సర్దార్ స్మృతి.. సంకుచిత ప్రయత్నాలు
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:49 AM
‘స్వతంత్ర భారతదేశ వ్యవస్థ ఒక చట్టబద్ధతను, శక్తి సంపన్నతను సమకూర్చుకోవడానికి ప్రధానంగా ముగ్గురు వ్యక్తులు చేసిన కృషి కారణమనాలి.
‘స్వతంత్ర భారతదేశ వ్యవస్థ ఒక చట్టబద్ధతను, శక్తి సంపన్నతను సమకూర్చుకోవడానికి ప్రధానంగా ముగ్గురు వ్యక్తులు చేసిన కృషి కారణమనాలి. ఆ మహనీయులు గాంధీ, నెహ్రూ, పటేల్. ఈ సమున్నత గుర్తింపు నెహ్రూకు పూర్తిగా లభించింది. గాంధీకి భక్తి శ్రద్ధలతో జరిగింది. అయితే పటేల్‌ను ఎవరూ ఎక్కువగా పట్టించుకోలేదు’– మహాత్ముని మనవడు రాజ్ మోహన్‌గాంధీ మూడున్నర దశాబ్దాల క్రితం రాసిన ‘పటేల్: ఎ లైఫ్’ అన్న పుస్తకం ఉపోద్ఘాతంలోని మాటలివి. నెహ్రూ మనవడు రాజీవ్‌గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం నెహ్రూ శత జయంత్యుత్సవాలను అట్టహాసంగా, వైభవోపేతంగా నిర్వహించిన అనంతరం రాజ్ మోహన్ ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజీవ్‌కు ముందు ఆయన తల్లి ఇందిరాగాంధీ దాదాపు పదహారేళ్ల పాటు అధికారంలో ఉన్నారు. ఆ కాలంలో ఆమె తన తండ్రి పండిట్ నెహ్రూ మరణానంతర ప్రతిష్ఠను పెంపొందించేందుకు విశేష కృషి చేశారు. ఈ పూర్వాపర సందర్భంలోనే రాజ్ మోహన్ రాసిన ‘పటేల్: ఎ లైఫ్’ తొలుత ప్రచురితమయింది. మూడున్నర దశాబ్దాల అనంతరం, రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయి ఉన్న నేపథ్యంలో ఆ పుస్తకం మరోసారి ప్రచురితమయింది. 2014లో నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత పటేల్‌కు ఎనలేని ఘనతను చేకూర్చేందుకు, అదే సమయంలో నెహ్రూను అపఖ్యాతి పాలు చేసేందుకు సకల ప్రయత్నాలు జరిగాయి, జరుగుతున్నాయి.
రాజ్ మోహన్‌గాంధీ ‘పటేల్’ను నేను తొలుత ఈ శతాబ్ది తొలినాళ్లలో చదివాను. ఇటీవల రెండోసారి చదివాను. రాజ్ మోహన్ ప్రశస్త పాండిత్య ప్రతిభకు ‘పటేల్’ ఒక దర్పణం. పటేల్, ఆయన కుమార్తె మణిబెన్ డైరీలు, పటేల్ సమకాలికుల, సహచరుల ప్రైవేట్ పేపర్స్, ప్రభుత్వ రికార్డులు, పాత దినపత్రికలు, పటేల్‌తో కలిసి పనిచేసిన వారితో నిర్వహించిన ఇంటర్వ్యూల ఆధారంగా రాజ్ మోహన్ ఈ గ్రంథాన్ని వెలువరించారు. పటేల్ బాల్యం, విద్యాభ్యాసంలో జాప్యం, కుటుంబ జీవనం, న్యాయవాదిగా కీర్తి కనకాలను సముపార్జించుకోవడం, స్వాతంత్ర్య సమరంలో పాత్ర, అన్నిటికంటే ముఖ్యంగా హోంమంత్రిగా అయిదు వందల సంస్థానాలను శాంతియుతంగా విలీనం చేసి సమైక్య భారత్‌ను సంస్థాపించడం మొదలైన విషయాలన్నిటినీ నిష్పాక్షిక పరిశీలనతో రాజ్ మోహన్ రాశారు.
పటేల్ రైతు కుటుంబంలో జన్మించారు. సహచర స్వాతంత్ర్య సమరయోధులు అయిన గాంధీ, నెహ్రూ, బోస్ పుట్టి పెరిగిన కుటుంబాలకు పూర్తిగా భిన్నమైన గ్రామీణ కుటుంబం నుంచి వల్లభ్ భాయి ప్రభవించారు. 1920ల్లో బార్డోలి సత్యాగ్రహానికి నాయకత్వం వహించడంలో పటేల్ తన అసాధారణ పట్టును నిరూపించుకున్నారు. రైతులను అమితంగా ఆకట్టుకుని వారిని తన వైపు తిప్పుకున్నారు.
