రీచ్ ఇన్ ఎ బ్లింక్
ABN , Publish Date - Apr 06 , 2026 | 03:31 AM
బతుకుకు భరోసా లేని చోట మనుగడ ఓ పరుగు పందెం నీ ప్రాణశ్వాసని నీ నుంచి వేరు చేసి తన బ్రాండ్‌లోకి కలిపేసుకున్న...
బతుకుకు భరోసా లేని చోట
మనుగడ ఓ పరుగు పందెం
నీ ప్రాణశ్వాసని నీ నుంచి వేరు చేసి
తన బ్రాండ్‌లోకి కలిపేసుకున్న కార్పోరేటీకరణలో
నీది డెత్ రేస్ కాక మరేమిటీ?
చావూ బతుకుల మధ్య రేఖ
నీకు నీవు గీసుకునేది కాదు
నీ లక్ష్యం నీ కలల కుంచె చిత్రించుకునే చిత్తరువు కాదు
వేగం గమ్యం నీ కోసం నీవు ఏర్పరచుకునే రక్షక కవచాలు కాదు
ఏ రక్షణా లేని
ఒట్టి శూన్యపు దారి నీ ఉపాధి
నీవు నడుస్తున్న దారుల వెంటా
నెత్తుటి ఆనవాళ్ళ మూగరోదన!
మృత సమాజపు చివరి ఆకలి కేకలా
ఆన్‌లైన్ ఆర్డర్లలో అంతరాత్మల వేట!
ఇరుకు సందుల ట్రాఫిక్ మాయాజాలాన్నెంత
ఒడుపుగా దాటుకుంటావో,
ఆ వేగం మాత్రమే నిన్ను
జీవన సమరంలో వీరుడిగా మారుస్తుంది–
పోటీలో ప్రాణాలొడ్డి నిలబడేలా చేస్తుంది–
ఇంకే ప్రమాణాలు లేవు, నైపుణ్యాలు ఒద్దు
నీ సృజనాత్మక అంతా నీ చురుకుదనమే!
ఇతరులను వెనక్కునెట్టే
చాకచక్యం నీ సొంతం అవునా కాదా?
జీవితం ఓ రేస్ ట్రాక్ అవునా కాదా? తేల్చుకో!
పరుగిడు... పరుగులోనే నిలబడు
పరుగులో నిద్రించు, పరుగే నీ మేల్కొలుపు,
పరుగే నీ ఆదరింపు... పరుగే నీ లాలింపు
బతుకును గెలిపించే చావును ఓడించే
పోరు కొనసాగించు...
గెలువు
లేదా విరిగిపడు!
నీ పనితీరుని వేరెవరో నిర్ధారిస్తారు
స్టార్ రేటింగ్‌ని నీ సౌభాగ్యంగా నీపై విసురుతారు
రేటింగ్ నీ నైపుణ్యానికి కాదు
బానిసత్వపు అంగీకారానికి.
హింసని పైకి కనబడనీయని టెక్నో బానిసత్వంలో
నీవో అత్యాధునీక బానిసవు,
అంతరాత్మల మారకంలో డిమాండ్ ఉన్న సరుకువు
భ్రమపడకు బ్రదర్ నీకు రేటింగ్ ఇచ్చినవాళ్ళూ
సర్వస్వతంత్రులు కాదు
అధికారపు పర్వతాల కింద పడి నలుగుతున్న
గడ్డిపోచలు
యాప్ అధికారి పాదాన్ని
కిరీటంగా ధరింపజేసిన మార్కెటింగ్ ట్రిక్‌కి
పుట్టిన గిగ్ వర్కర్‌వి
మూడుపూటల తిండి కోసం
ముప్పొద్దులా తిరిగే గానుగెద్దు వారసుడివి
చావో–రేవో
నీ వేగాన్ని మైక్రో క్షణాల్తో పోటీ పెట్టి,
గూగుల్ మాప్‌కి నీ గుండెలయని వేలాడదీసి,
శాటిలైట్ నిఘా వలలో
నెత్తురోడే కాలాన్ని లెక్కిస్తూ
గమ్యం చేరు–
నీ బతుకుకు భరోసా
పది వేల జీతం కాదు
పది నిమిషాల్లో
నువ్వు అధిరోహించే దూరం...
అంతే...
యాప్‌ల స్క్రోలింగ్‌కి జీవితాన్ని తాకట్టుపెట్టిన వాళ్ళకీ,
దాన్నో వ్యాపారంగా మార్చుకున్నవాళ్ళ అవసరాల
అంగీకారపు నేత్రాల, లాభం రెప్పలకీ మధ్య ఇరుక్కున్న
బ్లింక్ ఇట్ నీ జీవితం...
కాలపు వేగాన్ని మించిపోయే
పరుగును ప్రాక్టీస్ చేయ్
లేదా నీ ప్రాణాన్ని వాంహోల్‌గా
మార్చేయ్...
n మహమూద్
& 94410 27462