ఇద్దరు విప్లవ రచయితలు, ఆ ఇద్దరి ‘తల్లులు’
ABN , Publish Date - Mar 30 , 2026 | 02:55 AM
సా హితీలోకంపై చెరగని ముద్ర వేసిన అద్భుత రచయితల్లో ఒకరు మహాశ్వేతాదేవి. ఎక్కువగా బెంగాలీలో ఆమె చేసిన రచనలు, ముఖ్యంగా నవలలు ఎన్నో భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆమె ప్రఖ్యాత నవల..
సాహితీలోకంపై చెరగని ముద్ర వేసిన అద్భుత రచయితల్లో ఒకరు మహాశ్వేతాదేవి. ఎక్కువగా బెంగాలీలో ఆమె చేసిన రచనలు, ముఖ్యంగా నవలలు ఎన్నో భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆమె ప్రఖ్యాత నవల ‘హజార్ చౌరాషిర్ మా’ 1983లో ‘ఒక తల్లి’ పేరుతో తెలుగు పాఠకులకు పరిచయమైంది. విప్లవం గురించి, బిడ్డలను కోల్పోయిన తల్లుల దుఃఖం గురించి తెలుగు పాఠకులకు ఒక కొత్త స్పృహను కలిగించిన నవల అది. ప్రతి విప్లవకారిణి వెనుక ఒక తల్లి ఉంటుందని, కానీ తరచూ ఆమె భావోద్వేగాలకు చోటు దక్కకుండా పోతోందన్న వాస్తవాన్ని అందులో మహాశ్వేత అసాధారణ నైతికధృతితో ప్రకటిస్తారు.
ఈ నవల ఒక కల్లోలభరితమైన రాజకీయ సందర్భంలో తెలుగులోకి వచ్చింది. అప్పటికే నక్సల్బరీ, శ్రీకాకుళ ఉద్యమాలు హింసాత్మక అణచివేతకు గురయ్యాయి. అయినప్పటికీ తెలుగునాట తిరుగుబాటు అగ్నికణాలు పూర్తిగా చల్లారలేదు. విప్లవకారులు పునస్సంఘటితమయ్యే పనిలో పడ్డారు. భూమి సమస్యతో పాటు వివిధ రూపాల దోపిడిపీడనలపై ఉద్యమాలు రాజుకోసాగాయి. అలాంటి ఉద్విగ్నమైన చారిత్రక సన్నివేశంలో వచ్చిన ‘ఒక తల్లి’ నవల పాఠకులకు ఒక కొత్త నైతిక సమర్థనను అందించింది. అది విప్లవకారుల త్యాగాలతో పాటు, వారి తల్లులు అనుభవించే మూగవేదనను మన ఉమ్మడి ఎరుకలోకి తీసుకొచ్చింది.
ఈ నవల తెలుగులో రావడానికి పదమూడేళ్ల ముందు తెలుగు నేలపై మరో రచయిత రేణుక జన్మించారు. ఆమె స్వగ్రామం కడవెండి. 1940ల్లో ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలో జరిగిన తెలంగాణ రైతాంగ పోరాటంతో పెనవేసుకుపోయిన గ్రామం. భూస్వామ్య దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడే చైతన్యం ఆనాటి నుంచే అలవర్చుకున్న గ్రామం. అలాంటి వాతావరణంలో, ఒక కొత్త తరం మరో దశ ఉద్యమాలకు నాంది పలుకుతున్న కాలంలో పుట్టిపెరిగిన రేణుక, టీనేజర్‌గా ఉన్నప్పుడే మహాశ్వేతాదేవి ‘ఒక తల్లి’ నవలను చదివారు. అందుకే ఆమెకు అందులోని అంశాలేవీ అమూర్తమైనవిగా, దూరంలో ఉన్నవిగా అనిపించలేదు.
రేణుక ఆ తర్వాతి కాలంలో రచయితగా ఎదిగి మహాశ్వేత ఒరవడిని ఒడిసి పట్టుకున్నారు. భూమి కోసం, అడవిపై హక్కు కోసం, న్యాయం కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడేవాళ్లందరికీ గొంతుక అవుతూ, మహాశ్వేత మార్గాన్ని అనుసరించారు. తర్వాతి కాలంలో ‘మిడ్కో’ అనే కలంపేరుతో ప్రఖ్యాతి గాంచిన రేణుక మహిళలపై అణచివేత, వివక్షలతో మొదలై అన్ని రకాల దోపిడీపీడనలకు వ్యతిరేకంగా రాయడం మొదలుపెట్టారు. అంతేకాదు, వాటికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలలో భాగమయ్యారు. అందుకే, రేణుక కథల్లోనైనా, ఇతర రచనల్లోనైనా పరిశీలకురాలిలా రాసినట్టు అనిపించదు. ప్రత్యక్ష అనుభవాలతో చేసిన గాఢమైన అల్లిక కనిపిస్తుంది.
మహాశ్వేత నవలలో కనిపించే భావోద్వేగ, రాజకీయ ధ్వనులన్నీ రేణుక ఒడిసిపట్టుకున్నట్టు అనిపిస్తుంది. అయితే, ఆమె మహాశ్వేతను అనుకరించలేదు. దానికి బదులు, ఆ సంప్రదాయాన్ని ఆమె మరింత విశాలమైన కాన్వాస్‌పైకి విస్తరించారు. తెలంగాణ మైదానాల్లో, దండకారణ్యం ఆదివాసీ పల్లెల్లో నివసించే తల్లుల దుఃఖానికి, సంఘర్షణకు ఆమె అక్షరరూపం ఇచ్చారు. అయితే, రేణుక రచనల్లోని తల్లులు విప్లవానికి సాక్షులు మాత్రమే కాదు, వేర్వేరు రూపాల్లో అందులో భాగస్వాములు కూడా.

మహాశ్వేత ‘ఒక తల్లి’ నవలనూ, రేణుక ‘ఇద్దరు తల్లులు’ కథనూ పోల్చి చూస్తే– ‘ఒక తల్లి’లో కథంతా సుజాత అనే తల్లి పాత్ర చుట్టూ తిరుగుతుంది. శవాలగదిలో 1084 నెంబర్ వేసి ఉన్న ‘గుర్తు తెలియని’ శవం తన కొడుకు ‘బ్రతి’దిగా గుర్తించడంతో కథ మొదలవుతుంది. ఆనాడు బెంగాల్‌లో రాజ్యం చేతిలో హతులైన వేలాదిమంది యువ విప్లవకారుల్లో బ్రతి ఒకరు. తన కొడుకు జీవించిన, స్వప్నించిన ప్రపంచాన్ని క్రమంగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన సుజాతలో ఒక బాధాకరమైన గ్రహింపు, చైతన్యం కలుగుతాయి. అదంతా తన మధ్యతరగతి జీవితానికి దూరంగా.. అన్యాయాలు, అణిచివేతలతో నిండిన ప్రపంచమని బోధపడుతుంది. విప్లవ సాహిత్యంలో కథావస్తువు కేంద్ర స్థానాన్ని బదిలీ చేయడం ఈ నవల విశిష్టతగా చెప్పుకోవచ్చు. విప్లవకారుడైన హీరో పాత్రకు బదులు, కథనాన్ని ఆమె తల్లిపాత్ర చుట్టూ అల్లుతారు. తన దుఃఖంలోంచే తన కొడుకు జీవితానికీ, స్వచ్ఛందంగా ఎంచుకున్న మృత్యువుకూ కారణమైన రాజకీయ వాస్తవాలను సుజాత తెలుసుకుంటుంది. క్రమంగా ఎదిరించడం కూడా మొదలుపెడుతుంది.
రేణుక కథల్లో కూడా ఇలాంటి భావోద్వేగ ప్రపంచమే కనిపిస్తుంది. అయితే ఒక ముఖ్యమైన తేడా ఉంది. ఆమె కథల్లోని తల్లులు విప్లవాన్ని ఒక విషాదంలోంచి, లేదా బయటి నుంచి కనుగొనేవాళ్లు కాదు. దానికి భిన్నంగా, వారందరూ విప్లవోద్యమానికి ప్రాతిపదికగా ఉన్న సామాజిక పునాదుల్లో ముందు నుంచే జీవిస్తూ ఉండే మహిళలు.
ఉదాహరణకు, రేణుక రాసిన ‘ఇద్దరు తల్లులు’ కథలో అడివమ్మ అనే ఒక గ్రామీణ దళిత మహిళ రోజూ ఒక టీచరు ఇంటికి వెళ్లి, పోలీస్ ఎన్‌కౌంటర్ల వార్తలు తెలుసుకుంటూ ఉంటుంది. మృతుల్లో తన కొడుకు లేడని తెలిసినా కూడా, ఆమె ఊరట చెందదు. ‘ఎవరైతే ఏందమ్మా, ఏ తల్లులో కన్నబిడ్డలే గద, ఏ తల్లుల కడుపులు కాలినయో... కడుపుతీపి ఎవలకైన వొక్కటేగద, పంతులమ్మ?’ అంటుంది. ఈ ఒక్క వాక్యంలో మహాశ్వేత, రేణుకల మధ్య ఒక అద్భుతమైన భావోద్వేగ వారధి కనిపిస్తుంది. ‘మహాశ్వేత సుజాత’ తన కొడుకు సహచరుల్లో మానవీయ కోణాలను గుర్తించినట్టుగా, ‘రేణుక అడివమ్మ’కు కూడా నేలరాలిన విప్లవకారులందరూ తనలాంటి తల్లుల బిడ్డలుగా తోస్తారు.
మహాశ్వేత ‘ఒక తల్లి’ నవలలో మార్చురీలో విప్లవకారుల గుర్తు తెలియని మృతదేహాలు పడి ఉన్న వర్ణన మనసును మెలిపెడుతుంది. రాజ్యం వాటికి గుర్తింపు లేకుండా చేయాలని ప్రయత్నిస్తే, దాన్ని నిలబెట్టుకునేందుకు తల్లి పడే ఘర్షణ, వేదన అందులో ఉంటాయి. రేణుక రాసిన ‘ఆమె నా బిడ్డనే’ కథలో కూడా ఇలాంటిదే ఉంటుంది. ఓ మారుమూల అడవిలో ఎన్‌కౌంటర్‌లో మరణించిన విప్లవకారుల శవాలు సమీప పట్టణంలోని హాస్పిటల్‌లో పడి ఉంటాయి. వాటిలో ఒక మృతదేహం తన బిడ్డదేనని ఒక ఆదివాసీ వృద్ధురాలు అధికారులతో వాదిస్తుంది. ఆమె ఆ శవాన్ని నిజంగానే గుర్తుపట్టిందా, లేదా అనేది అక్కడ అప్రస్తుతమవుతుంది. మృతులెవ్వరూ పేర్లు లేని అనాథ శవాలుగా మిగిలిపోవద్దనే ఆరాటం ఒక్కటే ఆ తల్లిలో కనిపిస్తుంది. ఏ విప్లవకారిణినైనా తన బిడ్డగా ప్రకటించే ఔన్నత్యం ఆమెలో ఆవిష్కృతమవుతుంది. రాజ్యహింస ఫలితంగా వ్యక్తిగత దుఃఖం సమిష్టి దుఃఖంతో కలగలిసిపోయే సన్నివేశం ఇది.
రేణుక మరో కథ ‘ఆ రాజకీయాలు నాగ్గావాలె’లో మాతృత్వంపై ఆమె అన్వేషణ మరింత లోతుగా, గాఢంగా జరిగినట్టు కనిపిస్తుంది. ఈ కథంతా వెంకటమ్మ అనే నిరుపేద గ్రామీణ మహిళ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన తన కొడుకు కొమురయ్య స్తూపాన్ని కట్టుకునేందుకు చేసే పోరాటం చుట్టూ నడుస్తుంది. ఇందులో మొదట వ్యక్తిగతమైందిగా మొదలయ్యే తల్లి దుఃఖం క్రమంగా రాజకీయమైందిగా మారుతుంది. పోలీసులు కొడుకు స్తూపాన్ని కూలగొట్టి ఆమె నోరు మూయించాలని ప్రయత్నిస్తారు. కానీ ఆమె తన కొడుకు స్మృతి చెదిరిపోనివ్వడాన్ని ఒప్పుకోదు. చివరకు స్తూపం కట్టాక, ఆవిష్కరణ సభలో ఆమె ఇలా అంటుంది – ‘‘పలక మీద గీసిన గీతలైతే తుడిపెయ్యొచ్చు. కానీ మనుషులు అట్ల తుడిపేస్తే పోతరా, అయ్యా?’’ అంతే కాదు – ‘‘మనుషులను తలుసుకునేదే రాజకీయమైతే ఆ రాజకీయాలు నాగ్గావాలె’’ అంటుంది.
రేణుక మరో కథ ‘ఈ శోకం ఎందరిది’లో కమలమ్మ అనే తల్లి దుఃఖాగ్రహం ఉమ్మడి విషాదంగా రూపాంతరం చెందే తీరు మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎన్‌కౌంటర్‌లో తన కొడుకు చనిపోయాడని విని, ఎంతో దుఃఖభారంతో ప్రయాణించి, పొరుగు రాష్ట్రంలోని ఒక హాస్పిటల్‌కు ఆమె చేరుకుంటుంది. కానీ అక్కడ, చనిపోయింది తన కొడుకు కాదని, ఒక గుర్తు తెలియని యువతి అని తెలిసినా ఆమె దుఃఖం ఆగదు. ‘‘అయ్యో బిడ్డా! ఏ తల్లి కన్నదో నిన్ను. ఇయ్యాల నన్ను ఏడిపించినవ్. కడుపు కోతంటే ఏందో తెలువ జెప్పినవ్. నా కడుపుల పుట్టిన బిడ్డ లెక్కనే అనిపిస్తున్నవ్, బిడ్డా’’ అంటూ కొనసాగే ఆమె విలాపం సామూహిక ధిక్కారంలా ధ్వనిస్తుంది.
