Share News

బంజారాల మార్గదర్శకుడు

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:59 AM

లంబాడీల్లో జ్ఞానజ్యోతిని వెలిగించిన గొప్ప ఆధ్యాత్మిక గురువు, ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్. ప్రజల మేలు కోసం ఆయన అనేక ఉద్యమాలు చేశారు. వీటిలో ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడులను అరికట్టడం...

బంజారాల మార్గదర్శకుడు

లంబాడీల్లో జ్ఞానజ్యోతిని వెలిగించిన గొప్ప ఆధ్యాత్మిక గురువు, ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్. ప్రజల మేలు కోసం ఆయన అనేక ఉద్యమాలు చేశారు. వీటిలో ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడులను అరికట్టడం, క్షేత్రధర్మాన్ని రక్షించడం వంటివి ప్రధానమైనవి. బంజారాల సంస్కృతికి ఆధ్యాత్మికతను జోడిస్తూ, దేశమంతా సంచరిస్తూ, హితబోధ చేశారు. దేశమంతా ఛిన్నాభిన్నంగా ఉన్న బంజారా సమాజాన్ని సేవాలాల్ ఏకం చేశారు. ఊరికి దూరంగా అడవిలో స్థిరమైన తండా వ్యవస్థను పటిష్ఠంగా నిర్మాణం చేశారు. మూఢనమ్మకాలు, హింస, మద్యపానం మొదలైన వ్యసనాలకు బానిస కాకుండా స్వచ్ఛమైన జీవనం కొనసాగించాలని ఆయన బంజారాలకు హితోపదేశం చేశారు. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారు.

1739 ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని రాంజీనాయక్‌ తండాలో జన్మించారు సేవాలాల్. తండ్రి భీమానాయక్‌, తల్లి ధర్మిణిబాయి. సేవాలాల్‌ పశువులను మేపడానికి వెళ్లేవారు. తల్లి తనకిచ్చిన చద్దిని ఆకలితో ఉన్నవారికి పెట్టి, అడవిలో దొరికే బంకమట్టితో రొట్టెలు చేసి తినేవారాయన. ఈ విచిత్ర ప్రవర్తన తల్లితండ్రులకు, తండాలోని ప్రజలకు ఆశ్చర్యం కలిగించేది. ఆకలితో ఉన్నవాడికి అన్నం, దాహంతో ఉన్నవాడికి మంచి నీళ్ళు ఇవ్వాలని, దారి తప్పిపోయి ఆగమవుతున్న వారికి మంచి మార్గం చూపించాలని, సహాయం కోరిన వారికి అండగా ఉండాలని, ఏడుస్తూ కూర్చుంటే ఉన్నతులు కాలేరని... ఎన్నో జీవిత సత్యాలను తెలియజేశారు.

క్షణంలోనే మన మాటలు ఏ ఖండాంతరాలకైనా చేరిపోతాయని, నీళ్ళను సైతం డబ్బుతో కొనాల్సిన రోజు వస్తుందని, ఎడ్లు లేకుండానే బండ్లు నడుస్తాయని... నేడు మన అనుభవంలో ఉన్న సెల్‌ఫోన్, నీళ్లు, వాహనాలను గురించి ఆనాడే సేవాలాల్‌ చెప్పారు. ఈయన మహిమలపై అనేక కథనాలున్నాయి. బంజారాల ఆరాధ్యదైవమైన సేవాలాల్ మహరాజ్ జీవితం యావత్ సమాజానికి ఆదర్శప్రాయం. గోర్బోలి భాషను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్‌లో చేర్చాలి, సేవాలాల్ విగ్రహాన్ని పార్లమెంట్‌లో ప్రతిష్ఠించాలి, ఈయన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి. సేవాలాల్‌ జయంతి రోజైన ఫిబ్రవరి 15ను సెలవు దినంగా ప్రకటించి, జయంత్యుత్సవాలు నిర్వహించాలని బంజారాలు కోరుతున్నారు.

– డా. భూక్యా రాజారాం నాయక్

Updated Date - Feb 14 , 2026 | 12:59 AM