Share News

ప్రజా సంస్కృతికి స్ఫూర్తిగా సమ్మక్క సారలమ్మ స్మృతి

ABN , Publish Date - Jan 31 , 2026 | 03:31 AM

ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతి నిర్మాణంలో నేలవిడిచి సాము చేస్తున్నామన్న విమర్శలకు ప్రతిస్పందనగా, సమ్మక్క–సారలమ్మల అస్తిత్వ పోరాట స్మృతి....

ప్రజా సంస్కృతికి స్ఫూర్తిగా సమ్మక్క సారలమ్మ స్మృతి

ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతి నిర్మాణంలో నేలవిడిచి సాము చేస్తున్నామన్న విమర్శలకు ప్రతిస్పందనగా, సమ్మక్క–సారలమ్మల అస్తిత్వ పోరాట స్మృతి నుంచి ప్రజా సాంస్కృతిక ఉద్యమ నిర్మాణానికి దారులు వేసుకోవచ్చనే ప్రతిపాదన ఆలోచనాపరులైన ఉస్మానియా విద్యార్థుల నుంచి మొదలయ్యింది. సమ్మక్క సారలమ్మల వనజాతర జనజాతరగా విస్తరిస్తున్న క్రమాన్ని ఒడిసిపట్టుకుని మేడారం పోదామన్న వారి పాటల సీడీ ఆవిష్కర ణకు నేను ఓయూకు వెళ్లలేకపోయాను. అయితే ఉస్మానియా ప్రతినిధిగా నలిగింటి శరత్ అరుణోదయ కార్యాలయానికి వచ్చి తమ ఆర్తిని ప్రకటించిన తర్వాతనే నేనీ ప్రతిపాదనతో ప్రజల ముందుకు వస్తున్నాను. గతం నుంచి గుణపాఠాలు తీసుకుని, వర్తమానాన్ని పాఠంగా నేర్చుకుంటూ భావి సాంస్కృతికోద్యమానికి బాటలు వేసుకోవడానికి ఇదొక మంచి సందర్భం.

మాతృస్వామ్యానికి ఆనవాళ్లుగా ఉన్న తెలంగాణ గ్రామ లోగిళ్ళను కమ్మేస్తున్న పితృస్వామ్య సంస్కృతిలో ఏడుగురు అక్క చెల్లెళ్లయిన గ్రామ దేవతలు కనుమరుగవుతున్న క్రమానికి భిన్నంగా మేడారంలో అమ్మల కొలుపు పెరుగుతూ వస్తోంది. ఆ జనజాతర విస్తరిస్తుండగా మేడారంలో సమ్మక్క– సారలమ్మల విగ్రహాలు చేయించి, అక్కడో గుడి నిర్మాణం చేపట్టి, శాశ్వత పూజారులను నియమించి నిత్య పూజలతో ఆదివాసుల సంప్రదాయాలను కనుమరుగు చేయాలన్న కుట్రలు జరిగాయి. ఆ సమయంలో జనశక్తి నాయకుడు శంకరన్న (కృష్ణారెడ్డి) నాయకత్వంలో సాంస్కృతిక రంగంలో జరిపిన వర్గ పోరాటానికి ముందు వరుసలో ఉన్నవాళ్లలో సీతక్క కూడా ఒకరు. యాదృచ్ఛికంగా ఇప్పుడు ఆమె మంత్రిగా ఉంటూ సమ్మక్క– సారలమ్మల గద్దెలను బ్రాహ్మణీకరించకుండా ఆధునికీకరించడంలో కూడా ముందున్నారు. అక్కడే జన సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘సమ్మక్క–సారక్కల ధీరత్వమే దైవత్వంగా కొలువబడుతున్నదని’ అభివర్ణించారు. 1946లో వరంగల్ సుబేదార్‌గా ఉన్న అమీర్ అలీఖాన్ పర్యవేక్షణలో కూడా ఆదివాసీ సంప్రదాయాలకు ఘనమైన గౌరవం దక్కిందని ప్రతీతి. 1996లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. మేడారం జాతరపై కొన్ని అకడమిక్ పరిశోధనలు జరిగాయి. ఇటీవల పలు వ్యాసాలు వెలువడ్డాయి. తెలంగాణ ఉద్యమం నుంచి పాటల పరంపర మొదలయింది. ‘సమ్మక్క–సారక్కల సాంస్కృతిక పోరాట వారసత్వాన్ని కొనసాగిద్దాం. అడవులను, ఆదివాసులను, మాతృస్వామిక ప్రేమలను కాపాడుకుందా’మన్న పిలుపుతో ఓయూ విద్యార్థులు ఈ ఏడాది నూతన కార్యక్రమానికి నాంది పలికారు.


వైవిధ్యభరితమైన తెలంగాణ చరిత్రలో, పితృస్వామిక సంకెళ్లను తెంచుకుని రాణి రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యానికి పట్టపురాణి అయింది. సమ్మక్క–సారలమ్మల పోరాటాన్ని నెత్తుటేరుల్లో ముంచిన ఆమె మనుమడు ప్రతాపరుద్రుణ్ణి ఢిల్లీ పాదుషాలు బందీగా తీసుకుపోతున్నప్పుడు ఆయన నర్మదా నదిలో దూకి ఆత్మార్పణ చేసుకున్నాడు. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి నాంది పలికిందని ప్రొఫెసర్‌ కేశవరావు జాదవ్‌ అన్నారు. అయితే రాజ్యం కోసం ఆత్మార్పణ చేసుకున్న రాజు చరిత్ర శిలా శాసనాల్లో ఉంటే ఆదివాసుల కోసం పోరాడిన సమ్మక్క–సారక్క, పగిడిద్దరాజుల సాహసం ప్రజల విశ్వాసాల్లో నిలిచి ఉంది. జంపన్న ఆత్మార్పణ సంపెంగ వాగును జంపన్న వాగుగా మార్చింది. యుద్ధంలో గాయపడి శత్రువు చేతికి చిక్కని సమ్మక్క నెత్తుటి బొట్లను కుంకుమ వర్ణంలో ప్రజలు నేటికీ ఆరాధిస్తున్నారు. ఇది ధీరత్వమా? దైవత్వమా? ఆదివాసి కోణం నుంచి నిర్వచించుకుని ప్రగతిశీల శిబిరం కదిలి రావాలి.

ఈ సందర్భంగా ఎక్కడో న్యూజిలాండ్‌లో సరిగ్గా 13వ శతాబ్దిలో స్థిరపడ్డ మావోరి తెగ ప్రజలు మేడారం జాతరకు కదిలి వచ్చారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆహ్వానంతో సి.డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మావోరి తెగవారి సంప్రదాయ హాకా నృత్యం రవీంద్రభారతిలో జనవరి 28న ప్రదర్శితమైంది. 162 ఏళ్ల న్యూజిలాండ్ పార్లమెంటు (పారమెట అవోటియారోవా) చరిత్రలో మావోరి తెగ ప్రజల హక్కులను హరించే బిల్లును వ్యతిరేకిస్తూ 2025 అక్టోబర్ 14న 22 ఏళ్ల పార్లమెంటు సభ్యురాలు హాన రెపెట్టి బిల్లు కాగితాలను చింపివేస్తూ మొదలుపెట్టిన హాకా నృత్యం నా కళ్ళ ముందు కదలాడింది.

కానీ భారత్‌లో దిలీప్ సింగ్ బూరియా కమిషన్ సిఫార్సులనే ఏమార్చిన ఏలికలతో మన ఆదివాసీ గిరిజన పార్లమెంటు సభ్యులు అట్లా తలపడగలరా? కానీ ప్రగతిశీల శిబిరంలోని మేం ఏనాడూ ప్రజా వేదికలపై సమ్మక్క–సారక్కల సాహసాన్ని ప్రదర్శించలేకపోయాం. న్యూజిలాండ్ మావోరి బృందంలోని హాకా నృత్యం కొత్త ఆలోచనకు బీజం వేసింది.

ప్రొ. కొల్లాపురం విమల చెబుతున్నట్లు నాగరికత నదుల అంచున కాదు, అడవిలోనే పుట్టిందన్న విషయం స్ఫురణకు వచ్చింది. ఆదివాసుల గోండ్వానా ఉనికి నేటిది కాదని ఈ ఆదివాసుల నేలపైన భారతదేశ పనిముట్లు, మడగాస్కర్ పనిముట్లకు ఉన్న పోలికలు చిత్రాల (illustration) ద్వారా ఆమె వివరించింది. చరిత్ర పరిశోధనకు ఉపయోగపడే ఎన్నో ఆదివాసీ భాషలు (రాజ్యాంగం గుర్తించినవి సైతం) అంతర్ధానమవుతున్న స్థితిలో మనం కోల్పోతున్న చరిత్ర, భాష– సంస్కృతులన్నీ ఒక్క మేడారం జాతరలోనే కాదు దేశమంతా జరుగుతున్న ఆదివాసుల మేళాల నుంచి మనం గ్రహించాల్సిందే. సమ్మక్క–సారక్కల తిరుగుబాటు నుంచి సాంస్కృతిక అస్తిత్వ ప్రకటనను ఎగరేయాల్సిన రోజే మన దిద్దుబాటుకు నాంది పలకాలి. ఈ ఆత్మీయ అనుబంధంతో సమ్మక్క–సారక్కల గద్దెల్ని సందర్శించి ప్రజా సాంస్కృతిక పతాకాన్ని ఎగిరేద్దాం.

అరుణోదయ విమలక్క

Updated Date - Jan 31 , 2026 | 03:31 AM