Share News

మణిపూర్‌లో మరో విన్యాసం

ABN , Publish Date - Sep 02 , 2026 | 12:36 AM

రెండు తెగలకు చెందిన ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఈ హింసకు మీరే కారణమంటూ ఒకరినొకరు తిట్టిపోసుకుంటున్నారంటే, పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతుంది. ఒక మీతీ ముఖ్యమంత్రి, నాగా, కుకీలనుంచి...

మణిపూర్‌లో మరో విన్యాసం

రెండు తెగలకు చెందిన ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఈ హింసకు మీరే కారణమంటూ ఒకరినొకరు తిట్టిపోసుకుంటున్నారంటే, పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతుంది. ఒక మీతీ ముఖ్యమంత్రి, నాగా, కుకీలనుంచి ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఉంటే మణిపూర్‌ ప్రశాంతంగా ఉంటుందన్న భ్రమ వేగంగా తొలగిపోయింది. ఆరేళ్ళనాటి మీతీ–కుకీ హింస ఇప్పుడు నాగా కుకీలకు బదిలీ అయి మణిపూర్‌ మండుతోంది. మంగళవారం తెల్లవారుజామున మూడు నాగా గ్రామాలపై కుకీ మిలిటెంట్లు జరిపిన దాడి మంటలను మరింత ఎగదోస్తోంది. ఈ ఘటనలో నలుగురు మరణించడంతోపాటు, నాగా తెగకు చెందిన ముప్పై ఇళ్ళు, ఆస్తిపాస్తులు దగ్ధమైనాయి. దీనికి ఒకరోజు ముందు కుకీ గ్రామంపై నాగాలు దాడిచేసి నలుగురిని చంపినందుకు ప్రతీకారం ఇది.

రెండు తెగల మధ్యా వరుస దాడులతో పాటు, ఉపముఖ్యమంత్రుల పరస్పర ఆరోపణలు ప్రభుత్వం పరువు మరింత దిగజార్చాయి. నాగాలమీద వరుస దాడులకు కుకీ ఉపముఖ్యమంత్రి సహకరిస్తున్నారని, ఆమె భర్త నేతృత్వంలోని కుకీ నేషనల్‌ ఫ్రంట్‌ (కెఎన్‌ఎఫ్‌–పి) మిలిటెంట్లు అత్యంత పాశవికంగా అమాయక నాగాలను ఊచకోతకోస్తున్నారని నాగా ఉపముఖ్యమంత్రి ఆరోపణ. భర్తతో కలసి నాగాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆమె మీద చర్యలు తీసుకోవాలంటూ ఈయన కేంద్రహోంమంత్రికి ఒక లేఖరాశారు. నాగా ఎమ్మెల్యేలు, నాగా తెగ పెద్దలంతా దీనిపై సంతకాలు చేశారు. ఈ ఏడాది మేలో ఆరుగురు నాగాల అపహరణ, అనంతరం ఘోరమైన స్థితిలో వారి మృతదేహాలు లభ్యం కావడం నుంచి ఇప్పటివరకూ జరిగిన పరిణామాలన్నీ ఈ లేఖలో గుర్తుచేస్తూ, మారణాయుధాలతో దాడులకు పాల్పడటంతోపాటు, ఎక్కడికక్కడ నాగాలను ఈ సంస్థ గుట్టుచప్పుడు కాకుండా చంపి, వేర్వేరు చోట్ల పూడ్చిపెడుతున్నదని వారు ఆరోపించారు. ఆ దుర్మార్గుడి కారణంగానూ, భార్య ఉపముఖ్యమంత్రిగా అతడికి రహస్యసహకారం అందిస్తున్నందునా రాష్ట్రంలో శాంతిస్థాపన సాధ్యపడటం లేదని, అందువల్ల అన్ని కుకీ మిలిటెంట్‌ గ్రూపులతో ఉన్న ఒప్పందాలన్నీ రద్దుచేసి మిలిటెంట్ల ఏరివేతకు ఉపక్రమించాలన్నారు వారు. కేంద్రప్రభుత్వం తక్షణమే సాహసోపేత నిర్ణయం చేయకుంటే, మణిపూర్‌ చేజారిపోతుందన్నది ఆ లేఖ సారాంశం. ఇక, బుధవారం నుంచి ఆరంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనవద్దంటూ కుకీ–జో ఎమ్మెల్యేలకు ఆ తెగ అత్యున్నత సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆరేళ్ళుగా కుకీలకు అన్యాయం జరుగుతున్నా, ఊచకోతలు సాగుతున్నా, స్వయంపాలన సహా చాలా డిమాండ్లను కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు బేఖాతరుచేసినందున అసెంబ్లీలో కాలుపెట్టవద్దని తమ ఎమ్మెల్యేలను ఆ సంఘం హెచ్చరించింది. అరవైమంది సభ్యులున్న మణిపూర్‌ అసెంబ్లీలో ప్రస్తుతం ఎనిమిదిమంది కుకీ ఎమ్మెల్యేలున్నారు. వీరిలో ఆరుగురు బీజేపీవారే.


మణిపూర్‌ కొండప్రాంతాల్లో కుకీ–నాగా హింస సాగుతూండగా, లోయలో మీతీలు రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీ అమలు కోసం బంద్‌ పాటిస్తున్నారు. నాగా సంఘాలు కూడా ఈ డిమాండ్‌కు మద్దతునిస్తూ మీతీ సంస్థలతో కలిసి నడుస్తున్నాయి. జనగణనకు ముందే జాతీయ పౌరపట్టికను సిద్ధంచేయాలన్నది మీతీ–నాగా ఉమ్మడి డిమాండ్‌. కుకీ జో సంఘాలు జనగణనను స్వాగతిస్తూనే, తమ పుట్టుపూర్వోత్తరాలూ అక్రమవలసల కట్టుకథలతో తెగను అప్రదిష్టపాల్జేసే కుట్ర బలంగా సాగుతోందంటూ ఎన్‌ఆర్‌సీని మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. మణిపూర్‌లో సెప్టెంబర్‌ ఒకటినుంచి ఆరంభం కావాల్సిన జనగణనను వాయిదావేస్తూ ముందురోజు సోమవారం కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మీతీ–నాగాల డిమాండ్‌ నెరవేరినట్టయింది. అయితే, ఎన్‌ఆర్‌సీని ప్రకటించేవరకూ తమపోరాటం ఆగదని ఆ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మీతీల డిమాండ్‌కు తలొగ్గి జనగణనను వాయిదావేసిన కేంద్ర ప్రభుత్వం, కుకీ జోలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎన్నార్సీకి కూడా సానుకూలంగానే ఉన్నట్టు కనబడుతోంది. బీరేన్‌సింగ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నార్సీకి అనుకూలంగా చేసిన తీర్మానాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి గుర్తుచేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నార్సీని అమలుచేయించే నిమిత్తం ముఖ్యమంత్రి యుమ్నమ్‌ ఖేమ్‌చంద్‌ ఇటీవలే తమ ఎమ్మెల్యేలను ఢిల్లీ పంపారు కూడా. చీలికలు పీలికలైన మణిపూర్‌ సమాజం మరమ్మతుకు నోచుకోవడానికి బదులు, రాబోయే రోజుల్లో మరిన్ని ఘోరాలు చూడాల్సి రావచ్చు.

ఈ వార్తలు కూడా చదవండి

పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని

వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..

Updated Date - Sep 02 , 2026 | 12:36 AM