Share News

ప్రాథమిక హక్కుగా కుల మార్పిడి

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:06 AM

ప్రకృతి, మనిషీ, సమాజమూ, చట్టమూ, ఎగ్జిక్యూటివ్, న్యాయ, రాజకీయ, సమస్త వ్యవస్థలూ నిరంతర చలనశీలమైనవి (డైనమిక్) అయినప్పుడు, వర్ణం/కులం మాత్రం ఎందుకు కాదు? మతం కాలానుగుణంగా కొత్త ఆచారాలు...

ప్రాథమిక హక్కుగా కుల మార్పిడి

కులం కొందరికి పుట్టుకతో వరం, మరికొందరికి శాపం అవుతున్నది. ఈ పరిస్థితి రద్దు కావాలి. వర్ణ, కుల అసమానతలు అంతరించిపోయే వరకూ, నచ్చిన కులాన్ని అనుసరించే స్వేచ్ఛను పౌరులు కలిగి ఉండాలి. ప్రతి పౌరుడికీ/పౌరురాలికి ఉత్తమ సాంఘిక (వర్ణం/కులం) హోదా పొందే ప్రాథమిక హక్కు ఉండాలి. ఇందుకు పార్లమెంటు వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలి.

ప్రకృతి, మనిషీ, సమాజమూ, చట్టమూ, ఎగ్జిక్యూటివ్, న్యాయ, రాజకీయ, సమస్త వ్యవస్థలూ నిరంతర చలనశీలమైనవి (డైనమిక్) అయినప్పుడు, వర్ణం/కులం మాత్రం ఎందుకు కాదు? మతం కాలానుగుణంగా కొత్త ఆచారాలు, సంస్కరణలకు గురవుతూ, అభివృద్ధి చెందుతూ ఎట్లా గతిశీలమైనదో వర్ణం/కులం కూడా అలాగే గతిశీలమైనవి. ఇవాళ ఏ కులంలోనూ, గరిష్ఠంగా మూడు నుంచీ ఐదు శాతం కూడా వారి కులవృత్తులను నమ్ముకొని జీవించడం లేదు. ప్రతి వృత్తి వర్ణం/కులంలోనూ నూటికి తొంభై ఐదు శాతం మంది వారి వృత్తేతర పనుల్లో, ఉపాధుల్లో ఉన్నారు! ఇది సామాజిక వాస్తవికత.

మూసుకుపోయిన వర్గమే కులం అని డాక్టర్ అంబేడ్కర్ విశ్లేషించారు. ప్రతి సాంఘిక సమూహమూ బయట సమూహంలోని వారితో పెళ్ళి సంబంధాలు కలుపుకునే సంప్రదాయంపై నిషేధం విధించి, ఒకే సమూహంలోని వారితో పెళ్ళి సంబంధాలు కలుపుకోవడం వలన వర్ణం/కులం దడి కట్టుకున్న స్థితిలో ఉండిపోయింది. బాహ్య వివాహ సూత్రంపై నిషేధం విధించి, అంతర్వివాహ సూత్రాన్ని రుద్దటమే కులం పుట్టుకకు కారణమైందని అంబేడ్కర్ విశ్లేషించారు. అంతేకాదు, వర్ణ/కుల వ్యవస్థలను నిట్టనిలువు అంచెలవారీ వ్యవస్థీకృత సామాజికాధికార వ్యవస్థలుగా మలిచాక, కొందరు పుట్టుకతో ‘పవిత్ర సామాజిక స్థితి’లో పుట్టినందుకు సంతోషించే పరిస్థితి ఏర్పడింది. అత్యధికులు అవకాశాల చట్రం నుంచి పక్కకు నెట్టివేయబడి, న్యూనతతో కుంగిపోయే సామాజిక విలువల వ్యవస్థ తయారయ్యింది! విశాలమైన ప్రపంచంలో అత్యధిక సమూహాలకు వర్ణం/కులం విధి, నిషేధాల వేలాది సామాజిక జైళ్లు (సోషల్ ప్రిజన్స్)గా వర్ణం/కులం వ్యవస్థాపితమయ్యింది.


చట్టం ముందు అందరూ సమానమే అని రాజ్యాంగం చెబుతున్నా, సమాజంలో అందరూ సమానం కాదని, వర్ణ, కుల వ్యవస్థలు చెబుతున్నాయి! ఇది ఆధిపత్య సామాజిక వర్ణ, కుల వ్యవస్థల దోపిడీ దురాచారం అని ఇట్టే అర్థం అవుతున్నది. ఈ సామాజిక దురాచారాన్ని ఇప్పుడు బద్దలుకొట్టాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే ప్రేమ వివాహాలతో, వివాహేతర సంబంధాలతో, వర్ణ కుల సంప్రదాయ వృత్తులకు అతీతమైన ఉపాధులు, నైపుణ్యాలతో కలగాపులగమైన నేటి చలనశీల సాంఘిక వ్యవస్థలో ప్రతి వ్యక్తీ స్వేచ్ఛగా తాను ఎంచుకున్న వర్ణంలోకి లేదా కులంలోకి మారే ప్రాథమిక హక్కును రాజ్యాంగబద్ధంగా సృష్టించాల్సిన అవసరాన్ని సమాజమూ, అధికార వ్యవస్థలూ ఇప్పటికైనా గుర్తించాలి. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఇందుకు పూనుకోవాలి.

సమాజంలోని అత్యధిక సంఖ్యలోని వ్యక్తులకు బహుళ వృత్తుల నైపుణ్యాలు ఉన్నాయి, ఉంటున్నాయి. మరి అలాంటి వారికే కాదు, ఎవరికైనా వర్ణం లేదా కులాన్ని మార్చుకునే అవకాశం ఎందుకు ఉండకూడదు? అందరు పౌరులకు– స్వేచ్ఛగా మతానుసరణ, మత మార్పిడి హక్కు ఉన్నట్టుగానే, మత రహితంగా (అంటే నాస్తికవాదిగా/హేతువాదిగా) ఉండే హక్కు కూడా రాజ్యాంగబద్ధంగా ఉన్నది. ఇదే మాదిరిగా, వర్ణం/కులం కలిగి ఉండటం ఒక రాజ్యాంగబద్ధ హక్కుగా ఇప్పటికే ఉన్నది. అలాగే వర్ణ/కుల రహితంగా ఉండటమూ ఒక రాజ్యాంగబద్ధ హక్కుగా ఉన్నది (వర్ణం, కులం పేర్కొనకుండా సర్టిఫికెట్లు జారీ చెయ్యడం ఇందుకు ఒక ఉదాహరణ). ఇదే మాదిరిగా వర్ణం/కులం మార్చుకోవడం కూడా ఒక రాజ్యాంగ హక్కుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. వర్ణ/కుల మార్పిడిని ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చాలి. పైన పేర్కొన్న అంశాలను క్రోడీకరించిన పద్ధతిలో న్యాయ వ్యవస్థ లేదా పార్లమెంటు రాజ్యాంగబద్ధంగా స్పష్టపరచాలి. సాంఘిక అసమానతల స్థితి స్థాపకత్వానికి చోటు కల్పించిన వర్ణ/కుల వ్యవస్థలకు చలనశీల (డైనమిక్) తత్వం ఉన్నదని విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ద్వారా సుప్రీంకోర్టు, లేదా రాజ్యాంగ ఆదేశంగా, రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు వెంటనే స్పష్టం చెయ్యాలి.


ఇదే విధంగా బ్రాహ్మణ్యం కులం మాత్రమే కాదు, గుణం కూడా అని కొందరు అంటుంటారు. కానీ, బ్రాహ్మణ వర్ణేతరుల్లో బ్రాహ్మణ్య గుణం ఉన్న సామాన్యులను గురించిన గుర్తింపు, ప్రశంస వర్ణాధికుల్లో ఉన్నట్టు ఎక్కడా మనం చూడబోము. ఈ అంశంపై దీర్ఘ మౌనం వహించడం మనం చూస్తుంటాం. ఇక ఒక చోట బీసీ కులంగా ఉన్నది మరో చోట ఎస్సీగా ఉంటున్నది. ఉదాహరణకు ఏపీలో రజక, వడ్డెర వెనుకబడిన తరగతుల జాబితాలో ఉన్నాయి. దక్షిణ భారత దేశమంతా రజక ఎస్సీ కులంగా ఉంది. వడ్డెర కులం కర్ణాటకలో ఎస్సీ కులంగా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎస్టీలుగా ఉన్న లంబాడీ, సుగాలి తెగలు కర్ణాటకలో ఎస్సీలుగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కమ్మ, రెడ్డి కులాలు ఆధిపత్య కులాలుగా ఉన్నాయి. ఇవి కర్ణాటకలో బీసీ జాబితాలో ఉన్నాయి. ఇక్కడ ప్రస్తావించిన కులాల ఎత్నిక్ సంస్కృతి, వాటి సంప్రదాయక వృత్తీ ఏమీ మారలేదు. కానీ, వాటి రాజ్యాంగబద్ధ సాంఘిక హోదా రాష్ట్రానికొక తీరుగా మారింది. అంటే కులం చలనశీలమైనదని అర్థం! మరి వర్ణ, కుల అసమానతలు అంతరించిపోయే వరకూ, నచ్చిన కులాన్ని అనుసరించే స్వేచ్ఛను పౌరులు కలిగి ఉండాలి. ఉంటే, మునిగిపోయేదేమీ లేదు. వర్ణ, కుల వ్యవస్థలు గతిశీలమైనవిగా రాజ్యాంగం గుర్తించాలి. కులం కొందరికి పుట్టుకతో వరం, మరి కొందరికి శాపం అవుతున్నది. ఈ పరిస్థితి రద్దు కావాలి. వర్ణం, కులం ఏదైనా పౌరులందరికీ ఒకటే సామాజిక విలువ దక్కాలంటే, వర్ణం, కులం మార్చుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉండాలి. కులం అనేది అణచివేత సాధనం కారాదు. ఎవ్వరికీ వర్ణం/కులం ఇప్పుడున్న మాదిరిగా సోషల్ ప్రిజన్ (సాంఘిక జైలు) కారాదు. ఈ సాంఘిక బానిస సంకెళ్లు పోవాలి. కాబట్టి, ఈ దిశగా శాసనిక, న్యాయ, కార్యనిర్వాహక, రాజకీయ వ్యవస్థలు కదలాలి. ఇందుకు సానుకూలంగా ఆలోచించాలి. ప్రతి పౌరుడికీ/పౌరురాలికి ఉత్తమ సాంఘిక (వర్ణం/కులం) హోదా పొందే ప్రాథమిక హక్కు ఉండాలి. ఇందుకు పార్లమెంటు వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలి.

- కృపాకర్ మాదిగ

Updated Date - Apr 15 , 2026 | 04:07 AM