హక్కులకు బాధ్యతలు ప్రత్యామ్నాయం కాదు!
ABN , Publish Date - Mar 01 , 2026 | 01:58 AM
‘బాధ్యతలు నెరవేరిస్తేనే హక్కులు దక్కుతాయి’ అనే శీర్షికతో ఫిబ్రవరి 24న ప్రచురితమైన వ్యాసం పౌరుల నైతిక ప్రవర్తనను ఉద్బోధించే క్రమంలో, ప్రజాస్వామ్యంలోని ప్రాథమిక సూత్రాలను విస్మరించింది.
‘బాధ్యతలు నెరవేరిస్తేనే హక్కులు దక్కుతాయి’ అనే శీర్షికతో ఫిబ్రవరి 24న ప్రచురితమైన వ్యాసం పౌరుల నైతిక ప్రవర్తనను ఉద్బోధించే క్రమంలో, ప్రజాస్వామ్యంలోని ప్రాథమిక సూత్రాలను విస్మరించింది. ఈ వ్యాసం పాలకుల బాధ్యతను ప్రజలపైకి నెట్టే ప్రయత్నానికి మేధో ముసుగు అందిస్తోంది.
వ్యాసకర్త ‘బాధ్యతలు నెరవేరిస్తేనే హక్కులు దక్కుతాయి’ అంటున్నారు. అంటే, హక్కులను షరతులతో ముడిపెట్టడమే (Conditionality of Rights) కదా. ఇది రాజ్యాంగ తత్వానికి విరుద్ధంగా కనిపించే సరళీకరణ. రాజ్యాంగం ప్రకారం పౌరుడే కేంద్ర బిందువు. ప్రభుత్వం అనేది ప్రజల సార్వభౌమత్వం నుంచి పుట్టిన ఒక సాధనం మాత్రమే. ప్రజలు వారి హక్కులను కాపాడుకోవడానికి, సామాజిక పురోగతి కోసం తమ అధికారాన్ని రాజ్యానికి ‘ట్రస్టీ’గా అప్పగిస్తారు. కాబట్టి, ప్రభుత్వాల విధి హక్కులను ప్రసాదించడం కాదు, ఉన్న హక్కులను రక్షించడం.
రాజ్యం తన విధులను కేవలం రాజ్యాంగ పరిధిలోనే నిర్వర్తించాలి. అభివృద్ధి పేరుతోనో, మరే ఇతర కారణంతోనో పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయడం రాజ్యాంగ విరుద్ధం. విభిన్న వర్గాల ప్రయోజనాలను సమతూకం చేస్తూ, రాజ్యాంగ ఆశయాలను నెరవేర్చడమే నిజమైన ప్రజాస్వామ్య పాలన. భారత రాజ్యాంగం ప్రకారం, ప్రాథమిక హక్కులు (Fundamental Rights) పౌరుడికి సహజసిద్ధంగా లభిస్తాయి. అవి ఏదైనా ‘పని’ చేసినందుకు ఇచ్చే బహుమతులు కావు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఒక పౌరుడు తన బాధ్యతను నిర్వర్తించలేదనే నెపంతో, అతని వాక్ స్వాతంత్ర్యాన్ని లేదా జీవించే హక్కును ప్రభుత్వం దూరం చేయకూడదు. హక్కులను బాధ్యతలతో ముడిపెట్టడం అంటే పౌరుడిని ప్రభుత్వం ముందు మోకరిల్లేలా చేయడం వంటిదే.
