ముందడుగు...!
ABN , Publish Date - Apr 02 , 2026 | 05:13 AM
మణిపూర్‌లో శాంతిపునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఖేమ్‌చంద్ సింగ్‌ను కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల...
మణిపూర్‌లో శాంతిపునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఖేమ్‌చంద్ సింగ్‌ను కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల స్థితిని బుధవారం ఆయన సమీక్షించారు. రాష్ట్రానికి ఒక మహిళా రిజర్వు బెటాలియన్ కేటాయించాలని ముఖ్యమంత్రి కోరగానే, తప్పక పరిశీలిస్తానని కూడా అమిత్ షా హామీ ఇచ్చినట్టు మణిపూర్ ప్రభుత్వం ఈ ప్రకటనలో తెలియచేసింది. మణిపూర్ త్వరితగతిన గాడినపడాలని కేంద్రం భావించడం సరైనదే. అదే ప్రయత్నంలో ఉన్నానంటూ తాను చేసిన, చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి కూడా వివరించే ఉంటారు.
మూడేళ్ళపాటు గత ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని తగలబెడితే, రెండు నెలల క్రితమే సీఎం కుర్చీలో కూర్చున్న తనను త్వరగా మంటలార్పమని ఎందుకు తొందరపెడుతున్నారని కొత్త ముఖ్యమంత్రి సహజంగానే పైకి అనలేరు. ఈ డబుల్ ఇంజన్ సర్కారు రాష్ట్రం పేరు ఇప్పటికీ దేశమంతా మారుమోగుతున్న తరుణంలో, చెడ్డపేరు త్వరితంగా చెరిపేసే ప్రయత్నం జరగాల్సిందే. మొన్న పశ్చిమబెంగాల్‌లో మమత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమిత్ షా స్వయంగా పొలిటికల్ చార్జిషీటు విడుదల చేసి వెళ్ళగానే, తృణమూల్ నేతలంతా మణిపూర్‌ను మాచెడ్డ స్మరించారు. బెంగాల్‌లో మహిళలకు రక్షణలేదనీ, అత్యాచారాలూ అఘాయిత్యాలూ తెగ జరుగుతున్నాయని, శాంతిభద్రతలు ఘోరంగా దెబ్బతిన్నాయని బీజేపీ నాయకులు అనగానే, మూడేళ్ళపాటు మణిపూర్ నిరవధికంగా మండిన విషయాన్ని టీఎంసీ నేతలు గుర్తుచేశారు. మతపరమైన చీలికలతో, జాతుల మధ్య విద్వేషాలతో జనాన్ని విడదీస్తున్నదంటూ బీజేపీ మీద వాగ్బాణాలు సంధించడానికి విపక్షాలకు మణిపూర్ అందివస్తోంది. బిహార్‌లో ఒక పెద్ద గుంపు ఒక మహిళను నడివీధుల్లో నడిపిస్తూ, ఆమె పట్ల అసభ్యంగా, అనుచితంగా ప్రవర్తిస్తున్న వీడియో ఒకటి వెలుగుచూడగానే విపక్షనేతలకు మళ్ళీ మణిపూర్ గుర్తుకొచ్చింది. ఇది సామూహిక అత్యాచార యత్నమేనని, బిహార్‌కు కొత్త బీజేపీ ముఖ్యమంత్రి ఇంకా రాకుండానే, రాష్ట్రం మణిపూర్‌గా మారిపోవడం మొదలైందని తేజస్వియాదవ్ వ్యాఖ్యానించారు. చక్కగా ఉన్న తమిళనాడులో మణిపూర్ తరహా చిచ్చుపెట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందని, ఆ కుట్రను తాను విజయవంతంగా భగ్నం చేశానని ముఖ్యమంత్రి స్టాలిన్ ఎన్నికల ప్రచారంలో చెప్పుకున్నారు. బీజేపీ ఏలుబడిలో ఉన్నందునే మణిపూర్ ఈ దుస్థితికి దిగజారిపోయిందని విపక్షపార్టీల నేతలతో పాటు, పౌర సంస్థలు, హక్కుల సంఘాల విమర్శలు ఉండనే ఉన్నాయి.
మాజీ ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ మీతీలకు ఎస్టీ హోదా కట్టబెట్టేందుకు కుట్ర పన్నుతున్నారన్న అనుమానంతో కుకీ–జో సంస్థలు నిర్వహించిన ఒక నిరసన ప్రదర్శనమీద మీతీల ప్రతిదాడితో చిచ్చురేగింది. కరడుగట్టిన మీతీ పక్షపాతి బీరేన్ సింగ్ ఆ కుర్చీలో ఉన్నంతకాలం తెగలు తెగనరుక్కోవడం, గృహదహనాలు, సామూహిక అత్యాచారాలతో రాష్ట్రం అతలాకుతలమైంది. మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియోలు వెలుగుచూసేవరకు ఆ రాష్ట్రంలో ఏమి జరుగుతోందో మిగతాదేశానికి పాలకులు తెలియనివ్వలేదు. మీతీలకు ఆయుధాలు ఇవ్వమంటూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న బీరేన్ అధికారులను ఆదేశిస్తున్న ఆడియో ఒకటి బయటకు వచ్చి, సుప్రీంకోర్టు దానిని ధ్రువీకరించిన తరువాత, బీజేపీ అధిష్ఠానం బీరేన్‌ను ఇక గత్యంతరం లేక తప్పించింది. ఏడాది రాష్ట్రపతి పాలనలో సైతం రాష్ట్రంలో అనేక దారుణాలు జరిగాయి. ఫిబ్రవరి 4తో దాని గడువు ముగిసి, కొత్త ముఖ్యమంత్రి రాకతో పరిస్థితుల్లో కాస్తంత మార్పు మొదలైంది. మీతీయేతర తెగలు, జాతుల వారికి బీజేపీ ప్రభుత్వం మీద నమ్మకం నశించిన నేపథ్యంలో, ఖేమ్‌చంద్ ముఖ్యమంత్రి కాకమునుపే కుకీ–జో శరణార్థ శిబిరాన్ని సందర్శించి ఒక సానుకూల మార్పుకు పునాది వేశారు. సీఎం అయ్యాక తన ప్రభుత్వం పట్ల ప్రజలందరి విశ్వాసాన్ని గెలుచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కుకీ–జో కౌన్సిల్‌తో చర్చలకు సిద్ధపడి, ఇంఫాల్‌లో కాక మరొక తటస్థ ప్రాంతంలో వాటిని కొనసాగించేందుకు సైతం అంగీకరించడం మంచి పరిణామం. విభేదాలను పరిష్కరించుకుంటూ, అవిశ్వాసాన్ని తొలగించుకుంటూ కొత్త సీఎం ముందుకు సాగుతారని ఆశించాలి. త్వరితంగా మణిపూర్‌ను గాడినపెట్టాలని కోరుతున్న కేంద్రప్రభుత్వం కూడా సరిపడినంత ఆర్థికసాయంతో పాటు, ఆయా జాతులవారి చిన్నాచితకా డిమాండ్లను అంగీకరించడంలోనూ ఉదారంగా వ్యవహరించాలి.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్ ప్రిన్స్‌కు వందోసారి కూడా ఓటమి ఖాయం: మోదీ
ఎన్డీయే వస్తే తమిళనాడును దక్షిణ ప్రదేశ్‌గా మార్చేస్తారు: స్టాలిన్