‘‘నిరలంకారంగా రాయలేను’’
ABN , Publish Date - Oct 26 , 2026 | 02:21 AM
తొంభయ్యవ దశకంలో మొదలుపెట్టి ఇప్పుడు విస్తృతంగా రాస్తున్న కవి రఘు శేషభట్టర్ పదవ కవితా సంపుటి ‘లోలకం’ ఇటీవల విడుదలైన సందర్భంగా ఆయనతో సంభాషణ...
తొంభయ్యవ దశకంలో మొదలుపెట్టి ఇప్పుడు విస్తృతంగా రాస్తున్న కవి రఘు శేషభట్టర్ పదవ కవితా సంపుటి ‘లోలకం’ ఇటీవల విడుదలైన సందర్భంగా ఆయనతో సంభాషణ.
‘‘కవిత్వం మనలోని అలజడిని చక్కదిద్దే వ్యాకరణం’’ అని ‘లోలకం’కు రాసుకున్న ముందుమాటలో చెప్పుకున్నారు. మనసు అలజడితో ఉన్నప్పుడు కవిత్వం ఇంకుతుందా?
మనసు అతలాకుతలంగా ఉన్నప్పుడు కవిత్వంతో సేద తీరటం నా అలవాటు. నా కార్పొరేట్ ఉద్యోగంలోని ఒత్తిడిని కవిత్వం తోటే జయించాను. వాక్యాలకు బాధతో సహజీవనం చేసే శక్తి ఉంటుంది. కాలిలో ముల్లు దిగిన నొప్పిని మాటల్లో వర్ణించగలం. దానిని మళ్ళీ మళ్ళీ చదువుకొని అనుభవించగలం. ఫలితంగా తెలియని ఉపశమనం ఏదో కలుగుతుంది. ఐతే కవిత్వానుభవం రుచి తెలియనివాడికి అది సాధ్యం కాదు.
‘‘మనసనేది లేకుంటే మనం గడ్డి మేసే మందలం’’ అని ఈ సంపుటిలో ఒకచోట అన్నారు. ఈ తరహా కోటబుల్ స్టేట్మెంట్స్ కోసమే కవిత్వం రాస్తారా?
కోటబుల్‌గా ఉండే వాక్యాల్ని పనికట్టుకొని రాయాలనుకోను. అసంకల్పితంగానే వస్తాయి. కవిత్వం అట్లానే రాయాలనే ధోరణేదో నా తొలిరోజుల నుండే ఉన్నట్టుంది. బహుశా ఇది నా గురువు శేషేంద్రశర్మ ప్రభావమై ఉంటుంది. మనం ఏ బడిలో చదువుకుంటామో ఆ బడి ఛాయలు మన మాటలోనూ, నడవడిలోనూ కనబడతాయి కదా! కవిత్వమూ అంతే. Quotability ఉంటే వాక్యాలు ఎరువేసినంత బలంగా ఉంటాయనుకుంటాను
మీ కవిత్వంలో అంతర్ముఖత్వం ఎక్కువ. దానిని ప్రతీకలతోనో రూపకాలతోనో నింపకుండా నేరుగా చెప్పాలని తోచలేదా ?
చెప్పొచ్చు. కానీ అట్లా రాస్తే జీన్స్ వేసుకొని క్లాసికల్ చేసినట్టుంటుంది. దండి ప్రోక్తమైన ‘రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతీ’ అన్న శ్లోకం నుండి సర్వశుక్లా అనే దాన్ని కత్తిరించి చెబితే ఎట్లా ఉంటుందో ఉపమలు లేని కవిత్వం అట్లా ఉంటుంది. వాక్యాన్ని ఊహలతో, రూపకాలతో నింపటం ఒక తపస్సు. దానిని అభ్యాసం చేసి సాధించాను. నిరలంకారంగా రాయటం నాకు రాదు.
బాగా చదవటం వల్ల కవిత్వం రాయటం అబ్బుతుందా?
బాగా చదవటం అనేది కొంతవరకే ఉపయోగపడుతుంది. అదొక్కటే అర్హతైతే ప్రూఫ్ రీడర్లంతా కవులయ్యే వాళ్ళు కదా! చెప్పదలుచుకున్న సంగతి లోలోపల మగ్గే వరకు కవిత్వం రాయొద్దనేది నాకు తోచిన నియమం. దీనినే ఇన్నేళ్లూ పాటిస్తూ వస్తున్నాను.
ఇంటర్వ్యూ : రోహిత్
96761 44904
ఈ వార్తలూ చదవండి
అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు.. సీజేపీ నేతపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు..
గ్రీకు రెస్టారెంట్‌లో తొలి పరిచయం.. రాజీవ్ గాంధీతో ప్రేమకథను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ..