Share News

నిర్ణయాత్మక విజయాలు

ABN , Publish Date - May 05 , 2026 | 12:47 AM

దేశ భవిష్య రాజకీయాలమీద ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం బలంగా ఉండబోతోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో చతికిలబడిన భారతీయ జనతాపార్టీకి సమధికోత్సాహాన్ని ఇచ్చిన తీర్పు ఇది. బీజేపీ, దాని...

నిర్ణయాత్మక విజయాలు

దేశ భవిష్య రాజకీయాలమీద ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం బలంగా ఉండబోతోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో చతికిలబడిన భారతీయ జనతాపార్టీకి సమధికోత్సాహాన్ని ఇచ్చిన తీర్పు ఇది. బీజేపీ, దాని మిత్రపక్షాల చేతుల్లో దేశంలోని 22 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా ఇంతటి విస్తరణ, ఆధిపత్యం ఆరున్నర దశాబ్దాల తరువాత చూస్తున్నాం. సభలో తగిన సంఖ్యాబలం లేక, రెండు పార్టీలమీద ఆధారపడిన బీజేపీ, తాను దేశవ్యాప్తంగా చేయలేని చట్టాలను, చర్యలను రాష్ట్రాల స్థాయిలో దూకుడుగా అమలు చేయగల ధైర్యాన్ని, నైతిక శక్తినీ ఆ పార్టీకి ఈ ఎన్నికలు ఇచ్చాయి. విపక్షాల కంచుకోటలనీ, కూల్చడం అసాధ్యమనీ అనుకున్నవి కూడా వరుసగా కూలిపోతున్నాయి. గంగోత్రి నుంచి గంగాసాగరం వరకూ విస్తరించిన విజయం ఇది అన్నారు ప్రధాని నరేంద్రమోదీ. జన్‌సంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్‌ ముఖర్జీ జన్మస్థలాన్ని ఏడున్నర దశాబ్దాల తరువాత గెలుచుకున్నందుకు ఆయన సంతోషానికి అవధుల్లేవు.

హిందూత్వంతో ఇంకొంత వేళ్ళూనడానికీ, విస్తరించడానికీ అసోం–బెంగాల్‌ మోడల్‌ ఇకపై బీజేపీకి మరింత ఉపకరిస్తుంది. హేమంత శర్మ విద్వేషపూరిత వ్యాఖ్యలు, బుల్‌డోజర్‌ కూల్చివేతలు అసోంలో ఆశించిన ఫలితాన్నిచ్చాయి. ఇక్కడి నియోజకవర్గాల పునర్విభజన, పొరుగున బెంగాల్‌లో ‘సర్‌’ పేరిట తృణమూల్‌ ఓటు బ్యాంకు అయిన ముస్లిం ఓటర్ల ఏరివేత ఈ విజయాలకు కారణమని విపక్షనేతలు ఆడిపోసుకోవడం సహజం. 90లక్షల మంది ఓటర్లను గాలికొదిలేసి, బెంగాల్‌ను బీజేపీకి అప్పగించి తనను నియమించినవారి రుణం జ్ఞానేశ్‌కుమార్‌ తీర్చుకున్నారట. అసోం, బెంగాల్‌లో బీజేపీ ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు, బంగ్లాదేశ్‌ అక్రమ వలసదారులు ఏరివేత హామీలు బాగా పనిచేశాయి. లక్షలాదిమంది బంగ్లాదేశీ ముస్లింలు స్థానిక హిందువుల కూడు గూడు లాగేసుకుంటున్నారని, ఉద్యోగ ఉపాధులకు గండికొట్టి, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్న ప్రచారం ప్రభావం చూపింది. బంగ్లాదేశ్‌ నుంచి షేక్‌ హసీనా నిష్క్రమణ, మహ్మద్‌ యూనిస్‌ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏలుబడిలో హిందువులపై జరిగిన దాడులు ఈ సరిహద్దు రాష్ట్రాల్లో ముస్లిం వ్యతిరేకతను పెంచడానికి, హిందూ ఓటుబ్యాంకును సృష్టించుకోవడానికీ బీజేపీకి ఉపకరించాయి. బంగ్లాకు ఆనుకొని ఉన్న ఈ రెండు ప్రధాన రాష్ట్రాలు బీజేపీ చేతిలో ఉండటం ఆ దేశంతో భావి సంబంధాలను ప్రభావితం చేయవచ్చు.


