Share News

సమరారంభం

ABN , Publish Date - Mar 17 , 2026 | 02:29 AM

తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, అసోం, కేరళ, పుదుచ్చేరీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను నిర్ణయించడంలో ఎన్నికల సంఘం బీజేపీ పక్షపాతాన్ని, తమపట్ల వివక్షనూ కనబరిచిందంటున్నారు కాంగ్రెస్‌ పార్టీ...

సమరారంభం

తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, అసోం, కేరళ, పుదుచ్చేరీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను నిర్ణయించడంలో ఎన్నికల సంఘం బీజేపీ పక్షపాతాన్ని, తమపట్ల వివక్షనూ కనబరిచిందంటున్నారు కాంగ్రెస్‌ పార్టీ అధినాయకులు. ఎక్కడ, ఎప్పుడు పోలింగ్‌ జరగాలో నిర్ణయించడం వెనుక, బీజేపీకి మేలు చేసే ఉద్దేశం కనబడుతోందని, ఆ పార్టీ అధినాయకుల సౌకర్యానికి అనుగుణంగా ఇది జరిగిందని ప్రియాంక సహా కాంగ్రెస్‌ నాయకులంతా ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ బలంగా ఉన్న రాష్ట్రాలను తొలిదశకు సిద్ధంచేయడం వెనుక వీరికి దురుద్దేశాలు కనిపిస్తున్నాయి. అసోం, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో ఏప్రిల్‌ 9న మొదటగా ఎన్నికలు జరగబోతున్నాయి. కేరళలో ఏప్రిల్‌ చివరి వారంలో ఎన్నికలు ఉంటాయని జనమంతా అనుకుంటే, క్రైస్తవులకు పవిత్రమైన గుడ్‌ఫ్రైడే వారం చేరువలోకి ఎన్నికలను తేవాల్సిన అవసరం ఏముందని శశిథరూర్‌, వేణుగోపాల్‌ ప్రశ్నిస్తున్నారు. నామినేషన్ల ముగింపు తరువాత, ఒకపక్క క్రైస్తవుల పండుగ ఉండగా, మరోపక్క మలయాళీల విషు వేడుక సమీపిస్తున్న తరుణంలో, ఎన్నికల ప్రచారం ఎంత కష్టం అని వారి వాదన. మొత్తంగా చూస్తే, కేరళలో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎల్డీఎఫ్‌)కూ, అసోంలో బీజేపీకి మేలు చేకూర్చే విధంగా ఈ షెడ్యూల్‌ ఉన్నదని కాంగ్రెస్‌ నేతల అభిప్రాయం కావచ్చు. అధికారపార్టీని ఐదేళ్ళకోమారు మార్చే సంప్రదాయం ఉన్న కేరళలో ఈ మారు తాము అధికారంలోకి రానివ్వకుండా చేయడానికి ఈ తేదీలు అడ్డుపడతాయన్నది వారి బాధ.

