Share News

బిహార్‌లో పెనుమార్పు

ABN , Publish Date - Apr 15 , 2026 | 03:56 AM

పాతికేళ్ళక్రితం లాలూ యాదవ్‌ పార్టీ ఆర్జేడీతో తన రాజకీయ ప్రస్థానం ఆరంభించి, పన్నెండేళ్ళక్రితం నితీశ్‌కుమార్‌ పార్టీ జేడీయూలో చేరి, మూడేళ్ళలోనే అక్కడనుంచి బీజేపీలోకి గెంతిన సామ్రాట్‌ చౌదరి నేడు బిహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

బిహార్‌లో పెనుమార్పు

పాతికేళ్ళక్రితం లాలూ యాదవ్‌ పార్టీ ఆర్జేడీతో తన రాజకీయ ప్రస్థానం ఆరంభించి, పన్నెండేళ్ళక్రితం నితీశ్‌కుమార్‌ పార్టీ జేడీయూలో చేరి, మూడేళ్ళలోనే అక్కడనుంచి బీజేపీలోకి గెంతిన సామ్రాట్‌ చౌదరి నేడు బిహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. యాభైఏడేళ్ళ వయసులో రాష్ట్రాన్ని ఏలబోతున్న తొలి బీజేపీ ముఖ్యమంత్రి ఆయన. గత ఏడాది అక్టోబర్‌లో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా అమిత్‌ షా తారాపూర్‌ ప్రజలతో ఓ మాటన్నారు. సామ్రాట్‌ చౌదరిని గట్టిమెజారిటీతో గెలిపిస్తే, ఆయనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా మార్చేస్తారని. ఎమ్మెల్యేగా గెలిచి సామ్రాట్‌ చౌదరి మళ్ళీ డిప్యూటీ సీఎం కావడమే కాక, కొద్దినెలల్లోనే ఏకంగా రాజ్యపాలకుడైనారు.


లాలూ ప్రసాద్‌ పక్షాన రబ్డీదేవి రాష్ట్రాన్ని ఏలుతున్న కాలంలో ఓ చిన్న మంత్రిగా ఉన్న సామ్రాట్‌ చౌదరి, అతివేగంగా ఎదిగి పాతికేళ్లు తిరిగేసరికి సీఎం కుర్చీలో కూర్చోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పిన్నవయసునుంచి పార్టీకోసం చెమటోడ్చి, కనీసం టిక్కెట్టు కూడా దక్కని అనేకమంది సీనియర్‌ బీజేపీ నాయకులు ఈ విఐపి తొమ్మిదేళ్ళలోనే సీఎం స్థాయికి ఎదిగిన తీరుచూసి కుళ్ళుకుంటున్నారట. ఢిల్లీ నుంచి ఎవరినో దించి కొత్త అలజడి సృష్టించడం కంటే డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తికే ప్రమోషన్‌ ఇస్తే పార్టీలో కుదుపులు, కుతకుతలు ఉండవని బీజేపీ అధిష్టానం అనుకొని ఉంటుంది. నితీశ్‌కుమార్‌ అధికారంలో ఉండగా, ‘లవకుశు’లకు, అంటే కుర్మీ– కుశ్వాహాలకు సమతూకంలో దక్కిన ప్రాధాన్యాన్ని అదేరీతిలో కొనసాగించడం కూడా బీజేపీ ఆలోచన కావచ్చు. యాదవేతర కులాలను తమ పక్షాన నిలబెట్టుకోవాల్సిన బీజేపీ, కుశ్వాహా కులానికి చెందిన సామ్రాట్‌ చౌదరిని ముఖ్యమంత్రి పదవిలో కూచోబెట్టింది కనుక, డిప్యూటీ సీఎం పదవి నితీశ్‌ కులమైన కుర్మీలకు దక్కుతుందని అంటున్నారు.