మూడున్నర దశాబ్దాల పాటు కమ్యూనిస్టుల ఏలుబడిలో ఉన్న బెంగాల్‌ను ఏ తరహా వీధిపోరాటాలతో మమత లాక్కున్నదో, అంతకుమించిన యుద్ధతీవ్రతతో బీజేపీ ఆమె నుంచి దానిని ఇప్పుడు వశపరచుకుంది. మమతను ముస్లిం అనుకూల వ్యక్తిగా కంటే, హిందూ వ్యతిరేకశక్తిగా చూపడంలో బీజేపీ విజయం సాధించింది. పంచాయతీల్లో సైతం పార్లమెంట్‌ ఎన్నికల స్థాయిలో పోరాటం చేసే బీజేపీ, బెంగాల్‌ వశం కోసం సర్వశక్తులూ ఒడ్డింది, మమతను దించడానికి దారులన్నీ వాడుకుంది. మోదీ, అమిత్‌షాలు పాల్గొన్న 80 సభలు, ర్యాలీలు సువేందు అధికారి పోరాటానికి మరింత శక్తినిచ్చాయి. గ్రామీణ ప్రాంతాలతోపాటు, పట్టణాలనూ, రాష్ట్ర రాజధానిలోని అధిక స్థానాలనూ బీజేపీ వశం చేసుకుంది. కేరళలో మూడుస్థానాలు గెలుచుకోవడం కూడా శుభశకునమే.

తమిళనాడులో అధికారం కొత్తగా పుట్టిన విజయ్‌ పార్టీకి పోయినా, డీఎంకే ఓడిపోవడం బీజేపీకి సంతోషం కలిగించే పరిణామం. విజయ్‌ ప్రభావం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనే కాదు, రాష్ట్ర రాజధానిలోనూ స్పష్టంగా ఉంది. ఐదు దశాబ్దాలుగా రెండు ద్రవిడ పార్టీల మధ్య అధికారాన్ని మారుస్తూ వచ్చిన తమిళులు వాటిని నిర్దయగా వెనక్కు నెట్టి, ద్రవిడోద్యమంతో ఏ బంధంలేని సినీ హీరోను విజేతను చేశారు. ఓ గుప్పెడు స్థానాలు తక్కువపడినప్పటికీ, విజయ్‌ గాలికి స్టాలిన్‌, కొందరు మంత్రులు కొట్టుకుపోవడం, ఏ పార్టీకైనా, కూటమికైనా స్పష్టమైన మెజారిటీ ఇచ్చే తమిళనాడులో తొలిసారిగా త్రిశంకు సభ ఏర్పడటం ఆశ్చర్యకరమైన పరిణామాలు. ఏ రాజకీయ అనుభవం లేకుండా, పార్టీ పెట్టిన స్వల్పకాలంలోనే ఇంతటి విజయాన్ని సాధించడం ఎన్టీఆర్‌ను గుర్తుకు తెస్తుంది. తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో కరడుగట్టిన బీజేపీ వ్యతిరేక పార్టీలు కూలిపోవడం విపక్ష కూటమికి ఎదురుదెబ్బ. కేరళలో మంచి విజయాన్ని సాధించడం కాంగ్రెస్‌కు పెద్ద ఉపశమనం.

ఈ వార్తలు కూడా చదవండి

బెంగాల్‌‌లో చారిత్రక తీర్పు.. విజయోత్సవ సంబరాల్లో మోదీ

ఇది గెలుపు కాదు లూటీ.. మేం పుంజుకుంటాం.. బెంగాల్‌లో షాకింగ్ తీర్పుపై మమతా బెనర్జీ

Updated Date - May 05 , 2026 | 12:47 AM