‘సర్’ను రద్దు చేయాలి!
ABN , Publish Date - Oct 13 , 2026 | 12:54 AM
ప్రధాన ఎన్నికల కమిషనర్ చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని, ఎన్నికల కమిషన్‌లోని మిగతా ఇద్దరి సభ్యుల అభిప్రాయాలను లెక్కలోకి తీసుకోకుండా ఇష్టానుసారం నిర్ణయాలు..
ప్రధాన ఎన్నికల కమిషనర్ చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని, ఎన్నికల కమిషన్‌లోని మిగతా ఇద్దరి సభ్యుల అభిప్రాయాలను లెక్కలోకి తీసుకోకుండా ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రిక ప్రచురించిన పరిశోధనాత్మక కథనంతో ప్రజాస్వామ్యం నీటి బుడగ మరోసారి బద్దలైంది. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్నికలలో 64 లక్షల ఓట్లు తొలగించారు. మరో 60 లక్షల ఓటర్లను జ్యుడీషియల్ విచారణ ద్వారా తేల్చాల్సినవంటూ పక్కన పెట్టారు. ఎన్ని అక్రమ పద్ధతులు అనుసరించినా, కేవలం ఐదు శాతం ఓట్ల తేడాతో అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2023లో చేసిన చట్టం ద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల కమిషన్‌ను ఏ విధంగా తన పావుగా వాడుకుంటున్నదీ ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలలో చూశాం.
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఎన్నికల పట్ల ప్రజలకు ఆసక్తి ఉండటం లేదు. ఎన్నికల సందర్భంగా దేశం ఎదుర్కొంటున్న మౌలిక రాజకీయ, ఆర్థిక, సాంఘిక సమస్యలు చర్చకు రావటం లేదు. రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోలను విడుదల చేసినా, వాటి ఆధారంగా చర్చలు జరగటం లేదు. బడ్జెట్ల ద్వారా ఓట్లు కొనే పథకాలతో పాటు రకరకాల అవినీతి, అక్రమ పద్ధతులను అనుసరించి అధికారంలోకి రావటమే పరమావధిగా రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. కొన్ని దేశాల్లో అమల్లో వున్న ‘దామాషా ప్రాతినిధ్యం’ కూడా మన దేశంలో లేదు. ఆయా రాజకీయ పక్షాలు సాధించిన ఓట్ల శాతానికి అనుగుణంగా సీట్ల కేటాయింపు జరిగితే చట్టసభల్లో ఆ మేరకు వాటికి ప్రాతినిధ్యం ఉంటుంది.
కేంద్రంలోని అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తున్న సీఈఓ జ్ఞానేశ్ కుమార్‌ను ఆ పదవి నుంచి తొలగించి, ఆయన చేసిన అక్రమాలపై సుప్రీంకోర్టు జడ్జిచే విచారణ జరిపించాలి. అర్హులైన వయోజనులందరికీ ఓటు హక్కు కల్పించాలి. కేంద్రంలోని అధికార పార్టీకి లాభం చేకూరేలా రూపొందించిన ఎస్‌ఐఆర్ ప్రక్రియను రద్దుచేయాలి. ప్రభుత్వానికి కీలుబొమ్మగా వ్యవహరించే ఎన్నికల సంఘాన్ని నియమించుకోటానికి ఉద్దేశించి 2023లో చేసిన చట్టాన్ని రద్దు చేయాలి. స్వతంత్రంగా, ప్రజాస్వామ్యయుతంగా పనిచేయగల ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయాలి.
- కె. సుబ్బారెడ్డి
ప్రధాన కార్యదర్శి, ఓపీడీఆర్, ఆంధ్రప్రదేశ్