Share News

‘ఈ20’ రచ్చ...!

ABN , Publish Date - Jul 11 , 2026 | 02:56 AM

వాహనదారులనుంచి ఈ20 పెట్రోల్‌ వాడకంపై అభ్యంతరాలు, విమర్శలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ ఒక సుదీర్ఘ వివరణ విడుదల చేసింది. 20శాతం ఇథనాల్‌ కలిపిన...

‘ఈ20’ రచ్చ...!

వాహనదారులనుంచి ఈ20 పెట్రోల్‌ వాడకంపై అభ్యంతరాలు, విమర్శలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ ఒక సుదీర్ఘ వివరణ విడుదల చేసింది. 20శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వాడకం వల్ల ఎన్నెన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలియచెప్పడం ఈ డాక్యుమెంట్‌ లక్ష్యం. సామాన్యులతో పాటు, కొందరు విపక్షనేతలు కూడా ఇథనాల్‌ బ్లెండెండ్‌ పెట్రోల్‌మీద విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. 2023కంటే ముందు తయారైన వాహనాల్లో ఈ ఇంధనాన్ని వినియోగించడంలో ఉన్న కష్టనష్టాలను వివరించండి అంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ 29వాహన తయారీ కంపెనీలకు ఇటీవలే లేఖ రాసి, వారంలోగా ప్రజలకు వివరణ ఇవ్వాలని హెచ్చరించారు కూడా. వారంక్రితం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఓ మీడియా సమావేశంలో, మూడు దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీల ప్రతినిధులు ఈ20ని మెచ్చుకుంటూ, ఈ ఇంధనంతో ఇంజన్లకు కీడు జరగదని, మైలేజీ మాత్రం మూడు నుంచి ఐదుశాతం తగ్గవచ్చునని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ సమావేశాల్లో ఆయా కంపెనీల ప్రతినిధులు ఇలా చెబుతూంటే, అవి వాహనయజమానులకు ఇచ్చే మాన్యువల్స్‌లో మాత్రం పదిశాతం కంటే ఎక్కువ ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వాడకూడదని ఎందుకు హెచ్చరించాయని కేజ్రీవాల్‌ ప్రశ్న. సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన రచ్చ జరుగుతున్న తరుణంలో ప్రభుత్వం ఈ వివరణ ద్వారా ప్రజాందోళనని చల్లార్చే ప్రయత్నం చేసింది.

ధరకాస్తంత ఎక్కువైనా, మైలేజీ ఓ మోస్తరుగా తగ్గినా, ఈ చమురు వల్ల పర్యావరణానికి చాలా మేలు జరుగుతుందని, సాధారణ పెట్రోల్‌ ధరలకు ఆటుపోట్లు ఉన్నా, దీనికి మాత్రం ఉండదని, వాహన జీవితకాలం కూడా హెచ్చుతుందని, పాతవాహనాలు పాడవుతాయన్న వాదన శుద్ధ అబద్ధమనీ, ఇథనాల్‌ బ్లెండింగ్‌ వల్ల దాదాపు రెండులక్షలకోట్ల విదేశీమారకద్రవ్యం ఆదా చేశామని ప్రభుత్వం ఈ డాక్యుమెంట్‌లో చాలా చెప్పింది. ఈ20తో దెబ్బతిన్న ఒక్క కారునైనా చూపించండి అంటూ కేంద్ర రోడ్డు రవాణామంత్రి నితిన్‌ గడ్కరీ కూడా సవాలు చేస్తున్నారు. కొన్ని పాతమోడల్‌ వాహనాల్లోని భాగాలపై స్వల్పస్థాయి ప్రభావం ఉంటుందని గ్రహించినందువల్లనే, సర్వీసింగ్‌ సమయంలో ఆయా భాగాలను రిప్లేస్‌ చేయమని తాము వాహనసంస్థలను కోరినట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు.


ఈ20తో పదిశాతం మైలేజీ తగ్గిందనీ, వాహనాన్ని ఎక్కువసార్లు రిపేర్లు చేయించవలసి వస్తోందని అత్యధికులు చెప్పినట్లు ఇటీవలి సర్వేలు పేర్కొన్నాయి. ఇటీవలే ఢిల్లీలో ఇథనాల్‌ ఇంధనానికి వ్యతిరేకంగా నిరసనలు కూడా జరిగాయి. ఫ్యూయల్‌ పైపులు తుప్పుబట్టడం, ఇంజక్టర్లు మూసుకుపోవడం వంటివి జరుగుతున్నట్లుగా ఒకపక్క జనం చెబుతూ, ఐదుశాతం మైలేజీ తగ్గుతుందని ప్రభుత్వమూ, కంపెనీలూ మరోపక్క అంటున్న తరుణంలో, ఈ20వల్ల అంతిమంగా ఒనగూరే లబ్ధిని నిక్కచ్చిగా లెక్కవేయాల్సిందే. తక్కువ మైలేజీ కారణంగా అధికపెట్రోల్‌ను వినియోగించాల్సి రావడం, రిపేర్లకు ఎక్కువ ఖర్చుచేయాల్సి ఉండటం సామాన్యుడికీ, పర్యావరణానికీ మేలు చేయబోదు. దీనికితోడు, ఇథనాల్‌ కంపెనీలకు బ్యాంకులు విరివిగా లక్షలకోట్లు అప్పులిచ్చి, భారీ ఎత్తున ఉత్పత్తి చేపట్టామని ప్రభుత్వమే చెప్పుకొచ్చింది. ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తున్న ఇథనాల్‌ ప్లాంట్లకు వ్యతిరేకంగా పలుచోట్ల ఉద్యమాలు జరుగుతున్నాయి. వాటి కాలుష్యంతో పంటలకూ, ప్రజలకు, పాడిపశువులకు జరుగుతున్న నష్టం అపారమైనదని, కేవలం ఇథనాల్‌ ఉత్పత్తికోసం వరి, మొక్కజొన్న, సోయాబీన్‌ పంటలను అత్యధికంగా సాగుచేయడంద్వారా భూగర్భజలాలు క్షీణిస్తున్నాయని శాస్త్రవేత్తల ఆవేదన. కేంద్రప్రభుత్వం ఈ ప్లాంట్లకోసం మరింత చవుకగా బియ్యాన్ని సరఫరా చేస్తున్నది. ఇది చాలదన్నట్టుగా అమెరికానుంచి జన్యుమార్పిడి మొక్కజొన్న దిగుమతులకు అనుమతించండంటూ ప్లాంట్ల యజమానులు ప్రభుత్వాన్ని పోరుతున్నారు. ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ కారుచవుకగా లభిస్తుందని గడ్కరీ గతంలో చేసిన వ్యాఖ్యలు సైతం నిరాధారమైనవని తేలిపోయింది. సామాన్యుడికీ, రైతుకూ, పర్యావరణానికీ మేలు చేయనిపక్షంలో ఇథనాల్‌ ఇంధనంమీద ప్రజావ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. విమర్శలు, ప్రతివిమర్శలతో సరిపుచ్చడం కాక, ఆయా రంగాల ప్రముఖులు, నిపుణులతో స్వతంత్రకమిటీలను ఏర్పాటుచేసి ఇథనాల్‌ ఇంధనం ప్రయోజనాలను, ప్రభావాలను నిగ్గుతేల్చడం అవసరం.

Also Read:

తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?

ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్

Updated Date - Jul 11 , 2026 | 02:56 AM