Share News

సనాతన ధర్మం, చరిత్ర ఒకటేనా?

ABN , Publish Date - May 31 , 2026 | 12:38 AM

బండి నారాయణస్వామి వంటి రచయితలు సనాతన ధర్మాన్ని ఒక భౌతిక ‘చరిత్ర’గా కుదించి (‘మతాలన్నీ సనాతనం వైపే!’– 24–5–2026) చూసే ప్రయత్నం చేస్తున్నారు. తాత్త్వికంగా చరిత్ర అనేది స్థల కాల బద్ధమైనది.

సనాతన ధర్మం, చరిత్ర ఒకటేనా?

బండి నారాయణస్వామి వంటి రచయితలు సనాతన ధర్మాన్ని ఒక భౌతిక ‘చరిత్ర’గా కుదించి (‘మతాలన్నీ సనాతనం వైపే!’– 24–5–2026) చూసే ప్రయత్నం చేస్తున్నారు. తాత్త్వికంగా చరిత్ర అనేది స్థల కాల బద్ధమైనది. కానీ ‘సనాతనం’ అంటేనే స్థల కాలాలకు అతీతమైన అనంత సత్యం. బుద్ధుడి కాలం నుంచి ఆధునిక తాత్త్వికుల వరకు ఎవరూ సనాతన ధర్మాన్ని భౌతిక చరిత్రతో లంకె పెట్టలేదు. నేటి ‘చరిత్ర’ అనే భావన ఐరోపా వలసవాద దృక్పథం నుంచి దిగుమతి అయినది.

ఏసుక్రీస్తును చారిత్రక పురుషుడిగా రెండు వేల ఏళ్ల క్రితం నాటి పాలస్తీనాకు పరిమితం చేయడం సాధ్యం. కానీ, మన పురాణపురుషుడైన శ్రీరాముడి స్థల కాలాలను ఇటువంటి కొలమానాలతో నిరూపించడం అసాధ్యం. పాశ్చాత్య చారిత్రక కాలం అనేది ఒక బాణంలా సరళరేఖలో ముందుకు సాగుతుంది. భారతీయ భావనలో కాలం చక్రాకృతిలో భ్రమిస్తుంది. కాలం అనంతం కావడం వల్ల, పురాణాల ప్రకారం రాముడు ఒక్కసారే అవతరించడు. ఆ దివ్యలీల విశ్వ కాలచక్రంలో నిరంతరం పునరావృతమవుతూనే ఉంటుంది.

అబ్రహామిక్ మతాలలా సనాతన ధర్మానికి ఏకైక పుణ్యస్థలం, ఒకే గ్రంథం, అంతిమ ప్రవక్త గానీ లేరు. సనాతన ధర్మం ఏ ఇతర జీవన విధానాన్ని నేలమట్టం చేయాలని చూడదు, బానిసగా మార్చుకోదు. దీనికి వెలుపల ‘ఇతరములు’ (The Others) అని విడిగా గుర్తించడమే తాత్త్వికంగా కుదరదు.


నారాయణస్వామి ఒకవైపు వర్ణ ధర్మాన్ని తిరస్కరిస్తారు. మరొకవైపు జాతి, డీఎన్ఏ, రక్తం వంటి పదాల్ని రేసిస్ట్ పదాల్ని వాడతారు. కుల వివక్ష కన్నా రేసిజం గొప్పదా? కుల నిర్మూలనవాదులు అని చెప్పుకున్న వారిలో సాధారణంగా కనబడే ముస్లిం వ్యతిరేకత ఈయనలోనూ కనపడుతుంది. పాకిస్తాన్‌కు వచ్చిన ప్రమాదం అరబ్బులనో, టర్కీనో ఆశ్రయించటం వల్ల కాదు ముస్లిం జాతీయవాదం వల్ల వచ్చింది. అలాగే భారతదేశానికి వస్తున్న ప్రమాదం కూడా హిందూత్వ జాతీయవాదం వల్లనే. ఆ హిందూ మతం పూర్తిగా కొత్తది అదొక ప్రచ్ఛన్న క్రైస్తవం. అది సనాతన ధర్మం కాదు.

