యువ సాహిత్యోత్సవం
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:40 AM
ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న జెన్–జీ (జెన్) ఉద్యమాలు ముందుకు తెచ్చిన ప్రశ్నలు అనేకం. వ్యక్తిగత విజయమే జీవిత లక్ష్యమని బోధించే సమాజంలో, ఆ విజయానికి..
ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న జెన్–జీ (జెన్) ఉద్యమాలు ముందుకు తెచ్చిన ప్రశ్నలు అనేకం. వ్యక్తిగత విజయమే జీవిత లక్ష్యమని బోధించే సమాజంలో, ఆ విజయానికి అవసరమైన అవకాశాలు అందరికీ సమానంగా ఉన్నాయా? కులం, వర్గం, లింగం, ప్రాంతం, ఆర్థిక స్థితి ఒక వ్యక్తి భవిష్యత్తును ఎంతవరకు నిర్ణయిస్తున్నాయి?
సాహిత్యం సమాజాన్ని ప్రతిబింబించడమే కాదు, మనకు అలవాటైన సామాజిక వాస్తవాలను కొత్తగా చూడటానికి కూడా సహాయపడుతుంది. అయితే సాహిత్యం ‘ప్రజాసమూహాల మధ్య జరిగే అనేక భావరీతుల సంఘర్షణను’ ప్రతిఫలించాలి. భిన్నమైన గొంతుకలు వినిపించినప్పుడే సాహిత్యం ప్రజాస్వామిక సంభాషణకు నిజమైన వేదిక అవుతుంది.
సంస్కృతి విషయంలోనూ ఇలాంటి పరిశీలనలే అవసరం. సంస్కృతిని ఎవరు నిర్వచిస్తున్నారు? ఏ విలువలకు సమాజంలో గౌరవం లభిస్తోంది? భిన్నమైన భాషలు, సంప్రదాయాలు, జీవన అనుభవాలకు సమాన స్థానం ఉందా? సంస్కృతి పేరుతో ఆధిపత్య విలువలు ఇతరులపై రుద్దడం జరుగుతోందా? ఈ ప్రశ్నలు సంస్కృతిని నిరాకరించడానికి కాదు; దానిలోని వైవిధ్యాన్ని అధికార సంబంధాలను అర్థం చేసుకోవడానికి.
ఈ నేపథ్యంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం తన రెండవ ఎడిషన్ సమూహ యువ సాహిత్యోత్సవం–2026ను నిర్వహిస్తోంది. హైదరాబాద్ కోఠీలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో రేపు ఈ ఉత్సవం జరగనున్నది. ‘సంస్కృతి–ఆధిపత్య వ్యవస్థలు, ‘డిజిటల్ మాధ్యమాలు–అసమ్మతి స్వరాలు’, ‘కొత్తతరం–సాహిత్య స్వరం’, ‘చదువుల మ్యానిఫెస్టో–మేమెక్కడ?’, ‘ప్రదర్శన కళలు–సామాజిక మార్పు’ అనే అంశాలపై చర్చలు జరుగుతాయి. ప్రజాస్వామిక విలువలను ఆకాంక్షించే పౌరులందరూ ఈ సంభాషణలో భాగస్వాములు కావాలి.
- సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం