గ్రహాలు రాంగ్ రూట్లో వెళ్తే?
ABN , Publish Date - May 05 , 2026 | 01:43 AM
మన జీవితంలో వేగం పెరిగింది, ప్రయాణాలు పెరిగాయి, కానీ సహనం తగ్గింది. అందుకే రోడ్లపై ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనల్ని ఆపి ఆలోచింపచేయాల్సిన ఆలోచన ఒకటి ఉంది. ఈ విశ్వాన్ని...
మన జీవితంలో వేగం పెరిగింది, ప్రయాణాలు పెరిగాయి, కానీ సహనం తగ్గింది. అందుకే రోడ్లపై ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనల్ని ఆపి ఆలోచింపచేయాల్సిన ఆలోచన ఒకటి ఉంది. ఈ విశ్వాన్ని నడిపిస్తున్న సౌర వ్యవస్థలో ఎన్నో యుగాలుగా గ్రహాలు వాటి కక్ష్య దాటి ఢీకొన్న ఘటనలు జరగలేదు. ఎందుకంటే– ప్రతి గ్రహం నిర్దేశిత కక్ష్యలోనే ప్రయాణిస్తుంది. సూర్యుడి చుట్టూ తిరిగే ఏ గ్రహమూ తన కక్ష్యను ఎప్పుడూ దాటదు. ఈ క్రమశిక్షణ వల్లే సౌర వ్యవస్థ 4.5 బిలియన్ సంవత్సరాలుగా స్థిరంగా ఉంది.
రోడ్‌పై ప్రయాణించేటప్పుడు మన లేన్ డిసిప్లిన్‌లో లోపాలపై గ్రహాలు చెప్పే పాఠాలు కొన్ని మనం గమనించాలి. సౌర వ్యవస్థలో మెర్క్యూరి గ్రహం సూర్యుడి చుట్టూ గంటకు 1,72,440 కి.మీ వేగంతో తిరుగుతుంటే, మన భూ గ్రహం గంటకు 1,07,280 కి.మీ వేగంతోను, నెప్ట్యూన్ గంటకు 19,440 కి.మీ వేగంతోను తిరుగుతున్నాయి. అయినా ఈ గ్రహాలు ఎప్పుడూ తమ కక్ష్యను విడిచి వెళ్ళలేదు. ఒక్క గ్రహం కక్ష్య దాటినా అది మహా విపత్తుకు దారితీస్తుంది. లక్షల కిలోమీటర్ల వేగంతో తిరిగే గ్రహాలు కక్ష్య దాటకుండా పరిభ్రమిస్తుంటే, గంటకు 60–80 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే మన వాహనాలు మాత్రం నిర్దేశించిన మార్గాన్ని అతిక్రమించి, లేన్లు దాటి ప్రమాదాలకు గురై ప్రాణనష్టానికి కారణమవుతున్నాయి.
పరిశోధనల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 18 నుంచి 28శాతం వరకు ప్రమాదాలు లేన్ క్రమశిక్షణ లేకపోవడం వల్లే జరుగుతున్నాయి. 2023 సంవత్సరానికి రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జాతీయ డేటా ప్రకారం, భారతదేశంలో మొత్తం రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణాలు: లేన్ క్రమశిక్షణ లేకపోవడం, రాంగ్ రూట్ డ్రైవింగ్... ఇవే! ఈ కారణాల వల్ల 9,432 మంది మరణించారని తెలుస్తోంది. రోడ్డుపై క్రమశిక్షణ లేకపోవడం, అతివేగం లేదా మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాంతకమని ఇది స్పష్టంగా గుర్తుచేస్తోంది. మన దేశంలో వాహనదారులు లేన్ మార్చేటప్పుడు సిగ్నల్ ఇవ్వకపోవడం, రాంగ్‌సైడ్ వెళ్ళడం, ఓవర్ టేక్ చేయడానికి తొందరపడటం... ఇవన్నీ రోడ్డు ప్రమాదాలకు కారణాలు. చాలామంది డ్రైవర్లు లేన్ నియమాలను సరిగ్గా పాటించకపోవడం వల్ల ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్ సమీపంలో జరిగిన ట్రక్కు ప్రమాదం మనకు గట్టి హెచ్చరిక. ఒక చిన్న లేన్ ఉల్లంఘన వల్ల 19 మంది ప్రాణాలు పోయాయి. ట్రక్కు డ్రైవర్ రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న లేన్‌లోకి వెళ్ళాడు.