అరబ్బులు పోర్చుగీసుల దాడులతోనే ఇస్లాం, క్రైస్తవాలు భారతదేశంలోకి ప్రవేశించాయి అనే వాదన పూర్తిగా హిందూత్వ ఫాసిజానికి దగ్గరగా ఉంది. మొట్టమొదట కేరళలో ఇస్లాం అరబ్బులతో వ్యాపార సంబంధాల వల్ల ప్రవక్త జీవించి ఉన్న ఏడవ శతాబ్దంలోనే ప్రవేశించింది. యుద్ధం ద్వారా కాదు. భారతదేశంలోకి క్రైస్తవ మతం క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే ప్రవేశించింది. ఏసుక్రీస్తు పన్నెండు మంది ముఖ్య శిష్యులలో ఒకరైన సెయింట్ థామస్ ద్వారా ఈ మతం భారత గడ్డ పైకి వచ్చింది. అప్పటికి యూరప్‌లోకి క్రైస్తవం వెళ్ళనే లేదు. ప్రతిదాన్ని ఘర్షణాత్మకంగా చూడడం హిందూత్వ ఫాసిజంలో భాగం.


బ్రిటిష్ కాలానికి చెందిన శృంగేరి శారదా పీఠాధిపతులు జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి వారి ప్రకారం సనాతన ధర్మం రెండు విధాలు: ఒకటి– ‘సామాన్యం’, రెండు– ‘విశేషం’. సామాన్య దృక్పథంలో చూస్తే క్రైస్తవం, ఇస్లాం కూడా సనాతన ధర్మ స్వరూపాలే; వాటి ఆచారాలు, గ్రంథాలు వాటి విశేష గుణాలు మాత్రమే. అందుకే, వైదిక ధర్మంలోకి ఘర్ వాపసీ కోరుకొన్న ఒక క్రైస్తవుడిని స్వామి నిరాకరిస్తూ, భగవదిచ్ఛ ప్రకారమే ఆ మతంలో జన్మించావు కాబట్టి, అందులోనే సచ్ఛీలుడిగా జీవించమని ప్రబోధించారు. దీన్ని విస్మరించి, హిందూమతం అన్నిటికన్నా ప్రాచీనమైనది, మిగిలినవి కురుచ మతాలు అని చరిత్ర ఆధారంగా నిరూపించాలనుకోవడం ప్రచ్ఛన్న క్రైస్తవమే. ‘స్వదేశీ–విదేశీ మతాలు’ అనే పదాలు వాడటంలోనే అసలు సనాతనతత్వం మిస్ అయింది. మతాల స్థల కాలాలు, కొత్త పాతలు వెతకడం సనాతనం కాదు. అలాగే ఒక మతం కన్నా మరొక మతం గొప్పది తక్కువది అనే భావాన్ని రామకృష్ణ పరమహంస తిరస్కరించారు. అన్నీ ఒకే సత్యం యొక్క బహుళ వ్యక్తీకరణలు అనే ఆయన భావించారు. అసలు ‘మతం’, ‘హిందూ’ అనే కాన్సెప్ట్‌లే బ్రిటిష్ కాలంలో వచ్చిన ఆధునిక భావనలు. అవి సనాతనాలు కావు.

నారాయణస్వామి చారిత్రక ప్రమాణం ప్రకారం చూసినా, హిందూ మతం ప్రాచీనం అని కానీ, పూర్తి స్వదేశీ అని కానీ గొప్పలు చెప్పడం కుదరదు. అందరూ వలస వచ్చినవారే. స్వామి నేటి హిందూవాదుల చరిత్రను ప్రమాణంగా తీసుకొంటున్నారు అనుకుంటా. అలాగే భారతీయ ఇస్లాం, క్రైస్తవాలు స్థానిక లక్షణాలు సంతరించుకున్నాయి. ఉదాహరణ దర్గా సంస్కృతి. సూఫీయిజం, షిరిడి సాయిబాబా పూజా విధానం, అలాగే వేంకటేశ్వర స్వామి–బీబీ నాంచారి కథ... ఒక ఉమ్మడి సంస్కృతిని మనకి పరిచయం చేస్తాయి. సూఫీయిజం భారతీయ సర్వాంతర్యామి దృక్పథానికి అద్వైతానికి చాలా దగ్గర. వీటిగురించి స్వామి అసలు మాట్లాడరు.


ఈ చారిత్రక ఏకీకరణ దృక్పథం సావర్కర్ ప్రతిపాదించిన రాజకీయ హిందుత్వ సిద్ధాంతానికి సమీపంగా ఉంటుంది. అందుకే ఆ కాలంలోనే సనాతన ధర్మ సంరక్షకులైన స్వామి కరపాత్రి... సావర్కర్ రాజకీయాన్ని, సావిత్రీదేవి (మాక్సిమిలియాని పోర్టాస్) వంటి వారు హిట్లర్‌ను విష్ణుమూర్తి అవతారంగా పోల్చడాన్ని సనాతన బాహ్యమైనవిగా తిరస్కరించారు. సావర్కర్ చెప్పిన భారత్‌ను పుణ్యభూమిగా చేసుకున్నవాళ్లే స్వదేశీయులు అనే సిద్ధాంతాన్ని, ఇది విదేశాలలో పౌరులైన హిందువులకు కూడా ముప్పు అని కరపాత్రి తిరస్కరించారు. అందుకే విదేశాలలో భారతీయులు ఎదుర్కొంటున్న మత వివక్షని ఇప్పుడు మనం చూస్తున్నాం. సావర్కర్ సైతం తన ‘హిందుత్వ’ గ్రంథంలో సనాతన ధర్మం వేరని, తాను ప్రతిపాదిస్తున్న రాజకీయ హిందుత్వ వేరని స్పష్టం చేశారు. సనాతన ధర్మం బహుళత్వాన్ని అంగీకరిస్తుంది; కానీ హిందుత్వ జాతీయ ఏకీకరణను కోరుకుంటుంది.

సావర్కర్ సిద్ధాంతం ప్రకారం... ఆర్యులు వచ్చాక తమ పూర్వపు విదేశీ స్మృతులను విస్మరించి హిందువులుగా మారారు. ముస్లింలు అలా చేయలేదు. ముస్లింలు ఇప్పటికీ తమ పుణ్యభూమి మక్కాని విస్మరించలేదు. ఇక్కడ ఆయన పవిత్రమైన ‘స్మృతి’ని కాకుండా, చారిత్రక ‘విస్మృతి’ని (Amnesia) మూస జాతీయతకు ఒక సాధనంగా కొనియాడారు. సావర్కర్ వైదిక సనాతన ధర్మానికి మూలస్తంభాలైన ‘శ్రుతి–స్మృతులను’ తన చారిత్రక భౌతికవాదంతో పడగొట్టాలని చూశారు. పాశ్చాత్య ఫాసిస్ట్ దృక్పథాన్ని ఆశ్రయించారు. కన్నడ రచయిత భైరప్ప కూడా తన జీవితాంతం చరిత్రను ప్రాతిపదికగా చేసుకోవడం వల్లే, ఆయన తాత్త్విక ప్రయాణం ‘ఆవరణ’ వంటి నిర్దిష్ట రాజకీయ కోణాల వద్ద ఆగిపోవాల్సి వచ్చింది.


సంస్కృత సంప్రదాయంలో ‘విదేశీయ మతాలు’ అనే విభజన రేఖ లేదు. సంస్కృత గ్రంథాలలో ‘మ్లేచ్ఛ’ అనే పదాన్ని యవనులు, ముస్లింలకే కాక, దేశీయంగా ఉంటూ సంస్కృతేతర స్థానిక భాషలు మాట్లాడే ద్రావిడులను, ఆంధ్రులను సూచించడానికి కూడా వాడారు. పైగా వేదాన్ని అర్థం చేసుకోవడానికి మ్లేచ్ఛభాషల అధ్యయనం కూడా ఉపయోగకరం అని వేద మీమాంస శబర భాష్యంలో రాశారు. ఖగోళ శాస్త్రవేత్తలైన మ్లేచ్ఛ గ్రీకులు ఋషులవలె పూజనీయులు అని వరాహమిహిరుడు రాశాడు. క్రైస్తవ మిస్టిక్స్ జ్ఞానానికి అద్వైతానికి పోలికలు ఉన్నాయి అని కంచి పరమాచార్య అన్నారు. కాబట్టి ఒక సంస్కృతిని ‘విదేశీయులది’ పరాయిది అని నిరసించడం ఆధునిక వలసవాద దృక్పథం. బ్రిటిష్ పాలకులు తమ ప్రయోజనాల కోసం సృష్టించిన ‘హిందూ–ముస్లిం’ ద్విజాతి సిద్ధాంతాన్ని, పాశ్చాత్య ప్రొటెస్టెంట్ చారిత్రకవాదాన్ని నేడు బండి నారాయణస్వామి సనాతన ధర్మానికి అన్వయించడం హిందుత్వ ఫాసిజం మాత్రమే.

- రాణి శివశంకర శర్మ (ది లాస్ట్ బ్రాహ్మిన్)

Updated Date - May 31 , 2026 | 12:41 AM