మహాశ్వేతాదేవి ‘ఒకతల్లి’ నవలలో సుజాత పాత్రలో కలిగిన చైతన్యం తన కొడుకు జీవితపు రాజకీయ సారాన్ని అర్థం చేసుకునేందుకు దారి తీస్తుంది. రేణుక కథల్లో తల్లులు ఆ రాజకీయ పరిదృశ్యంలో భాగంగా ఉంటారు. జ్ఞాపకం ప్రతిఘటనగా మారి పోతుంది. ముందే చెప్పినట్టు, రేణుక తన కథల్లో చిత్రించే తల్లులను ఉత్త అబ్జర్వర్లుగా ఉండిపోనివ్వరు. తమ చుట్టూ ఆవరించిన విప్లవం అనే విస్తృత ప్రపంచంలో అనేక విధాలుగా భాగస్వాములై మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తేలా వాటిని తీర్చిదిద్దుతారు.
రేణుక మరో కథ ‘గంగి’. అడవిలో గెరిల్లాగా మారిన ఒక తల్లి, నగరంలో తన తల్లిదండ్రుల ఇంట్లో వదిలేసి వచ్చిన కూతురుకు వేర్వేరు కాలాల్లో రాసే ఉత్తరాల సమాహారం. ఇందులో రాజకీయ నిబద్ధతకు, మాతృత్వానికి మధ్య ఉండే బాధాకరమైన వైరుధ్యాన్ని రేణుక తనదైన అద్భుత శైలితో, అంతకన్నా అద్భుతమైన సంవేదనతో చిత్రీకరిస్తారు. ఆ తల్లి ఓ ఉత్తరంలో ఇలా రాస్తుంది: ‘‘మేము నమ్ముకున్న విశ్వాసాల కోసం మా జీవితాలను అర్పించే హక్కు మాకుంది. కానీ నిన్ను కని, తల్లిదండ్రుల ప్రేమకు దూరంగా పెరిగే దుస్థితికి నెట్టేసే హక్కు మాకు లేదు.’’ ఈ కథలో రేణుక చివరి వరకూ ఎడతెగని నైతిక సంఘర్షణను కొనసాగిస్తారు. చివరకు, మాతృత్వం – విప్లవం రెండూ ఒకే జీవితంలో ఒదిగిపోగలవని తన ఉత్కంఠభరితమైన కథనం ద్వారా, అత్యంత సహజంగా రుజువు చేస్తారు.
వయసులో దాదాపు యాభయ్యేళ్ల అంతరం ఉన్న ఈ ఇద్దరు రచయితలకూ ఆదివాసీ జీవితాల పట్ల, మొత్తంగా పీడిత సముదాయాల పట్ల బలమైన సంఘీభావం ఉంది. అట్టడుగు ప్రజల జీవితాల గురించి, సంఘర్షణల గురించి రాయడానికే తన జీవితాన్ని అంకితం చేసిన మహాశ్వేత చివరి వరకూ వారితో నిలబడ్డారు. రేణుక ఈ నిబద్ధతను మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు. ఆమె బాధిత సముదాయాల గురించి దూరంలోంచి, లేదా పరోక్షంగా తెలుసుకొని రాయలేదు. వారి మధ్యే, వారిలో ఒకరిగా ఉంటూ, వారు నిత్య జీవితంలో ఎదుర్కొనే కష్టాలను, ప్రాణాంతక ప్రమాదాలను తనూ ఎదుర్కొంటూ వారి సంఘర్షణలను చరిత్రబద్ధం చేశారు. వారితో భుజం కలిపి పోరాడారు. వారి జీవితాల్లో, సంఘర్షణల్లో విడదీయలేని భాగమై, చివరకు వారి మధ్యే ప్రాణాలు విడిచారు. ఈ ఏడాది మహాశ్వేతాదేవి శత జయంతి. రేపు రేణుక తొలి వర్ధంతి.
అమన్
ఈ వార్తలు కూడా చదవండి
పోలీసులపై దాడి.. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
సీసీ టీవీ కెమెరా వైర్ అనుకుని కేబుల్ వైర్ కట్ చేసింది.. అంతే..
మినాబ్ క్రిమినల్స్ వీళ్లే.. ఫోటోలు విడుదల చేసిన ఇరాన్