Share News

భాషలో అసమానతను ఎలా సరిచేద్దాం?

ABN , Publish Date - Apr 13 , 2026 | 01:42 AM

భాష అనేది కేవలం భావ వినిమయ సాధనం మాత్రమే కాదు, అది ఒక సమాజపు సంస్కృతికి, విలువలకు అద్దం పడుతుంది. అలాంటి మన తెలుగు భాషలో పరిపూర్ణ విలువలు ఉన్నాయా?

భాషలో అసమానతను ఎలా సరిచేద్దాం?

భాష అనేది కేవలం భావ వినిమయ సాధనం మాత్రమే కాదు, అది ఒక సమాజపు సంస్కృతికి, విలువలకు అద్దం పడుతుంది. అలాంటి మన తెలుగు భాషలో పరిపూర్ణ విలువలు ఉన్నాయా? ఎందరో దేశ విదేశీ భాషా పండితులు మెచ్చిన భాష మన తెలుగు. తెలుగు పదాల నుంచి వచ్చే శబ్దం సంగీతం లాగా ఉంటుందని అనేకమంది అన్యులు పొగిడిన భాష మనది. అలాంటి మన భాషలో ఒక దోషం వేల ఏళ్లుగా కొనసాగుతున్నది. వ్యాకరణంలోనే పొందుపరచబడ్డ ‘లింగ వివక్ష’ నేటి ఆధునిక ప్రజాస్వామ్య విలువలకు పూర్తి భిన్నమైనది. ఎందరో మెచ్చిన భాషకు అపకీర్తి మిగిల్చేదిగా ఉన్న ఈ వివక్షను ఇప్పటికైనా రూపుమాపాల్సిన బాధ్యత మనపై ఉంది. అసలు ఆ వివక్ష ఏమిటి?


నామాలు, సర్వనామాలు, వాటితో కూడిన సమాపక క్రియల్లోని అక్షరాలను చూస్తే అది స్పష్టమవుతుంది. రాముడు వచ్చాడు – సీత వచ్చింది. అతడు వచ్చాడు – ఆమె వచ్చింది. వాడు వచ్చాడు – అది వచ్చింది. వాడిని పొగిడారు – దానిని పొగిడారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, పురుషుడికి తప్ప మిగిలిన అన్నిటికీ ఒకే సర్వనామం, ఒకే సమాపక క్రియను వాడటం. కుక్క వచ్చింది – దానికి అన్నం పెట్టండి. బల్ల పడింది – దానిని లేపండి. కవిత అచ్చయింది – దానిని చదవండి. వాచీలో సమయం మారింది – దానిని సరి చేయండి. దగ్గు వచ్చింది – దానికి మందేయండి... ఈ ఉదాహరణలన్నింటిలో స్త్రీకి, జంతువుకు, వస్తువుకు, కళకు, కాలానికి, రోగానికి.. అన్నిటికీ ‘అది/దాని’ అనే సర్వనామం, ‘ది’ అనే సమాపక క్రియే ఉండటం మన తెలుగు భాషలోని గొప్ప లోపం. ఇది వేల ఏళ్ల నాడే భాషలో జొప్పించబడిన భూస్వామ్య–పురుషాధిక్య కోణం.


వాస్తవంగా కర్తను, కర్మను బట్టి చివరన వచ్చే క్రియల ద్వారా ఆయా లింగ భేదాలు తెలియాలి. కానీ తెలుగులో ఒక్క పురుషుడికి మాత్రమే ప్రత్యేక క్రియావాచకం ఉంది. అన్నింటికంటే అన్యాయం స్త్రీని వస్తువులతో, జంతువులతో జమ కట్టేయడం. వ్యాకరణ పరంగా చూస్తే వాడు–అది, అతడు–ఆమె, ఆయన–ఆవిడ అని ఉన్నా, ‘అది’ అనే సర్వనామాన్ని, ‘వచ్చింది’ అనే క్రియను స్త్రీకీ, జంతువుకూ, వస్తువుకూ కలిపి వాడటం అవమానకరం. వాడికి దెబ్బ తగిలింది (పురుషుడికి), దానికి దెబ్బ తగిలింది (స్త్రీకి), దానికి దెబ్బ తగిలింది (జంతువుకు). వాడిని కొట్టారు (అతడిని), దానిని కొట్టారు (ఆమెని), దానిని కొట్టారు (కుక్కని).. ఇలా!

భాషాశాస్త్రపరంగా గౌరవంగా పిలిచే వాటిని మహద్వాచకాలు (మహత్తులు) అనీ, అగౌరవంగా పిలిచే వాటిని అమహద్వాచకాలు (అమహత్తులు) అనీ అంటారు. తెలుగులో పురుషులు/ దేవతలు మాత్రమే ‘మహత్తులు’ (సుపీరియర్‌), స్త్రీలు, జంతువులు, వస్తువులు ‘అమహత్తులు’ (ఇన్‌ఫీరియర్‌). స్త్రీలను అమహద్వాచకంగా చేర్చి, ‘తిర్యక్కుల’ (జంతువుల)తో సమానంగా ‘వచ్చింది, పోయింది’ అని సంబోధించడం ప్రాచీన పురుషస్వామ్య సమాజపు ఛాయలే. ఇది నేటి కాలానికి అప్రజాస్వామికం.


ప్రపంచవ్యాప్తంగా అన్యభాషీయులు కూడా ఇది భాషాశాస్త్రపరంగా ఎత్తిచూపే విషయమే. మన పక్కనున్న ద్రవిడ భాషల్లో, ఉత్తరాది భాషల్లో స్త్రీకి ఉన్న క్రియా స్థానాన్ని పరిశీలిస్తే తెలుగులోని లోపం అర్థమవుతుంది. తమిళంలో స్త్రీని ‘అమహత్తు’లో చేర్చలేదు. అక్కడ ‘అవళ్‌ వందాల్‌’ (ఆమె వచ్చింది) అని స్త్రీకి ప్రత్యేకమైన ‘అల్‌’ ప్రత్యయం ఉంది. జంతువు/వస్తువుకు ‘అదు వందదు’ (అది వచ్చింది) అని ‘దు’ వాడతారు. మలయాళంలో ‘వన్ను’ (వచ్చారు) అని అందరికీ సమానంగా వాడినా, సంబోధనలో స్త్రీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. కన్నడలో పురుషుడికి ‘బందను’, స్త్రీకి ‘బందలు’ అని ‘లు’ ప్రత్యయం ఉండగా, జంతువుకు ‘బంతు’ అని స్పష్టమైన తేడా ఉంది. బెంగాలీలో అందరికీ ఒకే క్రియ ఉండటం వల్ల వివక్షే లేదు. హిందీలో వస్తువులకు లింగం ఉన్నా, స్త్రీకి ‘వహ్‌ ఆయీ’ అని ఇచ్చే గౌరవం వినడానికి అమహత్తుగా అనిపించదు. ఇక సంస్కృతంలో మూడు లింగాలు శాస్త్రీయంగా ఉంటాయి. అక్కడ క్రియ లింగం మీద కాక వచనం, పురుష మీద ఆధారపడుతుంది. ‘రామః గచ్ఛతి’, ‘సీతా గచ్ఛతి’ అని రెండింటికీ సమాన క్రియే ఉంటుంది. కానీ సర్వనామాల్లో ‘సః’ (వాడు), ‘సా’ (ఆమె), ‘తత్‌’ (అది) అని అత్యంత స్పష్టత ఉంటుంది.


ఇటు మాతృక అయిన ద్రవిడ భాషల్లో లేనిది, అటు ప్రభావితం చేసిన సంస్కృతంలో లేనిది, తెలుగులో ఈ వివక్ష ఎలా ప్రవేశించింది? తెలుగులోనూ పూర్వం ‘‘ఆమె వచ్చింది’’ కంటే ‘‘ఆమె వచ్చెను’’ అనే మధ్యస్థ రూపాలు ఉండేవి. కానీ వాడుక భాషలో ‘‘వచ్చింది’’ అనేదే స్థిరపడిపోయింది. మన తెలుగు వ్యాకరణకర్తలు సంస్కృతాన్ని అనుసరించామని చెబుతూనే, స్త్రీల విషయంలో ఆ భాషలోని ఆ విశిష్టతను ఎందుకు విస్మరించారు? తెలుగు, గోండి వంటి ‘మధ్య ద్రవిడ’ భాషలు పరిణామం చెందే క్రమంలో జరిగిన ‘జెండర్‌ న్యూట్రలైజేషన్‌’ అనే సాంకేతిక పొరపాటు లింగవివక్షకు దారి తీసింది. ‘‘స్త్రీ శూద్రౌ నాధీయతావ్‌ు’’ వంటి సూత్రాలు స్త్రీని విజ్ఞానానికి, గుర్తింపుకు దూరం చేశాయి. ఆ భావజాలమే వ్యాకరణంలో ‘అమహత్తు’ వర్గీకరణకు పునాది వేసింది. అంటే నన్నయ కాలంనాటికి వారసత్వంగా వచ్చిన రాచరిక పురుషస్వామ్య ధోరణులు స్త్రీని ‘నపుంసక’ వర్గంతో సమానంగా అమహత్తులో పడేశాయి. ఇప్పటికైనా ఈ దోషాన్ని సవరించాలి. మన భాషలో స్థిరపడిపోయిన స్త్రీ వివక్షను రూపుమాపాలి. ఆంగ్లంలో సైతం ‘జెండర్‌ న్యూట్రల్‌’ పదాల వాడకం పెరిగింది. ఉదాహరణకు: చైర్మన్‌ స్థానంలో చైర్‌పర్సన్‌ అని, మేన్‌ పవర్‌ స్థానంలో వర్క్‌ ఫోర్స్‌ అని, ఫైర్‌మేన్‌ స్థానంలో ఫైర్‌ ఫైటర్‌ అని, మేన్‌ కైండ్‌ని హ్యూమన్‌ అనీ మార్పులు జరుగుతున్నాయి.


దీనిని సరిచేయడానికి మూడు మార్గాలున్నాయి. మొదటి మార్గం– గౌరవ వాచకాలను సాధారణీకరించడం. అంటే స్త్రీలను ఎప్పుడూ బహువచనంతో ‘ఆమె వచ్చారు’ అని సంబోధించడం. అయితే చిన్న వాళ్ల గురించి చెప్పేప్పుడు ఇబ్బంది ఉంటుందేమో! ఇక రెండో మార్గం– ‘ఉభయలింగ’ సంబోధన (జెండర్‌ న్యూట్రల్‌). తమిళం లేదా ఇంగ్లీష్‌ తరహాలో, లింగ భేదం లేకుండా అందరికీ ఒకే క్రియా పదాన్ని బహువచనం వాడటం. ఆయన వచ్చారు – ఆమె వచ్చారు... ఇలా! ఇక మూడో మార్గం, పురుషులకు ‘డు’ (వచ్చాడు) ఉన్నట్లే, స్త్రీలకు ‘ది’ (వచ్చింది) ని ఖాయం చేసి, జంతువులకు, వస్తువులకు ‘బి’ అనే ప్రత్యేక ప్రత్యయాన్ని వాడటం. (ట–ఠ–డ–ఢలలోని ‘డు’ పురుషులకు, త–ధ–ద–ధలలోని ‘ది’ స్త్రీలకు, ప–ఫ–బ–భలలోని ‘బి’ వస్తువులకు, జంతువులకు వాడటం). ఉదాహరణకు: అతడు వచ్చాడు, ఆమె వచ్చింది, పిల్లి వచ్చింబి, బల్ల పడింబి. అలాగే బానికి (పిల్లికి) అన్నం పెట్టండి. బానిని (పుస్తకాన్ని) అరలో సర్దండి... ఇలాగ. ఈ ‘బ’కార ప్రయోగం ద్వారా సంస్కృతంలోని ‘తత్‌’ (అది) వంటి ప్రత్యేక వర్గాన్ని సృష్టించి, సంస్కృత స్థాయి స్పష్టతను సాధించవచ్చు. ఈ ప్రయోగం మొదట్లో కొత్తగా ఉన్నా, నవ్వు వచ్చినా.. స్త్రీలకు, జంతువుతకు, వస్తువులకు మధ్య భాషాపరమైన వర్గీకరణ సౌలభ్యం, స్పష్టత పెరుగుతాయి. ముఖ్యంగా అసమానత పోతుంది. అయితే అలవాటయ్యే వరకు ఆచరణాత్మకంగా ఒక తరంపాటు దీనిపై అవగాహన కల్పించాలి. ముఖ్యంగా రాస్తూ పోతే.. చదివేవాళ్లు కూడా క్రమంగా అలవాటు చేసుకుంటారు. గ్రాంథికం నుంచి వ్యవహారిక భాష ఎలా పరిణామం చెందిందో మనకు తెలుసు. ఈ అర్ధ శతాబ్ద కాలంలోనే పత్రికలు, పాఠ్య పుస్తకాలలో సైతం ఎన్నో క్రియలు మారుతూ వచ్చాయి. పాఠ్య పుస్తకాలలో, ‘‘చేయవలయును’’ అని ఉండేది. తర్వాత ‘‘చేయవలెను’’, ‘‘చేయవలె’’, ‘‘చేయాలి’’గా మారింది.


జంతువులు, వస్తువులకు ప్రత్యేకించే ఈ మార్పు కేవలం అక్షరం మార్పు కాదు, వేల ఏళ్ల చారిత్రక పొరపాటును సరిదిద్దే ప్రయత్నం. ఈ మార్పుతో స్త్రీకి గౌరవంలభించడంతోపాటు, మన భాష మరింత ఉన్నతం అవుతుంది.

టి. కొండబాబు

94907 92047

Updated Date - Apr 13 , 2026 | 01:44 AM