పునర్జాగృత కాంగ్రెస్సే ప్రతిపక్ష బలం
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:57 AM
భారతీయ సినిమా చరిత్రలో సీక్వెల్స్ అరుదుగా విజయం సాధించాయి. ప్రేక్షకులు సాధారణంగా ఒరిజినల్ హిట్ సినిమాను చూస్తారు, ఆదరిస్తారు. సీక్వెల్ చూడవచ్చేటప్పటికి కొత్తదనం తగ్గిపోతుంది. కథ నిస్సారమైనదిగా...
భారతీయ సినిమా చరిత్రలో సీక్వెల్స్ అరుదుగా విజయం సాధించాయి. ప్రేక్షకులు సాధారణంగా ఒరిజినల్ హిట్ సినిమాను చూస్తారు, ఆదరిస్తారు. సీక్వెల్ చూడవచ్చేటప్పటికి కొత్తదనం తగ్గిపోతుంది. కథ నిస్సారమైనదిగా అనిపిస్తుంది. ప్రారంభ సినిమాలో పులకింపజేసిన అనుభూతి అంతగా పునరావృతమవదు. ఇటీవల బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టిన ‘ధురంధర్’ అందుకొక మినహాయింపే అయినా చాలా సీక్వెల్స్ మొదటి హిట్ సినిమా మ్యాజిక్‌ను పునః సృష్టించడంలో విఫలమవుతున్నాయి. 2024 సార్వత్రక ఎన్నికలలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీని ఆశ్చర్యకరంగా సవాల్ చేసిన ఇండియా కూటమి.. 2029 సార్వత్రక ఎన్నికలలోనూ అటువంటి పోటీని సమర్థంగా ఇవ్వగలదా? ఇవ్వగలదనే నమ్మకాన్ని ఇండియా కూటమి 2.0 ఏమాత్రం ఇవ్వలేకపోతోంది. దానికి బదులుగా అంతర్గత నిర్మాణాత్మక ప్రక్షాళనతో దేశ పురాతన రాజకీయ పక్షమైన కాంగ్రెస్‌ను పునశ్శక్తిమంతం చేయవలసిన అవసరమున్నదని చాలామంది భావిస్తున్నారు.
మరి గత రెండు సంవత్సరాలలో యమునా నదిలో చాలా నీరు ప్రవహించింది. ప్రధాన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పలు పరాజయాలను మూటగట్టుకున్నది. ఇండియా కూటమికి వెన్నెముకగా నిలిచిన వివిధ ప్రాంతీయ పార్టీలు గణనీయంగా బలహీనపడ్డాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన తృణమూల్ కాంగ్రెస్ అంతర్గత తిరుగుబాట్లతో కుదేలయిపోతోంది. మహారాష్ట్రలో శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్) చీలిపోయాయి. ఢిల్లీలో అధికారాన్ని కోల్పోయిన ఆమ్ ఆద్మీ పార్టీ తన ప్రాసంగికతను నిలుపుకునేందుకు నానా ప్రయాసలు పడుతోంది. ఇంకా ఇతర రాష్ట్రాలలోని ప్రతిపక్షాలు అధికారం కోసం ఎంతగా పోరాడుతున్నాయో మనుగడను కాపాడుకునేందుకు అంతగా ప్రాకులాడుతున్నాయి. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు ఇటీవల న్యూఢిల్లీలో సమావేశమై తమ భావి కార్యాచరణ గురించి సమాలోచనలు జరిపాయి. ఉమ్మడి లక్ష్యం, దార్శనికతతో కంటే 2029 లోక్‌సభ ఎన్నికల అనంతరం నరేంద్రమోదీ తిరిగి అధికారానికి రాకుండా నిలువరించాలనే ప్రగాఢ ఆకాంక్షతో మళ్లీ కలగలసిన రాజకీయ శక్తుల సంకీర్ణంగా ఇండియా కూటమి కనిపిస్తోంది.
