థ్యాలను పరిపూర్ణంగా ప్రదర్శించేందుకు టెస్ట్ మ్యాచ్‌లు అవకాశమిస్తాయి. పిచ్‌ల వైవిధ్యం, వాతావరణ సవాళ్లు ఆటగాళ్ల సహనాన్ని, సామర్థ్యాన్ని టెస్ట్ మ్యాచ్‌లు పరీక్షిస్తాయి. టీ20 ఆటగాడిగా విజయవంతమవడం కంటే టెస్ట్ క్రికెటర్‌గా సఫలమవడం చాలా చాలా కష్టం. ఇటీవలి టీ20 ప్రపంచకప్‌లో ఆడిన భారతీయ క్రికెటర్లలో టెస్ట్ క్రికెట్‌లో ఆడే టీమ్ ఇండియాకు అర్హుడు కాగల ఏకైక క్రీడాకారుడు జస్ప్రీత్ బుమ్రా మాత్రమే.
‘500 డిక్లేర్డ్’ పఠనంతో, నేను ప్రత్యక్షంగా వీక్షించిన; రేడియో శ్రవణ మాధ్యమం, టెలివిజన్ దృశ్య మాధ్యమం ద్వారా నా అనుభవంలోకి వచ్చిన అనేక అద్భుత టెస్ట్ మ్యాచ్‌ల మధుర జ్ఞాపకాలు మళ్లీ నన్ను పరవశింపచేశాయి. ట్రెంట్ బ్రిడ్జ్‌లో తన మొదటి టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించినప్పుడు బెర్రీ వయసు 19 ఏళ్లు కాగా అప్పుడు 15 సంవత్సరాల వయసులో ఉన్న నేను అదే మ్యాచ్‌పై వ్యాఖ్యానాన్ని డెహ్రాడూన్‌లో మా రేడియో ద్వారా విన్నాను. గెలవడానికి 479 పరుగులు చేయవలసి ఉన్న న్యూజిలాండ్ జట్టు టెస్ట్ మ్యాచ్ తొలి దశలోనే తన స్టార్ బ్యాటర్ గ్లెన్ టర్నర్‌ను కోల్పోయింది. అయితే కెప్టెన్ బెవాన్ కాంగ్డన్ తన జీవితంలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. అసాధారణ పట్టుదలతో, దృఢనిశ్చయంతో తన సహచర ఆటగాడు విక్ పొలార్డ్‌తో కలిసి చివరి ఇన్నింగ్స్ దాకా ఆటను స్ఫూర్తిదాయకంగా కొనసాగించాడు. ఇరువురూ వందలాది పరుగులు తీశారు. కాంగ్డన్ అవుట్ అయిన తరువాత విక్ పొలార్డ్‌కు తోడుగా వికెట్ కీపర్–బ్యాటర్ కెన్ వేడ్స్ వర్త్ రంగంలోకి దిగాడు. ఇరువురూ దీక్షా దక్షతలతో ఆడినప్పటికీ అవుట్ అయ్యారు. అంతిమంగా న్యూజిలాండ్ జట్టు 38 పరుగుల తేడాతో ఓడిపోయింది. ప్రత్యర్థి జట్టులోని సీమ్ బౌలర్ జెఫ్రీ ఆర్నాల్డ్ తన టీమ్ విజయానికి విశేషంగా తోడ్పడ్డారు. యాభైమూడు సంవత్సరాల అనంతరం కూడా ఆ టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు అద్భుత ఆటతీరుపై నన్ను నిలువెల్లా పులకింపజేసిన బీబీసీ వ్యాఖ్యానం నాకు ఇప్పటికీ ఒక వీడని జ్ఞాపకమే. మరి ఈ ఐపీఎల్ సీజన్‌లో గతవారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభ మ్యాచ్‌ను వీక్షించిన వారికి ఇప్పటికి ఒక ఏడాది పిమ్మట, లేదూ, ఒక నెల రోజుల తరువాత అయినా సరే ఆ క్రికెట్ మ్యాచ్ ఏమైనా అనుభూతిదాయకంగా తలపుకొస్తుందా?
(వ్యాసకర్త చరిత్రకారుడు)