రఘురాయ్ ‘భారత దర్శనం’
ABN , Publish Date - May 03 , 2026 | 02:43 AM
తన ఎనభై మూడో ఏట, ఏ్రపిల్ 26న కాలం చేసిన రఘురాయ్ భారతీయ ఛాయాచిత్రకారుల్లో అగ్రగణ్యులు. అంతర్జాతీయ స్థాయిలోనూ వారు అద్వితీయ కళాకారులు.
తన ఎనభై మూడో ఏట, ఏ్రపిల్ 26న కాలం చేసిన రఘురాయ్ భారతీయ ఛాయాచిత్రకారుల్లో అగ్రగణ్యులు. అంతర్జాతీయ స్థాయిలోనూ వారు అద్వితీయ కళాకారులు. పత్రికారంగం నుంచి ప్రారంభమైన వారి ప్రస్థానం, స్వతంత్ర ఫొటో జర్నలిస్ట్‌గా ఎదిగిన తీరు, సాగిన క్రమం నిరాటంకం, అపురూపం, అద్భుతం.
ప్రప్రథమంగా ఆరు దశాబ్దాల వారి స్థిమితమైన సుదీర్ఘ ప్రయాణంలో తప్పక చెప్పుకోవలసింది ఆయన దృక్పథం గురించి. దేశీయం అని ఒక్క మాటలో చెప్పడం సరికాదు. మరి, దాన్ని సులభంగా ఎలా చెప్పవచ్చునూ అంటే, వారి ప్రదర్శనలే చూడనక్కరలేదు. అవి కాకుండా ప్రపంచంలో మరే ఫొటోగ్రాఫర్ ప్రచురించనన్ని కాఫీ టేబుల్ బుక్స్ వారే తెచ్చారు. అందుబాటులో ఉన్న అవే సాక్ష్యం. సుమారు యాభై పుస్తకాలుగా తన పనిని చరిత్రలో భాగం చేసి వెళ్ళిన రఘురాయ్‌కి తన పుస్తకాల్లో అమిత ఇష్టమైన గ్రంథం నలుపు తెలుపుల్లో తెచ్చిన ‘రఘురాయ్స్ ఇండియా’. ఈ శీర్షికే ఆయన కళా దృక్పథానికి కొలమానం. ఇదే శీర్షికతో వారు రంగుల్లోనూ మరో గ్రంథం తెచ్చారు.
విస్పష్టంగా రఘురాయ్ ఒక్కరే ఈ దేశాన్ని ఆత్మవిశ్వాసంతో పని ఆధారితంగా ‘నా దేశం’ అన్న ఏకైక ఛాయాచిత్రకారుడు. ఇక్కడి మనిషిని, మానును, ఉత్సవాలను, విషాదాలను, వార్తను, కథనాన్ని, రాజకీయ పరిణామాలను... అవేమైనా సరే, వాటిని దర్శించి ప్రతిదాన్నీ తాను ‘భారతం’ చేశారు. తనకన్నా ముందు, తన తర్వాతా ఎందరో ఛాయాచిత్రకారులు మన దేశాన్ని చిత్రించినా, ఇంకనూ చిత్రిస్తున్నప్పటికీ, వారెవరికీ లేని దృక్పథం రఘురాయ్ సొంతం. ఆయన ‘ఇది నా దేశం’ అని సగర్వంగా చిత్ర సహితంగా చాటిన ఏకైక కళాకారుడు. అంతేకాదు, ‘‘నా దేశాన్ని మినహా మరే దేశాన్ని చిత్రించను’’ అని ప్రకటించిన ఏకైక చిత్రకారుడు కూడా ఆయనే. దేశం దాటితే ఆయన కెమెరా మూసి పెడతారు. కళ్ళతోనే చూస్తారు. కెమెరా తెరిస్తే అది తన దేశం, మనిషి, స్థలం, మన మహిమ, అంతే. అదీ ఆయన ఘనత. ఈ దేశంలోని వైవిధ్యాన్ని, బహుళత్వాన్ని ఆయన అర్థం చేసుకుని చిత్రించినంత విశాలంగా మరొకరు చిత్రించలేదు కూడా. ఒక్క మాటలో ఈ దేశ ప్రజానీకపు విభిన్న జీవన సాంస్కృతిక సామరస్య సంపుటి ‘రఘురాయ్స్ ఇండియా’.