సమస్యేమిటంటే రాజకీయాలు ఎంతగా అంకగణిత వ్యవహారాలో (ఓట్ల వాటా, సీట్ల సంఖ్య తదితరాలు) అంతగా ప్రజలను సమ్మోహనపరిచే సామర్థ్యం, భావోద్వేగ సంబంధాలతో ముడివడి ఉన్న విషయాలు. సమావేశాలు, సంప్రతింపులతో ఎన్నికల పొత్తులు కుదుర్చుకోవచ్చు. అయితే ఆ పొత్తులలో అవకాశవాదం ఎంతగా ఉన్నదో ఓటర్లు ఇట్టే గ్రహించగలరు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తృణమూల్ కాంగ్రెస్ పాలన అవినీతిమయమని, బీజేపీతో చాటుమాటు ఒప్పందాలు కుదుర్చుకున్నదని రాహుల్‌గాంధీ ఆరోపించారు. మరి ఇప్పుడు తృణమూల్, కాంగ్రెస్ నాయకులు ఒకే వేదిక మీద కనిపిస్తున్నారు! కాంగ్రెస్‌కు విరుద్ధంగా ప్రజలకు బీజేపీ ఒక స్పష్టతనిస్తోంది. ఆ పార్టీ భావజాలంతో మీరు ఏకీభవించకపోవచ్చు, దాని పద్ధతులను మీరు వ్యతిరేకించవచ్చు. అయితే ఆ పార్టీకి నేతృత్వం వహిస్తున్నది ఎవరో ఓటర్లకు తెలుసు, ఆ పార్టీ ఏ లక్ష్యాల కోసం పని ేస్తుందో బాగా తెలుసు, అధికారం ఎవరి చేతుల్లో ఉందో కూడా మరీ తెలుసు. వర్తమాన భారత రాజకీయాలలో బీజేపీ ప్రాబల్యం కేవలం నరేంద్ర మోదీకి లభిస్తున్న విశేష ప్రజాదరణ ఫలితం కాదు. ప్రతిపక్షం తరచూ చీలికలు పీలికలై పోతుండడం కూడా అందుకొక కారణం. సదా అంతర్గత జగడాలతో, అనిశ్చిత నాయకత్వాన్ని అందిస్తున్న ప్రతిపక్షం వైపు ఓటర్లు ఎందుకు మొగ్గుచూపుతారు? ఈ వాస్తవం దృష్ట్యా ప్రతిపక్షం తన విధానాలు, తీరుతెన్నులను మౌలికంగా మార్చుకోవల్సిన అవసరం ఉన్నది.
ప్రతిపక్షాలు ఎదుర్కొంటున్న సవాలు బహుశా ఇండియా కూటమిని పునరుద్ధరించడం కాకుండా మరింత పాత రాజకీయ శక్తి అయిన కాంగ్రెస్ వ్యవస్థను పునరుజ్జీవింప జేయడమేనని చెప్పవచ్చు. ఇది వర్తమాన రాజకీయ కర్తవ్యం. అదలా ఉంచితే భారత రాజకీయాలకు సంబంధించిన బాగా ఆసక్తికరమైన విశేషం ఈనాటి ప్రాంతీయ పార్టీలలో అనేకం కాంగ్రెస్ విశ్వం నుంచి ప్రభవించినవి కావడమే. మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్, శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ మూలాలు కాంగ్రెస్‌లోనే ఉన్నాయి. ఆ ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్ చీలిక వర్గాలు. నాయకత్వ వివాదాలు, రాజకీయ ఆకాంక్షలు, ప్రాంతీయ రాజకీయాల ఒత్తిళ్ల కారణంగా ఆయా ప్రాంతీయ పార్టీల నాయకులు కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకుని స్వంత పార్టీలను నెలకొలుపుకున్నవారే. అయితే విశాల దృష్టితో చూస్తే వారందరూ ఒకే భావజాల ఆవరణంలో ఉన్నవారే, సందేహం లేదు.
ఈ పార్టీలన్నీ తమ నామధేయాలు, రాజకీయ అస్తిత్వాల్లో కాంగ్రెస్ ముద్రను ఎందుకు కొనసాగిస్తున్నాయి? ఇందుకు ఒక కారణమున్నది: అవన్నీ కాంగ్రెస్ గర్భాశయం నుంచి పుట్టినవే. గత నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ కుటుంబం వివిధ ప్రాంతీయ పార్టీలుగా చీలిపోయింది. ఆ క్రమంలో బీజేపీ వ్యతిరేక ఓటు చెల్లాచెదురైపోయింది, విభజితమైపోయింది. మరో బలహీన బీజేపీ వ్యతిరేక కూటమిని నిర్మించడానికి బదులు కాంగ్రెస్ చీలిక వర్గాలను పునరేకీకరించే అవకాశాలను ఎందుకు అన్వేషించకూడదు? ఒక విలీనం లేదా కనీసం పరస్పర అవగాహనతో ఒక వ్యవస్థీకృత రాజకీయశక్తిగా ఏర్పడడం కాంగ్రెస్‌ను పునశ్శక్తిమంతం చేస్తుంది. ఎన్నికలకు కొన్ని నెలల ముందు నానా పార్టీలతో కట్టే కూటమి కంటే పునరుజ్జీవిత కాంగ్రెస్ చాలా మేలు కాదా? ఇదే జరిగితే ప్రతిపక్షాలకు కాంగ్రెస్ ఒక ప్రధాన కేంద్రంగా ప్రభవిస్తుంది. చిన్న చిన్న పార్టీలతో ప్రభావశీలంగా సంప్రతింపులు జరిపేందుకు కాంగ్రెస్‌కు వెసులుబాటు లభిస్తుంది. అటువంటి ఆలోచన నేడు అవాస్తవికమైనదిగా కన్పించవచ్చు. అయితే రాజకీయాలలో అనూహ్య సంభవాలు ఒక సాధారణ సత్యం.
గతంలో ఏం జరిగినా, ఇప్పుడు కాంగ్రెస్ కుటుంబం ఇంకా చీలిపోవడాన్ని ఎందుకు అనుమతించాలి? ఏకీకృత కాంగ్రెస్ ఆలోచన సఫలమవ్వాలంటే, తొలుత కాంగ్రెస్ ఆలోచనలు, ఆచరణల్లో మార్పులు రావల్సిన అవసరమున్నది. ప్రాంతీయ పార్టీలు తిరిగి కాంగ్రెస్ ఛత్రం కిందకు రావాలంటే వాటితో అధికారాన్ని, నాయకత్వాన్ని పంచుకోవడానికి కాంగ్రెస్ అంగీకరించాలి. అయితే ఈ విషయంలో బాధ్యత పూర్తిగా కాంగ్రెస్‌కు మాత్రమే ఉన్నదని భావించడం సరికాదు. ప్రాంతీయ పార్టీల అధినేతలు తమ వ్యక్తిగత అహాలను పక్కన పెట్టి కుటుంబ ఆసక్తులు, స్వల్పకాలిక ప్రయోజనాలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరమున్నది. అన్ని ప్రాంతీయ పక్షాలూ తమ వైయక్తిక ఆకాంక్షలను విశాల జాతీయ రాజకీయ లక్ష్యాలకు లోబరిచినప్పుడు మాత్రమే శక్తిమంతమైన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవిస్తుంది. అప్పుడు మాత్రమే ప్రతిపక్షం.. బీజేపీ వ్యతిరేక శక్తుల సమాహారం స్థాయి నుంచి ఒక సువ్యవస్థిత రాజకీయ ప్రత్యామ్నాయంగా రూపొందగలదు. ఇది మనలను రాహుల్‌గాంధీ వద్దకు తీసుకువస్తుంది. బీజేపీకి ప్రధాన భావజాల సవాల్‌దారుగా రాహుల్ ప్రజల దృష్టిలో ఉన్నారు. గత పది సంవత్సరాలకు పైగా నిరంతర రాజకీయ దాడులను దీటుగా ఎదుర్కొని నిలబడిన రాహుల్ ప్రతిపక్షానికి ఒక పదునైన సైద్ధాంతిక బలాన్ని సమకూర్చడంలో సఫలమయ్యారు. అయితే బీజేపీ వ్యతిరేక భావజాల శక్తిగా ఉండడమే సరిపోదు. ఎందుకని?
ఒక వ్యక్తి కేంద్రంగా కాంగ్రెస్‌ను పునర్నిర్మించలేము. కాంగ్రెస్‌కు ఇప్పుడు అనుభవజ్ఞులైన ప్రాంతీయ నాయకులు, యువ నేతలు, సంస్థాగత సామర్థ్యం, విభిన్న రాజకీయ పక్షాలతో సర్దుకుపోయేందుకు మరింత సుముఖత చూపే విశాల వైఖరి చాలా అవసరం. మరీ ముఖ్యంగా అందరినీ కలుపుకుపోగల రాజకీయపక్షంగా వ్యవహరించడంలో తన స్వతస్సిద్ధ సామర్థ్యాన్ని మళ్లీ చూపాలి.
2024 సార్వత్రక ఎన్నికలలో ప్రతిపక్షాలు ఒక పెద్ద తప్పు చేశాయి. తమ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో స్పష్టంగా ప్రకటించకపోవడమే ఆ ఘోర తప్పిదం. ఒక విశ్వసనీయ ఉమ్మడి నాయకత్వ నిర్మాణాన్ని సృష్టించడంలో వైఫల్యానికి అదొక తార్కాణం. ఇటీవలి భారత రాజకీయాలలో ఒక గొప్ప సంభావ్యతగా మిగిలిపోయిన నేత నితీశ్ కుమార్. ఆయన రాజకీయ ప్రస్థానం ‘ఒకవేళ అలా జరిగి ఉంటే’ అన్న ఆసక్తికరమైన ప్రశ్నగా మిగిలిపోయింది. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు తమ ఆకాంక్షలను పక్కన పెట్టి నితీశ్‌ను కూటమి కన్వీనర్‌గా ప్రకటించి, ఆయన నాయకత్వానికి సాధికారత కల్పించి ఉంటే అద్భుతం జరిగి ఉండేది కాదూ?
చరిత్ర చాలా అరుదుగా మాత్రమే రెండో అవకాశాన్ని కల్పిస్తుంది. 2029 సార్వత్రక ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ప్రతిపక్షాలు ఒక బలమైన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకు వాటికి రెండు మార్గాలున్నాయి: పాత సంకీర్ణాన్ని ఒక కొత్త పేరుతో పునరుద్ధరించి, గెలవడానికి ప్రయత్నించడం లేదా ఒకప్పుడు ఉమ్మడి వారసత్వాన్ని కలిగివున్న రాజకీయ శక్తుల పునరేకీకరణ ద్వారా వాస్తవ మార్పులకు పూనుకోవడం. విపక్షాలు ఈ రెండిటిలో ఒకదాన్ని ఎంచుకోవాలి. మొదటిదాని వల్ల ప్రయోజనముండదు. రెండోది సత్వరమే జరగాలి. దీని ద్వారా మాత్రమే వాస్తవ మార్పులకు అవకాశమున్నది. రాజకీయ పునరేకీకరణ కాంగ్రెస్‌ను కేంద్ర స్థానంలో నిలబెడుతుంది. ప్రాంతీయ పార్టీల నాయకులు మరింత బృహత్తర పాత్ర నిర్వహించేందుకు ఆస్కారమిస్తుంది. మరీ ముఖ్యంగా ఓటర్లకు ఒక స్పష్టమైన పోటీని ప్రతిపాదిస్తుంది. ఆ పోటీ ప్రాబల్య బీజేపీ, పునశ్శక్తిమంతమైన కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రత్యామ్నాయానికి మధ్య అని ఓటర్లకు విశదమవుతుంది. సినిమాలో వలే రాజకీయాల్లో కూడా ఒకే కథనం రెండుసార్లు ఆదరణకు, ఆమోదానికి నోచుకోదు. చెప్పవచ్చినదేమిటంటే, ఇండియా కూటమి 2.0 ఒక సీక్వెల్. ప్రతిపక్షానికి నిజంగా అవసరమైనది కాంగ్రెస్ నాయకత్వంలో ఒక నిజమైన రాజకీయ పునఃప్రారంభం.
రాజ్‌దీప్ సర్దేశాయి
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్)
ఇవి కూడా చదవండి..
అమేథీ పంచాయతీ ఓటర్ల జాబితా నుండి స్మృతి ఇరానీ పేరు గల్లంతు
మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న రైలుపై దాడి.. ఇద్దరి అరెస్టు