ఎన్నికల షెడ్యూల్‌ మీద విపక్షాల విమర్శలు ఎప్పుడూ ఉండేవే. తాము యుద్ధానికి సిద్ధంగా, సర్వసన్నద్ధంగా ఉన్నామని అంటూనే మరోవైపు ఈ తరహా ఆరోపణలు సాగుతూంటాయి. ఆదివారం ఎన్నికల సంఘం ప్రకటించిన తేదీల్లో ఒక్క బెంగాల్‌లోనే రెండు దశల పోలింగ్‌ ఉంది. ఏప్రిల్‌ 23, 29 తేదీల్లో పోలింగ్‌ జరగబోతున్న తరుణంలో, సరిగ్గా ఐదేళ్ళక్రితం జరిగిన ఎన్నికల్లో ఆయా అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీ నెగ్గిందన్నదానిని బట్టి రేపటి ఫలితాలను అంచనాకడుతున్నవారూ ఉన్నారు. ఇప్పుడు తొలిదశ ఎన్నికలు జరగబోతున్న 152స్థానాల్లో ఐదేళ్ళక్రితం టీఎంసీ 92 స్థానాలు, బీజేపీ 59 గెలుచుకున్నాయి. ఇతరులకు ఒక స్థానం దక్కింది. మలిదశ 142అసెంబ్లీ స్థానాల్లో టీఎంసీ 123, బీజేపీ 18 సాధించుకున్నాయి. మిగతా ఒకటీ వేరొకరిది. రేపటి రెండుదశల మధ్య కాస్తంత ఎడం ఉండటంతో, తొలిదశలో తన స్థానాలను పెంచుకోవడానికీ, కంచుకోటలాంటి రెండోదశ ప్రాంతాలను నిలబెట్టుకొనేందుకు తృణమూల్‌కు వీలుందని కొందరి అంచనా. కానీ, రెండుదశల్లోనూ విజృంభించడానికి సమర్థనాయకత్వం, తగినంత మందీమార్బలం బీజేపీకి ఉందన్నది వాస్తవం. తొలిజాబితాలోనే సువేందు అధికారిని మమతకు పోటీగా, గతంలో ఆమె ఓడిన, గెలిచిన రెండు చోట్లా నిలబెట్టి ఆ పార్టీ సమరశంఖం పూరించింది. ఆమె తప్పనిసరిగా తన స్థానానికి కట్టుబడేట్టు చేసి, నేరుగా తృణమూల్‌ అధినేతనే ఢీకొడుతూ రాజ్యాన్ని దక్కించుకోవాలన్నది ఆ పార్టీ వ్యూహం. తృణమూల్‌కు ఈ మారు గట్టిదెబ్బ తప్పదని, బీజేపీకి అధికారం దక్కకపోయినా అడుగుదూరం వరకూ అది విస్తరించడం ఖాయమని ఉత్తరాది మీడియా ఇప్పటికే అంచనాలు కడుతోంది.


రచ్చగెలిచి, ఇంట ఓడిన విజయ్‌ చుట్టూ తమిళ రాజకీయం తిరుగుతోంది. మాతో చేయి కలిపితే 80అసెంబ్లీ స్థానాలు, డీప్యూటీ సీఎం పదవీ ఇస్తామని తమిళగ వేట్రి కళగం (టీవీకె) అధినేతకు బీజేపీ ప్రతిపాదించినట్టుగా ప్రచారం సాగుతోంది. మా హీరో ఎన్నటికీ ఎవరికీ డిప్యూటీగా ఉండరు అంటూ టీవీకే తిప్పికొడుతోంది. అన్నాడీఎంకె అధినేత ఎళప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) కూడా విజయ్‌ రాకడ జరగని పని అంటూ అదేపనిగా ఖండిస్తున్నారు. ఆర్థికకష్టాల్లో ఉన్న విజయ్‌ను నయానోభయానో దారికితెచ్చే ప్రయత్నాలు బలంగా, జోరుగా సాగుతున్నాయన్న వార్తలను అటుంచితే, ఈ హీరో ప్రవేశం పళనిని కచ్చితంగా ఇబ్బందిపెట్టేదే. నేడు తాను వందసీట్లకు కాస్త అటూఇటూ సరిపెట్టుకొని, నెగ్గినపక్షంలో రేపు డిప్యూటీగా భరించాల్సివస్తుంది. విజయ్‌ చేరికతో కూటమికి తిరుగులేని పేరూ జోరూ వస్తుందని, తమిళనాట తనకు ఎదురులేని ఊనిక దక్కుతుందని బీజేపీ భావించడం సహజం. అన్నీ ఎన్నికల ముందే, తెరతీయగానే జరిగిపోవాలన్న నియమం ఏమీ లేదు కానీ, రేపటిరోజుల్లో తమిళరాజకీయం బెంగాల్‌ కంటే వేడిగా ఉండబోతోదన్నది నిజం.

ఇవి కూడా చదవండి..

ఆటో డ్రైవర్ అని తేలిగ్గా చూడకండి.. ఇతడు ఒక్క రోజులో ఎంత సంపాదిస్తాడో తెలిస్తే..

మీవి డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో జింక ఎక్కడ దాక్కుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 17 , 2026 | 02:29 AM