ఆక్రమిత కశ్మీర్‌లో అల్లర్లు
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:38 AM
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో పాకిస్థాన్ పాల్పడుతున్న దుర్మార్గాల నుంచి ప్రపంచం దృష్టి మరల్చడానికే ఆ దేశ రక్షణమంత్రి భారత్‌పై యుద్ధోన్మాద వ్యాఖ్యలు చేస్తున్నారంటూ భారతప్రభుత్వం...
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో పాకిస్థాన్ పాల్పడుతున్న దుర్మార్గాల నుంచి ప్రపంచం దృష్టి మరల్చడానికే ఆ దేశ రక్షణమంత్రి భారత్‌పై యుద్ధోన్మాద వ్యాఖ్యలు చేస్తున్నారంటూ భారతప్రభుత్వం మంగళవారం తీవ్రంగా స్పందించింది. ఇటీవలే పాకిస్థాన్ రక్షణమంత్రి సింధుజలాల విషయంలో భారత్ వైఖరిని తప్పుబడుతూ తమ నీటిహక్కుల పరిరక్షణకోసం సైనికచర్యకు కూడా వెనుకాడేది లేదంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పీవోకేలో సాగుతున్న ఆందోళనలు, పాక్ భద్రతాదళాల అణచివేత చర్యలను మసిపూసేందుకు పాక్ ప్రయత్నిస్తున్నదని, మిగతా ప్రపంచం దీనిని ఖండించి, ఆ దేశాన్ని హెచ్చరించాలంటూ భారత్ విజ్ఞప్తిచేసింది.
పీవోకేలో ఇప్పుడంతా ప్రశాంతంగా ఉన్నదన్న పాకిస్థాన్ ప్రభుత్వమూ, మీడియా చేస్తున్న వాదనలు, ప్రచారాలు శుద్ధ అబద్ధమంటూ జమ్మూకాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) మంగళవారం ప్రకటనలో స్పష్టంచేసింది. పక్షంరోజుల క్రితం విధించిన కర్ఫ్యూ, భద్రతాదళాల అణచివేత విధానాలు అదేస్థాయిలో కొనసాగుతున్నాయని జాక్ ప్రకటించింది. ఈ ఉద్యమంలో విదేశీశక్తులు పాల్గొన్నాయన్న పాక్ పాలకుల విమర్శ హాస్యాస్పదమని, తమ స్వప్రయోజనాలకు ముప్పువాటిల్లినప్పుడల్లా వారు దేశభక్తి గురించి మాట్లాడుతూంటారని ఆ పౌరసమాజ కూటమి వ్యాఖ్యానించింది. అమెరికా–ఇరాన్ యుద్ధాన్ని ముగించి, శాంతిని సాధించడంలో పాకిస్థాన్ అత్యద్భుతమైన పాత్ర పోషించినందుకు యావత్ ప్రపంచం కీర్తిస్తున్నదని, ఈ తరుణంలో పీవోకేలో అల్లర్లకు విదేశీశక్తులు కుట్రపన్నితే, కొన్ని సంస్థలు దేశభక్తి లేకుండా అందుకు సహకరిస్తున్నాయన్న అర్థంలో పాకిస్థాన్ పీపుల్స్‌పార్టీ (పీపీపీ) అధ్యక్షుడు బిలావల్ భుట్టో వంటివారు చేస్తున్న విమర్శలకు సమాధానంగా జాక్ ఈ వ్యాఖ్యలు చేసింది.
జూలై 27న పీవోకే శాసనసభకు ఎన్నికలు నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.అయితే, శాసనసభలో ఉన్న మొత్తం నలభైఐదుస్థానాల్లో 12 స్థానాలు భారత్ ఆధీనంలో ఉన్న కశ్మీర్ నుంచి వలసవచ్చినవారికి కేటాయించి ఉండటం ఈ ఆగ్రహనికి కారణం. దీనివల్ల స్థానికులకు నష్టం జరుగుతోందని, ఇస్లామాబాద్ ఆశీస్సులున్న ప్రభుత్వాలు ఏర్పడటానికి మార్గం సుగమం అవుతోందని జాక్ వాదన. ఎన్నికలకు ముందే ఈ సీట్లను రద్దుచేయాలన్న దాని డిమాండ్‌కు సుప్రీంకోర్టు కూడా అంగీకరించలేదు. పూర్వపు రాచరిక కశ్మీర్ మొత్తం వివాదాస్పదమైనదేనని, వలసవచ్చిన కశ్మీరీలకు మొత్తం కశ్మీర్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే హక్కు ఉన్నదని అంతర్జాతీయ వేదికలపై వాదించడానికి ఈ విధానం పాక్ పాలకులకు ఉపకరించవచ్చును గానీ, అది పీవోకేలో అల్లర్లకు కారణమవుతోంది. తమ భూభాగంలో నివసించనివారికి సీట్ల కేటాయింపులు సరికాదన్నది జాక్ వాదన.
పన్నెండుస్థానాల విషయంలో జరుగుతున్న పోరాటంగా ఉపరితలంలో కనిపిస్తున్నప్పటికీ, పీవోకే మీద పట్టుజారిపోకుండా పాక్ పాలకులు నిరంతరం కొనసాగిస్తున్న అణచివేత విధానాలపై ఇది తిరుగుబాటు. వనరుల దోపిడీ, మౌలిక సదుపాయాలు, ఉపాధి ఇత్యాది వివిధ అంశాలపై స్థానికుల పోరాటం సాగుతూనే ఉంది. నిజానికి, పంజాబ్ మినహా పాకిస్థాన్‌లోని అన్ని ప్రాంతాల్లో ఏదో విధమైన అల్లర్లు, తిరుగుబాట్లు సాగుతూనే ఉన్నాయి. బలూచిస్థాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ అత్యంత శక్తివంతమైన సాయుధపోరాటం చేస్తోంది. గత ఏడాది సైనికులతో వెళుతున్న రైలునే అది హైజాక్ చేసి పాక్ ప్రభుత్వాన్ని హడలుగొట్టింది. మరోపక్క అఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతాలనుంచి తెహ్రీక్–ఏ తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) తీవ్రమైన దాడులకు పాల్పడుతోంది. ప్రతిగా పాకిస్థాన్ ప్రభుత్వం ఏకంగా సరిహద్దులు దాటి యుద్ధవిమానాలతో అఫ్ఘాన్‌మీద విరుచుకుపడుతోంది. చైనా, అమెరికాలనుంచి సంపూర్ణ సహాయసహకారాలు ఉన్నప్పటికీ, ఈ అంతర్గత సమస్యలు, అంతర్యుద్ధాలనుంచి బయటపడలేక అది భారత్‌ను ఆడిపోసుకుంటోంది, నిరర్థక కారణాలతో రణనినాదాలు చేస్తోంది.
ఇవి కూడా చదవండి
వర్షంలో కారు నడుపుతున్నారా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి
తమిళనాడు సీఎం విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు!