మర్యాదలు ఇచ్చిపుచ్చుకోండి
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:50 AM
ప్రజాస్వామ్య భారతంలో 1950 జనవరి 24 కీలకమైన రోజు. ఆ ఉదయం 11.30 ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ సంఘటన భవిష్యత్తులో ఎదురయ్యే పాలకుల అధిపత్య సవాళ్లు ఎలా ఉంటాయన్న సంకేతాన్ని ఇచ్చింది.
ప్రజాస్వామ్య భారతంలో 1950 జనవరి 24 కీలకమైన రోజు. ఆ ఉదయం 11.30 ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ సంఘటన భవిష్యత్తులో ఎదురయ్యే పాలకుల అధిపత్య సవాళ్లు ఎలా ఉంటాయన్న సంకేతాన్ని ఇచ్చింది. ఆ రోజు రాజ్యాంగ సభ చివరి సమావేశం. సిద్ధం చేసిన రాజ్యాంగ ప్రతిపై సంతకాలు చేయాల్సిన సమయం. ఉత్సాహంతో కావొచ్చు.. మరేదైనా కారణంతో కావొచ్చు.. దేశ ప్రధానిగా ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ రాజ్యాంగ ప్రతి మీద తొలిగా సంతకం చేశారు. కానీ, మొదట సంతకం చేయాల్సింది రాష్ట్రపతిగా అధికారిక ప్రకటన వెలువడిన బాబూ రాజేంద్రప్రసాద్. అంతేకాదు.. ఆయన రాజ్యాంగ పరిషత్ చైర్మన్ కూడా. అందులో ప్రధాని నెహ్రూ సభ్యుడు మాత్రమే.
తన కంటే ముందే ప్రధాని నెహ్రూ సంతకం చేయటంతో, ఆ సంతకానికి పై వరుసలో ఖాళీ లేకపోవటం బాబూ రాజేంద్రప్రసాద్ గమనించారు. దీంతో, నెహ్రూ సంతకం పక్కన ఓ చిన్న బాణంలాంటి గుర్తు గీసి.. తన సంతకాన్ని పైన చేశారు. అలా చేయటం ద్వారా ప్రాధాన్య క్రమంలో ఎవరు ఏమిటన్నది కూడా చెప్పేశారు. నిశ్శబ్దంగా జరిగిపోయిన ఈ ఘట్టం వెలుగు చూడటానికి మూడు దశాబ్దాలకు పైనే పట్టింది. ఈ ఉదంతాన్ని రాజేంద్రప్రసాద్ వివాదంగా మార్చాలని అనుకోలేదు. ఆ తర్వాత నెహ్రూతో కలిసి గణతంత్ర వేడుకల్లోనూ పాల్గొన్నారు. అలా అని జరిగిన విషయాన్ని ఆయన మర్చిపోలేదు. భవిష్యత్తులో ఇలాంటివి జరగటానికి వీల్లేని ఏర్పాటు చేయాలనుకున్నారు. సంతకాల ఘట్టం ముగిసిన 48 గంటల్లోనే, అంటే, 1950 జనవరి 26 మధ్యాహ్నం హోం మంత్రిత్వ శాఖ తన మొదటి ‘వారెంట్ ఆఫ్ ప్రెసిడెన్స్’ గెజిట్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం, ప్రోటోకాల్‌లో మొదటి స్థానంలో రాష్ట్రపతి.. రెండో స్థానంలో ఉపరాష్ట్రపతి.. మూడో స్థానంలో ప్రధానమంత్రి ఉంటారు. ఒక్కముక్కలో చెప్పాలంటే, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల్ని అంచనా వేసి.. ఇలా మొగ్గలోనే తుంచేశారు.
ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ రాసిన ‘‘ఇండియా ఆఫ్టర్ గాంధీ’’ పుస్తకంలో ఈ సంతకం ఉదంతాన్ని ప్రస్తావించటంతో అది అందరికీ మరింత విశదంగా తెలిసింది. ప్రధానిగా కార్యనిర్వాహక అధికారం తనకే ఉండాలని నెహ్రూ భావించేవారు. రాజేంద్రప్రసాద్ మాత్రం రాష్ట్రపతికి రాజ్యాంగబద్ధమైన విశేషాధికారాలు ఉండాలనేవారు. చిన్న చిన్న ప్రోటోకాల్ ఇబ్బందులు అప్పట్లో తలెత్తినా.. ఇద్దరూ మర్యాదస్థులు కావటంతో రచ్చలు రేగలేదు. మరో విధంగా చెప్పాలంటే నెహ్రూ చేసిన ఆ చిన్న పొరపాటు.. భారత ప్రభుత్వం అధికారిక గౌరవ క్రమాన్ని రూపొందించేందుకు కారణమైంది. ప్రోటోకాల్ ఉల్లంఘనలకు చెక్ పెట్టేలా రాజేంద్రప్రసాద్ తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో దేశ ప్రధాని–రాష్ట్రపతి మధ్య ఉండే గీతను స్పష్టంగా గీసేందుకు ఉపకరించింది.