వ్యవస్థాగత వైఫల్యాలను వ్యక్తిగతీకరించేలా (Individualizing Systemic Failures) వ్యాసకర్త పలు అంశాలు ప్రస్తావించారు. పర్యావరణ పరిరక్షణ, అవినీతిని అంతం చేయడం, ప్రజా ఆస్తుల రక్షణ వంటి అంశాలను పూర్తిగా పౌరుల బాధ్యతగా ఆయన చిత్రించారు. అలాగే, ‘చెట్లు నాటడం, వన్య ప్రాణులను కాపాడడం, కాలుష్యాన్ని తగ్గించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం... వంటి చర్యలు తీసుకోవడం మన బాధ్యత’ అన్నారు. ఉదాహరణకు, అమెరికాలో పర్యావరణ ఉద్యమాలు బలపడుతున్న 1960 దశకంలో అక్కడి కార్పొరేట్ శక్తులు ఎంచుకున్న ‘పక్కదోవ పట్టించే ఎత్తుగడ’ ఇదే. ‘అమెరికాను అందంగా ఉంచుదాం’ అంటూ కోకాకోలా వంటి కంపెనీల ప్రకటనల్లో ‘ప్రజలే కాలుష్యాన్ని మొదలుపెడతారు, కాబట్టి ప్రజలే దాన్ని ఆపగలరు’ అని ఊదరగొట్టారు. అలాంటి పలు ప్రకటనలను పరిశీలించిన ప్రొ. ఫినిస్ డనవే వాటిని విశ్లేషిస్తూ ‘సీయింగ్ గ్రీన్’ (Seeing Green) అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో, ఇదొక ప్రచార మాయాజాలమనీ, ఉత్పత్తిదారుడి బాధ్యతలను వినియోగదారుడిపైకి నెట్టి, తాము సురక్షితంగా తెరవెనుక ఉండిపోయే ప్రయత్నమనీ డనవే రాశారు. అదే కోవలో ఈ వ్యాసకర్త కూడా ప్రభుత్వ బాధ్యతను ప్రజల బాధ్యతగా చిత్రించే ప్రయత్నం చేశారు. సమస్య యొక్క నిర్మాణాత్మక మూలాలను ప్రస్తావించకుండా, నైతిక బాధ్యతను వ్యక్తిగత స్థాయికి కుదించే ఫ్రేమింగ్ ఆ వ్యాసంలో కనిపిస్తోంది. అంటే, భారీ పరిశ్రమల వల్ల కలిగే కాలుష్యాన్ని నియంత్రించడంలో విఫలమైన ప్రభుత్వం– ప్రజలకు ‘ప్లాస్టిక్ వాడొద్దు’ అని చెప్పడం ద్వారా తన వైఫల్యాన్ని ప్రజలపైకి నెట్టేస్తోంది (Deflection). అవినీతి అనేది వ్యవస్థలో ఉన్న లోపం, దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత పాలకులదే కానీ, కేవలం ప్రజల నీతిపై ఆధారపడి వ్యవస్థ మారదు.
వ్యాసమంతా పౌరులు ఏం చేయాలి అనే దానిపైనే దృష్టి సారించింది. కానీ, పాలకులు లేదా ప్రభుత్వం ఏం చేయాలి అనే అంశాన్ని పూర్తిగా విస్మరించింది. ప్రజాస్వామ్యం అంటే కేవలం ప్రజల బాధ్యత మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువగా పాలకుల జవాబుదారీతనం (Accountability). ప్రజలు పన్నులు కడుతున్నప్పుడు, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతను గుర్తుచేయకుండా, కేవలం ప్రజలకే పాఠాలు చెప్పడం ఏకపక్షంగా ఉంది.
అధికార పక్షానికి అనుకూలమైన వాదనలు ఈ వ్యాసంలో ఉన్నాయి. ‘రాజకీయ అస్థిరత, విలువల క్షీణత’ వంటి కారణాల వల్ల 1976లో (ఎమర్జెన్సీ సమయంలో) ప్రాథమిక బాధ్యతలను రాజ్యాంగంలో చేర్చారని వ్యాసంలో ఉంది. ఆ సమయంలో పౌరుల గొంతు నొక్కడానికి, ప్రభుత్వానికి ఎదురు తిరగకుండా చేయడానికి ఈ ‘బాధ్యతల’ ముసుగును ఉపయోగించారు. వ్యాసం ఆ చారిత్రక కోణాన్ని విస్మరించి, దాన్ని ఒక గొప్ప సంస్కరణలా చిత్రీకరించింది. ఈ వ్యాసం పౌరుడిని ఒక ‘విధేయుడైన సేవకుడి’గా చూడాలని కోరుకుంటోందే తప్ప, ప్రశ్నించే ‘హక్కులు గల పౌరుడి’గా కాదు. బాధ్యతలు ముఖ్యం, కాదనలేం. కానీ అవి హక్కులకు ప్రత్యామ్నాయం కాకూడదు. ‘హక్కులు లేని బాధ్యతలు బానిసత్వం.. బాధ్యత లేని హక్కులు అరాచకం’ అంటారు. కానీ ఇక్కడ వ్యాసం కేవలం మొదటి దానికే ప్రాధాన్యమిచ్చి, రెండోవైపు ఉన్న ప్రభుత్వ బాధ్యతను కప్పిపుచ్చింది.
- బాబూరావు కలపాల