ఆయన మొదటి చిత్రమే గాడిద. బేబీ డాంకీ. అందరూ అడ్డ గాడిదను చూసే తీరుకు భిన్నంగా ఆయన నిలువు గాడిదను చిత్రించి దాన్ని సమ్మోహనంగా ఒక యోగిలా చూపారు. అదీ మొదలు ఇక ఆయన వెనుదిరిగి చూడలేదు. అనుభవం గడించినకొద్దీ ఆయన ‘నిలువు’ నుంచి ‘అడ్డం’ వైపు తిరిగారు. ఇదే ఆయనను మిగతా వారికి భిన్నం చేసింది. ఈ దేశాన్ని చూడాలంటే వర్టికల్‌గా శిఖరాలు కాదు, హారిజాంటల్‌గా మైదానాలు చూడాలి అన్న ధోరణి అవలంబించారు. అందుకే ఆయన మన దేశాన్ని ‘హారిజాంటల్ ఇండియా’ అని పేర్కొనడమే కాదు, పదే పదే నొక్కి చెప్పారు. ‘‘అడ్డంగా తీసే చిత్రంలోనే సామాన్యం నుంచి అసామాన్య విశేషాలనెన్నిటినో దర్శించవచ్చు’’ అన్నారు. అడ్డదిడ్డంగా పనిచేసిన ప్రభుత్వాలనూ ఆయన ఇదే ధోరణిలో ఎండగట్టారు. విశేషం ఏమిటంటే, ఒక చిత్రం తీస్తున్నప్పుడు ఆయన రెండు మూడు నిమిషాలు సైతం వ్యూ ఫైండర్ నుంచి కన్ను ఆర్పకుండా చూసేవారు. ఒక దృశ్యాన్ని చప్పున చూసి తీసిన వారు కాదు. చూస్తూ చూస్తూ దర్శనం వంటి అనుభవం గ్రాహ్యం అయ్యేదాకా వేచి ఉండి క్లిక్ చేసేవారు. అందుకే ఆయన చిత్రంలో ఏకకాలంలో అనేక కాలాలను చదవవచ్చు.
దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే వారు తరచూ చెప్పే ‘సెంచరీస్ లివ్ టుగెదర్’ అన్న మాటను, అందులోని భావనను గమనించాలి. ‘‘అనేక శతాబ్దాల ఒరవడి వినిపించే నాగరిక దేశం మనది’’ అన్నారు. ‘‘చార్మినార్ వద్దకు వెళ్లి నిలబడు. నీతో పాటు జవసత్వాలతో హుందాగా, సమున్నతంగా పదిహేనో శతాబ్దం కానవస్తుంది’’ అన్నారు. దానర్థం, ఒక ఫ్రేంలో అనేక ఫ్రేంలు. పొరలు పొరలుగా జీవన శకలాలు. ఒక రకంగా పురాతత్వ సంపదను వెలికి తీసే ఆర్కియాలజిస్ట్‌గా, ఒక చరిత్రకారుడిగా ఆయన మన స్థలకాలాదుల్లో ఉన్న అన్ని విశేషాలనూ విని, ఒక్క చిత్రంలోనే ఆ ధ్వనిని నిక్షిప్తం చేసి, మనకు వినిపించిన అపూర్వ సంగీతజ్ఞుల వంటి ఛాయచిత్రకారులు ఆయన. అందుకే రఘురాయ్ లేరు అన్న బాధ అక్కరలేదు. ఆయన ప్రతి ఫొటో మనకు గతాన్ని వినిపించే వర్తమానం. భవితకు సోపానం.
మరో విశేషం ఏమిటంటే... తాను తీస్తున్నది ‘హారిజాంటల్ ఇండియా’ అనడమే కాదు, అందులో తాను చిత్రిస్తున్నది మనిషినైనా, సంఘటననైనా లేదా ల్యాండ్‌స్కేప్ అయినా తాను దృష్టిలో పెట్టుకునేవి రెండే అంశాలని చెప్పారు. అవేమిటో కాదు.. ‘‘ఎనర్జీ, ఎక్స్‌ప్రెషన్’’ అని వివరించారు. ‘‘ఆరు దశాబ్దాలుగా నేను గమనిస్తూ వచ్చింది ఈ రెండే’’ అని బోధపరిచారు.
ఈ దేశంలోని శక్తి ఎలా నిబిడీకృతమైందో, అది ఎలా ప్రవహిస్తున్నదో ఆయన దేశమంతా తిరిగి చూశారు, చిత్రించారు, పదిలపరిచారు. మనం చూసే చిత్రం ఇందిరాగాంధీనో, మదర్ థెరిసానో అనిపిస్తుంది లేదా ఆ చిత్రంలో మనం దలైలామాను చూస్తాం. కాదంటే అది కుంభమేళా అనుకుంటాం, లేదా ఏడుపాయల జాతర అని భావిస్తాం. కానీ, వాటిల్లో ఆయన చూస్తున్నది ఈ దేశంలోని ఆత్మ. అది శక్తి. ఆ ఆత్మ ఎలా ప్రతిచోటా ప్రతిదృశ్యంలోనూ ప్రవాహ సదృశ్యమైపోతున్నదో అది వ్యక్తీకరణ. దాన్నీ ఆయన చిత్రించారు. అంటే వారు ఈ దేశ ఆత్మను, ఆ ఆత్మ తారాడే రీతిని వ్యక్తపరిచారు. ఈ రెండింటి నిక్షిప్తం కళాకారులు. ఇప్పుడు గమనించండి. శక్తి, దాని వ్యక్తరూపం. అదే భారతం. రఘురాయ్ కూడా.
అందుకే అనడం, రఘురాయ్ సిసలైన ముద్దుబిడ్డ. మన దేశం చరిత్రను దర్శించిన తీరు, పదిలపరిచిన తీరు కేవలం ఒక ఛాయాచిత్రకారుడిగానే కాదు, దేశీయ చిత్రకారుడిగా, మనం ఎన్నడూ మరచిపోలేని కృతికర్తగా, స్మృతికర్తగా భరతమాత సిసలైన ముద్దుబిడ్డగా వారు సదా నిలిచిపోతారు.
చివరగా, రఘురాయ్ భారతమే వారిని అంతర్జాతీయం చేసిందనడానికి ఒక ప్రస్తావన. గత ఏడాది మరణించిన సెబాస్టియో సాల్గాడో అన్న ప్రసిద్ధ బ్రెజిలియన్ ఛాయాచిత్రకారుడు ప్రపంచంలోని నూటా ఇరవై దేశాలు తిరిగి ఛాయాచిత్రలేఖనం చేశారు. వారు కరోనా సమయంలో రఘురాయ్‌తో జరిపిన సంభాషణ ఈ దిశలో ఒక గొప్ప మెలకువ. అయన ఒక అద్భుతమైన మాట అన్నారు. ‘‘నేను ప్రపంచం మొత్తం తిరిగాను. కానీ, చిత్రంగా రఘురాయ్ ఈ దేశాన్ని విడవలేదు. నిజానికి వారే నాకన్నా గొప్ప’’ అన్నారు. ‘‘ఎందుకూ అంటే నా దేశంలో ఏమీ లేక తిరగవలసి వచ్చింది. రఘురాయ్ అలా కాదు, వారి ఇంగితం అపూర్వం. ఆయనకు తన దేశం ఘనత తెలుసు. అది బహుళం, వైవిధ్యం, విస్తారం అని గ్రహించిన దార్శనికుడు ఆయన. అందుకే దాన్ని విడిచి మరెక్కడికీ వెళ్ళలేదు. వెళ్ళదలచుకోలేదు. నా దేశమే నా ప్రపంచం అని సగర్వంగా చాటి చెప్పారు. నా దృష్టిలో రఘురాయ్ నాకన్నా అంతర్జాతీయం, విశ్వం’’ అని ఆత్మీయంగా కొనియాడారు. రఘురాయ్ కూడా గౌరవంగా తలవంచి నమస్కరిస్తూ, సెబాస్టియో అభినందనను హుందాగా స్వీకరించారు.
నేడు రఘురాయ్ భౌతికంగా లేరు. కానీ ఈ సూక్ష్మం అర్థం చేసుకోవడమే ఈ దేశవాసులుగా ఆ మహా కళాకారుడికి మనమిచ్చే ఘనమైన నివాళి, కృతజ్ఞతలు.
- కందుకూరి రమేశ్‌బాబు
ఫొటోగ్రాఫర్, జర్నలిస్ట్