విద్యాలయాలా... మృత్యునిలయాలా?
ABN , Publish Date - May 05 , 2026 | 01:40 AM
హర్యానాలోని కురుక్షేత్ర జాతీయ సాంకేతిక విద్యాసంస్థలో కేవలం రెండు నెలల్లోనే తెలంగాణకు చెందిన అమ్గోత్ శివ, హర్యానాకు చెందిన పవన్ కుమార్, ప్రియాంశు, బిహార్‌కు చెందిన దీక్షా దూబే ప్రాణాలు...
హర్యానాలోని కురుక్షేత్ర జాతీయ సాంకేతిక విద్యాసంస్థలో కేవలం రెండు నెలల్లోనే తెలంగాణకు చెందిన అమ్గోత్ శివ, హర్యానాకు చెందిన పవన్ కుమార్, ప్రియాంశు, బిహార్‌కు చెందిన దీక్షా దూబే ప్రాణాలు కోల్పోయారు. ముంబై భారతీయ సాంకేతిక విద్యాసంస్థలో నమన్ అగర్వాల్ మరణించాడు. కాన్పూర్‌లో ఒకే ఏడాదిలో మూడు ఆత్మహత్యలు నమోదయ్యాయి. గోవా బిట్స్ పిలానీ క్యాంపస్‌లో పదిహేను నెలల్లో ఆరు మరణాలు నమోదయ్యాయి. కేరళలో ధనుష్ డి, కన్నూర్‌లో దళిత విద్యార్థి నితిన్ రాజ్, వరంగల్‌లో హృతిక్ సాయి వంటి ఘటనలు బయటకు వచ్చాయి. వార్తల్లోకి రాని ఎన్నో మరణాలు ఇంకా చీకట్లోనే ఉన్నాయి.
రోహిత్ వేముల నుంచి నితిన్ రాజ్ వరకు.. కులం ఇంకా క్యాంపస్ గోడల మధ్య వెంటాడుతూనే ఉంది. ప్రాజెక్టుల కేటాయింపులో, ఇంటర్న్‌షిప్ అవకాశాల్లో, మార్కుల మూల్యాంకనంలో, పరిశోధన అవకాశాల్లో విద్యార్థిని వివక్ష మానసికంగా కుంగదీస్తోంది. ‘మెరిట్’ అనే ముసుగులో కులం ఇంకా బతికే ఉంది. రెండువేల పద్నాలుగు నుంచి రెండువేల ఇరవై ఒకటి మధ్య భారతీయ సాంకేతిక విద్యాసంస్థలు, భారతీయ నిర్వహణ విద్యాసంస్థలు, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ఆత్మహత్య చేసుకున్న 122 మందిలో ఇరవై నలుగురు ఎస్సీలు, ముగ్గురు ఎస్టీలు, 41 మంది వెనుకబడిన బీసీ వర్గాలకు చెందినవారు. ఇది వివక్ష, ఒత్తిడి, సామాజిక అవమానాల కలయిక.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే– ఈ వరుస మరణాలపై పౌర సమాజం మౌనం పాటించడం. విద్యార్థి సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, ఉపాధ్యాయ సంఘాలు, మానవ హక్కుల సంస్థలు దేశవ్యాప్తంగా ఒక్కటై గళమెత్తాల్సిన సమయంలో నిశ్శబ్దంగా ఉండటం మరింత ప్రమాదకరం. ఒకప్పుడు ఒక్క రోహిత్ వేముల మరణం దేశవ్యాప్తంగా ఉద్యమాలను రగిలించింది. అంతకంటే ముందే డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో అవినీతికి, క్యాపిటేషన్ ఫీజుల పెంపుదలకు వ్యతిరేకంగా, మండల్ రిజర్వేషన్లకు మద్దతుగా, విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బలమైన విద్యార్థి ఉద్యమాలు వచ్చాయి. విద్యార్థి సమస్యలపై క్యాంపస్‌లు మంటలెక్కాయి. కానీ, నేడు అలాంటి ఉద్యమాలు కనిపించడం లేదెందుకు? విద్యార్థి సంఘాలు విద్యారంగ సమస్యలపై స్వతంత్ర పోరాటాలు చేయడం మానేశాయి. అవి రాజకీయ అనుబంధాల నీడలో చిక్కుకుపోయాయి. ఏ పార్టీకి అనుబంధమో ఆ పార్టీ దిశానిర్దేశంలోనే కదులుతున్నాయి. ఆ రాజకీయ పార్టీలకు ప్రజా సమస్యల కంటే అధికార రాజకీయాలే ముఖ్యం. రేపు పొత్తులు పెట్టుకోవాల్సి వస్తుందనే లెక్కలతో అధికార పార్టీలకు వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమాలకు పిలుపునివ్వడం లేదు. ఫలితంగా విద్యార్థి ప్రాణాలు పోతున్నా, క్యాంపస్‌లు మౌనంగా మారుతున్నాయి.
ప్రతి మరణం తర్వాత కేంద్ర బృందాలు వస్తాయి. నివేదికలు అడుగుతాయి. కమిటీలు వేస్తాయి. కానీ అవి తాత్కాలిక స్పందనలు మాత్రమే. శాశ్వత పరిష్కారం కోసం నిర్మాణాత్మక సంస్కరణలు రావాలి. రోహిత్ వేముల చట్టం న్యాయమైన డిమాండే కానీ, చట్టం ఒక్కటే ప్రాణాలను కాపాడదు. పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోతే చట్టాలు కాగితాలకే పరిమితమవుతాయి. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, యాంటీ ర్యాగింగ్ నిబంధనలు, యూజీసీ మార్గదర్శకాలు ఉన్నా, అమలు సరిగా జరగడం లేదు. కొత్త చట్టం కంటే, ఉన్న చట్టాలను అమలు చేసే సంకల్పమే ఇప్పుడు ముఖ్యం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే ధైర్యం, ఉద్యమాల ఒత్తిడి, సమాజం పర్యవేక్షణ, ఇవి లేకపోతే ఇంకో చట్టం కూడా మరో రోహిత్‌ను కాపాడలేని నిర్జీవ అక్షరాలుగానే మిగిలిపోతుంది. క్యాంపస్‌లలో కుల, లింగ, ప్రాంతీయ వివక్షను నేరంగా గుర్తించి, కఠిన చర్యలు తీసుకునే చట్టపరమైన రక్షణలు తప్పనిసరి. థోరట్ కమిటీ సిఫార్సులు పూర్తిగా అమలు చేయాలి. ప్రతి విద్యాసంస్థలో ప్రత్యేక మానసిక ఆరోగ్య బడ్జెట్ ఉండాలి. కౌన్సెలింగ్ కేంద్రాలు నిజంగా పనిచేయాలి. విద్యార్థి హాజరు తగ్గినా, గ్రేడ్‌లు పడిపోయినా వెంటనే స్పందించే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఉండాలి. మెంటార్ వ్యవస్థ కాగితాలకే పరిమితం కాకుండా నిజంగా పనిచేయాలి. ఒక విద్యార్థి మరణిస్తే ఆ సంస్థ డైరెక్టర్, వార్డెన్, విభాగాధిపతి, సంబంధిత మెంటార్‌లపై పరిపాలనా విచారణ తప్పనిసరి చేయాలి. వివక్ష చూపిన ప్రొఫెసర్లను సర్వీస్ నుంచి తొలగించేంత కఠిన చర్యలు ఉండాలి. విద్యార్థుల భద్రత, సంక్షేమం ఆధారంగా సంస్థల ర్యాంకింగులు నిర్ణయించాలి. అకడమిక్ ఒత్తిడిని తగ్గించేలా సిలబస్‌ను పునర్వ్యవస్థీకరించాలి. చదువుకోవడానికి వెళ్ళిన బిడ్డ శవమై రావడం ఏ నాగరిక సమాజమూ భరించలేని నిజం. కేంద్రం తన మౌనాన్ని వీడాలి. విద్యాసంస్థలు తమ నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే ఈ మృత్యుఘంటికలు ఆగుతాయి. లేకపోతే ప్రతి తల్లీ, తండ్రి గుండెలో ఒక్కటే భయం మిగులుతుంది– ‘‘చదవడానికి పంపితే, చనిపోయి వస్తాడేమో’’ అని!
పాపని నాగరాజు
సత్యశోధక మహాసభ
ఈ వార్తలు కూడా చదవండి
బెంగాల్‌లో చారిత్రక తీర్పు.. విజయోత్సవ సంబరాల్లో మోదీ
ఇది గెలుపు కాదు లూటీ.. మేం పుంజుకుంటాం.. బెంగాల్‌లో షాకింగ్ తీర్పుపై మమతా బెనర్జీ