వందలేళ్ల వారసత్వం బొగ్గు కోసం బుగ్గి!
ABN , Publish Date - Oct 10 , 2026 | 01:06 AM
ములుగు జిల్లా వెంకటాపూర్ సమీపంలో ప్రతిపాదించిన పీవీ నరసింహారావు ఓపెన్‌కాస్ట్ బొగ్గు గని ప్రాజెక్టు అక్కడ ఎనిమిది వందల ఏళ్ళ వారసత్వం గల రామప్ప దేవాలయానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
ములుగు జిల్లా వెంకటాపూర్ సమీపంలో ప్రతిపాదించిన పీవీ నరసింహారావు ఓపెన్‌కాస్ట్ బొగ్గు గని ప్రాజెక్టు అక్కడ ఎనిమిది వందల ఏళ్ళ వారసత్వం గల రామప్ప దేవాలయానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అంతేగాక, రామప్ప చెరువుకు దిగువన ఉంది. బొగ్గు గని వల్ల కలిగే ప్రభావాన్ని కేవలం దేవాలయానికి ఏర్పడే పగుళ్లకు మాత్రమే పరిమితం చేయలేం. నీటి ప్రవాహాలు, రామప్ప చెరువు, పురాతన కాలువలు, భూగర్భజలాలు, పర్యావరణం, వ్యవసాయ భూములు, మొత్తం సాంస్కృతిక భూదృశ్యంపై ఈ బొగ్గుగని దీర్ఘకాలిక ప్రభావాన్ని కలిగించే ప్రమాదం ఉంది. ఈ ప్రతిపాదిత గనికి జీవిత కాలం సుమారు 19 సంవత్సరాలు మాత్రమే. పంతొమ్మిదేళ్ళపాటు వెలికితీయగలిగే వనరు కోసం వందల ఏళ్ళ వారసత్వాన్ని ప్రమాదంలో పెట్టడం అవసరమా అన్నది ఆలోచించాలి. అత్యంత కఠినమైన ప్రమాణాలతో ఈ నిర్ణయం తీసుకోవాలి.
13వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో పాలంపేటలో నిర్మించిన కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) దేవాలయం భారతీయ వాస్తుశిల్పం, శిల్పకళ, ఇంజినీరింగ్ ప్రతిభకు అపూర్వ నిదర్శనం. 2021లో యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. అయితే రామప్ప ప్రాధాన్యం దేవాలయ నిర్మాణంతో మాత్రమే ముగియదు. ఇక్కడి రామప్ప చెరువు, పురాతన నీటిపారుదల కాలువలు, సాగుభూములు, అడవులు, గ్రామాలు కలిసి ఒక విశిష్టమైన కాకతీయ సాంస్కృతిక భూదృశ్యాన్ని నిర్మించాయి.
ఇదే ఏడాది జరిగిన 48వ యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో– రామప్ప చెరువు, పురాతన కాలువలు సహా విస్తృత నీటిపారుదల వ్యవస్థను రక్షణ పరిధిలోకి తీసుకురావడానికి భారత్ చేపడుతున్న చర్యలను కమిటీ స్వాగతించింది. ప్రతిపాదిత సరిహద్దు మార్పునకు సంబంధించిన పత్రాలను 2027 ఫిబ్రవరి 1లోపు సమర్పించాలని ప్రోత్సహించింది. ఒకవైపు యునెస్కో ఈ సూచనలు చేస్తుంటే, మరోవైపు అక్కడే భారీ ఓపెన్‌కాస్ట్ గని ఏర్పాటు చేయడం సరైన నిర్ణయమేనా?
ఈ ప్రాజెక్టు పరిమాణం కూడా చిన్నది కాదు. ప్రతిపాదిత గనిలో ఏటా సుమారు 2.50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, గరిష్ఠంగా 3.75 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. సుమారు 40.43 మిలియన్ టన్నుల వెలికితీయగల బొగ్గు నిల్వలు, సుమారు 300 మీటర్ల గరిష్ఠ తవ్వకం లోతు, సుమారు 1,071 హెక్టార్ల భూమి, అందులో సుమారు 431.85 హెక్టార్ల అటవీ భూమి ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి.
