మొక్కజొన్న రైతును ఆదుకోవాలి
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:43 AM
మొక్కజొన్నను ఆహార పంటగానే కాక పశువులకు, కోళ్లకు దాణాలలో ప్రధాన ముడి సరుకుగా వాడుతున్నారు. పేలాలు, స్వీట్ కార్న్, బేబీ కార్న్, పాప్ కార్న్, కార్న్ సిరప్, మందులు, రంగులతో పాటు పారిశ్రామిక అవసరాలు కూడా పెరిగాయి.
మొక్కజొన్నను ఆహార పంటగానే కాక పశువులకు, కోళ్లకు దాణాలలో ప్రధాన ముడి సరుకుగా వాడుతున్నారు. పేలాలు, స్వీట్ కార్న్, బేబీ కార్న్, పాప్ కార్న్, కార్న్ సిరప్, మందులు, రంగులతో పాటు పారిశ్రామిక అవసరాలు కూడా పెరిగాయి. మొక్కజొన్న నుంచి తయారు చేసిన ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపటంతో ఈ పంటకు డిమాండ్ మరింత పెరిగింది. కానీ ఆ ప్రయోజనాలు రైతుకు దక్కటం లేదు. మొక్కజొన్నను సాగు చేసిన రైతులు ఎకరాకు 30–40 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించారు. గత ఏడాది ప్రభుత్వ సంస్థ మార్క్‌ఫెడ్‌తో సంబంధం లేకుండానే బహిరంగ మార్కెట్లో మొక్కజొన్నకు మంచి ధర పలికింది. క్వింటాల్‌కు 2,400 రూపాయలు కనీస మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఆ రేటుకు కొనేవారెవరూ లేరు. దళారులకు 1,400 నుంచి 1,700 రేటుకి అమ్ముకుంటూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించకపోవడంతో బహిరంగ మార్కెట్‌లో దళారులు రాజ్యమేలుతున్నారు.
కలుపు, ఎరువులు, పురుగు మందులు, రవాణా ఛార్జీలు, కూలి, కౌలుతో సహా వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా ప్రారంభించిన యుద్ధంతో ఎరువులకు రెక్కలు వచ్చాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం సగటు హెక్టార్ సాగు ఖర్చు రూ.1,18,156. కాగా, క్షేత్రస్థాయిలో ఇది మరింత ఎక్కువగా ఉంటోంది. తన జన్యుమార్పిడి మొక్కజొన్నను దిగుమతి చేసుకోవాలని అమెరికా మన దేశంపై ఒత్తిడి తెస్తోంది. నేరుగా ఆహారంగా వాడటానికి అమెరికాలో కూడా దీనిపై అనేక నియంత్రణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మనం ఎటువంటి నియంత్రణ లేకుండా మొక్కజొన్న పంటను దిగుమతి చేసుకుని, మనుషులు, పశువులు ఆహారంగా తీసుకుంటే, ఆ ప్రభావంతో క్యాన్సర్ వస్తే దిక్కెవ్వరు? ప్రభుత్వం మార్క్‌ఫెడ్ సంస్థను రంగంలోకి దింపి కనీస మద్దతు ధర 2400 రూపాయలకు కొనుగోలు చేయడంతో పాటు రూ.500 బోనస్‌గా ఇచ్చి రైతులను ఆదుకోవాలి. దిగుమతులను ఆపివేసి భారత రైతులను రక్షించాలి.
– డాక్టర్ కొల్లా రాజమోహన్
నల్లమడ రైతు సంఘం, గుంటూరు