Share News

మతాలన్నీ సనాతనం వైపే!

ABN , Publish Date - May 24 , 2026 | 12:17 AM

సమాజంలో సామరస్యం సాధించాలంటే మతాల మధ్య కృత్రిమమైన అగాధాలను పూడ్చుకోవడం అవసరం. ఈ ఆలోచనలో భాగంగా ఈ రచయిత ఇక్కడ ఒక ప్రతిపాదన చేయదలుచుకున్నాడు.

మతాలన్నీ సనాతనం వైపే!

మాజంలో సామరస్యం సాధించాలంటే మతాల మధ్య కృత్రిమమైన అగాధాలను పూడ్చుకోవడం అవసరం. ఈ ఆలోచనలో భాగంగా ఈ రచయిత ఇక్కడ ఒక ప్రతిపాదన చేయదలుచుకున్నాడు. ప్రతిపాదనే సుమా!

భాషలో రెండు ధోరణులు వున్నాయి. కొన్ని పదాలు తమ అసలైన అర్థంతోనే చెలామణిలో వుంటాయి. వీటిని ‘ధాత్వర్థం’ అనవచ్చు. మరికొన్ని పదాలు అసలైన అర్థాన్ని విడిచి మరో అర్థంలో చెలామణిలో వుంటాయి. వీటిని ‘రూఢ్యర్థం’ అనవచ్చు. ఉదాహరణకు ‘అన్నం’ అనే పదానికి ‘తినుట’ అనేది ధాత్వర్థం. కానీ ఈ అర్థం వాడుకలో లేదు. బియ్యమును వండివార్చినదే అన్నము అన్నది రూఢ్యర్థం. మతపారిభాషిక పదాలను గుర్తిస్తే చాలా పదాలు వాడుకలో అర్థభ్రంశమైనవి. అనగా వాటి అసలు అర్థం కోల్పోయి అపభ్రంశమైన అర్థాలతో చెలామణి అయ్యేవి. ‘సనాతన ధర్మం’ అనే పదం అట్లాంటిదే. సనాతన ధర్మానికి వున్న అసలైన అర్థం నుండి భారతీయులు చాలా దూరం వచ్చేసినారు. ఒక రాజకీయ పార్టీ సనాతన ధర్మాన్ని హైజాక్ చేసింది. వర్ణాశ్రమ ధర్మాలు ఆపాదించి, బ్రాహ్మణులు దానిని మతపరం చేసినారు. తమిళనాడులో డీఎంకే వంటి పార్టీలు సనాతన ధర్మాన్ని కులపరం చేసినాయి. ఒకసారి సనాతన ధర్మానికి ఏర్పడిన పెడర్థాలు పక్కకుపెట్టి పరిశీలన చేద్దాం. ‘సనా’ అంటే సృష్టికి పూర్వం వున్నది అని అర్థం. ధర్మం అంటే దానిని చేరుకునే మార్గం. సనాతన ధర్మం అంటే– ‘ఎప్పటినుండో వుంటూ, వర్తమానంలో కొనసాగుతూ, భవిష్యత్తులో కూడా కొనసాగేది’ అని అర్థం. అనగా, ఈ ప్రపంచంలో ‘నేను’ అనే అస్తిత్వం ఒకటి ఏర్పడక ముందు, దానికి ఆధారమైన మూలసత్యం! మరింత స్పష్టత కోసం ఆధునిక విజ్ఞానశాస్త్రం ప్రకారం కూడా నిర్వచించుకోవలసిన అవసరం వుంది.


విశ్వమంతా విద్యుత్ తరంగాలు వ్యాపించి వున్నాయని అంటారు శాస్త్రవేత్తలు. ఇవే ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్. అదనంగా ఇంకా ఏవైనా తరంగాలు కూడా వుండి వుండవచ్చు. ఈ విద్యుత్ తరంగాల శక్తే ప్రపంచం అంతా ఆవరించి వున్నదని చెబుతారు. కానీ ఈ శక్తితరంగాలకు తనదైన అస్తిత్వం వున్నట్లు సైన్స్ చెప్పదు. ఈ శక్తి అస్తిత్వానికే ఒక ‘Automatic divine action’ వుంది అని చెబుతారు భారతీయ యోగులు. ఈ ఆటోమెటిక్ డివైన్‌ యాక్షనే ప్రకృతి నియమాలకు అతీతంగా పనిచేయగలదని అనేక దృష్టాంతాలు వున్నాయి.

ఈ విశ్వశక్తి సృష్టికి పూర్వం వున్న సత్యమే! సృష్టికి పూర్వం అంటే ‘నేను’ అనే అస్తిత్వం రూపు తీసుకోకముందు అని కూడా అనుకోవచ్చు. హిందూ, క్రిస్టియన్, ఇస్లాం, జైనం, బౌద్ధం అన్ని మతాల్లోనూ ఈ సనాతనమే వుంటుంది. ధర్మం అంటే ఈ సనాతన సత్యాన్ని చేరుకునే మార్గమే! ఈ మార్గాన్నే మతం అని కూడా అంటాం. సనాతనం స్పృహ లేకుండా ఏ మతమూ వుండటానికి వీలులేదు. ఈ లెక్కన సనాతన సత్యానికి అన్ని మతాలూ శాఖలే! వీటిలో హిందూమతం అతి ప్రాచీన శాఖ అయివుండడానికి అవకాశం వుంది. ఈ ప్రాచీన మతపు ఆనవాళ్లు ఇప్పటికీ వివిధ దేశాల చారిత్రక తవ్వకాలలో బయటపడుతూనే వున్నాయి. సనాతనం దృష్ట్యా సర్వమతాలూ సోదర మతాలే అని గుర్తించవలసిన అవసరం కూడా వుంది. ఫలానా మతమే ప్రపంచ మతం కావాలనే వెర్రివిశ్వాసాన్ని విడిచిపెట్టవలె. పలుమతాల సమాజాన్ని స్వాగతించవలె.


విదేశీ మతాలు మతపరంగా కంటే జాతి పరంగా మూలాలు వెదుక్కోవడం వివేకవంతమైన చర్య. అరబ్బులు అఫ్ఘాన్ మీద దాడి చేయడంతో భారతదేశంలో ముస్లింల చరిత్ర మొదలవుతుంది. ముస్లింలది పదమూడు వందల ఏళ్ల చరిత్ర. పోర్చుగీసు క్రిస్టియన్లు కాలికట్, గోవాల మీద దాడి చేయడంతో భారతదేశంలో క్రిస్టియన్ల చరిత్ర మొదలవుతుంది. క్రిస్టియన్లది ఐదు వందల సంవత్సరాల చరిత్ర. హిందువుల చరిత్ర ఎన్ని ఏండ్లది? ఎన్ని వేల సంవత్సరాల నాటిది?

హిందూమత చారిత్రక కాలంతో పోల్చినపుడు ఈ విదేశీ మతాల చారిత్రక కాలాలు కురచగానే వుంటాయి. ఈ కురచదనం ఈ నేలమీద వాటి వారసత్వాలను ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. ఇవే విదేశీ మతాలు కేవలం తమ మతంతో మాత్రమే కాకుండా, ఇక్కడి తమ జాతి (ద్రవిడ)తోనూ, తమ మతంలో అంతర్లీనంగా వున్న సనాతనంతోనూ ఐడెంటిఫై అయినపుడు మాత్రమే వారు ఈ నేల వారసత్వాన్ని మరింత స్వేచ్ఛగా అనుభవించగలరు.

సనాతనం మాదిరే అపభ్రంశ అర్థాలకు లోబడిన మతపారిభాషిక పదాలు విదేశీ మతాలలో కూడా వున్నాయి. ‘నేను, నా తండ్రి ఒక్కటే’ అనే వాక్యంలోని అద్వైత స్పృహను క్రిస్టియన్ మతం కోల్పోయింది. ‘జిహాద్ అంటే ఆధ్యాత్మిక శక్తితో కనెక్టివిటీ కోసం మానవుడు తనతో తాను చేసే పోరాటం’ అని చెబుతారు. కానీ మధ్యయుగాలలోగానీ, ఆధునిక కాలంలోగానీ జిహాద్ పోషిస్తున్న పాత్ర ఎటువంటిదో మనకు అవగతమే.


