ఐఆర్‌డీఎస్ ఒక జాతీయ అవసరం!
ABN , Publish Date - Feb 21 , 2026 | 01:03 AM
భారతదేశ అభివృద్ధి ప్రణాళికలు ఎంత విశాలంగా, సమగ్రంగా రూపొందించినా అవి క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. కేంద్రం, రాష్ట్రాలు వేల కోట్ల రూపాయలతో అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి పథకాలు...
భారతదేశ అభివృద్ధి ప్రణాళికలు ఎంత విశాలంగా, సమగ్రంగా రూపొందించినా అవి క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. కేంద్రం, రాష్ట్రాలు వేల కోట్ల రూపాయలతో అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి పథకాలు కాగితాలపై అద్భుతంగా కనిపిస్తున్నా గ్రామాల్లో వాస్తవ పరిస్థితుల్లో ఆశించిన మార్పును తీసుకురాలేక పోతున్నాయి. ప్రభుత్వ పథకాలు గ్రామాలకు చేరుతున్నాయి గానీ, వాటి అమలు, పర్యవేక్షణ, మూల్యాంకనం, ప్రజలకు కలిగే ప్రత్యక్ష ప్రయోజనం విషయంలో అనేక లోపాలు కనిపిస్తున్నాయి. దీనికి మూలకారణం గ్రామీణాభివృద్ధికి అంకితమైన ప్రత్యేక పరిపాలనా సేవ లేకపోవడమే.
దేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు ప్రధానంగా ఐఏఎస్ అధికారులకు లేదా ఇతర కేంద్ర, రాష్ట్ర సేవల అధికారులకు అదనపు బాధ్యతలుగా అప్పగిస్తున్నారు. ఒక అధికారికి రెవెన్యూ, అభివృద్ధి, ఎన్నికలు, శాంతిభద్రతలు వంటి అనేక బాధ్యతలుండగా, గ్రామీణాభివృద్ధి మరో అదనపు అంశంగా మారుతోంది. ఫలితంగా ఇది తాత్కాలిక పరిపాలనా బాధ్యతగా మిగులుతోంది. గ్రామీణాభివృద్ధి అనేది అత్యంత సున్నిత, విస్తృతమైన ప్రజల జీవితాలతో నేరుగా ముడిపడిన రంగం. దీనికి ప్రత్యేక శిక్షణ, దీర్ఘకాలిక దృష్టి, క్షేత్రస్థాయి అనుభవం, స్థానిక అవసరాలపై లోతైన అవగాహన కలిగిన అధికారుల సేవలు అత్యవసరం.
1993లో అమలులోకి వచ్చిన 73వ రాజ్యాంగ సవరణ భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక మైలురాయి. దీంతో పంచాయతీరాజ్ సంస్థలను స్థానిక స్వయంపాలనా సంస్థలుగా గుర్తించి, గ్రామీణ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ హోదా కల్పించారు. ఈ సవరణలో భాగంగా 11వ షెడ్యూల్‌లో పేర్కొన్న 29 అంశాలు గ్రామ పంచాయతీలకు బదలాయించి విధులు, నిధులు, సిబ్బంది వికేంద్రీకరణను అమలు చేయాల్సి ఉంది. అయితే ఈ సవరణ అమలై మూడు దశాబ్దాలు గడిచినా అనుకున్న లక్ష్యం సిద్ధించలేదు. చాలా రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ సంస్థలు పేరుకే స్వయంపాలనా సంస్థలుగా మిగిలిపోయాయి. విధులు అప్పగించకపోవడం, నిధులపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ కొనసాగడం, సిబ్బంది ఇతర శాఖలకు లోబడి ఉండడం వంటి కారణాల వల్ల పంచాయతీలు స్వతంత్రంగా పనిచేయలేకపోతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ గ్రామీణ అభివృద్ధి సర్వీస్ (ఐఆర్‌డీఎస్) ఏర్పాటు చేయడం ద్వారా 73వ రాజ్యాంగ సవరణ లక్ష్యాన్ని సాధించవచ్చు. ఈ అధికారులు ప్రత్యేకంగా గ్రామీణాభివృద్ధి కోసం శిక్షణ పొందినవారుగా, పంచాయతీ, మండల, జిల్లా స్థాయిల్లో పనిచేస్తూ విధులు, నిధులు, సిబ్బంది వికేంద్రీకరణను సమర్థవంతంగా అమలు చేయగలరు. స్థానిక ప్రజల అవసరాలు, సమస్యలు, వనరులు గుర్తించి, వాటికి అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడం ఐఆర్‌డీఎస్ ద్వారా సాధ్యమవుతుంది.
గ్రామీణాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, ఉపాధి, కార్యక్రమాల సమన్వయం, మౌలిక వసతుల అభివృద్ధి, నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలు, పర్యవేక్షణ, మూల్యాంకనం వంటి వాటిని ఐఆర్‌డీఎస్ ద్వారా బాధ్యతాయుతంగా అమలుచేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం విభిన్న శాఖల మధ్య చీలిపోయిన బాధ్యతలు ఐఆర్‌డీఎస్ ద్వారా ఒకే వ్యవస్థలోకి రావడంతో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు స్పష్టత లభిస్తుంది. వికసిత భారత్ వంటి జాతీయ లక్ష్యాలు, వీబీజీరామ్‌జీ వంటి గ్రామీణ ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాలు విజయవంతం కావాలన్నా కూడా ఈ ఐఆర్‌డీఎస్ వ్యవస్థ అవసరం.
గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న నిరుద్యోగం, నగరాల వైపు యువత వలసలు, వ్యవసాయంపై ఆధారపడే కుటుంబాల ఆదాయ అస్థిరత, పథకాల అమలులో లోపాలు– ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. గ్రామీణాభివృద్ధికి ప్రత్యేక పరిపాలనా సేవ లేకుండా దేశాభివృద్ధి సాధ్యం కాదు. పంచాయతీరాజ్ వ్యవస్థ ఆర్థికంగా, పాలనాపరంగా బలపడాలంటే ఐఆర్‌డీఎస్ అత్యవసరం. అందువల్ల కేంద్ర ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసి 73వ రాజ్యాంగ సవరణలో ఊహించిన విధంగా పంచాయతీరాజ్‌కు ప్రాణం పోయాల్సి ఉంటుంది.
-టీఎంబీ బుచ్చిరాజు
అధ్యక్షులు, ఏపీ పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధి ఇంజనీరింగ్ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం