విప్లవ స్వాప్నికుడు.. రవూఫ్!
ABN , Publish Date - Feb 07 , 2026 | 02:34 AM
రాయలసీమ వెనుకబాటుతనం నుంచి విప్లవోద్యమ ఆచరణలోకి వచ్చాడు రవూఫ్. విప్లవకారుని జీవన విధానం ఏ రీతిలో ఉండాలో రవూఫ్ జీవనం ఒక నమూనా.
రాయలసీమ వెనుకబాటుతనం నుంచి విప్లవోద్యమ ఆచరణలోకి వచ్చాడు రవూఫ్. విప్లవకారుని జీవన విధానం ఏ రీతిలో ఉండాలో రవూఫ్ జీవనం ఒక నమూనా. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నుంచి చారు మజుందార్ రూపొందించిన విప్లవ పంథా వైపు ఆయన అడుగులు వేశాడు. తన రాజకీయ కార్యాచరణకు కుటుంబం అడ్డంకి అని నమ్మి, ఒంటరిగా జీవితాన్ని కొనసాగించాడు. చదివింది న్యాయవాద వృత్తి అయినా, ప్రజల మధ్య రాజకీయ కార్యకర్తగా పనిచేశాడు. ముస్లిం అస్తిత్వానికి దూరం జరిగాడు. మానవ సమాజంలో మనుషులందరూ కలిసి ఉండాలనే భావనను జీవితమంతా కొనసాగించాడు. విప్లవాన్ని చూసే దృష్టి కోణంలో అనేక అవగాహనలను, అభిప్రాయాలను గౌరవిస్తూనే... ఏకైక మార్గం నక్సల్బరీ పంథా అని నమ్మాడు.
భిన్న వర్గాల ప్రజలు నూతన భారతదేశ నిర్మాణం కోసం పనిచేయాలనే భావన రవూఫ్‌కు ఉండేది. ప్రజలే చరిత్ర నిర్మాతలనే మావో ఆలోచనను అన్వయించుకున్నాడు. భారతదేశంలో కోట్లాది రైతులు భూమి ఆధారంగా జీవిస్తున్నారు. రైతుల ఉన్నతే ఈ దేశ భవిష్యత్తు అని నమ్మాడు. అదే సమయంలో కార్మికవర్గ పోరాటాలను గమనిస్తూ, వాటిని తన రాజకీయ కార్యాచరణలో భాగం చేశాడు. తొంభై ఏళ్ల జీవితంలో అన్ని వర్గాల ప్రజలకు భరోసాగా నిలిచాడు. భారతదేశ పునర్నిర్మాణం అన్ని రంగాలలో జరగాలంటే నిజాయితీ, పోరాటరూపం ఉంటేనే సాధ్యపడుతుందని విశ్వసించాడు. పదమూడేళ్ల జైలు జీవితాన్ని రాజకీయ పాఠశాలగా మార్చుకున్నాడు. వివిధ ప్రాంతాల విప్లవకారులును జైల్లోనే కలుసుకున్నాడు. అది విప్లవమార్గానికి బీజాలు వేసింది. భారత విప్లవోద్యమం ఆపరేషన్ కగార్ మధ్య తన మార్గాన్ని వెతుకుతోంది. అనేక మంది విప్లవకారులు అమరులయ్యారు. కొందరు లొంగిపోయారు, ఇంకొందరు విప్లవ ప్రతీఘాతక దారిని ఎంచుకున్నారు. రవూఫ్ జీవించి ఉంటే తన విప్లవ స్వప్నం పట్ల ఎలా ఆలోచన చేసి ఉండేవారో!
– అరసవిల్లి కృష్ణ (విరసం)
(ఫిబ్రవరి 9న అనంతపురంలో రవూఫ్ వర్ధంతి సభ)