ఈ20 ఇక్కట్లు..!
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:21 AM
ఇరవైశాతం ఇథనాల్ కలగలిసిన పెట్రోల్ (ఈ20)కు వ్యతిరేకంగా ఢిల్లీలో శుక్రవారం నిరసన ప్రదర్శనలు జరగబోతున్న నేపథ్యంలో, నిర్వాహకులతో కేంద్రప్రభుత్వం బుధవారం చర్చలు జరిపింది....
ఇరవైశాతం ఇథనాల్ కలగలిసిన పెట్రోల్ (ఈ20)కు వ్యతిరేకంగా ఢిల్లీలో శుక్రవారం నిరసన ప్రదర్శనలు జరగబోతున్న నేపథ్యంలో, నిర్వాహకులతో కేంద్రప్రభుత్వం బుధవారం చర్చలు జరిపింది. పెట్రోలియం మంత్రి హర్దీప్‌సింగ్ పురి ఏకంగా నాలుగుగంటలపాటు తమతో మాట్లాడి, నిరసన వాయిదావేసుకోమన్నారని, ఈ20 అమలు విషయంలో తాము పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచామని ‘టీమ్ భారత్’ ప్రతినిధులు చెప్పారు. పాలకులు ఇలా దిగిరావడం కాక్రోచ్ ఉద్యమం మహిమేనని అంతా అనుకుంటున్నారు. ఈ20కి వ్యతిరేకంగా ఢిల్లీలో అడపాదడపా నిరసన ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నా, బేఖాతరు చేస్తూ వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు మాట్లాడినందుకు సంతోషించవలసిందే. అయితే, ఈ రకం పెట్రోల్‌మీద ఉన్న భయాలు, అనుమానాలను నివృత్తి చేయడం కంటే, పాతవాదనలనే మళ్ళీమళ్ళీ ముందుకు తెచ్చి తమ మీద ఈ మిశ్రమాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందని విస్తృత ప్రజానీకం భావిస్తోంది. ఈ దేశంలోని మొత్తం వాహనాల్లో ఈ20 ఇంధనానికి అనుగుణమైనవో ఎన్నో తెలియచెప్పగలిగే సమాచారం ఏదీ లేదంటూ సోమవారం పార్లమెంట్‌లో ఒప్పుకున్న ప్రభుత్వం, వాహనాలపై దాని దుష్ప్రభావాలకు సంబంధించి ఏమైనా ప్రత్యేక అధ్యయనాలు జరిపిందీ లేనిదీ కూడా ప్రజలకు పూర్తిగా తెలియచెప్పకపోవడం సరికాదు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎప్పటిలాగానే గురువారం కూడా పార్లమెంట్‌లో ఈ20 పెట్రోలుకు సంబంధించి అవేవాదనలు చేశారు. మైలేజీ ఓ ఆరుశాతం వరకూ తగ్గవచ్చునని, అయితే, కర్బన ఉద్గారాల కాలుష్యం కూడా ముప్పైశాతం తగ్గుతుందని, వాహనాలు జోరుగా హుషారుగా పరిగెడతాయని, బిఎస్3, తదనంతర అన్ని రకాల వాహనాలమీదా ఈ రకం పెట్రోల్ ప్రభావాన్ని పలు సంస్థలు పరీక్షించాయని ఆయన వివరించారు. అయితే, ఎన్నివాహనాలకు ఈ20 సరిపడుతుందో చెప్పలేమంటూనే పార్లమెంట్‌లో సోమవారం ప్రభుత్వం ఇప్పటికే దేశంలో కోట్లాది వాహనాలు ఈ10, ఈ15, ఈ20 రకాలతో గత కొన్నేళ్ళుగా చక్కగా పరుగులు తీస్తున్నాయని, ఈ మిశ్రమాల వల్ల వాటిపై చెప్పుకోదగ్గ స్థాయిలో నష్టం జరిగిందనడానికి ఆధారాలు కూడా లేవని అంటోంది. తాము వాహనాలకు సర్వీస్ చేస్తున్నప్పుడు ఇంజన్‌మీద చెడు ప్రభావమేదీ కనిపించలేదని వాహన తయారీ సంస్థలు తెలియచేశాయట. కానీ, పర్యావరణానుకూల పచ్చ ఇంధనం పేరిట ఈ20 కోసం ప్రభుత్వం పరుగుతీస్తున్నప్పుడు క్షేత్రస్థాయిలో దానిని వినియోగిస్తున్న వాహనాల లెక్క తెలియకపోవడం సరికాదు. సమగ్రమైన గణనలేకుండా, ప్రభావాన్ని నిర్దిష్టంగా తేల్చకుండా ఆ మిశ్రమానికి మారాలన్న ఆతృత మంచిది కాదు, అది లక్ష్యసాధనకు కూడా ఉపకరించదు.
ముడిచమురు దిగుమతులను తగ్గించుకోవడం, కాలుష్యాన్ని నియంత్రించడం పేరిట పెట్రోల్‌లో ఐదోవంతు ఇథనాల్ కలిపే విషయంలో ప్రభుత్వం మొండిగా పోతోంది. ఈ ఇంధనం సురక్షితమైనదన్న ప్రభుత్వం వాదన నిజమే కావచ్చు. అయితే, ఆ శాస్త్రీయ పరీక్షలతో పాటు, సదరు మిశ్రమాన్ని వినియోగిస్తున్న ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయవలసిన బాధ్యత కూడా ప్రభుత్వంపైన ఉంది. కోట్లాదిమంది వాహనదారులను ప్రభావితం చేసే విధానం అమలు వాస్తవిక డేటా ఆధారంగానే జరగాలి. దేశంలోని 20కోట్ల ద్విచక్రవాహనాలు, మూడుకోట్ల కార్లు కొన్ని సంవత్సరాలుగా ఈ తరహా మిశ్రమాలను వాడుతున్నాయన్న వాదనతో, దేశంలోని వాహనాలన్నీ ఈ20 అనుగుణమైనవే అన్న భ్రమలు కల్పించడం సరికాదు. భవిష్యత్తులో ఇథనాల్ శాతాన్ని మరింత పెంచే అంశంమీద నిర్ణయానికి ముందే విస్తృత అధ్యయనాలు, పరిశీలనలు, పరిశోధనలు, మరీముఖ్యంగా వినియోగదారులతో చర్చోపచర్చలు జరుపుతామని, ఆ తరువాతే ఆచరణకు తెస్తామని ప్రభుత్వం హామీ ఇస్తున్నది. మరి, ఈ20 విషయంలో అది ఎందుకు జరగలేదు, ఇప్పటికీ ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదన్నది ప్రశ్న. ప్రతీ లీటరునూ అత్యంత ఖరీదుకు కొనుగోలుచేస్తూ, మైలేజీనీ లెక్కచూసుకొనే సామాన్యుడు విస్తృత ప్రయోజనాలకోసం సిద్ధపడాలంటే, ఈ కొత్తరకం ఇంధనం అన్ని రకాలుగా అతడికి అనుకూలమైనదై ఉండాలి. ఇథనాల్ ఉత్పత్తికోసం దేశవ్యాప్తంగా వందలాది ప్రాజెక్టులు ఆరంభించి, ఇప్పటికే రెండు లక్షలకోట్లు రుణాలు మంజూరు చేయించిన ప్రభుత్వం సామాన్యుడికి దీనిని ఎంతో చవుకగా అందించి కూడా చేరువచేయవచ్చు.
Also Read:
వర్షాకాలంలో ప్రయాణం.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఇంట్లో గులాబీ మొక్క పెంచుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి