Share News

Rajkumari Indiradevi: నేను బతికి ఉన్నానని తెలిసింది అలాగే!

ABN , Publish Date - Jan 18 , 2026 | 12:52 AM

సుమారు మూడేళ్ల క్రితం అనుకుంటా... రాజకుమారి ఇందిరాదేవి ధనరాజ్‌ గిర్‌ని నేను తొలిసారి కలిసింది. జ్ఞాన్‌బాగ్‌ ప్యాలెస్‌కు వెళ్తూ ఓల్డ్‌ సిటీలో దారి తప్పితే ఆవిడ నాకు వరుసగా కాల్స్‌ చేస్తూ దారి చెబుతూనే ఉన్నారు.

Rajkumari Indiradevi: నేను బతికి ఉన్నానని తెలిసింది అలాగే!

సుమారు మూడేళ్ల క్రితం అనుకుంటా... రాజకుమారి ఇందిరాదేవి ధనరాజ్‌ గిర్‌ని నేను తొలిసారి కలిసింది. జ్ఞాన్‌బాగ్‌ ప్యాలెస్‌కు వెళ్తూ ఓల్డ్‌ సిటీలో దారి తప్పితే ఆవిడ నాకు వరుసగా కాల్స్‌ చేస్తూ దారి చెబుతూనే ఉన్నారు. ఆవిడతో మాట్లాడుతుంటే బాగా సన్నిహితమైన మనిషితో సంభాషిస్తున్నట్లే అనిపించింది. నేను తిరిగి వచ్చేస్తుంటే... ‘మళ్లీ ఎప్పుడు వస్తారు?’ అని అడిగారు. ఆ తర్వాత వృత్తిపరంగా.. స్నేహపూర్వకంగా కలుస్తూనే ఉన్నాం. మంగళవారం సాయంత్రం ఆమె మరణించారని తెలిసిన వెంటనే వెలితిగా అనిపించింది. ఆమె నుంచి ఇక మెసేజ్‌లు రావంటే బెంగగా అనిపించింది. ‘‘అన్‌వెల్‌.. గ్రేట్‌ఫుల్‌ టూ యూ’’ అనేది శుక్రవారం నాకు పంపిన ఆఖరి మెసేజ్‌. ‘‘మీ ఆరోగ్యం త్వరలోనే మెరుగుపడుతుంది.. త్వరగా కలుద్దాం..’’ అని నేను రిప్లై ఇచ్చాను. స్పందన లేదు. 96 ఏళ్ల వయస్సులో... అనారోగ్యం పట్టి పీడిస్తున్నా... సన్నిహితులతో కనెక్ట్‌ కావాలనే కాంక్షతో ఆమె మెసేజ్‌లు పంపటం– జీవితం పట్ల ఆమెకు ఉన్న మమకారానికి ప్రత్యక్ష సాక్ష్యం.


మొదట్లో రాజకుమారి నన్ను ‘ప్రసాద్‌ గారు’ అని పిలిచేవారు. ఒక రోజు– మీరు వయస్సులో నా కన్నా చాలా పెద్దవారు.. నాకు ‘గారు’ అని తగిలించద్దు.. ప్రసాద్‌ అని పిలవండి’’ అన్నా. నవ్వేసి ‘‘నా బంధువులు.. కొందరు ముఖ్యమైన స్నేహితులు నన్ను ‘అక్క రాజే’ అని పిలుస్తారు. నువ్వు అలాగే పిలు..’’ అన్నారు. ఆ రోజు నుంచి ఆమె నాకు ‘అక్క రాజే’నే! కానీ ఆవిడ మాత్రం ఎప్పుడూ ‘ప్రసాద్‌ గారు’ అని పిలిచేవారు. నెల రోజుల క్రితం ఆవిడ పుస్తకం– ‘అలనాటి కథ’ ముందుమాటలో– ‘ప్రసాద్‌’ అని ఉంటే కొట్టేసి– ‘ప్రసాద్‌గారు’ అని రాశారు. వ్యక్తులకు గౌరవం ఇవ్వటం బహుశా ఆవిడకు చిన్నప్పుడే నేర్పిన విద్య అనుకుంటా! ఈ సందర్భంలో ఇంకో జ్ఞాపకం గుర్తుకొస్తోంది. వయస్సులో కొద్దిగా చిన్నదయినా– ప్రిన్సెస్‌ ఎస్రాతో ఆమెకు మంచి అనుబంధం ఉండేది. సుమారు ఏడాది క్రితం కొత్త నిజాం పట్టాభిషేకం జరిగినప్పుడు– ప్రిన్సెస్‌ ఎస్రా గౌరవార్థం ఆమె ఒక విందు ఇచ్చారు. హైదరాబాద్‌, మహారాష్ట్రలలో ఉన్న అనేక మంది రాజకుటుంబీకులు ఆ విందుకు వచ్చారు. బహశా ఆ అతిథుల్లో సామాన్యుడిని నేనొక్కడినే అనుకుంటా! అప్పటికే ఆమె ఎక్కువ సేపు నిలబడలేని స్థితిలో ఉన్నారు. అయినా ప్రిన్సెస్‌ వచ్చిన వెంటనే లేచి నిలబడి నన్ను పరిచయం చేశారు. ఆ తర్వాత– ‘‘మీరు స్నేహితులే కదా.. ఎందుకు లేచి నిలబడ్డారు?’’ అని అడిగాను. నవ్వేసి– ‘‘మా నాన్న రాజా. వాళ్ల మామగారు నిజాం.. వాళ్ల అబ్బాయి ప్రస్తుత నిజాం’’ అన్నారు. ఇలా సంప్రదాయాలను పాటించే వ్యక్తులు బహుశా మన చుట్టూ అతి తక్కువ మంది ఉంటారనుకుంటా!


రాజకుమారితో మాట్లాడుతుంటే చరిత్రలో సుప్రసిద్ధమైన వ్యక్తులందరూ కళ్ల ముందుకు వచ్చి నిలిచేవారు. భుట్టో రాసిన ప్రేమలేఖలు గురించి.. ప్రిన్సెస్‌ ఎస్రా తిరుపతి యాత్ర గురించి.. పంజాబ్‌ యువరాజుతో ప్రేమ పెళ్లి దాకా వచ్చి తప్పిపోవటం గురించి.. ఊటీలో శేషేంద్ర రాసిన కవిత్వం గురించి.. ఎన్టీఆర్‌ కుటుంబం గురించి.. ముఖ్దుంతో కవిత్వ చర్చల గురించి.. జనరల్‌ మానెక్‌ షా అందమైన భార్య గురించి.. నెహ్రూ నుంచి తీసుకున్న ఆటోగ్రాఫ్‌ గురించి.. నిజాం చనిపోయిన తర్వాత వారి కుటుంబ వ్యవహారాల గురించి.. చిన్నప్పుడు పిఠాపురం మహారాణి భారతీదేవి ఇంట్లో గోడ దూకి కాలు విరగొట్టుకోవటం గురించి.. సి.కె.నాయుడు తనతో ఆడిన క్రికెట్‌ గురించి– వందల విషయాలు వచ్చిపోతూ ఉండేవి. ఏరుకోవాలే తప్ప– అన్నీ చరిత్రలో నిలిచే ఆణిముత్యాలే!


ఆంధ్రజ్యోతి– నవ్య డైలీలో ఆమె రాసిన కాలమ్‌కు చాలా మంచి పేరు వచ్చింది. ఆమెకు ఆరోగ్యం సహకరించకపోవటంతో కాలమ్‌ను ఆపివేయాల్సి వచ్చింది. తన సహచరుడు, కవిమిత్రుడు, భర్త శేషేంద్ర శర్మ మరణం తర్వాత రాజకుమారి చాలా వేదనకు గురయ్యారు. తన చుట్టు ఉన్నవారికి దూరంగా జరిగారు. ‘నవ్య’ కాలమ్‌ ద్వారా మళ్లీ వారికి దగ్గరయ్యానని.. మళ్లీ అందరూ పలకరిస్తుంటే ఆనందంగా ఉందని చెప్పిన సందర్భాలెన్నో! ‘ఈ కాలమ్‌తో నేను బతికి ఉన్నానని చాలా మందికి తెలిసింది’ అనేవారు. ఇక గుంటూరు శేషేంద్ర శర్మ ద్వారా పరోక్షంగా.. ఉర్దు అకాడమీ చైర్‌పర్సన్‌గా ప్రత్యక్షంగా తెలుగు రాష్ట్రాలకు ఆమె ఎంతో భాషా సేవ చేశారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ)కి, సీసీఎంబీకి కూడా ఆమె అనేక ఎండోమెంట్స్‌ అందచేశారు. అనేక స్వచ్ఛంద సంస్థలకు కూడా ప్యాట్రన్‌గా ఉండేవారు.


శేషేంద్ర మరణం తర్వాత ఆమె తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. ప్యాలెస్‌ నుంచి అరుదుగా బయటకు వచ్చేవారు. కాలంతో పాటు ఆమె స్నేహితులందరూ చరిత్రలో కలిసిపోయారు. చాలా దురదృష్టకరమైన విషయమేమిటంటే– ఆమెతో అనేక సందర్భాలో జ్ఞాన్‌బాగ్‌ ప్యాలెస్‌లో విందుల్లో పాల్గొన్న రాజకుటుంబీకులెవ్వరూ ఆమె అంత్యక్రియలకు హాజరు కాకపోవటం. వందలాది మంది మధ్య రాజలాంఛనాలతో జరగాల్సిన ఆమె అంత్యక్రియలు– అత్యంత నిడారంబరంగా– తెలుగు బ్రాహ్మణ సంప్రదాయ పద్ధతిలో జరగటం. చివరి రోజుల్లో ఆమెకు రెండు కోరికలు ఉండేవి. ఒకటి– బేగంబజార్‌లో 250 ఏళ్ల నాడు కట్టిన తన తాతల సమాధుల పరిరక్షణ. జ్ఞాన్‌బాగ్‌ ప్యాలెస్‌ సమీపంలో ఉన్న తన తండ్రి భవంతి పునరుద్ధరణ. ఈ రెండు తీరకుండానే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆమెతో పాటుగా 150 ఏళ్ల చరిత్ర ఉన్న జ్ఞాన్‌బాగ్‌ ప్యాలెస్‌ కూడా చరిత్రలో కలిసిపోవచ్చు. హైదరాబాద్‌ చరిత్రలో మరొక రాణి నిశబ్దంగా ఎవ్వరికీ తెలియకుండానే నిష్క్రమించింది. జీవితం పట్ల ఆమెకు ఉన్న ఆసక్తికి.. అనురక్తికి నివాళి!

సి.వి.ఎల్‌.ఎన్‌. ప్రసాద్‌ (సీనియర్‌ జర్నలిస్ట్‌)

Updated Date - Jan 18 , 2026 | 12:54 AM