కొత్త రాహుల్, పాత కాంగ్రెస్!
ABN , Publish Date - Sep 05 , 2026 | 12:21 AM
పక్షం రోజుల క్రితం నేను పూణేలో ఉన్నాను. ఒక అసాధారణ దృశ్యం నా కళ్లను కమ్మివేసింది. ఎటుచూసినా ఒకే వ్యక్తి ముఖం. ఆ వ్యక్తి రాహుల్‌గాంధీ. భారతీయ జనతా పార్టీ పాలనలో ఉన్న ఒక రాష్ట్రంలో..
పక్షం రోజుల క్రితం నేను పూణేలో ఉన్నాను. ఒక అసాధారణ దృశ్యం నా కళ్లను కమ్మివేసింది. ఎటుచూసినా ఒకే వ్యక్తి ముఖం. ఆ వ్యక్తి రాహుల్‌గాంధీ. భారతీయ జనతా పార్టీ పాలనలో ఉన్న ఒక రాష్ట్రంలో, అందునా కాంగ్రెస్ పునరుజ్జీవ సూచనలు ఏ మాత్రం కనిపించని మహారాష్ట్రలో దేశ ప్రతిపక్షనేతకు ఏమిటీ ప్రాధాన్యం?
యువ భారతీయులతో సంభాషించేందుకు రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘ఛాత్రోంజ్ కి గూంజ్’ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 22న పూణేలో సభ జరిగిన సందర్భమది. స్థానిక కాంగ్రెస్ శ్రేణులు భూమ్యాకాశాలను ఏకం చేసి రాహుల్ సభకు ప్రచారం కల్పించారు. జెన్ జీ తరం యువతులను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన ఆ సభలో రాహుల్ ఇలా అన్నారు: ‘మీకు మీ తండ్రితో, సోదరుడితో, భర్తతో, కుమారుడితో అనుబంధం ఉండవచ్చు. అయితే మీరు వాళ్లకు చెందినవారు మాత్రమే కాదు. మీరు మీకు మాత్రమే చెందుతారు. మీపై పురుషుల పెత్తనాన్ని, నియంత్రణను ఎంతమాత్రం భరించవద్దు. పితృస్వామ్యం బంధనాలను బద్దలుగొట్టండి’. స్ఫూర్తిదాయక పిలుపు అది, సందేహం లేదు. రాహుల్ రాజకీయాలతో మీరు ఏకీభవించవచ్చు లేదా విభేదించవచ్చు. మీరు కాంగ్రెస్‌ను సమర్థించవచ్చు లేదా వ్యతిరేకించవచ్చు. అయితే ఒక ప్రధాన రాజకీయ పార్టీ వేదికపై పురుషాధిపత్యాన్ని బాహాటంగా విమర్శించడం బహుశా ఇదే మొదటిసారి. ఏమైనా ఇటీవల బహిరంగ సభలలో రాహుల్ ఉపన్యాసాల బాణీ మారిందనేది స్పష్టం. పూణేలో రాహుల్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా విన్న యువతులు, మహిళలే కాదు, మాధ్యమాల ద్వారా ఆ సందేశాన్ని తెలుసుకున్న ఇతర స్ర్తీలు కూడా రాహుల్‌ను సమర్థించారు, అభినందించారు. అయితే ఒక ప్రశ్న: రాహుల్ పిలుపునకు ఉత్సాహంగా స్పందించిన నవతరం యువతులలో ఎంతమంది 2029 లోక్‌సభ లేదా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌కు ఓటు వేయనున్నారు? కచ్చితంగా తెలియదు. ఎందుకంటే ప్రేక్షకులు, శ్రోతలు, వీక్షకులను ఆకట్టుకోవడం వేరు, ఎన్నికలలో విజయం సాధించడం వేరు. చాలా తేడా ఉంది. రాహుల్‌కు మహిళల మద్దతు పెరిగి ఉండవచ్చుగానీ... కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో మాత్రం మార్పులేదు. ఇప్పటికైతే ఆ మార్పు కనిపించడమే లేదు.
అందుకు కారణమేమిటో చెబుతాను. పూణే తరువాత కొద్ది రోజులకు గోవా వెళ్లాను. ఇదీ బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రమే. వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే ఎన్నికలకు వెళ్లనున్నది. అయినా కూడా అక్కడ కాంగ్రెస్ వ్యవహారాలు ఎన్నికల సమర సన్నద్ధంగా లేవు. ప్రధాన ప్రత్యర్థిపై కంటే తనపై తానే అంతర్గతంగా పోరాడుకోవడంలో కాంగ్రెస్ నిమగ్నమై ఉంది. బీజేపీని ఓడించితీరాలనే లక్ష్యం కాంగ్రెస్‌కు దృఢంగా ఉంటే అందుకు ఒక విశాల రాజకీయ సంకీర్ణాన్ని నిర్మించడం అత్యవసరం. మరి కాంగ్రెస్ ఆ దిశగా ఆలోచిస్తున్నదా? లేదు. జాతీయస్థాయిలో ప్రతిపక్షాల సమైక్యత గురించి కాంగ్రెస్ విశేషంగా మాట్లాడుతోంది. అయితే ప్రతి రాష్ట్రంలోనూ సంస్థాగత ఐక్యత నెలకొల్పుకోవడానికి ఆ పార్టీ నానా ప్రయాసలుపడుతోంది. కర్ణాటకకు వెళదాం. కాంగ్రెస్ పాలనలో ఉన్న పెద్ద రాష్ట్రాలలో అదీ ఒకటి. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కార్యకర్తల బలం అమితం. ప్రజల మద్దతు కూడా బాగా ఉంది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పార్టీకి కొత్త జవసత్వాలు సమకూర్చారు. అయితే ఆయన మంత్రి మండలిని చూడండి. 33 మందిలో ఒక్క మహిళ కూడా లేరు!
రాహుల్‌గాంధీ పూణేలో యువతుల ముందు నిలబడి మహిళా సాధికారత, సమాన అవకాశాలు, పితృస్వామ్య నియంత్రణ వ్యవస్థలను బద్దలుకొట్టడం గురించి భావోద్వేగంతో మాట్లాడారు కదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వాల పరిపాలనా పద్ధతుల్లో ఆ ఉదాత్త సందేశం ప్రతిబింబించకపోతే ఎలా? ఈ ఆచరణరాహిత్యమే కాంగ్రెస్‌కు అతిపెద్ద సమస్య. దేశాభ్యుదయం గురించి కాంగ్రెస్ నాయకులు సరైన విషయాలనే మాట్లాడుతున్నారు. అయితే ముఠాల కలహాలతో శిథిలమైన ఆ జాతీయ పార్టీ తన మాటలను చేతల్లో చూపించలేకపోతోంది.
పంజాబ్‌కు వెళదాం. ఈ రాష్ట్రంలోనూ కొద్దినెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముఠాల కుమ్ములాటలు మరింతగా పెచ్చరిల్లుతున్నాయి. పంజాబ్‌లోనే కాదు, ప్రతి రాష్ట్రంలోనూ కాంగ్రెస్ కథ అదే తీరులో ఉన్నది. ప్రత్యర్థి బీజేపీకి వ్యతిరేకంగా ప్రయోగించవలసిన రాజకీయ శక్తి సామర్థ్యాలు నాయకుల అంతర్గత కలహాలతో వ్యర్థమైపోతున్నాయి. కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణాలలో కూడా పురుషుల ప్రాబల్యమే స్పష్టంగా కనిపిస్తున్నది. 2022లో ఉదయ్‌పూర్ చింతన్ శిబిర్‌లో చేసిన వాగ్దానాలు ఏమిటో గుర్తుచేసుకోండి. యువ నాయకులకు మరింత ప్రాతినిధ్యం కల్పిస్తామన్న ఆ హామీ నెరవేరిందా? పార్టీ, దాని అనుబంధ సంఘాల పదవులలో యాభై ఏళ్ల వయసులోపు వారినే అత్యధికంగా నియమించేందుకు ఉదయ్‌పూర్‌లో నిర్ణయం తీసుకోలేదూ? ఈ నిర్ణయాన్ని అమలుపరిచారా? ఓబీసీలు, దళితులు, ఆదివాసీలకు మరింత కీలక భాగస్వామ్యం కల్పిస్తామని కూడా అక్కడ హామీపడ్డారు. ఈ వాగ్దానం ఏ మేరకు నెరవేరింది?
ఇది, ప్రజలకు కాంగ్రెస్ కనిపిస్తున్న తీరుకు సంబంధించిన ప్రశ్న కాదు. విశ్వసనీయతకు సంబంధించిన ప్రశ్న. అలనాటి భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే కాంగ్రెస్ వ్యవహారాలు ఇప్పటికీ నడుస్తున్నాయి. ఈనాటి భారతదేశం పూర్తిగా భిన్నమైనది. ఈ నవ రాజకీయ భారతదేశాన్ని విశ్వసించాలని యువ ఓటర్లకు చెప్పగలిగే నైతిక అర్హత కాంగ్రెస్‌కు ఉన్నదా? మోదీ–అమిత్ షాల నేతృత్వంలోని బీజేపీ ఇటీవలి దశాబ్దాలలోని ఎన్నికలలో అప్రతిహతంగా విజయాలు సాధిస్తున్న మహాశక్తిమంతమైన రాజకీయ వ్యవస్థ. కేవలం ప్రసంగాలతో ఆ వ్యవస్థను ఎదుర్కొని విజయం సాధించగలగడం కల్ల.