మహాత్ముడిని పటేల్ తొలిసారి కలుసుకున్నప్పుడు ఇరువురూ తమ నలభైలలో ఉన్నారు. ఆ తొలినాటి సమావేశాల గురించి గాంధీ ఆ తరువాత ఇలా రాశారు: ‘పటేల్ గురించి తెలుసుకోవడం ఎక్కువవుతున్న కొద్దీ, అతడి సహాయాన్ని తప్పక తీసుకోవాలనే సంకల్పం నాలో మరింత దృఢతరమవుతుండేది’. ‘గాంధీతో పరిచయమయిన తరువాత కుటుంబం, వృత్తి, కీర్తి ప్రతిష్ఠల కంటే దేశ స్వాతంత్ర్య సాధనకే ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించుకున్నానని’ పటేల్ తదనంతర కాలంలో గుర్తుచేసుకున్నారు. పటేల్‌కు గాంధీలో ఒక ఋషి, ఒక యోధుడు, ఎటువంటి మినహాయింపులు లేకుండా విశ్వసించి, అనుసరించదగ్గ మార్గదర్శకుడు కనిపించారు. 1930ల్లో గాంధీ, పటేల్ ఒకే జైలులో పదహారు నెలల పాటు సహచర ఖైదీలుగా ఉన్నారు. ఆ సమయంలో గాంధీ పట్ల ప్రేమానురాగాలతో ఆయనకు పటేల్ సేవలు చేశారు. ఉదయం దంతధావనానికి వేపపుల్లను సిద్ధం చేయడం, నిమ్మరసం తీసి ఇవ్వడం, గాంధీ లేఖలు కొన్నిటికి నకళ్లు రాయడం మొదలైన పనులను పటేల్ శ్రద్ధతో నిర్వహించేవారు. మహాత్ముడు నిర్వహించిన సత్యాగ్రహ ఉద్యమాలు అన్నిటిలోను పటేల్ కీలకపాత్ర వహించారు. గాంధీ మార్గదర్శకత్వంలో కాంగ్రెస్‌ను మహా శక్తిమంతమైన జాతీయ సంస్థగా రూపొందించడంలో పటేల్ పాత్ర అవిస్మరణీయమైనది.
1930ల్లో నెహ్రూ, పటేల్ కాంగ్రెస్ ప్రధాన నాయకులుగా ఆవిర్భవించారు. రాజకీయ వ్యూహాలకు సంబంధించిన అంశాలపై ఇరువురి మధ్య తరచూ విభేదాలు వ్యక్తమవుతుండేవి. అయితే తొట్టతొలుత స్వాతంత్ర్యాన్ని సాధించాలి, స్వాతంత్ర్య సాధనకు గాంధీ నాయకత్వం అనివార్యం అనే రెండు విషయాలపై నెహ్రూ, పటేల్ మధ్య సంపూర్ణ ఏకాభిప్రాయం ఉండేది. ‘రాజకీయంగా మేము విభేదించిన అంశాల కంటే ఏకీభవించే అంశాలే ఎక్కువగా ఉండేవని’ పటేల్‌తో సంబంధాల గురించి నెహ్రూ వ్యాఖ్యానించారు.
ఒక దశాబ్దం తరువాత ఈ ఇద్దరూ తమ విభేదాలను పూర్తిగా పక్కన పెట్టారు. గాంధీ హత్య జరిగిన మూడు రోజుల అనంతరం పటేల్‌కు రాసిన ఒక లేఖలో నెహ్రూ తన హృదయాన్ని ఇలా విప్పారు: ‘బాపూ మృతితో అంతా మారిపోయింది. మనం ఒక భిన్నమైన, మరింత కష్టదాయకమైన ప్రపంచాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. మనం పాతికేళ్లకు పైగా పరస్పరం సన్నిహితంగా పనిచేస్తూ అనేక సమస్యలను కలిసి ఎదుర్కొన్నాం. ఈ కాలంలో మీ పట్ల నా అభిమానం, గౌరవం పెరిగాయని పూర్తి నిజాయితీతో చెబుతున్నాను’. నెహ్రూ సౌహార్ద్ర పూర్వకమైన లేఖకు సర్దార్ అదే స్ఫూర్తితో ప్రతిస్పందించారు: ‘మీ లేఖలో ప్రస్ఫుటమైన ప్రేమాభిమానాలు నన్ను గుండె లోతుల నుంచి కదిలించివేశాయి. మీరెంతో సద్భావనతో వెలిబుచ్చిన అభిప్రాయాలకు అదే రీతిన హృదయపూర్వకంగా నా స్పందనలను తెలియజేస్తున్నాను. దేశ ప్రయోజనాలకు మించినవేవీ లేవన్న ఆలోచన, మన మధ్య గల పరస్పర గౌరవాభిమానాలూ, మన దృక్పథాలలో వ్యక్తిగత ధోరణులలో గల వ్యత్యాసాలను అధిగమించి మనలనిద్దరినీ ఒకటిగా ఉంచాయి. నా విధ్యుక్త ధర్మాలను అదే స్ఫూర్తితో నెరవేర్చేందుకు కృతనిశ్చయంతో ఉన్నానని హామీ ఇస్తున్నాను’. ఈ మహోదాత్త రాజకీయ సహచరుల మధ్య నడిచిన ఉత్తరప్రత్యుత్తరాలలో హృదయాలను కదిలించివేసే వాటిలో ఇవి చాలా ప్రధానమైనవి.
ఈ పరస్పర లేఖలు నెహ్రూ, సర్దార్‌పై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. వారిరువురూ తమ మధ్య ఉన్న విభేదాలను పూర్తిగా విస్మరించి ముక్కలైన దేశాన్ని ఒక సమైక్య జాతిగా నిర్మించేందుకు కలిసికట్టుగా కృషి చేశారు. హోం మంత్రిగా, ప్రధానమంత్రిగా పటేల్, నెహ్రూలు కలిసికట్టుగా పనిచేస్తున్న కాలంలో నెహ్రూ సర్వోత్కృష్టత, ప్రజాదరణ గురించి సర్దార్‌కు బాగా తెలుసు అని రాజ్ మోహన్ వ్యాఖ్యానించారు. 1948లో నెహ్రూ 59వ పుట్టినరోజు సందర్భంగా పటేల్ ఇలా అన్నారు: ‘పండిట్ నెహ్రూను మహాత్మాగాంధీ తన వారసునిగా ప్రకటించారు. గాంధీజీ అంచనాలు, నిర్ణయం సరైనవని మనకు ఆయన మరణం తర్వాత తెలియవచ్చింది’.
సర్దార్ పటేల్ 151వ జయంతి రోజున ప్రచురితమయ్యే ఈ కాలమ్‌ను రాజ్ మోహన్‌గాంధీ 1991లో తన ‘పటేల్: ఎ లైఫ్’ తొలిముద్రణకు రాసిన ఉపోద్ఘాతం నుంచి ఉటంకింపుతో ప్రారంభించాను. అదే పుస్తకానికి 2026లో ఆయన రాసిన ముందుమాట నుంచి ఉటంకింపులతో దీనిని ముగిస్తాను. రాజ్ మోహన్‌గాంధీ ఇలా రాశారు: ‘రాజకీయ ప్రయోజనాల కోసం సర్దార్ స్మృతిని దుర్వినియోగం చేయడానికి జరుగుతోన్న ప్రయత్నాలను ఏమని భావించాలి? హిందూ ఆధిపత్య, ముస్లింల అణచివేత రాజకీయాలకు సర్దార్‌ను ఉపయోగించుకుంటున్న సంకుచిత ప్రయత్నాలు మనస్తాపం కలిగిస్తున్నాయి’. రాజ్ మోహన్ ఇంకా ఇలా రాశారు: ‘మన దేశం ఇంటా బయటా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత సందర్భంలో నెహ్రూ, పటేల్ మధ్య ఉన్న, లేని విభేదాలను అతిశయించి చూపడం జాతి శ్రేయస్సుకు దోహదం చేయదు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే అది ఉపయోగపడుతుంది. దేశ సమస్యలను పరిష్కరించడంలో నెహ్రూ, పటేల్ మధ్య సంవాదాలు జరుగుతుండేవి. ఇరువురి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలోనే వ్యక్తమవుతుండేవి. ఇది సహజమే.
ఎందుకంటే ఆ ఇరువురి నేపథ్యాలు, ప్రారంభ ప్రయాణాలు, దృక్పథాలు భిన్నమైనవి, తమ మధ్య ఉన్న విభేదాల పట్ల ఇరువురూ వ్యక్తిగతంగా ఎల్లప్పుడూ స్పష్టంగా ఉండేవారు. ఆ విభేదాలను బహిరంగంగా ఒప్పుకున్న సందర్భాలూ ఉన్నాయి. దేశ శ్రేయస్సును విస్మరించని విభేదాలవి. కనుకనే అవి అర్థవంతమైనవి. వాటిలో ఒక నాటకీయత ఉండేది. ఇరువురి మధ్య ఏ అంశం విషయంలోనైనా నెలకొన్న వివాదం అంతిమంగా ఐక్యతతోనే ముగిసేది. నా పుస్తకం ఆ సత్యాన్నే స్పష్టం చేసింది’. పటేల్– నెహ్రూ ద్వయానికి మార్గదర్శకత్వం వహించడంలో మహాత్ముని పాత్రను ప్రస్తావిస్తూ రాజ్ మోహన్‌గాంధీ ఇలా వ్యాఖ్యానించారు: ‘గాంధీ–పటేల్– నెహ్రూ త్రయం అసాధారణ స్వభావాన్ని పాఠకులు గుర్తిస్తారని, అలాగే ఎంతటి సంక్షోభం ఎదురైనప్పటికీ, అంతిమంగా ఆ ముగ్గురూ కలిసికట్టుగా ముందుకు సాగడానికి చూపిన సామర్థ్యం, సుముఖత భారతదేశానికి చేకూరిన ఆశీర్వాదాలుగా గుర్తిస్తారని ఆశిస్తున్నాను’.
(వ్యాసకర్త చరిత్రకారుడు)