ప్రోటోకాల్ కేవలం వ్యక్తులకు ఇచ్చే గౌరవం కాదు. అది ఈ దేశ అత్యున్నత పదవులకు ఇచ్చే రాజ్యాంగబద్ధమైన మర్యాద. కానీ, వ్యవస్థల్ని వ్యక్తుల కోణం నుంచి చూడటం వల్లనే ఇప్పుడు సమస్య వస్తోంది. ఇందుకు రాజకీయం తోడైతే.. మర్యాదలు అభాసుపాలవుతాయి. మనకు మనంగా రాసుకున్న రాతల్ని రాజకీయ ద్వేష భావంతో చెరిపేయటం సరికాదు. ఈ మధ్యన ఈ తరహా ఉదంతాలు ఎక్కువ అవుతున్నాయి. వాటికి రాజకీయ రంగు పులమటమూ పెరిగిపోయింది. తాము అత్యున్నత పదవికి ప్రాతినిధ్యం వహిస్తున్నామన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు. తమ వ్యవహారశైలి భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా ఉండాలన్న స్పృహ పూర్తిగా లేకపోతోంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పశ్చిమ బెంగాల్‌లో ఎదురైన చేదు అనుభవం మరోసారి మన వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపింది. అదే సమయంలో మన రాజ్యాంగ నిర్మాతలు ప్రోటోకాల్‌ను ఎందుకు చట్టబద్ధం చేయలేదన్న సందేహం కలుగుతుంది. భారత రాజ్యాంగం నైతికత, సంప్రదాయాల మీద ఎక్కువగా ఆధారపడి రూపొందింది. అత్యున్నత పదవుల్లో ఉన్నవారు పరస్పర గౌరవ మర్యాదల్ని ఇచ్చి పుచ్చుకుంటారని రాజ్యాంగకర్తలు భావించారు. రాజకీయ ద్వేషాలు ఈ స్థాయికి చేరతాయని వారు ఊహించి ఉండకపోవచ్చు. అందుకే అధికారిక క్రమాన్ని వివరించారు, ఎవరికి ఎలాంటి మర్యాదలు జరగాలన్నది మాత్రమే చెప్పారు. తాము చూపిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తారన్న ఆలోచన అప్పట్లో రాకపోయి ఉండొచ్చు. అందుకే.. ఈ తరహా ఉల్లంఘనలకు శిక్షలు వేయాలన్న ఆలోచనే చేయలేదు.
కానీ, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ఒక ముఖ్యమంత్రి అనుకుంటే రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు రాష్ట్ర సీఎస్ సైతం వెళ్లని పరిస్థితి. మరో సీఎం అనుకుంటే దేశ ప్రధాని పాక్ సరిహద్దులకు దగ్గరలో 20 నిమిషాల పాటు రోడ్డు వంతెన మీద ఆయన వాహన శ్రేణి అలా చిక్కుకుపోయే దుస్థితి. అంతేనా, రాష్ట్రపతిని ప్రధాని తన చర్యలతో చిన్నబుచ్చటమూ, మర్యాదలకు.. సంప్రదాయాలకు నీళ్లు వదిలేయడమూ ఈ మధ్యన ఎక్కువైంది. రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవుల్లో ఉన్న వారి గౌరవం.. ప్రాధాన్యత క్రమంలో కింద ఉండే వారి మానసిక పరిపక్వత మీద ఆధారపడి ఉండటం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న అతిపెద్ద లోపం. అలాంటి వాటిని కట్టడి చేయటం సరిదిద్దటం అవసరం. ఇప్పుడే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో పరిస్థితులు మరెంత మారతాయో ఊహించుకుంటేనే భయం కలుగుతుంది.
మేధావులతో సహా అత్యధికుల్లో ఇటీవల ఒక అనారోగ్య తీరు కనిపిస్తోంది. సాపేక్షంగా చూసే ధోరణి కంటే ఒకవైపు నిలిచే ధోరణి ఎక్కువైంది. మమతను ప్రశ్నించేవారు మోదీ తీరును వేలెత్తి చూపరు. మోదీని తప్పు పట్టేవారికి మమత తప్పులు కనిపించవు. మోదీ కావొచ్చు మమత కావొచ్చు.. ఎవరైనా కొంత కాలానికే పరిమితం. కానీ, మర్యాదలు.. సంప్రదాయాలు శాశ్వతం. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారిలో రాజ్యాంగ నిబద్ధత మరింత ఎక్కువగా ఉండాలి. పదవిలో ఉన్న వ్యక్తి ప్రత్యర్థి అయినా, రాజకీయ శత్రువు అయినా.. ఆ పదవికి ఇచ్చే గౌరవం దేశానికి ఇచ్చే గౌరవంగా భావించాలి. నిజానికి, అలాంటి ఆలోచనలు ఉంటే చట్టాల అవసరమే లేదు. కానీ, అటువంటి ఘనమైన గతకాలం గతించింది.
సంప్రదాయాల్ని సవాలు చేసే, ప్రోటోకాల్‌ను పక్కన పెట్టేసే తెగింపు పెరుగుతున్న వేళ.. అలాంటి ఆలోచనలు చేసేవారికి చెక్ పెట్టే చట్టాల్ని రూపొందించాల్సిన సమయం ఆసన్నమైంది. నైతికత.. సంప్రదాయం పుస్తకాల్లో రాతలుగా మిగిలిపోతున్న ఈ కాలంలో.... తాము గీత దాటితే చట్టం చర్యలకు దిగే అవకాశం ఉందన్న భయం ఉండాలి. లేదంటే, రాబోయే రోజుల్లో మోదీలు.. మమతలకు మించినవాళ్లు ఈ దేశ అత్యున్నత స్థానాల్లో ఉండొచ్చు, పరిస్థితులు మరింత దిగజారవచ్చు!
- చామర్తి మురళీధర్
జర్నలిస్ట్