అయితే ఇక్కడ రాహుల్‌గాంధీకి కొంత ఘనత దక్కాలి. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన యువ భారతీయుల ఆవేదన, ఆందోళన, ఆకాంక్షల గురించి పదే పదే మాట్లాడుతున్నారు. యువత సమస్యల పట్ల సానుభూతి మాత్రమే కాదు, స్పష్టమైన అవగాహన కూడా ఆయన మాటల్లో వ్యక్తమవుతోంది. నిరుద్యోగం, అసమానతలు, సంపద కేంద్రీకరణ, పోటీ పరీక్షల ఒత్తిడి, కుంచించుకుపోతున్న ఉద్యోగ మార్కెట్... ఇత్యాది విషయాలలో సమాజంలో సర్వత్రా అసంతృప్తి ఉంది. ప్రధాన స్రవంతికి చెందిన మరే రాజకీయ నాయకుడి కంటే రాహులే ఆ అసంతృప్తిని ఎక్కువగా పట్టించుకుంటున్నారు. దానిని తొలగించేందుకు శ్రద్ధ చూపుతున్నారు. ఇది ప్రజలు గుర్తించిన వాస్తవం.
మరి, యువ భారతీయులతో తాను మాట్లాడే విధానాన్ని రాహుల్ మార్చుకోగలిగినప్పుడు కాంగ్రెస్ తన పనితీరును ఎందుకు మార్చుకోలేకపోతోంది? తన నాయకుడి కంటే ఇంకా పలు అడుగులు ఎందుకు వెనుకబడి ఉన్నది? ఆయన తన పార్టీని తనతో పాటు తీసుకువెళ్లే బదులు తన సొంత బాటలో మాత్రమే ఎందుకు సాగుతున్నారు? రాహుల్ తనను తాను రాజకీయంగా పునరావిష్కరణ చేసుకుంటున్నారు, సందేహం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ముఠా కలహాలు, నాయకత్వ పోటీలతో సతమతమవుతోంది. పాత పద్ధతులను విడనాడలేకపోతోంది. ఎన్నికలలో విజయాలు వ్యక్తులతో మాత్రమే సిద్ధించవు. ముఠా రాజకీయాల భారం లేని, అధికారం కోసం ఆరాటపడే విశ్వసనీయ ద్వితీయ శ్రేణి నాయకులతో మాత్రమే ఆ విజయాలు లభిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ ఒక బలమైన సంస్థగా, అనునిత్యం ప్రజలతో ఉండాలి. సామాన్యుడికి ఆపద్బాంధవుడిగా ఉండాలి. అంతేగానీ పోలింగ్‌కు 45 రోజుల ముందు మేల్కొని ప్రజా సమస్యల గురించి హడావుడి చేస్తే ప్రయోజనముంటుందా?
రాహుల్ మాత్రమే తమను మళ్లీ అధికారంలోకి తీసుకురాగలరని కాంగ్రెస్ శ్రేణులు ఆశిస్తున్నాయి. ‘బ్రాండ్ రాహుల్’ను రూపొందించేందుకు ఎంతగా శ్రమించారో, ‘బ్రాండ్ కాంగ్రెస్’ను పునర్నిర్మించేందుకు అంతగా పాటుపడాలి. రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతున్న నాయకుడు పార్టీకి ఉండవచ్చు. అయినా పార్టీ అంతకంతకూ ప్రాధాన్యం కోల్పోతోంది. సామాజిక మాధ్యమాలలో సాగే ప్రచార కథనాలలో విజయం సాధించినా, ఎన్నికల రోజున పోలింగ్ బూత్ పోరులో అపజయం పాలు కావచ్చు. చెప్పవచ్చినదేమిటంటే పాత కాంగ్రెస్‌తో మీరు నేటి నవ భారతదేశాన్ని జయించలేరు. పార్టీ నాయకుడు శక్తిమంతుడైన నేతగా ప్రభవిస్తుండవచ్చు. అయితే పార్టీ తాను చెబుతున్న మాటలను చేతల్లో చూపించని పక్షంలో ప్రస్తుతం ఎక్కడ ఉందో అక్కడే ఉండిపోతుంది.
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్)