నాలుగేళ్ళక్రితం నితీశ్‌కుమార్‌ మారోమారు ఎన్డీయేకి చెయ్యిచ్చి, ఆర్జేడీతో చేతులు కలిపిన ఆర్నెల్లలోనే సామ్రాట్‌ చౌదరిని బీజేపీ అధినాయకత్వం బిహార్‌ రాష్ట్రశాఖ అధ్యక్షుడుగా ప్రతిష్ఠించింది. ఆయన పనితీరుమీద ఎన్ని ఫిర్యాదులున్నా, అసమ్మతి తీవ్రస్థాయికి చేరినా, కష్టపడే ఆయన స్వభావం, పార్టీని ఒక్కతాటిపై నడిపించడంలో నైపుణ్యం చూసి బీజేపీ పెద్దలు సామ్రాట్‌ని స్వేచ్ఛగా వదిలేశారు. మహాగడ్బంధన్‌లో చేరిన నితీశ్‌‍ను గద్దెదించేంతవరకూ నెత్తిన తలపాగా ధరిస్తానని ప్రతిజ్ఞచేసిన సామ్రాట్‌, మరో రెండేళ్లలో నితీశ్‌ వెనక్కురాగానే అయోధ్యవెళ్ళి, గుండుగీయించుకొని, సరయూ నదిలో మునకలేసి, తలపాగా వదిలేశారట. అమిత్‌షాకు అమిత విశ్వాసపాత్రుడు కావడమే కాక, నితీశ్‌, సామ్రాట్‌ మధ్య చక్కని సమన్వయం, సయోధ్య ఉండటం కూడా కొత్త సీఎం ఎంపికమీద పనిచేసివుండవచ్చు. మొత్తానికి, రాష్ట్రాన్ని సొంతంగా ఏలుకోవాలన్న బీజేపీ కోరిక ఇంతకాలానికి నెరవేరుతోంది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలనాటికే ఈ పరిణామాన్ని విశ్లేషకులు ఊహించారు. స్థానిక బీజేపీ నాయకులు సైతం తమ మనసులో కోరికను ఎప్పటికప్పుడు బయటపెడుతూనే వచ్చారు. తొలిసారిగా బీజేపీ, జేడీయూలు సమానసంఖ్యలో– చెరి నూటొక్కస్థానాల్లో పోటీచేయడం కూడా ఈ ఊహాగానాలకు దోహదం చేసింది. నితీశ్‌ నాయకత్వంలో ఎన్నికలకు పోతున్నామని బీజేపీ ప్రకటించింది కానీ, కాబోయే ముఖ్యమంత్రి ఆయనేనని ఎక్కడా అనలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–జేడీయూ కలసికట్టుగా ఘనవిజయం సాధించి, బీజేపీ అతి పెద్దపార్టీగా అవతరించి, నితీశ్‌ పదోసారి సీఎం అయిన నాలుగునెలలకే ఆయన మనసు పెద్దల సభమీదకు పోయింది. ఎగువసభలో కూచొని ప్రజలకు సేవచేసుకోవాలన్న ఆ చిరకాల కోరిక రెండు దశాబ్దాలపాటు ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తున్నప్పుడు కానీ, కేవలం సీఎం కుర్చీకోసం పొత్తులను ఎడాపెడా మార్చేస్తున్నప్పుడు కానీ ఆయనకు ఎందుకో గుర్తుకురాలేదు. ఢిల్లీలో కూచొని బిహారీలకు పెద్దదిక్కుగా ఉంటానని ఆయన హామీ ఇస్తున్నప్పటికీ, బిహార్‌ రాజకీయాల్లో ఇక ఆయన పాత్ర ముగిసినట్టే, సామ్రాట్‌ చౌదరి ప్రవేశంతో రాష్ట్రం బీజేపీ వశమైనట్టే. చరిత్ర ఈ పరిణామాన్ని నితీశ్‌–-లాలూ శకం ముగింపుగా గుర్తుంచుకుంటుందా, లేక బీజేపీ శకారంభంగా చూస్తుందా?

Updated Date - Apr 15 , 2026 | 03:59 AM