ఈ ప్రాజెక్టుపై సీఎస్‌ఐఆర్–ఎన్‌ఈఈఆర్‌ఐ, హైదరాబాద్; ఎన్‌ఐటీకే సూరత్‌కల్; జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా; ఐఐటీ మద్రాస్; నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ, రూర్కీ; సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్, హైదరాబాద్ తదితర సంస్థలు వివిధ అంశాలను అధ్యయనం చేశాయి. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం నిర్దిష్ట నివారణ చర్యలు, సిఫారసులు అమలు చేస్తే రామప్ప దేవాలయం తదితర నిర్మాణాల స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం ఉండదని కొన్ని సాంకేతిక అధ్యయనాలు పేర్కొన్నాయి. ఐతే వారసత్వ పరిరక్షణను కేవలం దేవాలయ నిర్మాణ స్థిరత్వంతో కొలవలేం. ఒక చారిత్రక కట్టడం భౌతికంగా సురక్షితంగా ఉన్నప్పటికీ, దాని చుట్టూ ఉన్న నీటి వ్యవస్థ, పర్యావరణం, సాంస్కృతిక భూదృశ్యం దెబ్బతింటే వారసత్వం అసలు స్వరూపం దెబ్బతింటుంది. కాబట్టి వీటన్నిటిపైనా గని ప్రభావాన్ని ప్రత్యేకంగా పరిశీలించాలి. ఈ సంస్థల పూర్తి నివేదికలు, వాటి సిఫారసులు, గుర్తించిన ప్రమాదాలు, సూచించిన నివారణ చర్యలు, సంబంధిత ప్రభుత్వ శాఖల స్పందనలతో సహా ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
అదేవిధంగా, సమగ్ర హెరిటేజ్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ నిర్వహించాలి. అది కేవలం రామప్ప దేవాలయ నిర్మాణ భద్రతకు పరిమితం కాకుండా రామప్ప చెరువుకు సంబంధించిన అన్ని అంశాలను కలిపి పరిశీలించాలి. ముఖ్యంగా గని చెరువుకు దిగువన ఉన్నందున సమగ్ర జలవిజ్ఞాన అంచనా తప్పనిసరిగా ఉండాలి. తాజా యునెస్కో సిఫారసులను కూడా ఈ పరిశీలనలో భాగం చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు తెలంగాణ ప్రభుత్వం, ఈ ప్రాజెక్టుకు తుది అనుమతి ఇవ్వకూడదు. ఏఎస్‌ఐ సంబంధిత వారసత్వ పరిరక్షణ సంస్థలు పూర్తి ఆధారాలను పరిశీలించాలి. అనంతరం స్థానిక ప్రజలు, స్వతంత్ర వారసత్వ నిపుణులు, పర్యావరణ నిపుణులు, ఇతర భాగస్వాములతో పారదర్శకమైన ప్రజా సంప్రదింపులు నిర్వహించాలి.
ఈ చర్చ కేవలం ఒక గని ప్రాజెక్టు గురించి కాదు. మనం భవిష్యత్ తరాలకు ఎలాంటి వారసత్వాన్ని అందించాలనుకుంటున్నామనే ప్రశ్న ఇది. కాకతీయులు మనకు ఒక అద్భుతమైన దేవాలయాన్ని మాత్రమే గాక, నీటి నిర్వహణ, నీటిపారుదల, వ్యవసాయం, వాస్తుశిల్పం, సామాజిక జీవనం సమన్వయంతో కూడిన ఒక గొప్ప నాగరికతకు నిదర్శనాన్ని అందించారు. బొగ్గును మరెక్కడైనా వెలికితీయవచ్చు. రామప్పను మాత్రం మళ్లీ సృష్టించలేం.
- బోయినపల్లి వినోద్‌కుమార్
మాజీ పార్లమెంట్ సభ్యులు