‘రాజీవ్ యువ వికాస’ను అమలు చేయాలి
ABN , Publish Date - Jan 30 , 2026 | 02:06 AM
సమాజ అభివృద్ధిలో నిరుద్యోగులైన యువతీ యువకులకు సముచితమైన ఉపాధి, ఉద్యోగ, అవకాశాలు కల్పించడమే ప్రభుత్వాల ముఖ్య కర్తవ్యం. దురదృష్టవశాత్తు గత 15 సంవత్సరాలుగా తెలంగాణలో...
సమాజ అభివృద్ధిలో నిరుద్యోగులైన యువతీ యువకులకు సముచితమైన ఉపాధి, ఉద్యోగ, అవకాశాలు కల్పించడమే ప్రభుత్వాల ముఖ్య కర్తవ్యం. దురదృష్టవశాత్తు గత 15 సంవత్సరాలుగా తెలంగాణలో నిరుద్యోగులైన, యువతీ యువకులకు ఉపాధి కల్పించడంలో ఆయా ప్రభుత్వాలు విఫలమైనాయి. ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్, మేనేజ్‌మెంట్, వ్యవసాయ, డిగ్రీ కాలేజీలలో ఉన్నత విద్య నేర్చుకున్న యువతీ యువకులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేకపోయినా గ్రామీణ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు, ఇతర సేవా రంగాలను ప్రోత్సహిస్తూ సముచితమైన స్థాయిలో ఆర్థిక స్వాలంబన చేకూర్చవచ్చు. పారిశ్రామిక రంగంలో ముందంజలో ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాలు యువతీ యువకుల ఉపాధి కల్పనలో ముందు వరసలో ఉన్నాయి.
ఉద్యమ కాలంలో తెలంగాణలో కూడా నిరుద్యోగ యువతీ యువకులు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యారు. రాష్ట్రం ఏర్పడ్డాక కూడా కేసీఆర్ పాలనలో యువతీ యువకులకు నిర్లక్ష్యమే ఎదురయింది. స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తామని ఐదు లక్షల దరఖాస్తులను స్వీకరించి తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో చిల్లి గవ్వ కూడా విదిలించలేదు. కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల ముందు తమ మేనిఫెస్టో ద్వారా నిరుద్యోగ యువతీ యువకుల సమస్యల పరిష్కారానికి అనేక పథకాలను ప్రకటించింది. యూత్ కమిషన్ నియమించి సమస్యల పరిష్కారం నిరంతర ప్రక్రియగా అమలు చేస్తామన్నది. మండల కేంద్రాలలో స్కిల్ డెవలప్‌మెంట్, స్టడీ సర్కిల్ సంస్థలు ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ కాంట్రాక్టులలో తగిన భాగస్వామ్యం కల్పిస్తామని, ప్రతి జిల్లాలో పారిశ్రామికవాడల నిర్మాణం చేపడతామని, యువతీ యువకులకు వివిధ ఫైనాన్స్ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను కల్పిస్తామని ప్రకటించింది. గత సంవత్సరంలో రాజీవ్ యువ వికాస పథకం ప్రకటించి దాదాపు 16.23 లక్షల దరఖాస్తులు స్వీకరించింది. దాదాపు 15 సంవత్సరాల నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం యువతీ యువకుల ఉపాధి, ఉద్యోగ కల్పనకు ప్రకటించిన రాజీవ్ యువ వికాస్ పథకం అమలుకై లక్షలాది యువతీ యువకులు సంవత్సర నుంచి ఎదురుచూస్తున్నారు.
పేదలకు ఉచిత విద్యుత్తు, స్త్రీలకు ఉచిత బస్సు, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం మొదలైన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర జనాభాలో సామాజిక, ఆర్థిక ఎదుగుదలలో అత్యంత కీలకమైన వర్గం నిరుద్యోగ ఔత్సాహిక యువతీ యువకులు. ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువ వికాస పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయవలసిన అవసరాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలి. ఈ ప్రభుత్వం రెండు వార్షిక బడ్జెట్లు సమర్పించినా తమ సమస్యలు పట్టించుకోవడం లేదనే అసంతృప్తి యువతలో కనిపిస్తోంది. రాష్ట్ర సాధనకు అత్యంత కీలకంగా కృషి చేసి, అనేక త్యాగాలు చేసిన ఉద్యమకారులైన యువతను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ప్రశ్నిస్తే అణిచివేతకు గురిచేసింది. యాంత్రీకరణ, ప్రైవేటీకరణలో భాగంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో సబ్సిడీ రుణాలు కల్పించడం ద్వారా స్వయం ఉపాధి పథకాలు, స్టార్టప్స్ ప్రోత్సహించాలి. గ్రామీణ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధిని సాధించవచ్చు. బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పన కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి, కనీసం పదివేల కోట్ల రూపాయలు కేటాయించి, రాజీవ్ యువ వికాస పథకాన్ని అమలు చేయాలి.
ప్రొఫెసర్ కూరపాటి వెంకట్‌నారాయణ
తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర వేదిక చైర్మన్