Share News

తొలి మాండలిక నాటిక ‘తుఫాన్‌’

ABN , Publish Date - May 05 , 2026 | 01:38 AM

తెలుగు నాటక పరిషత్ వ్యవస్థలో అసలు సిసలైన మాండలికాన్ని ఉపయోగించి ఆధునిక తెలుగు సాంఘిక నాటక మాండలిక పితామహునిగా రాణించిన ఖ్యాతి పులుగుండ్ల రామకృష్ణయ్యకు దక్కింది. ‘తుఫాన్‌’ నాటిక...

తొలి మాండలిక నాటిక ‘తుఫాన్‌’

తెలుగు నాటక పరిషత్ వ్యవస్థలో అసలు సిసలైన మాండలికాన్ని ఉపయోగించి ఆధునిక తెలుగు సాంఘిక నాటక మాండలిక పితామహునిగా రాణించిన ఖ్యాతి పులుగుండ్ల రామకృష్ణయ్యకు దక్కింది. ‘తుఫాన్‌’ నాటిక రచనతో పూర్తిస్థాయి మాండలిక నాటకాలు రావటానికి ఆద్యులైన పులుగుండ్ల కృషి చిరస్మరణీయమైనది. తెలుగు నాటకరంగం ఇప్పటికీ ఈ తుఫాన్‌ నాటికను గుర్తుంచుకుని ఉంది.

తెలుగు సాంఘిక నాటక చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన తుఫాన్ నాటికను 1946లో పులుగుండ్ల రచించారు. 1948లో ఆంధ్ర నాటక కళాపరిషత్ పోటీలలో దాన్ని ప్రదర్శించగా, ‘ఉత్తమ రచన’గా ఆ నాటిక ఎంపికై, పులుగుండ్లకు బహుమతిని తెచ్చిపెట్టింది. నాడు ఈ నాటికను ఆంధ్ర సమాజం పక్షాన ప్రదర్శించేవారు. ఆంధ్ర సమాజం నిర్వాహకులలో తూములూరి శివరామయ్య, రేబాల దశరథరామిరెడ్డి, పులుగుండ్ల రామకృష్ణయ్య, సినీ నటుడు రమణారెడ్డి, గాడేపల్లి రామయ్య వంటి ప్రముఖులు ఉండేవాళ్ళు. ఈ నాటికలోని రమాదేవి పాత్రను రామతిలకం, శేషమ్మ వంటి గొప్ప నటీమణులు పోషించేవారు. ఆకాశవాణి మద్రాస్ కేంద్రం నుంచి అనేకసార్లు ఈ నాటిక ప్రసారమైంది. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు ఎంఏ తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా కూడా ఈ నాటికను ప్రవేశపెట్టారు. 1965లో పోలీస్ సంక్షేమ నిధికి ఎన్టీ రామారావు విరాళాలు సేకరించినప్పుడు... ఈ తుఫాన్ నాటికను కాంతారావు, రాజనాల, రమణారెడ్డి వంటి వారు రాష్ట్రంలో విస్తృతంగా ప్రదర్శించారు. ఈ నాటికలోని రాఘవరెడ్డి పాత్ర పోషణకు గానూ గాడేపల్లి రామయ్యకు ‘మద్రాసు తెలుగు సంఘం’ రజత పథకాన్ని, రేబాల పట్టాభిరామిరెడ్డి బంగారు పథకాన్ని బహూకరించారు.


పులుగుండ్ల రామకృష్ణయ్య నెల్లూరు సమీపంలోని దర్భాలమెట్ట కండ్రిగలో 1911 మే 5న జన్మించారు. నెల్లూరు వీఆర్ హైస్కూల్లో సుదీర్ఘకాలం ఉపాధ్యాయులుగా పనిచేస్తూనే నాటక రంగానికి కొత్త రూపురేఖలు తీసుకువచ్చారు. ‘తలవని తలంపు, విముక్తి, వాపస్, విజయపతాకం, గాంధీ బాల్యం...’ వంటి నాటికలను రచించారు. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకాన్ని శకుంతల పేరుతో పూర్తి వ్యవహారికంలోకి పులుగుండ్ల అనువదించారు. తుఫాన్ నాటికలో– గ్రామాల్లో రెడ్డి సామాజికవర్గంలోని ఇళ్లల్లో ఉండే మాండలికాన్ని, ఆ తీరుతెన్నులను సహజంగా, సంపూర్ణంగా ఆవిష్కరించారు. దీనిపై సామాజికంగా ఏమైనా వ్యతిరేకత వస్తుందేమోనని, సరైన ఆదరణ లభించదేమోనని నిర్వాహకులు మొదట వెనకడుగు వేశారు. కానీ... ఆత్రేయ, తూములూరు శివరామయ్య, రేబాల దశరథరామిరెడ్డి, రమణారెడ్డి వంటి ప్రముఖుల భరోసాతో నాటికను ఆ ఏడాది అక్టోబర్ 19న నెల్లూరు దసరా ఉత్సవాల్లో మొదటిసారిగా ప్రదర్శించారు. ప్రేక్షకాదరణ విపరీతంగా లభించటం, అన్ని సామాజికవర్గాల వారు కూడా ఆనందంగా స్పందించడంతో ఆ నాటికను ఇరవై అయిదుసార్లు ప్రదర్శించారు! వీరి శకుంతల నాటకాన్ని ఎస్వీ యూనివర్సిటీలో పీయూసీ వారికి ఉపవాచకంగా కూడా ప్రవేశపెట్టారు. 2002 నవంబర్ ఒకటో తేదీన పులుగుండ్ల రామకృష్ణయ్య దివికేగినా, మాండలిక నాటకాలకు జీవ ప్రదాతగా చరిత్రలో ఎప్పటికీ ఆయన నిలిచే ఉంటారు.

ఈతకోట సుబ్బారావు

(నేడు పులుగుండ్ల రామకృష్ణయ్య జయంతి)

ఈ వార్తలు కూడా చదవండి

బెంగాల్‌‌లో చారిత్రక తీర్పు.. విజయోత్సవ సంబరాల్లో మోదీ

ఇది గెలుపు కాదు లూటీ.. మేం పుంజుకుంటాం.. బెంగాల్‌లో షాకింగ్ తీర్పుపై మమతా బెనర్జీ

Updated Date - May 05 , 2026 | 01:38 AM