ఆ క్షణిక నిర్ణయం ప్రాణాంతకమైంది. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా ఎన్నో జరుగుతున్నాయి. చాలామంది ట్రాఫిక్ సిగ్నల్ కోసం వేచి ఉండలేక వెంటనే ముందుకు వెళ్ళాలని తొందరపడటం, అవగాహన లోపంతో లేన్ మార్కింగ్‌లను పట్టించుకోకపోవడం, సిగ్నల్ ఇవ్వకుండా లేన్ మార్చడం, రాంగ్ సైడ్ వెళ్ళడం ద్వారా సమయం ఆదా చేయాలని భావించడంతోపాటు ట్రాఫిక్ నియమాలు కఠినంగా అమలు కాకపోవటం వంటి కారణాలు రోడ్లను ప్రమాద నిలయాలుగా మారుస్తున్నాయి.
కేవలం ట్రాఫిక్ పోలీసులే కాదు, ప్రతి డ్రైవర్ నియమానుసారమైన డ్రైవింగ్‌ను బాధ్యతగా తీసుకోవాలి. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరికీ పాఠశాల స్థాయి నుంచి అవగాహన కల్పించాలి. సౌర వ్యవస్థ వంటి సృజనాత్మక ఉదాహరణలు ఉపయోగిస్తూ, అవగాహన కల్పిస్తే మరింత గుర్తుండిపోతుంది. లేన్ ఉల్లంఘనలకు భారీ జరిమానాలు విధించాలి. ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన కెమెరాలు, ఏఐ టెక్నాలజీ ద్వారా పర్యవేక్షణ పెంచాలి. కొత్త వాహనాల్లో లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్ వంటి సాంకేతికతలు ప్రమాదాలను తగ్గించేందుకు దోహదపడతాయి.
రోడ్డు అనేది అందరి సొంతం. మనం డ్రైవ్ చేసేటప్పుడు మన లేన్‌లో ఉండటం వల్ల మనవే గాక ఇతరుల ప్రాణాలనూ కాపాడినవాళ్ళమవుతాం. ఒక డ్రైవర్ క్రమశిక్షణ పాటిస్తే అది మరొకరికి స్ఫూర్తి అవుతుంది. సౌర వ్యవస్థలో గ్రహాలు ఎప్పుడూ పోటీపడవు. మనం మాత్రం రోడ్లపై పోటీపడుతున్నాం. ఇదే ప్రమాదాలకు కారణం. మన ప్రయాణం సురక్షితంగా ఉండాలి. మన కుటుంబాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. కాబట్టి లేన్ మారేటప్పుడు సిగ్నల్ ఇవ్వాలి, రాంగ్ సైడ్ వెళ్ళకూడదు, వేగాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి, ఇతర డ్రైవర్లను గౌరవించాలి. ఇవి చిన్న విషయాల్లా అనిపించినా, నిజానికి ప్రాణాలను కాపాడే అతిపెద్ద నిర్ణయాలు.
సౌరవ్యవస్థ మనకు గొప్ప పాఠం చెబుతోంది. గ్రహాలు తమ కక్ష్యల్లో ఉండటం వల్లే విశ్వం సురక్షితంగా ఉంది. మనం కూడా అదే మార్గాన్ని అనుసరిస్తే మన రోడ్లు కూడా సురక్షితంగా ఉంటాయి. మనం లేన్‌లో ప్రయాణించడం అనేది ఒక నిర్ణయం కాదు.. అది జీవితం పట్ల గౌరవం, రోడ్లపై క్రమశిక్షణ. అంటే.. జీవితానికి రక్షణ!
డాక్టర్ ఎ.వి.గురవారెడ్డి
చైర్మన్, సర్వేజనా ఫౌండేషన్
ఈ వార్తలు కూడా చదవండి
బెంగాల్‌లో చారిత్రక తీర్పు.. విజయోత్సవ సంబరాల్లో మోదీ
ఇది గెలుపు కాదు లూటీ.. మేం పుంజుకుంటాం.. బెంగాల్‌లో షాకింగ్ తీర్పుపై మమతా బెనర్జీ