హిందూమతంలోనూ- గుణకర్మలతో ఏర్పడిన వర్ణభేదాన్ని జన్మతో ముడిపెట్టిన మనువాదమూ మనకు తెలుసు. బ్రహ్మను తెలిసినవాడే బ్రాహ్మణుడు అన్న అర్థం పోయి, బ్రాహ్మణ్యం ఒక కులంగా స్థిరపడిన క్రమం కూడా తెలుసు. హిందూమతం సుదీర్ఘ చరిత్రకు, అన్యదేశీ మతాల పరిమిత చరిత్రలకు మధ్య వున్న అగాధాన్ని తగ్గించుకోవలసిన అవసరాన్ని మైనారిటీలు గుర్తించవలె. ఇందుకు దక్కన్ సంస్కృతి వలె మత సంస్కృతులు అన్నీ సమ్మేళనం పొందవలె. పాకిస్తాన్ దేశం తన సంస్కృతి పరంగా చేసిన పొరబాటులను ఇక్కడి ముస్లింలు చేయరని ఆశిద్దాం. పాకిస్తాన్ ముస్లింలు టర్కీ సంస్కృతినో, అరబ్బు సంస్కృతినో సొంతం చేసుకోబోయి చతికిలబడిన సాంస్కృతిక దివాళాకోరుతనాన్ని ఇక్కడి ముస్లిములు మరువరాదు. వారు పుట్టిపెరిగిన ఈ నేల, ఈ జాతి, ఈ రక్తం (డీఎన్‌ఏ) మీదుగా నిర్మాణం అయిన దేశీయ సంస్కృతిని సొంతం చేసుకోవలె. భారతీయ ముస్లిములుగా ప్రపంచ ముస్లింలలో తమ విశిష్టతను చాటుకోవలె.

మనువాదం, బ్రాహ్మణాధిక్యాలను విమర్శించినంత కాలం విమర్శించినాము. ప్రస్తుతం బ్రాహ్మణాధిపత్యం లేని శూద్రుల హైందవంతో మన జాతీయ ఆసక్తులకు కొత్త రూపం ఇద్దాం. దర్గాలో, చర్చిలో, దేవాలయంలో... ఆవరణలు వేరువేరు. భక్తి ఒక్కటే! భగవంతుడు ఒక్కడే! సనాతన ధర్మమూ ఒక్కటే..!

ఏ ఒక్క మతమూ దేవుడు కాదు. దేవుడు నుంచే మతం పుట్టింది కానీ, మతం నుంచీ దేవుడు పుట్టలేదు. అన్ని మతాలూ సనాతనాన్ని బోధించేవే. ఆ కాలాతీత సత్యాన్ని చేరుకోవడానికి మార్గం చూపేవే. హిందూ, క్రిస్టియన్, ఇస్లాం, జైనం, బౌద్ధం, జొరాస్ట్రియన్.. అన్ని మతాల లక్ష్యం ఈ సనాతన మార్గాన్ని చేరుకోవడమే! మతస్తులు అందరూ, మతానికి అతీతమైన ఆధ్యాత్మికతలో ఏకత్వం పొందవలె! అన్నీ సోదర మతాలే అని నమ్మినపుడు వాటి తల్లివేరు సనాతనం అనే ఏకైక సత్యంలోనే నాటుకున్నదని అర్థం చేసుకున్నపుడు మతాల మధ్య ఆధిపత్య వారసత్వాలు వుండవు. మతం కంటే జాతి వారసత్వము, జాతి కంటే సనాతనం నుండి దఖలు పడిన అనంత వారసత్వము సాధించుకోగలిగిన మహత్వాలు!

- బండి నారాయణస్వామి

కథారచయిత, నవలాకారుడు

Updated Date - May 24 , 2026 | 12:17 AM