Share News

పాత్రికేయ విజయం

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:43 AM

స్వతంత్ర డిజిటల్‌ వార్తాసంస్థ న్యూస్‌క్లిక్‌, దాని వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థపై ఢిల్లీ పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ చర్యలను తీవ్రంగా తప్పుబడుతూ, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీడియాకు...

పాత్రికేయ విజయం

స్వతంత్ర డిజిటల్‌ వార్తాసంస్థ న్యూస్‌క్లిక్‌, దాని వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థపై ఢిల్లీ పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ చర్యలను తీవ్రంగా తప్పుబడుతూ, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీడియాకు, పాత్రికేయరంగానికి పెద్ద ఉపశమనం. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక పాత్రికేయాన్ని టార్గెట్‌గా చేసుకొని ప్రబీర్‌పై ఈడీ ఈ విదేశీ ప్రత్యక్షపెట్టుబడులు కేసు అల్లిందని హైకోర్టు విస్పష్టంగా ప్రకటించింది. శూన్యం నుంచి దేనినో వెదకడం, లేనిదానికోసం గాలించడం, ఏదీ దొరక్క అటూ ఇటూ తిరగడం వంటి మాటలతో హైకోర్టు ఈడీని తీవ్రంగా విమర్శించింది. ఏడాదిన్నరపాటు దర్యాప్తుచేసినా కనీసం నేరం జరిగిందని కూడా ప్రాథమికంగా చెప్పలేకపోయారని కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన కేసును మరో కట్టుకథగా కోర్టు కొట్టిపారేసింది.

ఏళ్ళతరబడి కొనసాగిన దర్యాప్తులు, దాడులు, అరెస్టులు, విచారణల అనంతరం వెలువడిన ఈ తీర్పు ప్రబీర్‌ను వేదననుంచి విముక్తి చేయడంతో పాటు, తప్పుడు కేసులు బనాయించే పాలకులూ, వారి అడుగులకు మడుగులొత్తే వ్యవస్థలకు గట్టి చెంపదెబ్బ. తనకు గిట్టని, పాత్రికేయులూ, మీడియా సంస్థలమీద కేంద్రప్రభుత్వం అల్లిన మరో కట్టుకథ కుప్పకూలిందని మీడియా పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. విద్యార్థిదశనుంచి ధిక్కారానికీ, ప్రశ్నకూ ప్రతీకగా నిలిచిన ప్రబీర్‌ ఎమర్జెన్సీ రోజుల్లోనూ పాలకుల ఆగ్రహాన్ని చవిచూశారు, కష్టాలకు ఎదురొడ్డి నిలిచారు. ఉద్యోగాన్ని వదిలి, జర్నలిజాన్ని ఎంచుకొని, ప్రధాన మీడియా సంస్థలన్నీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయలేని తరుణంలో ప్రజా ఉద్యమాలవైపు నిలబడ్డారు. కార్మికులు, రైతులు, నిరుద్యోగులు, సామాన్యుల బాధలను తన పోర్టల్‌ ద్వారా వెలుగులోకి తెచ్చారు. వివిధ రంగాల్లో క్షీణతను తన కథనాల్లో డేటాతో సహా ఎత్తిచూపారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగించిన ఉద్యమాన్ని క్షేత్రస్థాయి కథనాలతో అందించడమే కాక, ఆ చట్టాలు భారత వ్యవసాయరంగానికి ఎంత ప్రమాదకరమైనవో విశ్లేషించారు. తన పోర్టల్‌ ద్వారా అన్ని అంశాల్లోనూ ఆయన సంధించిన ప్రశ్నలు, అందించిన విశ్లేషణలు సోషల్‌ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం కావడం సహజంగానే పాలకులకు నచ్చలేదు. అసలే కక్షకట్టివున్న తరుణంలో, అమెరికా పత్రిక ఒకటి ప్రచురించిన కథనం వారికి ఆయుధంగా అందివచ్చింది. ఆ సంస్థపైనా, అందులో పనిచేసే జర్నలిస్టులే కాదు, ఈ పోర్టల్‌ ద్వారా తమ అభిప్రాయాలను ప్రకటించే చరిత్రకారులు, సామాజిక కార్యకర్తలు, వ్యాఖ్యాతల ఇళ్ళలో కూడా సోదాలు జరిపి ప్రభుత్వం ఒక తీవ్ర హెచ్చరిక పంపింది. నెవిల్లే రాయ్‌ సింఘమ్‌ అనే ఒక అమెరికన్‌ మిలియనీర్‌ చైనా అధికారిక మీడియాతో కలిసి పనిచేస్తూ, ఇతరదేశాల్లో చైనా అనుకూలతను పెంచిపోషించేందుకు సహకరిస్తుంటారని, ఆయన నెట్‌వర్క్‌లో న్యూస్‌క్లిక్‌ ఉన్నదన్న ఆ కథనాన్ని బీజేపీ నాయకులు అందిపుచ్చుకున్నారు. కొందరు బీజేపీ ఎంపీలు లోక్‌సభలో ‘భారత వ్యతిరేక వాతావరణం’ సృష్టించడానికి చైనానుంచి ఈ పోర్టల్‌కు, రాహుల్‌గాంధీకీ డబ్బు ముడుతోందని ఆరోపించారు. ఈ కథనం ఆధారంగానే న్యూస్‌క్లిక్‌ కథంతా ముందుకు కదిలింది.


ప్రబీర్‌పైనా, ఆయన సంస్థల్లో పనిచేసే సీనియర్లపైన ప్రభుత్వం ఊపా ప్రయోగించింది. షాహీన్‌ బాగ్‌ ప్రతిఘటన, కరోనా సంక్షోభం వంటి అనేకానేక అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ఈ పోర్టల్‌ద్వారా పాత్రికేయులు, మేధావులు విమర్శించినమాట నిజం. అదానీ సంస్థ అక్రమలావాదేవీలు, మోదీ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాలమీద పరంజొయ్‌ గుహ ఠాకుర్తా వంటివారు ఘాటైన పరిశోధనాత్మక కథనాలు సైతం రాశారు. ‘ప్రభుత్వానికి, దేశానికి’ ఇలా వ్యతిరేకంగా రాస్తున్నందుకు మీకు ఎక్కువమొత్తం ముడుతోందా? అని ఢిల్లీ పోలీసులు వీరిని ప్రశ్నించారట. దాదాపు 225రోజులు జైల్లో ఉంటూ ప్రబీర్‌ న్యాయపోరాటం చేశారు. రెండేళ్ళక్రితం ప్రబీర్‌ అరెస్టును సుప్రీంకోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది, ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఆ కేసులను పూర్తిగా కొట్టివేసింది. తమను ప్రశ్నించే మీడియా సంస్థల నోరుమూయించడానికి ప్రభుత్వ వ్యవస్థలను వాడుకొంటూ చివరకు న్యాయస్థానాల్లో పాలకులు ఇలా అభాసుపాలు కావలసి వస్తున్నది. ఢిల్లీ హైకోర్టు తీర్పుమీద సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి నిర్ణయించుకున్న ప్రభుత్వం ఆ ఆలోచనను ఉపసంహరించుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి..

అమేథీ పంచాయతీ ఓటర్ల జాబితా నుండి స్మృతి ఇరానీ పేరు గల్లంతు

మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న రైలుపై దాడి.. ఇద్దరి అరెస్టు

Updated Date - Jun 13 , 2026 | 12:43 AM