‘సమూహ’ రాష్ట్ర మహాసభ
ABN , Publish Date - Aug 15 , 2026 | 01:11 AM
భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువలు సామాజిక ఆచరణలో వాస్తవమయ్యే కొద్దీ ప్రజాస్వామ్యం తాత్వికార్థంలో ఉన్నతీకరణ చెందుతుంది.
భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువలు సామాజిక ఆచరణలో వాస్తవమయ్యే కొద్దీ ప్రజాస్వామ్యం తాత్వికార్థంలో ఉన్నతీకరణ చెందుతుంది. పౌరుల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. జీవితం అర్థవంతమవుతుంది. అయితే భిన్న భౌగోళిక జీవన సంస్కృతి, భాషా సమాజాల వైవిధ్యం, ప్రాంతీయ వ్యత్యాసాలు, ఆర్థిక అసమానతలు, కుల మత వైరుధ్యాలు ఉన్న భారతదేశంలో న్యాయం, స్వేచ్ఛ, సమానత్వాలు అందరికీ సమంగా అనువర్తింపజేయగల పరిణతి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కొరవడింది. కనుకనే ప్రజాస్వామ్యం మరణశయ్య మీద ఉన్నదనే భావనకు ఆస్కారం కలిగింది. ప్రజాసంఘాలపై నిర్బంధాలు, ప్రశ్నించే హక్కుల కార్యకర్తలు, రచయితలు, జర్నలిస్టులు, మేధావులపై అక్రమ కేసులు బనాయించడం; రాజకీయ పక్షాల గొంతు మూయించడానికి రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేయడం, న్యాయస్థానాల స్వతంత్ర ప్రతిపత్తిని కబ్జా చేయడం, భాషా సంస్కృతుల ప్రత్యేక అస్తిత్వాలను హరించి ఫెడరల్ స్ఫూర్తిని నాశనం చేయడం ప్రజాస్వామిక విలువల విధ్వంసంలో భాగమే. ఇలాంటి సందర్భంలో రచయితలు ఏం చేయాలి? ఎలాంటి పదునైన సాంస్కృతిక సంభాషణ నిర్వహించాలి? చీకటి రోజులలో చీకటి గురించిన గానాలే కాదు, వెలుగు గీతాలు కూడా వీధుల్లో పోటెత్తుతాయని నేటి యువతరం నిరూపించింది. ఫాసిజాన్ని ఎదుర్కోగలమనీ, ఓడించగలమనీ ఒక గొప్ప భరోసానిచ్చింది. ఈ చిరుదీప కాంతిలో ‘సమూహ’ తన రెండో మహాసభలను ఆగస్టు 16న ఖమ్మంలోని వేదిక ఫంక్షన్ హాల్‌లో జరుపుకుంటోంది.
– సమూహ, సెక్యులర్ రైటర్స్ ఫోరం