‘సర్’ వలె సంక్షేమ పథకాల్లో అనర్హులను తొలగించాలి
ABN , Publish Date - Jul 08 , 2026 | 05:07 AM
కేంద్ర ఎన్నికల సంఘం సర్ ప్రక్రియ ద్వారా అనర్హులైన ఓటర్లను తొలగించి, అర్హులైన వారిని జాబితాలో చేరుస్తున్నది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా...
కేంద్ర ఎన్నికల సంఘం సర్ ప్రక్రియ ద్వారా అనర్హులైన ఓటర్లను తొలగించి, అర్హులైన వారిని జాబితాలో చేరుస్తున్నది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పుడో జారీ చేసిన రేషన్ కార్డుల స్థానంలో ఇప్పుడు కొత్త కార్డులు జారీ ఇస్తున్నది. అయితే ఆర్థిక సంస్కరణల పిమ్మట, కొన్ని కుటుంబాల ఆదాయం పేద/సామాన్య స్థాయి నుంచి మధ్య/ఎగువ మధ్య తరగతి స్థాయికి పెరిగింది. కొత్త కార్డులు ఇస్తున్న వేళ కుటుంబసభ్యుల వివరాలని క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండా యథాతథంగా కొత్త రేషన్ కార్డులిస్తే ప్రభుత్వంపై అదనపు భారం తప్ప, ప్రయోజనం లేదు, నేడు కార్లలో తిరుగుతున్నవారు కూడా పేదల పెన్షన్లు, రేషన్ సరుకులు తీసుకుంటున్న వింత పరిస్థితి ఉంది. ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలకు రేషన్ కార్డుతో ముడిపెట్టడంతో, రేషన్ అవసరం లేని వారు కూడా కార్డు తీసుకునే స్థితి వచ్చింది. ఫలితంగా బియ్యం కూడా పక్కదారి పడుతున్నాయి. కనుక ప్రభుత్వం సంక్షేమ పథకాలకు రేషన్ కార్డుతో ముడి పెట్టకుండా, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో కుటుంబీకుల వివరాలను పరిశీలిస్తే, ఎందరో ఆర్థిక స్థితిపరులు స్వచ్ఛందంగా బియ్యం కార్డులు వదిలేస్తారు. ఇంకా పేదలెవరైనా మిగిలిపోతే వారికి కూడా బియ్యం కార్డులు పంపిణీ చేస్తే పేదలకి న్యాయం జరుగుతుంది.
తిరుమలశెట్టి సాంబశివరావు, గుంటూరు