Share News

జ్ఞాన యాత్రికుడు

ABN , Publish Date - Sep 02 , 2026 | 12:39 AM

విద్యారంగంలో తనదైన ముద్ర వేసి, గ్రంథాలయ– సమాచార శాస్త్ర అభివృద్ధికి జీవితాంతం సేవలందించిన విశిష్ట విద్యావేత్త, పరిశోధకుడు ప్రొ. వి.పుల్లారెడ్డి ఇక మన మధ్య లేరు. ఆయన మరణం ఒక...

జ్ఞాన యాత్రికుడు

విద్యారంగంలో తనదైన ముద్ర వేసి, గ్రంథాలయ– సమాచార శాస్త్ర అభివృద్ధికి జీవితాంతం సేవలందించిన విశిష్ట విద్యావేత్త, పరిశోధకుడు ప్రొ. వి.పుల్లారెడ్డి ఇక మన మధ్య లేరు. ఆయన మరణం ఒక వ్యక్తి నిష్క్రమణ మాత్రమే కాదు; ఒక విద్యా శకం ముగింపు, ఒక పరిశోధనా దిక్సూచి మన కళ్లకు దూరమవడం కూడా.

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతిలో గ్రంథాలయ– సమాచార శాస్త్ర విభాగానికి పుల్లారెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన బోధనలు, పరిశోధనలు, రచనలు, విద్యార్థులపై చూపిన ప్రభావం, సహచరులకు అందించిన మార్గదర్శకత్వం ఎప్పటికీ సజీవం. విద్యను తపస్సుగా భావించిన గురువు ఆయన. ఎం.ఏ, ఎం.ఎల్‌.ఐ.ఎస్సీ, ఎం.ఫిల్, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యార్హతలను సాధించి, తన విజ్ఞానాన్ని విద్యార్థులకు, పరిశోధకులకు, గ్రంథాలయ రంగానికి అంకితం చేశారు. 34 ఏళ్లకు పైగా బోధనా అనుభవం, దాదాపు నలభయ్యేళ్ల పరిశోధనా అనుభవం ఆయన మేధోప్రతిభకు, నిరంతర అధ్యయనశీలతకు నిదర్శనం. తరగతి గది ఆయనకు కేవలం బోధనా వేదిక కాదు; ఆలోచనలను రగిలించే జ్ఞానదీపిక. విద్యార్థులు కేవలం శిష్యులు కాదు; భవిష్యత్తు జ్ఞాన సమాజాన్ని నిర్మించే శక్తులు.

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో గ్రంథాలయ, సమాచార శాస్త్ర విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా ఆయన సేవలు ప్రత్యేకమైనవి. 2012లో పదవీ విరమణ పొందేవరకు ఆయన విశ్వవిద్యాలయ విద్యా వాతావరణానికి తన ప్రతిభను, అనుభవాన్ని, పరిశోధనా దృక్పథాన్ని అందించారు. సహచర అధ్యాపకులకు ఆయన ఒక మేధో సహచరుడు; పరిశోధకులకు ఒక మార్గదర్శి; విద్యార్థులకు ఒక ఆదర్శ గురువు. ఆయన వద్ద విద్యను అభ్యసించిన అనేకమంది విద్యార్థులు తరువాత గ్రంథాలయ, సమాచార శాస్త్ర రంగంలో వివిధ స్థాయిలలో సేవలందించడం ఆయన గురుత్వానికి నిదర్శనం.

ప్రొఫెసర్ పుల్లారెడ్డి ప్రత్యేకత బోధనలో మాత్రమే కాదు, పరిశోధనలోనూ ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాల పరిశోధనా అనుభవంతో గ్రంథాలయ శాస్త్రంలోని సమకాలీన అంశాలపై ఆయన లోతైన అధ్యయనాలు నిర్వహించారు. విశ్వవిద్యాలయ గ్రంథాలయ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ జర్నల్స్ వినియోగం, సమాచార ప్రసార సాంకేతికత (ఐసీటీ), మౌలిక వసతులు, విద్యా ఇంజినీరింగ్ కళాశాలల గ్రంథాలయాల అభివృద్ధి వంటి అంశాలపై ఆయన చేసిన పరిశోధనలు కాలానుగుణమైనవే గాక, భవిష్యత్ గ్రంథాలయాల రూపకల్పనకు మార్గదర్శకం. డిజిటల్ సాంకేతికత విద్యారంగంలో విస్తృతంగా ప్రవేశించే ముందే దాని ప్రాధాన్యాన్ని ఆయన గుర్తించారు. ఎలక్ట్రానిక్ వనరులు, డిజిటల్ సమాచార సేవలు, ఐసీటీ ఆధారిత గ్రంథాలయ వ్యవస్థలు భవిష్యత్ విద్యకు ఎంత అవసరమో తన పరిశోధనల ద్వారా స్పష్టం చేశారు.


2012లో పదవీ విరమణ పొందినప్పటికీ, ప్రొఫెసర్ పుల్లారెడ్డి జ్ఞానయాత్రకు ఎక్కడా విరామం రాలేదు. పరిశోధకులను ప్రోత్సహించడం, విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించడం, గ్రంథాలయ రంగంలో అభివృద్ధి చెందుతున్న పరిణామాలను అధ్యయనం చేయడం వంటి విషయాలపై ఆయనకు ఎల్లప్పుడూ ఆసక్తి ఉండేది. ప్రొఫెసర్ వి.పుల్లారెడ్డి స్వరం ఇక తరగతి గదుల్లో వినిపించకపోవచ్చు. ఆయన సాన్నిధ్యం ఇక పరిశోధకులకు అందకపోవచ్చు. కానీ ఆయన వెలిగించిన జ్ఞానదీపం మాత్రం ఆరిపోదు. ఆయన రచనలు మాట్లాడుతూనే ఉంటాయి. శిష్యులు ఆయనను గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఆయన పరిశోధనలు భవిష్యత్ తరాలకు మార్గం చూపుతూనే ఉంటాయి.

రవికుమార్ చేగోని

ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రంథాలయ సంఘం

ఈ వార్తలు కూడా చదవండి

పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని

వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..

Updated Date - Sep 02 , 2026 | 12:39 AM