Share News

Telangana Agriculture: వ్యవసాయ అనుబంధ పరిశ్రమలేవి?

ABN , Publish Date - Jan 09 , 2026 | 04:53 AM

మన దేశంలో ఆహార ఉత్పత్తులతో పాటు వాణిజ్య పంటలూ ఎక్కువగా సాగు చేస్తున్నారు. పత్తి, నూనె గింజలు, సుగంధ ద్రవ్యాలు, పసుపు తదితర వాణిజ్య పంటలు పండిస్తున్నారు.

Telangana Agriculture: వ్యవసాయ అనుబంధ పరిశ్రమలేవి?

మన దేశంలో ఆహార ఉత్పత్తులతో పాటు వాణిజ్య పంటలూ ఎక్కువగా సాగు చేస్తున్నారు. పత్తి, నూనె గింజలు, సుగంధ ద్రవ్యాలు, పసుపు తదితర వాణిజ్య పంటలు పండిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో వాటికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చేస్తున్న సందర్భాలెన్నో. వివిధ రాష్ట్రాల్లో భారీగా పత్తి పండిస్తున్నా... అనుబంధ స్పిన్నింగ్‌, వస్త్ర పరిశ్రమలు తగినన్ని లేకపోవడంతో అటు రైతులు నష్టపోతుండగా, ఇటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించడం లేదు. తెలంగాణలో ప్రతి సంవత్సరం సుమారు 50 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అవుతున్నా, స్థానికంగా వినియోగించుకోలేని దుస్థితి ఉంది. దీంతో ధర పడిపోయి రైతులు నష్టపోతున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో సీసీఐతో అనేక దఫాలుగా ప్రభుత్వం చర్చలు జరిపింది. అయినా ప్రయోజనం లేదు. చివరకు రైతులు అగ్గువ ధరకు దళారులకు పత్తిని అమ్ముకోవాల్సి వచ్చింది.

తెలంగాణ వ్యాప్తంగా 33 స్పిన్నింగ్‌ మిల్లులున్నాయి. గతంలో ప్రభుత్వ స్పిన్నింగ్‌ మిల్లులుండేవి. వరంగల్‌లో అజాంజాహి, రామగుండంలో అంతర్గాం, సిరిసిల్లలో శ్రీ రాజరాజేశ్వర స్పిన్నింగ్‌ వంటివి ఖాయిలా పేరుతో మూతపడ్డాయి. సిరిసిల్లలోని మిల్లును గతంలో ఓ ప్రైవేటు వ్యక్తికి అతి తక్కువ ధరకు ప్రభుత్వం అమ్మితే, రెండేళ్ల క్రితం సదరు వ్యక్తి తన మిల్లును మూసివేసి, యంత్రాలను తొలగించి, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి అమ్మేశారు. దీంతో ఇక్కడి వందలాది కార్మికులు రోడ్డున పడ్డారు. రాష్ట్రంలో అత్యధిక పవర్‌ లూమ్‌ పరిశ్రమ ఉన్న సిరిసిల్లకు అవసరమయ్యే నూలును గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడుల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ట్రాన్స్‌పోర్ట్‌, ఇతర ఖర్చులు అధికమవుతున్నాయి. ఇక అంతర్గాంలో మూసివేసిన మిల్లు కార్మికులకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. తెలంగాణలోని ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా పత్తి పంట పండిస్తున్నారు రైతులు. ఆయా ప్రాంతాల్లో అనుబంధ స్పిన్నింగ్‌ మిల్లులను ఏర్పాటు చేస్తే నిరుద్యోగులకు ఉపాధితో పాటు రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. వరంగల్‌ శాయంపేటలో ఏర్పాటు చేసిన మెగా టెక్స్‌టైల్‌ పార్కులో కాటన్‌ అనుబంధ స్పిన్నింగ్‌ మిల్లు ఏర్పడలేదు. పీఎం మిత్ర కింద మౌలిక సదుపాయాలకు కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నట్లు చెబుతున్నా, కొంత మంది స్థానికులకు మాత్రమే ఉపాధి లభిస్తోంది.


ప్రపంచ వ్యాప్తంగా 60శాతం పాలిస్టర్‌ను చైనా ఉత్పత్తి చేస్తుండగా, ఇండియాలో రిలయన్స్‌ కంపెనీ సంవత్సరానికి సుమారు ఒక మిలియన్‌ టన్నుల పాలిస్టర్‌ యార్న్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పెట్రో ఉత్పత్తుల నుంచి పాలిస్టర్‌ను తయారు చేస్తున్నందున, ఎక్కువ శాతం ముడిసరుకు భారత్‌కు దిగుమతి అవుతోంది. మన దేశంలోని రైతులు పండించిన పత్తి నుంచి నాణ్యమైన, ఆరోగ్యకరమైన కాటన్‌ యార్న్‌ ఉత్పత్తికి ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం గుత్తాధిపత్యంగా ఒకటి, రెండు బడా కార్పొరేట్‌ కంపెనీలకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వడం వల్ల మధ్య తరహా నూలు పరిశ్రమలు ఏర్పాటు కావడం లేదు. అక్కడక్కడ ఉన్న కొద్దిపాటి పరిశ్రమలు కార్పొరేట్‌ పోటీ ధాటికి నిలబడలేక మూతబడుతున్నాయి. ఇక తెలంగాణలో కాటన్‌ స్పిన్నింగ్‌ మిల్లులు అంతంతే.

తెలంగాణలో స్పిన్నింగ్‌ మిల్లుల ద్వారా నూలు ఉత్పత్తి జరగాలి. అధునాతన సాంకేతిక పవర్‌ లూమ్‌ పరిశ్రమతో డిమాండ్‌ ఉన్న వస్త్రాలు తయారీకావాలి. డైయింగ్‌, ప్రాసెసింగ్‌, ప్రింటింగ్‌ లాంటి పరిశ్రమలు ఏర్పడాలి. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలని ఔత్సాహికులు కోరుతున్నారు. స్థానిక పరిశ్రమలకు ఉపయోగపడే పాలసీలను ప్రభుత్వం రూపొందించాలి. తెలంగాణ రైజింగ్‌–2047 ప్రణాళికలో భాగంగా వ్యవసాయ అనుబంధ కాటన్‌, వస్త్ర పరిశ్రమపై ప్రత్యేక దృష్టి సారించాలి.

చిలగాని జనార్ధన్‌

Updated Date - Jan 09 , 2026 | 04:53 AM